You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

నేపాల్ ప్రధానిగా ప్రచండ

నేపాల్ ప్రధానమంత్రిగా పుష్ప కమల్ దహల్ ప్రచండను ఆ దేశ అధ్యక్షురాలు బిద్యా దేవి భండారీ నియమించారు.

లైవ్ కవరేజీ

  1. ధన్యవాదాలు

    ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.

    రేపు ఉదయం మళ్లీ కలుద్దాం.

  2. పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో పేలుడు, అయిదుగురు మృతి

    పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో బాంబు పేలుడు వల్ల అయిదుగురు ప్రాణాలు కోల్పోయారు.

    ఈ పేలుడు కారణంగా మరో 10 మంది గాయపడినట్లు అక్కడి పోలీసులు ప్రకటించారు.

    గత కొన్నివారాలుగా పాకిస్తాన్‌లో మిలిటెంట్ల దాడులు జరుగుతున్నాయి.

  3. దిల్లీ మెట్రో ట్రాక్‌పై డ్రోన్.. సేవలకు కొద్దిసేపు అంతరాయం

    దిల్లీలోని జనక్‌పురి వెస్ట్‌ నుంచి బొటానికల్‌ గార్డెన్‌కు వెళ్లే దిల్లీ మెట్రో లైన్‌ ట్రాక్‌పై డ్రోన్‌ పడటంతో ఆదివారం మెట్రో సేవలకు అంతరాయం ఏర్పడింది.

    భద్రత కారణాల దృష్ట్యా జసోలా విహార్ షాహీన్ బాగ్, బొటానికల్ గార్డెన్ మధ్య సేవలకు అంతరాయం ఏర్పడిందని ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎం‌ఆర్‌సీ) ట్వీట్‌లో తెలిపింది.

    కొద్దిసేపటి తర్వాత సేవలు పునరుద్ధరించినట్లు డీఎంఆర్‌సీ వెల్లడించింది.

    కాగా, మందుల డెలివరీకి వినియోగించే ఓ డ్రోన్ జసోలా విహార్ సమీపంలోని మెట్రో ట్రాక్‌పై పడటంతో ఈ అంతరాయం ఏర్పడిందని ఏఎన్‌ఐ వార్తా సంస్థ తెలిపింది.

    మెట్రో డీసీపీ జితేంద్ర మణి ఏఎన్ఐతో మాట్లాడుతూ.. "మధ్యాహ్నం 2.30 గంటలకు సమాచారం అందింది. డాగ్ స్క్వాడ్ వెళ్లి పరిశీలించగా అక్కడి ట్రాక్‌పై డ్రోన్‌ కనిపించింది. అందులో మెడిసిన్ ప్యాకెట్లు ఉన్నాయి. ఇది నోయిడాకు చెందిన ఓ కంపెనీది. ఇది వివిధ ఆసుపత్రులు, ల్యాబ్‌లకు మందులను సరఫరా చేస్తుంది. దీనిపై దర్యాప్తు జరుపుతున్నాం‘‘ అని తెలిపారు

  4. తెలంగాణ: మేడపైకి ఎక్కిన దున్నను కిందకు ఇలా తెచ్చారు

  5. యుక్రెయిన్, రష్యా యుద్దం ముగించండి: క్రిస్మస్ సందేశంలో పోప్

    క్రిస్మస్ సందర్భంగా వాటికన్ నుంచి పోప్ ఫ్రాన్సిస్ తన సందేశాన్ని వినిపించారు.

    యుక్రెయిన్‌, రష్యా యుద్ధాన్ని పోప్ ప్రస్తావించారు. దీనిని 'అర్థరహిత యుద్ధం'గా పేర్కొన్న ఆయన యుద్ధాన్ని ముగించాలని విజ్ఞప్తి చేశారు.

    ఆహారాన్ని ఆయుధంగా ఉపయోగిస్తున్నారంటూ పోప్ ఖండించారు.

    ప్రపంచంలోని గోధుమ ఉత్పత్తిలో యుక్రెయిన్ 30 శాతం ఉత్పత్తి చేస్తోంది.

