You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కరోనావైరస్: ఇంటి నుంచి బయటకు వస్తే ఫేస్ మాస్కు తప్పనిసరి చేసిన దిల్లీ, ముంబై, ఉత్తరప్రదేశ్
ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ బాధితుల సంఖ్య 14,50,343ను దాటింది. మృతుల సంఖ్య 83,568 దాటింది.. ఇప్పటి వరకూ 3 లక్షల మంది ఈ వ్యాధి నుంచి బయట పడ్డారు.
లైవ్ కవరేజీ
తెలంగాణలో కొత్తగా 49 కేసులు నమోదు
తెలంగాణలో ఈరోజు కొత్తగా 49 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు ప్రభుత్వం ప్రకటించింది. వీటితో కలిపి రాష్ట్రంలౌ మొత్తం కేసుల సంఖ్య 397కు చేరింది.
ఇప్పటివరకూ 45 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
కరోనాతో ఇప్పటివరకూ 11 మంది మృతి చెందారు.
హైదరాబాద్‌లో అత్యధికంగా 161 కరోనా కేసులు నమోదయ్యాయి.
దిల్లీలో హాట్‌స్పాట్స్ సీల్ చేయాలని ప్రభుత్వ నిర్ణయం
కరోనావైరస్ కేసులు పెరుగుతుండడంతో యూపీలోలాగే దిల్లీలోని హాట్‌స్పాట్స్ ప్రాంతాలను సీల్ చేయాలని కేజ్రీవాల్ ప్రభుత్వం నిర్ణయించింది.
దిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోదియా దిల్లీలోని 20 ప్రాంతాలను సీల్ చేస్తామని, ఏయే ప్రాంతాలకు నిత్యావసరాలు పంపించాలి అనేది ప్రభుత్వం నిర్ణయించాల్సి ఉందని చెప్పారు..
దిల్లీ, యూపీలో ఇళ్ల నుంచి బయటకు వెళ్తే మాస్క్ తప్పనిసరి
ముంబయి ఫేస్ మాస్క్ తప్పనిసరి చేయగా, దిల్లీ, యూపీ ప్రభుత్వాలు కూడా అదే నిర్ణయం తీసుకున్నాయి.
ఇళ్ల నుంచి బయటికి వెళ్లే వారు మాస్క్ ధరించడం వల్ల కరోనా వ్యాప్తిని అడ్డుకోవచ్చని దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.
ఆయన తన ట్వీట్‌లో “ఫేస్ మాస్కులు ధరించడం వల్ల కరోనా వైరస్ వ్యాప్తి గణనీయంగా తగ్గుతుంది. అందుకే ఇంటి నుంచి బయటకు వెళ్లే ఎవరైనా ఫేస్ మాస్క్ ధరించడం తప్పనిసరి చేస్తున్నాం. గుడ్డ మాస్కు అయినా ధరించవచ్చు” అన్నారు.
పన్ను చెల్లింపుదారులకు ఆదాయ పన్ను శాఖ ఉపశమనం
కొవిడ్-19 వ్యాప్తితో సతమతం అవుతున్న వ్యాపారులు, వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం అందించేందుకు రూ.5 లక్షల వరకు పెండింగు(నిలిపివేయబడి)లో ఉన్న అన్ని రీఫండ్స్‌ను చెల్లించాలని ఆదాయ పన్ను శాఖ నిర్ణయించింది.
ఈ నిర్ణయం వలన సుమారు 14 లక్షల మంది పన్నుచెల్లింపుదారులకు లబ్ది చేకూరనుంది.
దీనితోపాటు సూక్ష్మ, చిన్న. మధ్యతరహా వ్యాపారులతో కలిపి సుమారు 1 లక్ష వ్యాపార సంస్థలకు పెండింగులో ఉన్న అన్ని జిఎస్టీ. కస్టం పున:చెల్లింపులను కూడా వెంటనే రీఫండ్ చేయాలని నిర్ణయించింది.
