లైవ్ పేజీ అప్‌డేట్స్ సమాప్తం
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్స్ ఇంతటితో సమాప్తం. మళ్లీ రేపు ఉదయం కలుద్దాం. అంతవరకు సెలవు.
బ్రిటన్ ప్రధాన మంత్రి పదవికి తుది రేసులో రిషి సునాక్, లిజ్ ట్రస్ నిలిచారు. కన్జర్వేటివ్ పార్టీ అధ్యక్షుడి పదవి వీరిద్దరిలో ఎవరో ఒకరికి దక్కుతుంది.
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్స్ ఇంతటితో సమాప్తం. మళ్లీ రేపు ఉదయం కలుద్దాం. అంతవరకు సెలవు.

ఫొటో సోర్స్, Reuters
బ్రిటన్ ప్రధాన మంత్రి పదవికి తుది రేసులో రిషి సునాక్, లిజ్ ట్రస్ నిలిచారు. కన్జర్వేటివ్ పార్టీ అధ్యక్షుడి పదవి వీరిద్దరిలో ఎవరో ఒకరికి దక్కుతుంది.
బుధవారం కన్జర్వేటివ్ పార్టీ ఎంపీల తుది ఓటింగ్ ప్రక్రియలో ఈ విషయం వెల్లడైంది. సెప్టెంబరు 5న పోస్టల్ బ్యాలెట్ విధానంలో రిషి సునాక్, లిజ్ ట్రస్‌ల మధ్య తుది పోరు జరుగుతుంది.
దీనిలో 1.6 లక్షల మంది కన్జర్వేటివ్ పార్టీ సభ్యులు పాలుపంచుకుంటారు.
జులై 25న బీబీసీలో లిజ్ ట్రస్, రిషి సునాక్‌ల మధ్య డిబేట్ జరగనుంది.

ఫొటో సోర్స్, Facebook/JanasenaParty
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అనారోగ్యానికి గురైనట్లు ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు.
ఇటీవల గోదావరి జిల్లాల్లో పర్యటించిన తరువాత పవన్ కల్యాణ్‌కు వైరల్ ఫీవర్ వచ్చినట్లు ఆయన వెల్లడించారు. పవన్ కల్యాణ్‌తో పాటు ప్రోగ్రాం కమిటీ సభ్యులు, సెక్యూరిటీ సిబ్బంది కూడా జ్వరాలతో అనారోగ్యానికి లోనయ్యారని వివరించారు.
అందువల్ల ఈ నెల 24న జరగాల్సిన జనవాణి కార్యక్రమాన్ని 31వ తేదీకి వాయిదా వేశారు.

ఫొటో సోర్స్, Getty Images
శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా రణిల్ విక్రమసింఘే ఎన్నికయ్యారు. పార్లమెంటులో బుధవారం మధ్యాహ్నం జరిగిన ఓటింగ్‌లో రణిల్‌కు 134 ఓట్లు లభించాయి. ఆయన ప్రత్యర్థి దలస్ అలాపేరుమాకు 82 ఓట్లు లభించాయి.
మొత్తం 223 ఎంపీలు ఓటింగ్‌లో పాల్గొన్నారు. ఇద్దరు ఎంపీలు ఓటింగ్‌కు గైర్హాజరయ్యారు. పోలైన 223 ఓట్లలో 219 ఓట్లు చెల్లుబాటు అవుతాయని పరిగణనలోకి తీసుకున్నారు. నాలుగు ఓట్లు చెల్లనివిగా ప్రకటించారు.
అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన తర్వాత రణిల్ విక్రమసింఘే పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగిస్తూ.. శ్రీలంకను కష్టాల నుంచి గట్టెక్కించటానికి అన్ని పార్టీలూ కలసికట్టుగా పనిచేయాలని కోరారు.
అలాగే, గురువారం నాడు తాను స్వయంగా అన్ని పార్టీలతో సమావేశమై చర్చిస్తానన్నారు.
గొటాబయ రాజపక్ష శ్రీలంక నుంచి పరారై, రాజీనామా చేసేముందు రణిల్ విక్రమసింఘేను తాత్కాలిక అధ్యక్షుడిగా చేశారు.
అధ్యక్షుడిగా గొటాబయ పదవీ కాలంలో మిగిలిన కాలాన్ని రణిల్ పూర్తిచేస్తారు. ఆయన పదవీ కాలం 2024 నవంబరు చివరికి ముగుస్తుంది.