    ఫిబ్రవరిలో యుక్రెయిన్‌పై రష్యా దాడి చేసిన తర్వాత గోధుమల ధరలు విపరీతంగా పెరిగాయి.

    పోప్ అయిన తర్వాత ఇది ఆయన 10వ క్రిస్మస్ ప్రసంగం.

    ఆదివారం తన 10 నిమిషాల ప్రసంగంలో ఎక్కువ సమయం యుక్రెయిన్ గురించే మాట్లాడారు.

    ప్రపంచంలోని చాలా ప్రాంతాలలో శాంతి కరువైందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.

    పశ్చిమాసియా, మయన్మార్, హైతీ, ఆఫ్రికాలోని సాహెల్ ప్రాంతంలో జరుగుతున్న హింస, మానవతా విపత్తులను కూడా పోప్ ప్రస్తావించారు.

    హిజాబ్‌కు సంబంధించి ఇరాన్‌లో గత మూడు నెలలుగా కొనసాగుతున్న నిరసనలకు స్వస్తి పలకాలని, 'సయోధ్య' నెలకొల్పాలని పోప్ ప్రార్థించారు.

  6. అమెరికా: ఒడిలో మూడేళ్ల బాబు, భార్యతో మెక్సికో సరిహద్దులో 30 అడుగుల గోడ దూకిన భారతీయుడు.. అక్రమంగా అమెరికా వెళ్లే ప్రయత్నంలో మృతి

  7. నేపాల్ కొత్త ప్రధానిగా ప్రచండ.. దేశ అధ్యక్షురాలు బిద్యాదేవి ప్రకటన

    నేపాల్ ప్రధానమంత్రిగా పుష్ప కమల్ దహల్ ప్రచండను ఆ దేశ అధ్యక్షురాలు బిద్యా దేవి భండారీ నియమించారు.

    నేపాల్‌లో మూడో అతిపెద్ద పార్టీ అయిన నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ (మావోయిస్టు సెంటర్) నాయకుడు ప్రచండ.

    ఈ మేరకు ప్రచండను ప్రధానిగా నియమిస్తూ రాష్ట్రపతి కార్యాలయం ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది. నేపాల్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 76 (2) ప్రకారం ప్రధానమంత్రిగా ప్రతినిధుల సభకు చెందిన ప్రచండను నియమించినట్లు ఆ ప్రకటనలో తెలిపారు.

    ఈ ఆర్టికల్ ప్రకారం రెండు లేదా అంతకంటే ఎక్కువ పార్టీల మద్దతుతో మెజారిటీ ఉన్న ప్రతినిధుల సభకు చెందిన వ్యక్తిని ప్రధానిగా నియమించవచ్చు.

    ప్రచండ ఆదివారం రాష్ట్రపతి అధికారిక నివాసమైన 'శీతల్ నివాస్'కు చేరుకున్నారు. ప్రధాని పదవికి 170 మందికి పైగా ఎంపీలు తనకు మద్దతు ఇచ్చారని ఆయన వివరించారు.

    అంతకుముందు ప్రతిపక్ష సీపీఎన్ (ఎన్ఎంఎల్), ఇతర చిన్న పార్టీలు నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ (మావోయిస్ట్ సెంటర్) చైర్మన్ ప్రచండకు తమ మద్దతును ప్రకటించాయి. .

    దీంతో ప్రచండ ప్రధాని కావడానికి మార్గం సుగమమైంది. మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీ నేతృత్వంలోని ప్రతిపక్ష సీపీఎన్ (యుఎంఎల్), సీపీఎన్ (మావోయిస్ట్ సెంటర్), రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ,ఇతర చిన్న పార్టీలు ప్రచండ నేతృత్వంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అంగీకరించాయని పీటీఐ వార్తా సంస్థ తెలిపింది.

    కాగా, ప్రచండ, కేపీ శర్మ ఒకరి తర్వాత మరొకరు అధికారం పంచుకోనున్నారు. మొదటగా ప్రచండ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించనున్నారు.