దీనికి సంబంధించిన దాదాపు రూ. 18 వేల కోట్ల మొత్తాన్ని వెంటనే మంజూరు చేయనున్నారు.
ఫ్రాన్స్ విమాన వాహక నౌకలో కరోనా అనుమానితులు
అణు శక్తితో నడిచే ఫ్రాన్స్ విమాన వాహక నౌక చార్లెస్ డీ గాలేలోని కొందరు సిబ్బందిలో కరోనా లక్షణాలు కనిపించడంతో అది తిరిగి పోర్టుకు బయల్దేరింది.
"ప్రస్తుతం 40 మంది సైనికులను ఐసొలేషన్‌లో ఉంచామని, వారికి పరీక్షలు జరపడానికి, నౌకలో వైరస్ వ్యాపించకుండా తగిన చర్యలు తీసుకోడానికి ఒక వైద్య సిబ్బందిని పంపించామని" ఫ్రాన్స్ రక్షణ మంత్రి ఒక ప్రకటనలో చెప్పారు.
ఈ విమాన వాహక నౌక ఫ్రాన్స్ నావికా దళంలో ప్రధానమైనది. ప్రస్తుతం అది అట్లాంటిక్ మహాసముద్రంలో ఉంది. ఏప్రిల్ 23 వరకూ అది పోర్టుకు తిరిగి రాకూడదు. కానీ ఇప్పుడు దానిని తీసుకొస్తున్నారు. అది ఎప్పుడు ఫ్రాన్స్ చేరుతుందో ఇంకా తెలీడం లేదు.
అమెరికా వివాన వాహక నౌక యూఎస్ఎస్ థియోడోర్ రూజ్‌వెల్ట్ లో కూడా కరోనా వ్యాపించడంతో అందులోని సిబ్బంది పసిఫిక్ ఐలాండ్ ఆఫ్ గువామ్‌లో క్వారంటైన్లో ఉన్నారు. ఈ సంక్షోభానికి బాధ్యత వహిస్తూ అమెరికా నావికాదళ తాత్కాలిక మంత్రి రాజీనామా కూడా సమర్పించారు.
గుజరాత్‌లో 7 కొత్త కేసులు నమోదు
గుజరాత్‌లో ఇవాళ కొత్తగా 7 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 186కు చేరింది.
ఇందులో 149 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇద్దరు కరోనా రోగులు వెంటిలేటరు మీద ఉన్నారని రాష్ట్ర ఆరోగ్య శాఖ ఏఎన్ఐకి చెప్పింది.
ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 19 పాజిటివ్ కేసులు నమోదు
ఆంధ్రప్రదేశ్‌లో ఇవాళ కొత్తగా 19 కేసులు నమోదయ్యాయి.
వీటిలో గుంటూరులో 8, అనంతపురంలో 7, ప్రకాశం 3, పశ్చిమ గోదావరి జిల్లాలో 1 కేసు నమోదయ్యాయి.
కొత్తగా నమోదైన 19 కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 348కి చేరింది.
రాష్ట్రంలో కరోనాతో మొత్తం నలుగురు మృతిచెందారు.
ఈరోజు ముగ్గురు డిశ్చార్జ్ అవడంతో, కరోనా వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయిన మొత్తం కేసుల సంఖ్య 9కి చేరింది.
మహారాష్ట్రలో 117 కొత్త కేసులు, 8 మంది మృతి
మహారాష్ట్రలో ఈరోజు కొత్తగా 117 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
8 మంది చనిపోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 72కు చేరింది.
రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1135కు చేరిందని మహారాష్ట్ర ఆరోగ్య శాఖ చెప్పింది.
కరోనావైరస్: ఇంగ్లండ్‌లో ఒకే రోజు 828 మంది మృతి
ఇంగ్లండ్‌లో గత 24 గంటల్లో 828 మంది కరోనా పాజిటివ్ రోగులు మృతి చెందారు. దీంతో దేశంలో మొత్తం కరోనా మృతుల సంఖ్య 6483కు చేరింది.
