You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

రెపో రేటును పెంచిన ఆర్బీఐ.. లోన్ల ఈఎంఐలు పెరిగే అవకాశం

రెపో రేటును 40 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్లు ఆర్బీఐ వెల్లడించింది. దీంతో ఇప్పుడు రెపో రేటు 4.40 శాతంగా మారింది. ఫలితంగా వడ్డీ రేట్లు, లోన్ల ఈఎంఐలు పెరిగే అవకాశముంది.

లైవ్ కవరేజీ

రాజేశ్ పెదగాడి

  1. మహారాష్ట్ర: నవనీత్ కౌర్ దంపతులకు బెయిలు మంజూరుచేసిన కోర్టు

    టాలీవుడ్ మాజీ నటి, మహారాష్ట్రలోని అమరావతికి చెందిన స్వతంత్ర ఎంపీ నవనీత్ కౌర్ రానా, ఆమె భర్త రవి రానాలకు ముంబయి సెషన్సు కోర్టు బుధవారం బెయిలు మంజూరుచేసింది.

    శివసేన అధినేత, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే నివాసం ఎదుట హనుమాన్ చాలీసా చదువుతానని, దమ్ముంటే తనను ఆపాలని రానా దంపతులు వివాదం సృష్టించిన సంగతి తెలిసిందే.

    శాంతి, భద్రతలకు భంగం కలిగిస్తున్నారనే ఆరోపణలపై రానా దంపతులను ఏప్రిల్ 23న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి తరలించింది.

    తాజాగా కొన్ని షరతులపై రానా దంపతులకు కోర్టు బెయిలు మంజూరు చేసింది.

  2. ఉత్తరప్రదేశ్: పోలీస్ స్టేషన్‌లో 13ఏళ్ల దళిత బాలికపై అత్యాచారం చేశారని ఆరోపణలు

    ఉత్తరప్రదేశ్‌లోని లలిత్‌పుర్‌లో 13ఏళ్ల దళిత బాలికపై పోలీస్ స్టేషన్‌లో అత్యాచారం చేసినట్లు ఓ పోలీసు అధికారిపై ఆరోపణలు వస్తున్నాయి.

    ‘‘మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో మొదట నలుగురు యువకులు ఆ బాలికపై అత్యాచారం చేశారు. దీంతో బాధిత బాలిక ఉత్తర్ ప్రదేశ్‌ లలిత్‌పుర్‌లోని పాలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అక్కడే బాధిత బాలికపై స్టేషన్ హౌస్ అధికారి తిలక్‌ధారి సరోజ్ అత్యాచారం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి’’అని లలిత్‌పుర్ ఎస్పీ నిఖిల్ పాఠక్ తెలిపారు.

    ‘‘నిందితుడు తిలక్‌ధారిని అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. ప్రస్తుతం ఆయన పరారీలో ఉన్నారు’’అని ఎస్పీ వివరించారు.

    ఈ ఘటనపై ఏప్రిల్ 3న ప్రాథమిక విచారణ నివేదిక నమోదైంది. పోక్సో చట్టంతోపాటు ఎస్సీ, ఎస్టీ చట్టంలోని భిన్న సెక్షన్ల కింద నిందితులపై ఆరోపణలు మోపారు.

    ఏప్రిల్ 22న బాధితురాలిను అపహరించి.. చందన్, రాజ్‌భన్, హరిశంకర్, మహేంద్ర అనే నలుగురు యువకులు మూడు రోజులపాటు అత్యాచారం చేసినట్లు ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించారు.

    ‘‘ఏప్రిల్ 26న బాధితురాలిని పాలి స్టేషన్ పరిసరాల్లో నిందితులు వదిలిపెట్టారు. దీంతో తమ కుటుంబానికి చెందిన ఒక మహిళతో కలిసి బాధితురాలు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అక్కడే ఆమెపై మళ్లీ అత్యాచారం జరిగినట్లు ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు’’అని ఎస్పీ వెల్లడించారు.