    అధికార భాగస్వామ్య ఒప్పంద పత్రాన్ని రాష్ట్రపతికి అందజేసేందుకు సిద్ధం చేస్తున్నట్లు సీపీఎన్( మావోయిస్టు సెంటర్) జనరల్ సెక్రటరీ దేబ్ గురుంగ్ తెలిపారు.

  8. సైన్యంలో పనిచేస్తున్న కొడుక్కి తండ్రి వార్నింగ్: ‘బిడ్డా నిన్ను కచ్చితంగా చంపేస్తాను’

  9. మెరైన్ పోలీసు రిక్రూట్‌మెంట్‌లో గడ్డం ఉందంటూ సిక్కుల ప్రవేశాన్ని నిరాకరించొద్దు: యూఎస్ కోర్టు

    అమెరికాలోని మెరైన్ పోలీసు రిక్రూట్‌మెంట్‌లో తలపాగ, గడ్డం ధరించి ఉన్న సిక్కుల ప్రవేశాన్ని నిరాకరించొద్దని అక్కడి కోర్టు ఆదేశించింది.

    తమ మతాచారం తగ్గట్లు నడుచుకోవాలనుకుని పోరాడిన ముగ్గురు సిక్కుల విజయం ఈ తీర్పు. పీటీఐ వార్తా సంస్థ కథనం ప్రకారం, ఇపుడు ఐకాశ్ సింగ్, జస్క్రీత్ సింగ్, మిలాప్ సింగ్ చాహల్ లు వారి మతాచారాలను పాటిస్తూ మెరైన్ పోలీసు విభాగంలో శిక్షణ తీసుకోవచ్చు.

    అంతకుముందు మెరైన్ పోలీసు విభాగంలో గడ్డం తొలగించాలనే నిబంధన నుంచి తమను మినహాయించాల్సిందిగా ఈ ముగ్గురూ కోరారు.

    గడ్డం తీసేయడం తమ మతాచారానికి వ్యతిరేకమని వారన్నారు. అయితే గడ్డం తీసేసి వస్తేనే వారికి శిక్షణ ఇస్తామని మెరైన్ పోలీస్ అధికారులు తేల్చి చెప్పారు.

    దీనిపై కోర్టుకు వెళ్లగా కింది కోర్టు పోలీసుల వాదననే సమర్థించింది.

    దీంతో వాళ్లు డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా సర్క్యూట్‌లోని యునైటెడ్ స్టేట్స్ కోర్టులో అప్పీల్ చేసుకున్నారు.

    ఆ కోర్టు సిక్కుల ప్రవేశాన్ని అడ్డుకోవద్దని మెరైన్ పోలీసు విభాగాన్ని ఆదేశించింది.

  10. కర్నాటక vs మహారాష్ట్ర: రాజుకున్న సరిహద్దు వివాదం, అసలేంటి ఈ గొడవ, 60 ఏళ్లకు పైగా ఎందుకు పరిష్కారం లేదు..

  11. చైనా ప్రధాని ఎక్కబోయే భారతీయ విమానంలో బాంబు ఉందని తెలిసినా ఆ దేశం కావాలనే చెప్పలేదా?

  12. ఇరాన్: ‘నా 19 ఏళ్ల జీవితంలో ఎన్నడూ తిననన్ని దెబ్బలు జైల్లో తిన్నాను’ - చనిపోయే ముందు ఒక యువతి చెప్పిన దారుణ వివరాలు

  13. అంతరించిపోయే దశకు చేరువగా బేబీ పింక్ ఇగ్వానాలు

  14. రవిచంద్రన్ అశ్విన్ పోరాటంతో బంగ్లాపై గెలిచిన టీమిండియా, 2-0తో సిరీస్ కైవసం

    ఉత్కంఠ రేకెత్తించిన మీర్పూర్ టెస్టు మ్యాచ్‌లో రవిచంద్రన్ అశ్విన్ (62 బంతుల్లో 42; 4 ఫోర్లు, 1 సిక్స్) పోరాటంతో బంగ్లాదేశ్‌పై భారత్ 3 వికెట్ల తేడాతో గెలుపొందింది.