వేల్స్‌లో గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో 33 మంది చనిపోయారు. వీరితో కలిపి అక్కడ మృతుల సంఖ్య 245కు చేరింది.
వేల్స్ లో 284 కొత్త కేసులు కూడా నమోదైనట్లు అధికారులు చెప్పారు. దీంతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 4073కు చేరింది.
నార్తర్న్ ఐర్లాండ్‌లో మరో ఐదుగురు కరోనా రోగులు చనిపోయారు. ఇక్కడ మొత్తం మృతుల సంఖ్య 78కి చేరింది. దేశంలో 84 కొత్త కేసులు ధ్రువీకరించడంతో మొత్తం కేసుల సంఖ్య 1339కి చేరింది.
స్కాట్‌లాండ్‌లో గత 24 గంటల్లో 70 మంది మృతి చెందారు. ఇది దేశంలో ఇప్పటివరకూ అత్యధికం.
భారత్‌లో లాక్‌డౌన్ తర్వాత పెరిగిన నిరుద్యోగం
లాక్‌డౌన్ సమయంలో భారతదేశంలో నిరుద్యోగం శాతం విపరీతంగా పెరిగిందని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ(సీఎంఐఈ) వీక్లీ నివేదికలో చెప్పారు.
లాక్‌డౌన్ ముందు జనవరిలో 6.60 ఉన్న నిరుద్యోగం రేటు లాక్‌డౌన్ విధించిన తర్వాత 23 శాతానికి పైగా పెరిగిందని సూచించారు.
సెంట్రల్ లండన్‌లో బిల్ బోర్డుపై రాణి సందేశం
కరోనా వ్యాపిస్తున్న సమయంలో దేశ ప్రజలకు ధైర్యం చెబుతూ, బ్రిటన్ రాణి ఇచ్చిన సందేశం ఫొటోను సెంట్రల్ లండన్‌లో ఒక భారీ బిల్ బోర్డుపై ప్రదర్శించారు.
ఆదివారం రాణి ప్రసంగంలోని సందేశాలను ఈ బోర్డుపై ప్రదర్శించారు.
వాటిలో రాణి ఎన్‌హెచ్ఎస్ సిబ్బందికి ధన్యవాదాలు చెప్పడం కూడా ఉంది.
వీటితోపాటు "మనం మన స్నేహితులను మళ్లీ కలుద్దాం, మన కుటుంబాలతో మళ్లీ ఉంటాం. మనం మళ్లీ కలుద్దాం" అనే సందేశాన్ని కూడా ప్రదర్శించారు.
ఆదివారం రాణి ప్రసంగాన్ని 2 కోట్ల 40 లక్షలమందికి పైగా వీక్షించారు.
'ముస్లిం వ్యతిరేక ప్రచారం తగదు'
"ముస్లిం వ్యతిరేక విద్వేషం కోవిడ్-19 వైరస్ వ్యాప్తిని పెంచుతుంది తప్ప, తగ్గించదు” అంటూ మహిళా, ట్రాన్స్జెండర్ సంఘాల ఐక్యకార్యాచరణ వేదిక ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది.
అందులో, కోవిడ్ వ్యాప్తిని అడ్డుకోడానికి శాస్త్రవేత్తలు, వైద్యులు, అంతర్జాతీయప్రజారోగ్య సంస్థలు అహర్నిశలుకుస్తీ పడుతుంటే, సామజికమాధ్యమాల్లో కుట్ర సిద్ధాంతాలు, మత ద్వేషాలు, వేరే దేశాలపట్ల విద్వేషం విజృంభిస్తున్నాయి అని చెప్పారు.
మొదట్లోచైనా మీద జరిగిన సామాజికమాధ్యమాలప్రచారంఇప్పుడు దేశంలోనిముస్లింల మీద జరుగుతోంది. మరి కొంత మంది ట్రాన్సజెండర్ల వల్లే ఇది వస్తుందని ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారంలో వాస్తవం లేదు. ఈ సమయంలో కోవిడ్-19 వైరస్ వ్యాప్తినిఅరికట్టటానికిఅలాంటివి ప్రతి కూలం.
