యుక్రెయిన్ యుద్ధం: సెక్యూరిటీ చీఫ్, ప్రాసిక్యూటర్ జనరల్‌ను తొలగించిన జెలియెన్‌స్కీ
యుక్రెయిన్ భద్రతా సంస్థ (ఎస్‌బీయూ) అధిపతి ఇవాన్ బకనోవ్‌ను, దేశ ప్రాసిక్యూటర్ జనరల్ ఐరీనా వెనెడిక్టోవాను.. దేశాధ్యక్షుడు వొలొదిమిర్ జెలియెన్‌స్కీ పదవుల నుంచి తొలగించారు. వారిద్దరి సారథ్యంలోని సంస్థల్లో దేశద్రోహ ఉదంతాలు చాలా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.
రష్యా ఆక్రమించిన ప్రాంతాల్లో 60 మందికి పైగా మాజీ ఉద్యోగులు ఇప్పుడు యుక్రెయిన్‌కు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని జెలియెన్‌స్కీ చెప్పారు.
చట్టాన్ని అమలు చేసే అధికారులకు వ్యతిరేకంగా కుమ్మక్కు, దేశద్రోహం ఆరోపణలతో మొత్తం 651 కేసులు నమోదైనట్లు తెలిపారు.
ఈ పరిణామంపై ఇవాన్, ఐరీనాలు స్పందించలేదు.
ఆదివారం పొద్దుపోయాక జెలియెన్‌స్కీ పోస్ట్ చేసిన ఒక వీడియోలో మాట్లాడుతూ.. ‘‘దేశ జాతీయ భద్రత పునాదులను దెబ్బతీసేలా ఇలాంటి నేరాల పరంపర.. సంబంధిత (సంస్థల) అధిపతుల మీద తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి’’ అని పేర్కొన్నారు.
ఉద్వాసనకు గురైన ఎస్‌బీయూ చీఫ్ ఇవాన్ బకనోవ్ జెలియెన్‌స్కీకి చిన్ననాటి స్నేహితుడు.
రష్యా 2014లో తమ దేశంలో కలుపుకున్న క్రైమియాలో.. ఎస్‌బీయూ విభాగానికి ప్రాంతీయ అధిపతిగా పనిచేసిన ఓలే కులినిచ్‌ను దేశద్రోహం అనుమానంతో కొద్ది రోజుల కిందట అరెస్ట్ చేశారు. తదనంతర పరిణామాల్లో ఇవాన్ బకనోవ్‌ను, ఐరీనా వెనెడిక్టోవాలను పదవుల నుంచి తొలగించారు.