కరోనావైరస్: ప్రపంచవ్యాప్తంగా 42,000 దాటిన మరణాలు, వైరస్ సోకిన వారి సంఖ్య 8.6 లక్షలు

భారతదేశంలో కరోనావైరస్ కేసుల సంఖ్య 1637కు చేరుకుంది. 38 మంది చనిపోయారు. ఏపీలో ఒకే రోజు 43 కొత్త కేసులు. మొత్తం కేసుల సంఖ్య 87కు చేరింది.

లైవ్ కవరేజీ

  1. కరోనావైరస్ కారణంగా పదమూడేళ్ల బాలుడి మృతి

    లండన్ హాస్పటల్

    ఫొటో సోర్స్, GETTY IMAGES

    కరోనావైరస్ పాజిటివ్ వచ్చిన పదమూడేళ్ల బాలుడు లండన్లో మరణించాడు.

    బ్రిక్స్టన్ కు చెందిన ఇస్మాయిల్ మొహమ్మద్ అబ్దుల్ వాహబ్ కింగ్స్ కాలేజ్ హాస్పటల్లో సోమవారం మరణించాడు. యూకేలో కరోనావైరస్ కారణంగా మరణించిన వారిలో అతి చిన్న వయస్కుడు ఇతడే అని భావిస్తున్నారు.

    అతడు కరోనావైరస్ కారణంగానే చనిపోయాడని హాస్పటల్ ట్రస్ట్ తెలిపింది.

    అతడికి ఎలాంటి వ్యాధి లక్షణాలూ లేవని, కానీ కరోనా పాజిటివ్ అని వచ్చిందని ఇస్మాయిల్ కుటుంబం వెల్లడించింది. శుక్రవారం వ్యాధి నిర్థరణ కాగానే, తర్వాత రోజు హాస్పటల్లో చేర్చామని వారు తెలిపారు.

    "ఈ వయసువారిలో కరోనావైరస్ సోకినా కేవలం 0.3% మందికి మాత్రమే ఆస్పత్రిలో చేర్చి చికిత్స చేయాల్సిన అవసరం ఉంది. వారిలో కూడా మరణాల శాతం కేవలం 0.006% మందికి మాత్రమే చనిపోయే ప్రమాదం ఉంటుంది. అంటే ప్రతి 30000 మంది కరోనా రోగుల్లో కేవలం ఇద్దరు మాత్రమే మరణించే ఆస్కారం ఉంది" అని బీబీసీ హెల్త్ ప్రతినిధి నిక్ ట్రిగిల్ తెలిపారు.

  2. మర్కజ్ కు హాజరైన 15 మంది శ్రీకాళహస్తి వాసులు

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

    ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా నుంచి దిల్లీ నిజాముద్దీన్ లో జరిగిన మతపరమైన కార్యక్రమానికి హాజరైన పదిహేను మందిని వైద్య శాఖ అధికారులు గుర్తించారు. శ్రీకాళహస్తిలో గుర్తించిన వారందరినీ తిరుపతిలోని రుయా ఆస్పత్రికి తరలించారు.

  3. కరోనా మరణాల్లో చైనాను దాటిన అమెరికా

    అమెరికాలో కరోనావైరస్ ఇన్ఫెక్షన్ మరణాల విషయంలో అమెరికా చైనాను దాటేసింది. ఇప్పటివరకూ అమెరికాలో కోవిడ్-19తో 3,606 మంది చనిపోయారు. చైనాలో దాని బారినపడి మరణించినవారి సంఖ్య 3,309.

    అమెరికాలో మృతుల్లో అత్యధికంగా న్యూయార్క్‌లోనే ఉన్నారు. ఇక్కడ దాదాపు 932 మంది ప్రాణాలు కోల్పోయారు.

    వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు తీసుకుంటున్న చర్యలు మరో 30 రోజులు కొనసాగుతాయని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ప్రకటించారు.

  4. ప్రపంచయుద్ధం తర్వాత ఇదే అతిపెద్ద పరీక్ష : ఐరాస సెక్రటరీ జనరల్

    ఆంటోనియో గుటెరస్

    ఫొటో సోర్స్, Getty Images

    ఫొటో క్యాప్షన్, ఆంటోనియో గుటెరస్

    ప్రపంచ యుద్ధం తర్వాత మానవాళి ఎదుర్కొంటున్న అతిపెద్ద పరీక్ష కరోనావైరస్ వ్యాప్తి అని ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గటెర్స్ వ్యాఖ్యానించారు.

    దీని వల్ల ఈ మధ్య కాలంలో మనం ఎప్పుడూ చూడని స్థాయయి ఆర్థిక సంక్షోభం రావొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ‘కార్చిచ్చు’లా వ్యాపించే అవకాశమున్న ఈ వైరస్‌ను ఎదుర్కోవడంలో పారిశ్రామీకరణ చెందిన దేశాలు తక్కువ అభివృద్ధి చెందిన దేశాలకు సాయపడాలని ఆయన కోరారు.

    కరోనావైరస్ వ్యాప్తి ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా 2.5 కోట్ల ఉద్యోగాలు పోవచ్చని ఐరాస నివేదిక అంచనా వేసింది. అంతర్జాతీయంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ప్రవాహంపై 40 శాతం తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించింది.

  5. ఆంధ్రప్రదేశ్: 44కు చేరిన కరోనావైరస్ కేసులు

    ఆంధ్రప్రదేశ్ లో మరో నాలుగు కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 44కు చేరింది.

    ఆంధ్ర ప్రదేశ్ నుంచి దిల్లీలో జరిగిన మతపరమైన సమ్మేళనానికి వెళ్లొచ్చిన నలుగురు విశాఖ వాసులకు కరోనా పాజిటివ్ అని తేలింది.మొత్తం 44 కేసుల్లో ప్రకాశం 11, విశాఖ 10, గుంటూరు 9,కృష్ణా 5, తూర్పు గోదావరి 4, అనంతపురంలో 2 కేసులు నమోదయ్యాయి.

    చిత్తూరు, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో ఒక్కో కేసు నమోదైంది.

    కరోనా పాజిటివ్ బాధితుల్లో ఇద్దరు పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.

    మంగళవారం మొత్తం 256 నమూనాలకు పరీక్షలు నిర్వహించారు. వీటిలో 21 పాజిటివ్ అని నిర్థరణ కాగా, 235 మందికినెగిటివ్ అని రిపోర్టుల్లో తేలింది.