మహిళా, ట్రాన్స్ జెండర్సంఘాలఐక్య కార్యాచరణ సమితి తరఫున ఇలాంటి ప్రచారాన్ని వెంటనే అడ్డుకోవాలని తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ప్రభుత్వాలను డిమాండుచేస్తున్నాం.
ఒరిస్సా ప్రభుత్వంలాగే రెండు రాష్ట్రప్రభుత్వాలుకూడా దీనిపై ఒక జీవో తీసుకురావాలని, తప్పుడు ప్రచారం చేసేవారిని హెచ్చరించాలని ప్రకటనలో డిమాండ్ చేశారు.
విశాఖ వాసికి వాట్సాప్‌లో కన్నీటి వీడ్కోలు
సింగపూర్‌లో చనిపోయిన విశాఖ వాసికి లాక్‌డౌన్ వల్ల స్నేహితులు అక్కడే అంత్యక్రియలు నిర్వహించాల్సి వచ్చింది.
ఎస్.రాయవరం మండలం వమ్మవరం గ్రామానికి చెందిన వెలుగుల సూర్య రావు (33) సింగపూర్‌లో ఒక కంపెనీలో పనిచేస్తున్నారు. ఆయన ఇటీవల చనిపోయారు.
కరోనా వల్ల అంతర్జాతీయ విమాన సర్వీసులు లేకపోవడంతో మృతదేహాన్ని భారత్ తీసుకురావడం సాధ్యం కాలేదు.
దీంతో మిత్రులు సూర్యారావుకు సింగపూర్‌లోనే దహన సంస్కారాలు పూర్తి చేశారు.
ఈ అంత్యక్రియలను విశాఖలో ఉన్న మృతుడి భార్య, కుటుంబ సభ్యులకు వాట్సాప్ వీడియో ద్వారా చూపించారు.
వాట్సాప్‌లోనే సూర్యారావును చివరిసారి చూసిన భార్య, కుటుంబ సభ్యులు ఆయనకు కన్నీటితో వీడ్కోలు పలికారు.
ఐసీయూలోనే బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్
బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఆరోగ్య స్థితిపై బీబీసీకి సమాచారం అందింది.
ఆయన గత రెండు రోజులుగా కరోనా లక్షణాలతో ఐసీయూలో ఉన్నారు.
"ప్రధానమంత్రి పరిస్థితి స్థిరంగా ఉంది. ఆయనపై చికిత్స ప్రభావం కనిపిస్తోంది" అని ఒక ప్రతినిధి చెప్పారు,.
"ఆయన లండన్‌లోని సెయింట్ థామస్ ఆస్పత్రిలోని ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ప్రధాని చాలా మనోబలం చాలా గట్టిది" అని ప్రభుత్వ ప్రతినిధి చెబుతున్నారు.
'లాక్‌డౌన్ పొడిగింపు' సంకేతాలు ఇచ్చిన ప్రధాని మోదీ
ఏప్రిల్ 14న లాక్‌డౌన్ ఎత్తేయడం సాధ్యకాదని ప్రధాని మోడీ పదే పదే చెప్పినట్లు స్థానిక మీడియా చెబుతోంది.
కరోనాపై చర్చించేందుకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని పార్టీలతో సమావేశమైన మోదీ “లాక్‌డౌన్ ఒకేసారి ఎత్తివేయడం ఉండదు” అనే విషయం స్పష్టంగా చెప్పినట్లు ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎంపీ మీడియాకు చెప్పారు.
కానీ కేంద్రం లాక్‌డౌన్ పొడిగించడం గురించి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటనా చేయలేదు.
దేశంలో కేంద్రం చెప్పిన లాక్‌డౌన్ ముగియడానికి ఇక వారం కంటే తక్కువే ఉంది. కానీ భారత్‌లో కేసులు 5000 దాటాయి. దాదాపు ఏడు రాష్ట్రాలు తాము లాక్‌డౌన్ పొడిగించాలనే అనుకుంటున్నట్లు సంకేతాలు ఇచ్చాయి.