  3. మౌలిక సదుపాయాల కల్పనలో పేదల అవసరాలకు పెద్దపీట – నరేంద్ర మోదీ

    విపత్తులను తట్టుకుని నిలబడే మౌలిక సదుపాయాల కల్పనపై నిర్వహించిన ఇంటర్నేషనల్ కాన్ఫెరెన్స్ ఆన్ డిజాస్టర్ రెసీలియెంట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్-2022 సదస్సును ఉద్దేశించి భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగించారు.

    ‘‘అభివృద్ధిలో అందరినీ కలుపుకుని పోవాలని సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు నిర్దేశిస్తున్నాయి. మౌలిక సదుపాయాల కల్పనలో పేదలు, బలహీనవర్గాల అభివృద్ధికి మేం కట్టుబడి ఉన్నాం’’అని మోదీ చెప్పారు.

    ‘‘మౌలిక సదుపాయాల కల్పన అంటే కేవలం సదుపాయాలను అభివృద్ధి చేయడం, దీర్ఘకాలంలో పెట్టబడులు సాధించే వనరులు సృష్టించడం కాదు. ఇది ప్రజాప్రయోజనాలతో ముడిపడి ఉంది’’అని మోదీ అన్నారు.

    ‘‘అందరికీ సమానంగా మెరుగైన, సుస్థిర సేవలు కల్పించడమే మౌలిక సదుపాయాల కల్పన లక్ష్యం’’అని మోదీ వివరించారు.

  4. హైదరాబాద్‌లో భారీ వర్షం.. రేపు కూడా వర్షం పడే అవకాశముందని ఐఎండీ అంచనా

    వడగాలుల నుంచి ఉపశమనం కల్పిస్తూ హైదరాబాద్‌లో బుధవారం ఉదయం భారీ వర్షం పడింది. ఈదురు గాలులు, ఉరుములతో చాలా ప్రాంతాల్లో వర్షాలు కురిసాయి.

    సిద్ధిపేట జిల్లాలోని హబ్సీపుర్‌లో అత్యధికంగా 108 మి.మీ. వర్షపాతం నమోదైనట్లు తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (టీఎస్‌డీపీఎస్) తెలిపింది.

    హైదరాబాద్‌తోపాటు సిద్ధిపేట, జగిత్యాల, మంచీర్యాల, యాదాద్రి జిల్లాల్లో వర్షాలు పడ్డాయి.

    మరోవైపు బుధవారం తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) కూడా అంచనా వేసింది.

    మే 5, 6 తేదీల్లో కూడా తెలంగాణలో, మే 5న ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు పడే అవకాశముందని ఐఎండీ వెల్లడించింది.

  5. ట్విటర్‌ యూజర్లు చార్జి చెల్లించాలా? ఎలాన్ మస్క్ తాజాగా ఏం చెప్పారు

    ఇప్పటివరకు ట్విటర్‌ను ఎలాంటి చెల్లింపులు లేకుండా యూజర్లు ఉపయోగిస్తున్నారు. అయితే, భవిష్యత్‌లో ట్విటర్‌ను ఉపయోగించేందుకు డబ్బులు చెల్లించాల్సి రావొచ్చని ఎలాన్ మస్క్ సంకేతం ఇచ్చారు.

    ఇటీవల ట్విటర్‌ను కొనుగోలుచేసిన ఎలాన్ మస్క్ ఈ విషయంపై తాజాగా ఓ ట్వీట్ చేశారు.

    ‘‘సాధారణ యూజర్లకు ట్విటర్ ఎప్పుడూ ఉచితంగానే ఉంటుంది. కానీ, వ్యాపార సంస్థలు, ప్రభుత్వాలు దీన్ని ఉపయోగించేందుకు కొంత డబ్బులు చెల్లించాల్సి రావొచ్చు’’అని ఎలాన్ మస్క్ ఒక ట్వీట్ చేశారు.