    దీంతో రెండు టెస్టుల సిరీస్‌ను భారత్ 2-0తో కైవసం చేసుకుంది.

    ఈ మ్యాచ్‌లో భారత్ ఓటమి దిశగా సాగుతున్న తరుణంలో క్రీజులోకి వచ్చిన అశ్విన్, ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. వికెట్ కోల్పోకుండా వేగంగా పరుగులు చేసి జట్టును గెలిపించాడు.

    ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 227 పరుగులు చేసింది. తర్వాత భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 314 పరుగులకు ఆలౌటైంది. దీంతో భారత్‌కు 87 పరుగుల ఆధిక్యం దక్కింది.

    అనంతరం రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన బంగ్లాదేశ్ 231 పరుగులకు ఆలౌట్ అవ్వడంతో భారత్‌కు 145 పరుగుల లక్ష్యం ఎదురైంది.

    ఈ స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత టాపార్డర్ తడబడింది. శుబ్‌మన్ గిల్ (7), కేఎల్ రాహుల్ (2), పుజారా (6), విరాట్ కోహ్లి (1) సింగిల్ డిజిట్ స్కోరుకే వెనుదిరిగారు.

    అక్షర్ పటేల్ (34), శ్రేయస్ అయ్యర్ (29), అశ్విన్ రాణించడంతో జట్టుకు విజయం దక్కింది.

  15. టీవీ సీరియల్ సెట్‌లోనే నటి ఆత్మహత్య, సహ నటుడి అరెస్ట్

    టీవీ నటి తునీషా శర్మ (21) ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

    'భారత్ కా వీర్ పుత్ర - మహారాణా ప్రతాప్' అనే సీరియల్‌తో 2015లో టీవీలో అరంగేట్రం చేసిన తునీషా శర్మ శనివారం ఓ టీవీ సీరియల్ సెట్‌లో నిర్జీవంగా కనిపించారు. ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించగా ఆమె అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. ఇది ఆత్మహత్య అని పోలీసులు తెలిపారు.

    ఈ కేసుకు సంబంధించి ఆమె సహనటుడు షీజన్ ఖాన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనపై ఆత్మహత్యకు పురికొల్పడం అనే నేరారోపణతో ఆయనపై ఐపీసీ సెక్షన్ 306 కింద కేసు నమోదు చేశారు.

    తునీషా తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

    మరోవైపు, తునీషా మృతదేహానికి ఆదివారం తెల్లవారుజామున పోస్ట్‌ మార్టం చేశారు. పోస్ట్ మార్టం నివేదిక రావాల్సి ఉందని పోలీసులు చెప్పారు.

    బీబీసీతో మాట్లాడుతూ థానే జిల్లా వలీవ్ పోలీస్ స్టేషన్ సీనియర్ ఇన్‌స్పెక్టర్ కైలాష్ బార్వే తునీషా శర్మ మరణాన్ని ధ్రువీకరించారు.

    పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం, షూటింగ్ విరామ సమయంలో తునీషా శర్మ తన మేకప్ రూమ్‌కి వెళ్లారు. ఆ తర్వాత షూటింగ్ స్పాట్‌కి రాకపోవడంతో కొంతమంది మేకప్ రూమ్ దగ్గరికి వెళ్లి ఆమెను పిలిచారు. ఎంతకీ తలుపు తెరవకపోవడంతో బలవంతంగా తలుపు తెరిచి చూడగా ఆమె నిర్జీవంగా కనిపించారు.

    21 ఏళ్ల తునీషా... ‘చక్రవర్తి అశోక్‌ సామ్రాట్‌’, 'ఇష్క్ సుభాన్ అల్లా', 'ఇంటర్నెట్ వాలా లవ్' వంటి సీరియల్స్‌లో కూడా నటించారు.