అనంతపురం జిల్లాలో ఒకే రోజు 7 కరోనా కొత్త కేసులు నమోదు
అనంతపురం జిల్లాలో ఇవాళ ఒక్కరోజే 7 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ప్రకటించారు.
కొత్త కేసులతో కలిపి జిల్లాలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 13కి చేరింది.
బుధవారం జిల్లాలో కోవిడ్-19 వ్యాప్తి గురించి జిల్లా కలెక్టర్ సమీక్షించారు.
“మక్కా నుంచి వచ్చిన ఇద్దరికి, కల్యాణ దుర్గం నుంచి ఢిల్లీ వెళ్లిన మరొకరికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ కాగా, ఇటీవల మృతి చెందిన కరోన పాజిటివ్ రోగికి చికిత్స చేసిన నలుగురు డాక్టర్లకు కూడా పాజిటివ్ వచ్చింది” అని కలెక్టర్ తెలిపారు..
కరోనా వైరస్ పాజిటివ్ కేసులకు సంబంధించి కంటైన్మెంట్ వ్యూహం అమలు చేస్తున్నామని, ర్యాపిడ్ రెస్పాన్స్ టీంలను రంగంలోకి దించి వివరాలను వేగంగా సేకరిస్తున్నాం అని ఆయన చెప్పారు.
జిల్లాలోకొత్తగా నమోదైన 7 కరోనా పాజిటివ్ కేసులకు సంబంధించిన వివరాలు, వారి కుటుంబ సభ్యుల వివరాలు, వారు ఎక్కడెక్కడ తిరిగారో అనే సమాచారం వేగంగా గుర్తించాలని ఏడు కంటైన్మెంట్ స్ట్రాటజీ బృందాలను ఆదేశించారు.
కరోనావైరస్: కేంద్ర ప్రభుత్వానికి కేరళ సూచనలు
దేశంలోని చాలా రాష్ట్రాలు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ పొడిగించాలని కేంద్రానికి సలహా ఇస్తుంటే, కేరళ ప్రభుత్వం మాత్రం లాక్‌డౌన్‌ను జూన్ 30 వరకూ క్రమంగా, దశలవారీగా కొనసాగించాలని సూచినట్లు జర్నలిస్ట్ ఇమ్రాన్ ఖురేషీ బీబీసీకి తెలిపారు..
కేరళ మాజీ ప్రధాన కార్యదర్శి, సెబీ నేతృత్వంలోని ఒక కమిటీ ఆరోగ్య, ఆరోగ్యేతర సంబంధిత అంశాలను సమగ్రంగా కవర్ చేసేందుకు చాలా సిఫారసులు చేసింది.
వీటిలో జీవనోపాధి సమస్యలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడం కూడా ఉంది.
కేరళ ప్రభుత్వం చేసిన సిఫారసుల్లో మరికొన్ని
- ఇళ్ల నుంచి బయటికి వచ్చే అందరికీ మాస్క్ ధరించడం తప్పనిసరి చేయడం
- 25 మంది లోపు హాజరయ్యే పెళ్లిళ్లకు స్థానిక సంస్థల అనుమతి తప్పనిసరి చేయడం
- పనిచేసే ప్రాంతాల్లో, కార్లలో, ప్రజా రవాణాలో ఎయిర్ కండిషన్ అనుమతించకూడదు
- కమ్యూనిటీ స్ప్రెడ్ కాకుండా పరీక్షలు పెంచడం
- హాట్‌స్పాట్స్ గుర్తించడం. ఐదు లేదా అంతకు మించి కరోనా కేసులు ఉన్న క్లస్టర్, వంద లేదా అంతకు మించి సెకండరీ కాంటాక్ట్ అనుమానితులు ఉన్న పంచాయతీ లేదా వార్డులను హాట్‌స్పాట్‌గా గుర్తించడం.
