డెన్మార్క్‌లోని
అతిపెద్ద షాపింగ్ మాల్‌లో జరిగిన కాల్పుల్లో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు
కోల్పోయారు. పలువురికి గాయాలయ్యాయి.
మరో ముగ్గురి
పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
దక్షిణ కోపెన్‌హాగన్‌లోని
ఫీల్డ్స్ మాల్‌లో ఆదివారం 22 ఏళ్ల యువకుడు అకస్మాత్తుగా కాల్పులు జరిపారు. దాడి
చేసిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
దాడికి గల కారణం
అస్పష్టంగా ఉందని పోలీస్ చీఫ్ సోరెన్ థామ్సన్ అన్నారు. ఇది ‘తీవ్రవాద దాడి’ అనే
అంశాన్ని కొట్టిపారేయలేమని ఆయన అన్నారు.
పోలీసులు
చెప్పినదాని ప్రకారం, దాడి చేసిన యువకుడి వద్ద రైఫిల్‌తో పాటు ఆయుధాలు ఉన్నాయి. ఈ
దాడిలో మిగతా వ్యక్తుల ప్రమేయంపై
ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లేదు.
డెన్మార్క్‌పై క్రూరమైన దాడి జరిగిందని ప్రధానమంత్రి మాట్ ప్రెరిక్సన్ వ్యాఖ్యానించారు.
‘‘చాలా మంది గాయపడ్డారు, చనిపోయారు. అమాయక ప్రజలు షాపింగ్ చేస్తున్నారు. భోజనం చేస్తున్నారు. అందులో చిన్నారులు, యువకులు కూడా ఉన్నారు. మా సుందరమైన, సురక్షితమైన రాజధాని కొన్ని సెకన్లలోనే భయానకంగా మారిపోయింది. ఈ కాల్పుల్లో మరణించిన వారి కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తూ, ఈ కష్ట సమయంలో దేశమంతా ఐక్యంగా ఉండాలని, ఒకరికొకరు మద్దతుగా నిలవాలని’’ మాట్ అన్నారు.
బాధితులకు, వారి కుటుంబాలకు డెన్మార్క్ రాజకుటుంబం ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది.
ఈ బహుళ అంతస్తుల షాపింగ్ మాల్‌లో దాదాపు 140 దుకాణాలు, రెస్టారెంట్లు ఉన్నాయి.కాల్పుల శబ్ధం వినగానే భయాందోళనలకు గురయ్యామని ఘటన సమయంలో అక్కడున్న ప్రజలు చెబుతున్నారు.
ఇసాబెల్లె అనే ప్రత్యక్ష సాక్షి మీడియాతో మాట్లాడుతూ.. ‘‘అకస్మాత్తుగా కాల్పుల శబ్దాలు వినిపించాయి. నేను 10 సార్లు కాల్పుల శబ్దం విన్నాను.తర్వాత పరుగున వెళ్లి టాయిలెట్‌లో దాక్కున్నాం. దాదాపు 11 మంది అందులో దాక్కున్నాం. మేమేంతా చాలా భయపడ్డాం. ఇది చాలా భయంకరమైన అనుభవం’’ అని చెప్పారు.