    2016లో 'ఫితూర్' సినిమాతో బాలీవుడ్‌లో అడుగు పెట్టారు.

  16. అటల్ బిహారీ వాజపేయి: ప్రేమించిన అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకోలేకపోయారు?

  17. చలపతి రావు ఇక లేరు... మూడు తరాల కథానాయకులతో నటించిన వైవిధ్య నటుడు

  18. క్రిస్మస్: భారత్‌లో తొలి క్రిస్మస్ కేక్ ఎక్కడ, ఎలా తయారైంది? ఆ కథ మీకు తెలుసా...

  19. అఫ్గానిస్తాన్: ‘‘ఎన్జీవోలలో మహిళలు పనిచేయకూడదు’’-తాలిబాన్లు

    ప్రభుత్వేతర సంస్థల్లో (ఎన్జీవోలు) పనిచేయకుండా మహిళలను నిషేధిస్తూ శనివారం తాలిబాన్లు వెలువరించిన ఉత్తర్వులను ఐక్యరాజ్య సమితి ఖండించింది.

    ఈ చర్య ప్రాథమిక హక్కుల ఉల్లంఘించిందని వ్యాఖ్యానించింది.

    అఫ్గాన్ ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజా ఉత్తర్వులను జారీ చేసింది.

    హిజాబ్‌ ధరించకుండా ఎన్జీవోలకు చెందిన మహిళా సిబ్బంది ఇస్లాం నిబంధనలను, డ్రెస్ కోడ్ నిబంధనలను ఉల్లంఘించారంటూ అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తాలిబాన్లు సమర్థించుకున్నారు.

    యూనివర్సిటీల్లో మహిళల ప్రవేశాలను నిషేధించిన రోజుల వ్యవధిలోనే తాజా డిక్రీని జారీ చేశారు.

    హిజాబ్ వేసుకోకుండా మహిళలు, షరియా చట్టాలను ఉల్లంఘిస్తున్నారని జాతీయ, అంతర్జాతీయ ఎన్జీవోలకు జారీ చేసిన ఉత్తర్వుల్లో అఫ్గాన్ ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది.

    తమ ఉత్తర్వులను పాటించకపోతే ఎన్జీవోల లైసెన్స్‌లు రద్దు చేస్తామని హెచ్చరించింది.

    ఈ నిర్ణయంపై అక్కడి మహిళలు ఆందోళన, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

  20. క్రిస్మస్: ‘‘మానవులు సంపద, అధికారం కోసం పాకులాడుతున్నారు’’- పోప్ ఫ్రాన్సిస్

    మానవులకు సంపద, అధికారం పట్ల ఉన్న దాహాన్ని పోప్ ఫ్రాన్సిస్ ఖండించారు.

    వాటికన్ సిటీలో క్రిస్మస్ ఈవ్ మాస్ సందర్భంగా యుక్రెయిన్ యుద్ధం, ఇతర ప్రపంచ సంఘర్షణలను దృష్టిలో పెట్టుకొని పోప్ ఫ్రాన్సిస్ ఇలా వ్యాఖ్యానించారు.

    ‘‘ఎన్ని యుద్ధాలను మనం చూశాం. వీటికి ప్రధానంగా బాధితులుగా మారేది బలహీనులు మాత్రమే. యుద్ధాలు, పేదరికం, అన్యాయం కారణంగా బాధితులుగా మారిన పిల్లల గురించి నేను ఆలోచిస్తున్నా.

    పురుషులు, మహిళలు తమదైన ప్రపంచంలో జీవిస్తున్నారు. సంపద, అధికారం కోసం పాకులాడుతున్నారు. వీటి కోసం పొరుగువారిని చివరకు కన్నవారిని, తోడబుట్టినవారిని కూడా బలిచేస్తున్నారు’’ అని పోప్ ఫ్రాన్సిస్ అన్నారు.

    వాటికన్ సిటీలోని సెయింట్ పీటర్స్ బసిలియాలో ఆయన క్రిస్మస్ సందర్భంగా సందేశం వెలువరించారు.