- అలాంటి పంచాయతీలు లేదా వార్డుల్లో కదలికలను పూర్తిగా నిషేధించడం. పోలీసులు , వాలంటీర్ల ద్వారా అత్యవసరసేవలు అందించడం. వాలంటీర్ టాస్క్ ఫోర్స్ ద్వారా నిత్యావసరాలు, ఆహారం లాంటివి డెలివరీ చేయడం.
- హాట్‌స్పాట్స్ బయట ఉన్న ప్రాంతాల్లో ఏప్రిల్ 15 నుంచి మూడు దశల్లో లాక్‌డౌన్ సడలించడం.
ఈ మూడు దశలను ఎప్పటి నుంచి ఎప్పటివరకూ అమలు చేయాలి. ఆ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, కరోనా కేసులు తగ్గినట్టు, పెరిగినట్టు ఎలా పరిగణించాలో కూడా కేరళ ప్రభుత్వం తమ సూచనల్లో చెప్పింది.
15 జిల్లాల్లో హాట్‌స్పాట్స్ సీల్ చేస్తాం- యూపీ ప్రభుత్వం
కరోనావైరస్ కేసులు పెరుగుతుండడంతో యూపీలోని 15 జిల్లాల్లో హాట్‌స్పాట్స్ గా భావిస్తున్న ప్రాంతాలను పూర్తిగా సీల్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వీటిని ఏప్రిల్ 15 వరకూ సీల్ చేస్తారు.
“యూపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 343కు చేరింది, 15 జిల్లాల్లో హాట్‌స్పాట్స్ గుర్తించారని, ఆప్రాంతాలను పూర్తిగా సీల్ చేస్తాం. అక్కడకు ఎవరూ వెళ్లకుండా పూర్తిగా లాక్‌డౌన్ చేస్తాం” అని యూపీ అదనపు చీఫ్ సెక్రటరీ అవనీశ్ అవస్థి చెప్పారు.
“లాక్‌డౌన్ చేసిన ప్రాంతాల్లో కరోనా కేసులు తగ్గుతున్నట్టు కనిపిస్తోంది. కాంటాక్ట్ ట్రేసింగ్ సాయంతో అలాంటివారిని క్వారంటైన్‌కు పంపించాం. ఎవరు, ఏ ప్రాంతంలో ఉన్నా, వ్యాధిని వ్యాపించేలా చేయలేదు. దీనిని ఆగ్రాలో విజయవంతంగా అమలు చేశాం. దానితో మంచి ఫలితాలు కూడాకనిపించాయి. అందుకే ఈ 15 జిల్లాల్లో హాట్‌స్పాట్లను కూడా లాక్‌డౌన్‌లో ఉంచుతాం” అన్నారు.
స్పెయిన్‌లో వరసగా రెండో రోజూ పెరిగిన మృతుల సంఖ్య
స్పెయిన్‌లో మృతుల సంఖ్య వరసగా రెండో రోజు కూడా పెరిగింది. బుధవారం కరోనా వల్ల దేశంలో మొత్తం 757 మంది చనిపోయారు. మంగళవారం కూడా 743 మంది మృతిచెందారు.
ఏప్రిల్ 2న 950 మృతుల కంటే ఈ సంఖ్య తక్కువే. కానీ రెండు రోజులు వరుసగా మృతుల సంఖ్య పెరగడంతో దేశంలో ఇంకా పరిస్థితి అదుపులోకి వచ్చినట్టు కనిపించడం లేదు.
స్పెయిన్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య కూడా వరసగా నాలుగు రోజుల నుంచీ వేగంగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 6810 కొత్త కేసులు బయటపడ్డాయి.
స్పెయిన్‌లో మొత్తం కరోనా కేసుల సంఖ్య లక్షా 47 వేలకు చేరింది. యూరప్‌లో కరోనా పాజిటివ్ కేసుల విషయంలో స్పెయిన్ అగ్ర స్థానంలో ఉంది.
స్పెయిన్‌లో కరోనా వల్ల మరణించిన వారి సంఖ్య కూడా 15 వేల దగ్గరకు చేరింది.