You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము... ప్రతిపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాపై భారీ విజయం

తొలి ఆదివాసీ మహిళ భారత రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. ద్రౌపది ముర్ముకు 2,824 మొదటి ప్రాధాన్యత ఓట్లు వచ్చాయి. వాటి విలువ 6,76,803. ప్రతిపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు 1,877 తొలి ప్రాధాన్యత ఓట్లు వచ్చాయి. వాటి విలువ 3,80,177.

లైవ్ కవరేజీ

  1. అమెరికా చేరుకున్న ఒలేనా జెలెన్‌స్కా.. మరింత సాయం కావాలని అభ్యర్థన

    యుక్రెయిన్ అధ్యక్షుడు వొలదిమీర్ జెలియెన్‌స్కీ భార్య ఒలెనా జెలెన్‌స్కా అమెరికా సాయం కోరారు. రష్యాపై యుద్ధం చేయడానికి మరింత సహాయం అందించాలని బుధవారం ఆమె అమెరికా కాంగ్రెస్‌ను కోరారు.

    ఈ మేరకు, వాషింగ్టన్‌లో ఉద్వేగభరితమైన ప్రసంగం ఇచ్చారామె.

    "నేను ఆయుధాలు అడుగుతున్నాను. వేరొకరి భూమిపై యుద్ధం ప్రకటించడానికి కాదు. సొంత ఇంటికి రక్షించుకోవడానికి ఆయుధాలు ఇమ్మని కోరుతున్నాను" అంటూ ఆమె ప్రసంగించారు.

    అంతకుముందు, మంగళవారం ఒలేనా జెలెన్‌స్కా అమెరికా అధ్యజ్షుడు జో బైడెన్‌తో, సోమవారం విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్‌తో సమావేశమయ్యారు.

    యుక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రారంభమై దాదాపు అయిదు నెలలు కావొస్తోంది. అమెరికా నుంచి మరింత సైనిక సహాయం, రాజకీయ మద్దతు కోరేందుకు ఒలేనా ఆ దేశానికి వెళ్లారు.

    యుక్రెయిన్‌కు 40 బిలియన్ డాలర్ల సహాయాన్ని ఇప్పటికే అమెరికా కాంగ్రెస్ ఆమోదించింది. సెప్టెంబర్ చివరి నాటికి దీన్ని పూర్తిగా అందిస్తారు.

    ఈ పర్యటనలో ఒలేనా, యూఎస్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ హెడ్ సమంతా పవర్‌ను కూడా కలిశారు. యుక్రేనియన్ ప్రభుత్వానికి మద్దతుగా, మానవతా అవసరాల కోసం ఈ ఏజెన్సీ బిలియన్ డాలర్ల సహాయం అందించింది.

  2. పతనమవుతున్న రూపాయి, పెరుగుతున్న ద్రవ్యోల్బణం - భారత ఆర్థికవ్యవస్థ పరిస్థితి ఏమిటి? నిపుణులు ఏమంటున్నారు?

  3. ‘‘మా భర్త 11 మందిని పెళ్లి చేసుకున్నాడు.. పక్క పక్క వీధుల్లో ముగ్గురితో కాపురాలు పెట్టాడు’’

  4. నేడు రాష్ట్రపతి ఎన్నికల ఫలితాలు.. ఉదయం 11 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం

    నేడు భారత 15వ రాష్ట్రపతి పేరును ప్రకటించనున్నారు. జూలై 18న పార్లమెంటు ఉభయ సభల సభ్యులు, రాష్ట్ర శాసనసభల సభ్యులు రాష్ట్రపతి ఎన్నికల్లో తమ ఓటు వేశారు. ఈరోజు ఉదయం 11 గంటలకు ఈ ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది.

    ఇందుకోసం ఇప్పటికే అన్ని రాష్ట్రాల శాసనసభల బ్యాలెట్ బాక్సులు పార్లమెంట్ భవనానికి చేరుకున్నాయి.

    ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవీకాలం జూలై 24తో ముగుస్తుంది. ఈ పదవికి ఎన్డీయే ద్రౌపది ముర్మును తమ అభ్యర్థిగా ప్రకటించగా, విపక్షాలు యశ్వంత్ సిన్హాను బరిలోకి దించాయి.

    రాష్ట్రపతి ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్ ద్వారా ఓటింగ్ జరుగుతుంది. ఈసారి ఎలక్టోరల్ కాలేజీలో మొత్తం 4,807 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో రాజ్యసభ నుంచి 233 మంది, లోక్‌సభ నుంచి 543 మంది, శాసనసభల నుంచి 4,033 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.

    వీరందరి ఓటుకు ఒక విలువ ఉంటుంది. ఈసారి పార్లమెంటు సభ్యుల ఓటు విలువ 700గా నిర్ణయించారు. రాష్ట్ర శాసనసభ సభ్యుల ఓట్ల విలువ ఆ రాష్ట్ర జనాభాపై ఆధారపడి ఉంటుంది.