ఫొటో సోర్స్, Twitter/@INCIndia
జీఎస్‌టీ రేట్ల పెంపు, ఆహార ధరల పెరుగుదల పట్ల.. ప్రతిపక్ష పార్టీల ఎంపీలు బుధవారం నాడు పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు.
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సహా ప్రతిపక్ష నేతలు చాలా మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
దీనికి ముందు మంగళవారం నాడు కూడా ప్రతిపక్షాల సభ్యులు పార్లమెంటు సమావేశాల్లో నిరసనకు దిగారు. దీనివల్ల నిన్నటి సమావేశాలను వాయిదా వేయాల్సి వచ్చింది.
కొత్త జీఎస్‌టీ రేట్ల వల్ల ద్రవ్యోల్బణం మరింత పెరిగిందని ప్రతిపక్షాలు అంటున్నాయి.
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సారథ్యంలో సమావేశమైన జీఎస్‌టీ మండలి.. ప్యాకేజ్ చేసిన పెరుగు, పన్నీర్, లస్సీ, తేనె వంటి ఆహార పదార్థాల మీద 5 శాతం జీఎస్‌టీ విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం సోమవారం నుండి అమలులోకి వచ్చింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, Reuters
టెస్లా సీఈవో ఎలాన్ మస్క్‌కు అమెరికా కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.ఎలాన్ మస్క్‌పై ట్విటర్ వేసిన పిటిషన్‌ను కోర్టు అక్టోబర్‌లో విచారించనుంది.
ఈ కేసులో ఆలస్యంగా విచారణ జరపాలని ఎలాన్ మస్క్ డిమాండ్ చేశారు.అయితే, విచారణను ఆలస్యం చేయడం వల్ల మరింత అనిశ్చితి పెరుగుతుందని డెలావర్ కోర్టు వ్యాఖ్యానించింది.
ట్విటర్‌ను 44 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 3.37 లక్షల కోట్లు)కు కొనేందుకు తొలుత మస్క్ ఒప్పందం చేసుకున్నారు. ఆ తర్వాత ఈ కొనుగోలు డీల్ నుంచి తప్పుకుంటున్నట్లు ఇటీవలే ఆయన ప్రకటించారు.
ఈ వ్యవహారంపై ట్విటర్, డెలావేర్ కోర్టును ఆశ్రయించింది. ట్విటర్ ప్రతీ షేరుకు 54.20 డాలర్ల (రూ. 4,315) చొప్పున కుదిరిన ఒప్పందం ప్రకారం ఈ డీల్‌ను పూర్తి చేసేలా మస్క్‌ను ఆదేశించాలని కోర్టును కోరింది.
నకిలీ ఖాతాల సమాచారాన్ని ట్విటర్ దాచిపెడుతోందని మస్క్ ఆరోపించారు.

ఫొటో సోర్స్, Getty Images
యుక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమీర్ జెలియన్‌స్కీ భార్య ఒలెనా జెలెన్‌స్కా అమెరికా పర్యటనలో ఉన్నారు.
ఉన్నత స్థాయి సమావేశాలు, కాంగ్రెస్‌లో ప్రసంగించడం కోసం ఆమె అమెరికాకు వెళ్లారు.
నాలుగు నెలల క్రితం జెలియన్‌స్కీ కూడా అమెరికా పార్లమెంట్‌లో వర్చువల్‌గా ప్రసంగించారు.
వైట్ హౌస్ ప్రకారం, ఒలెనా జెలెన్‌స్కా సోమవారం విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌తో, మంగళవారం అధ్యక్షుడు జో బైడెన్‌తో సమావేశమయ్యారు.
బైడెన్ మే నెలలో యుక్రెయిన్‌ను సందర్శించారు.

ఫొటో సోర్స్, Reuters
ఒలెనా జెలెన్‌స్కా ఈరోజు క్యాపిటల్ హిల్‌లో చట్టసభ సభ్యులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
యుక్రెయిన్, రష్యా యుద్ధం ప్రారంభమై దాదాపు 5 నెలలు అవుతుంది.
ఈ నేపథ్యంలో అమెరికా నుంచి మరింత సైనిక సహాయం, రాజకీయ మద్దతును యుక్రెయిన్ కోరుకుంటుంది.
యుక్రెయిన్ కోసం ఇప్పటికే కాంగ్రెస్ దాదాపు 40 బిలియన్ డాలర్ల సహాయాన్ని ఆమోదించింది. సెప్టెంబర్ చివరి నాటికి దీన్ని పూర్తిగా యుక్రెయిన్‌కు అందిస్తారు.
అమెరికాఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ హెడ్ సమంతా పావర్‌తో కూడా ఆమె సమావేశమయ్యారు.

ఫొటో సోర్స్, IPR
భద్రాచలం గుడి దగ్గర నీరు పూర్తిగా తొలగింది. గుడి కరకట్టను ఆనుకుని గోదావరి ఒడ్డునే ఉంటుంది. దీంతో వరద నీరు కాకుండా, ఇతరత్రా లీకేజీల వల్ల గుడి చుట్టూ నీరు చేరింది.
భారీ మోటార్లతో ఆ నీటిని తోడారు. ఇవాళ ఉదయానికి గుడి పరిసరాల్లో నీరంతా పోయి సాధారణ వాతావరణం ఏర్పడింది.
మరోవైపు భద్రాచలం దగ్గర గోదావరి వరద బాగా తగ్గుతోంది. ఆది-సోమ వారాల్లో పై నుంచి ప్రవాహాలు పెరగడంతో కాస్త నెమ్మదించిన వరద ప్రవాహం, తిరిగి వేగంగా సముద్రం వైపు వెళ్ళడం మొదలైంది.
బుధవారం ఉదయం 7 గంటలకు 49 అడుగుల నీటి మట్టం ఉంది భద్రాచలం దగ్గర.
మరోవైపు భద్రాచలాన్ని కాపాడాలంటే చుట్టూ ఉన్న ఐదు గ్రామాలను ఆంధ్ర నుంచి తెలంగాణకు ఇవ్వాలంటూ టిఆర్ఎస్ కొత్త డిమాండ్ ముందు పెట్టింది.

గుడ్ మార్నింగ్...
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు జాతీయ, అంతర్జాతీయ వార్తల తాజా అప్‌డేట్లను ఎప్పటికప్పుడు తెలుసుకోవడం కోసం ఈ పేజీని ఫాలో అవండి.