పతనం అంచున కమ్యూనిస్టుల చివరి కోట

ఫొటో సోర్స్, Getty Images
కేరళలోని 140 అసెంబ్లీ స్థానాలలో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్) మెజార్టీ స్థానాలలో ఆధిక్యంలో దూసుకుపోతుండటంతో కేరళలో కమ్యూనిస్టుల కోట పతనం అంచున నిలబడింది. ఇది కమ్యూనిస్టు పార్టీకి చివరి కోట.
పశ్చిమ బెంగాల్లో 2011 అసెంబ్లీ ఎన్నికలలో కమ్యూనిస్టుల ఓటమి తరువాత భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్కిస్ట్) నేతృత్వంలోని ఎల్‌డీఎఫ్ వామపక్ష ఉద్యమానికి ఊపిరిపోసింది.
కేరళ ప్రజలు దశాబ్దాలుగా ఒకసారి సీపీఎం మరోసారి కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని కూటములను ఎన్నుకుంటూ వచ్చారు. కానీ 2021లో ఈ సంప్రదాయానికి తెరదించుతూ వరుసగా రెండోసారి ఎల్‌డీఎఫ్‌ని ఎన్నుకున్నారు.
తాజాగా కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ విజయం సాధిస్తుండటంతో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద కార్యకర్తలు సందడిగా ఉన్నారు. వామపక్ష నేతలు వెనుకబడ్డారనే వార్తలు వచ్చినప్పుడల్లా వారు సంబరాలు చేసుకుంటున్నారు.
ముఖ్యంగా ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ వెనుకంజలో ఉన్నారనే వార్త అక్కడి అతిపెద్ద టెలివిజన్ తెరపై కనిపించగానే కార్యకర్తల సంబరాలు మిన్నంటాయి. 80 ఏళ్ల ఈ వృద్దనేత పరిపాలనాదక్షుడిగానూ, రాజకీయ చాణక్యుడిగానూ పేరుగాంచారు.
‘‘ముఖ్యమంత్రి 3,4వేల ఓట్ల తేడాతో వెనుకబడటమంటే ఎల్‌డిఎఫ్ కూటమి పాలన ఎంత దారుణంగా ఉందో తెలుపుతోంది’’ అని బీబీసీతో కేరళ స్టూడెంట్ యూనియన్ (కేఎస్‌యూ) సభ్యుడు అలోకవరియవల్లీ అన్నారు.
కాంగ్రెస్ సీనియర్ నేతలు వీఎస్ సతీశన్, రమేష్ చెన్నితాల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. బీజేపీ నేతలు రాజీవ్ చంద్రశేఖర్, కె.సురేంద్రన్ కూడా ఆధిక్యంలో ఉన్నారు.