    ట్విటర్‌లో మార్పులు ఉండొచ్చని ఎలాన్ మస్క్ ఇదివరకే సంకేతాలు ఇచ్చారు. ట్వీట్‌లో ఎడిట్ బటన్ కూడా ఉండొచ్చని ఆయన అన్నారు. మరోవైపు మేనేజ్‌మెంట్‌లోనూ మార్పులు ఉంటాయని ఆయన చెప్పారు.

    ట్విటర్‌ను కొనుగోలు చేసేందుకు ఎలాన్ మస్క్ ఎప్పటినుంచో ప్రయత్నిస్తున్నారు.

    అయితే, ఏప్రిల్ 25న ట్విటర్‌తో ఎలాన్ మస్క్‌కు ఒప్పందం కుదిరింది. 44 బిలియన్ డాలర్లకు ట్విటర్‌ను ఆయన కొనుగోలు చేశారు.

  6. డెన్మార్క్‌: ప్రవాస భారతీయులు ఐదుగురు విదేశీయులను భారత్‌కు తీసుకురావాలి – నరేంద్ర మోదీ

    యూరప్‌ పర్యటనలో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ డెన్మార్క్ చేరుకున్నారు.

    రాజధాని కోపెన్‌హెగన్‌లో భారతీయులను ఉద్దేశించి మోదీ ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి డెన్మార్క్ ప్రధాన మంత్రి మెట్ ఫ్రెడ్రిక్సన్ కూడా హాజరయ్యారు.

    ‘‘నేను మిమ్మల్ని ఒకటి అడగనా? మీరు చేస్తానని అంటేనే అడుగుతాను. మీరు తప్పనిసరిగా నా అభ్యర్థనకు అంగీకారం తెలపాలి’’అని మోదీ అన్నారు.

    ‘‘ఏటా ఐదురుగు విదేశీయులను మీరు భారత్ పర్యటనకు పంపించాలి’’అని మోదీ అన్నారు. ‘‘భారత్ గురించి వారికి చెప్పండి. అక్కడ ఏమేం మంచి పర్యటక ప్రాంతాలు ఉన్నాయో వివరించండి. భారత్‌లో పర్యటించాలని వారిలో స్ఫూర్తిని రగిలించండి’’అని మోదీ అన్నారు.

    ‘‘మీరంతా భారత్ ప్రతినిధులు. భారత్‌కు విదేశీ పర్యటకులు వచ్చేలా మీరే కృషి చేయాలి’’అని మోదీ మళ్లీ మళ్లీ చెప్పారు.

    ‘‘నేను విదేశీ నాయకులను కలిసినప్పుడు, అక్కడ ప్రవాస భారతీయులు చేస్తున్న కృషిని నాకు వివరిస్తుంటారు. నాకు చాలా గర్వంగా అనిపిస్తుంటుంది’’అని మోదీ అన్నారు.

    శ్వేత విప్లవం (వైట్ రివొల్యూషన్)‌లో భారత్‌కు డెన్మార్క్ తోడుగా నిలిచిందని మోదీ గుర్తుచేశారు. గ్రీన్ హైడ్రోజన్, అర్బనైజేషన్, సైన్స్, టెక్నాలజీ, ఇన్నోవేషన్‌లో రెండు దేశాలు కలిసి పనిచేస్తున్నాయని మోదీ చెప్పారు.

    జర్మనీ, డెన్మార్క్ పర్యటనల అనంతరం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఫ్రాన్స్‌లో పర్యటిస్తారు. తాజాగా రెండోసారి ఫ్రాన్స్ అధ్యక్షుడిగా ఎన్నికైన ఇమ్మానుయేల్ మెక్రాన్‌ను మోదీ కలవనున్నారు.

  7. బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం

    గుడ్ మార్నింగ్!

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.

    అంతర్జాతీయ, జాతీయ, స్థానిక వార్తల లైవ్ అప్‌డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేస్తూ ఉండండి.