    ఉదాహరణకు ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీలోని ఒక్కో సభ్యుడి ఓటు వెయిటేజీ 208 కాగా, మిజోరంలో 8, తమిళనాడులో 176. అసెంబ్లీ సభ్యుల ఓట్ల మొత్తం వెయిటేజీ 5,43,231. పార్లమెంటులోని మొత్తం సభ్యుల ఓట్ల వెయిటేజీ 5,43,200. అంటే ఎలక్టోరల్ కాలేజీలో ఉన్న సభ్యులందరి ఓట్ల వెయిటేజీ మొత్తం 10,86,431.

    మొత్తం వెయిటేజీలో 50 శాతం కంటే ఎక్కువ వచ్చిన అభ్యర్థి రాష్ట్రపతిగా ఎన్నికవుతారు.

  5. నేడు ఈడీ ఎదుట హాజరు కానున్న సోనియా గాంధీ

    నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ నేడు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎదుట హాజరుకానున్నారు. ఈ విచారణ అంతకుముందే జరగాల్సి ఉండగా, సోనియా గాంధీకి కోవిడ్ సోకిన కారణంగా వాయిదాపడింది.

    ఈరోజు ఉదయం 11 గంటలకు సోనియా గాంధీ కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం నుంచి ఈడీ కార్యాలయానికి వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో, దిల్లీ పోలీసులు కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం వెలుపల భద్రత కట్టుదిట్టం చేశారు.

    గతంలో నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ఈడీ ఐదు రోజుల్లో 50 గంటలకు పైగా ప్రశ్నించింది.

    బుధవారం దిల్లీలోని ఎంపీ మల్లికార్జున్ ఖర్గే నివాసంలో పార్టీ సీనియర్ నేతలు సమావేశమయ్యారు. సోనియా గాంధీపై ఈడీ విచారణకు వ్యతిరేకంగా పార్టీ వ్యూహాన్ని చర్చించారు.

    అధికారంలోకి రాకముందు దుష్ప్రచారాలు, అధికారంలోకి వచ్చిన తరువాత ఈడీ-సీబీఐ విధుల దుర్వినియోగంతో ప్రధాని మోదీ ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతున్నారని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది.

  6. Bullion Market: బంగారంపై పెట్టుబడి పెట్టే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

  7. బెయిల్‌పై విడుదలైన ఆల్ట్ న్యూస్ జర్నలిస్ట్ మొహమ్మద్ జుబేర్

    ఆల్ట్ న్యూస్ జర్నలిస్ట్ మొహమ్మద్ జుబేర్.. సుప్రీంకోర్టు ఆదేశాలతో బుధవారం సాయంత్రం తీహార్ జైలు నుంచి బెయిల్ మీద విడుదలయ్యారు.

    పలు వివాదాస్పద ట్వీట్లు చేశారంటూ జుబేర్ అహ్మద్ మీద వివిధ ప్రాంతాల్లో కేసులు నమోదు చేసి, అరెస్టు చేశారు. ఆయన మీద ఉత్తరప్రదేశ్‌లో నమోదైన ఆరు కేసుల్లో సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.

    జుబేర్‌ ట్వీట్ చేయకూడదని షరతు విధించాలని యూపీ ప్రభుత్వం తరఫున హాజరైన అదనపు అడ్వకేట్ జనరల్ గరిమ ప్రసాద్ కోరారు. దీనికి సుప్రీంకోర్టు స్పందిస్తూ.. ఒక జర్నలిస్టును రాయకుండా ఎలా ఆపగలమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. జుబేర్ ట్వీట్ చేయకుండా నిషేధించటానికి నిరాకరించింది.

    ‘‘ఇది.. ఒక న్యాయవాదికి వాదించకూడదని చెప్పటం వంటిది’’ అని అభివర్ణించింది.

    జుబేర్‌ను తక్షణం విడుదల చేయాలని జస్టిస్ డి.వై.చంద్రచూడ్ సారథ్యంలోని ధర్మాసనం ఆదేశించింది.

    ఆయనపై నమోదైన ఎఫ్ఐఆర్‌లు అన్నిటినీ ఒక దగ్గరకు చేర్చి, ఒకే దర్యాప్తు సంస్థ ద్వారా దర్యాప్తు చేయించటం మేలని సుప్రీంకోర్టు చెప్పింది.

  8. బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం

    గుడ్ మార్నింగ్...

    తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు జాతీయ, అంతర్జాతీయ వార్తల తాజా అప్‌డేట్లను ఎప్పటికప్పుడు తెలుసుకోవడం కోసం ఈ పేజీని ఫాలో అవండి.