You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

ట్విటర్‌కు ఎలాన్ మస్క్ ఆఫర్

‘‘నా వైపు నుంచి నేను అత్యుత్తమ ఆఫర్‌ను ఇచ్చాను. ఇదే తుది ఆఫర్ కూడా. ఒకవేళ దీన్ని మీరు అంగీకరించకపోతే, వాటాదారుగా నా స్థానం గురించి నేను పునరాలోచించాల్సి ఉంటుంది’’ అని ఆయన పేర్కొన్నారు.

లైవ్ కవరేజీ

సతీష్ ఊరుగొండ, రాజేశ్ పెదగాడి

  1. రష్యా-యుక్రెయిన్ యుద్ధం: కీలకమైన రష్యా యుద్ధ నౌకను పేల్చేశారా?

    నల్ల సముద్రంలో రష్యాకు చెందిన ప్రధాన యుద్ధ నౌకల్లో ఒకటైన మోస్క్వా ధ్వంసమైంది. ఈ నౌక పూర్తిగా దెబ్బతిన్నట్లు వార్తలు వస్తున్నాయి.

    నౌక దెబ్బతినడంపై రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. యుద్ధ నౌకలో మంటలు చెలరేగడంతో ఆయుధాలు విస్పోటం చెందాయని పేర్కొంది.

    ‘‘నౌక పూర్తిగా దెబ్బతింది. దానిలో ఉన్న అందరినీ సురక్షితంగా బయటకు తీసుకొచ్చేశాం. ప్రమాదానికి గల కారణంపై దర్యాప్తు చేపడుతున్నాం’’అని రక్షణ శాఖ ప్రకటనలో పేర్కొంది.

    మరోవైపు 186 మీ. పొడవైన ఈ నౌకను నెప్ట్యూన్ క్షిపణితో పేల్చేశామని యుక్రెయిన్ వెల్లడించింది.

    ‘‘రష్యా బలగాలు దెబ్బతిన్న ఆ నౌకను చేరుకోలేకపోయాయి’’అని యుక్రెయిన్ అధ్యక్షుడి సలహాదారు ఒలెక్సీ ఆరెస్టోవిచ్ చెప్పారు.

    క్షిపణులను ప్రయోగించే సామర్థ్యమున్న ఈ నౌకను 1980ల్లో తయారుచేశారు. మొదట దీని పేరు స్లావా. అయితే దీని మోస్క్వాగా పేరు మార్చారు. దీనిలో పీ-1000 వుల్కాన్ క్షిపణులు ఉన్నాయి.

    సిరియాలో సైనిక చర్యలకు ఈ నౌకను ఉపయోగించారు.

  2. అస్సాంలో విషపూరిత పుట్టగొడుగులు తిని 13 మంది మృతి

    అస్సాంలో విషపూరిత పుట్టగొడుగులు తిని 13 మంది మరణించారు.

    నాలుగు జిల్లాల్లో మొత్తంగా 13 మంది మరణించారని, 35 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని అస్సాం మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ (ఏఎంసీహెచ్) సూపరింటెండెంట్ డాక్టర్ ప్రశాంద్ ధిహింగియా చెప్పారు.

    ‘‘గత ఐదు రోజుల్లో చరాయిదేవ్, డిబ్రూగఢ్, శివ్‌సాగర్, తిన్సుకియా జిల్లాల్లో మృతులు సంభవించాయి. సోమవారమే నలుగురు మరణించారు. మంగళవారం మరో తొమ్మిది మంది చనిపోయారు. వీరంతా విషపూరిత పుట్టగొడుగులను సాధారణ పుట్టగొడుగులుగా భావించి తినేశారు. దీంతో తలనొప్పి, వాంతులు, కడుపునొప్పి లాంటి సమస్యలు తలెత్తాయి. క్రమంగా వీరి ఆరోగ్యం క్షీణించింది’’అని ఆయన చెప్పారు.

    మరణించిన వారిలో ఒక చిన్నారి కూడా ఉన్నట్లు వివరించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు.

    ఈశాన్య రాష్ట్రాల్లో పుట్టగొడుగులు విరివిగా దొరుకుతుంటాయి. అయితే, ఇక్కడ చాలా కొద్ది మందికి మాత్రమే తాము ఏ పుట్టగొడుగులు తింటున్నామో, వాటితో ఏం ప్రయోజనాలు ఉంటాయో అవగాహన ఉంటుంది.

  3. అలియా భట్, రణబీర్ కపూర్ ల లవ్‌స్టోరీ ఎప్పుడు, ఎక్కడ, ఎలా మొదలైంది?

  4. హిందూ రాజ్యాన్ని అంబేడ్కర్ అతి పెద్ద ప్రమాదంగా ఎందుకు భావించారు?

  5. ఆంధ్రప్రదేశ్: ఏలూరు పోరస్ రసాయన పరిశ్రమలో పేలుడు.. ఏడుకు పెరిగిన మృతుల సంఖ్య

  6. జితేంద్ర సింగ్: ‘‘నాలుగైదేళ్లలో అందరికీ ఉచిత విద్యుత్’’

    వచ్చే నాలుగైదేళ్లలో సౌర విద్యుత్ కర్మాగారాలు ఏర్పాటు చేయడం ద్వారా జమ్మూకశ్మీర్‌లో అందరికీ ఉచిత విద్యుత్ ఇవ్వడంపై కేంద్ర ప్రభుత్వం దృష్టిసారించిందని కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ గురువారం చెప్పారు.

    త్వరలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జమ్మూకశ్మీర్‌లో పర్యటించనున్నారు. దీనికి సంబంధించిన భ్రదతా ఏర్పాట్లను జితేంద్ర సింగ్ సమీక్షించారు. అనంతరం మాట్లాడుతూ.. జమ్మూకశ్మీర్ విద్యుత్ మోడల్.. దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని అన్నారు.

    ‘‘నాలుగైదేళ్లలో అందరికీ ఉచితంగా విద్యుత్ అందిస్తాం. ఇక్కడ గ్రామీణాభివృద్ధిలో కొత్త ఆవిష్కరణలు, సాంకేతికతలను ప్రోత్సహిస్తున్నాం. వ్యవసాయ అంకుర పరిశ్రమలకు ఊతం ఇస్తున్నాం. రూ.2.45 కోట్లతో నిర్మిస్తున్న సౌర విద్యుత్ కర్మాగారాల పనులు ఒకటి రెండు రోజుల్లో పూర్తవుతాయి’’అని ఆయన అన్నారు.

    ఏప్రిల్ 24న పాలిలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటించనున్నారు.

    జమ్మూకశ్మీర్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చిన తర్వాత, ఇక్కడ మోదీ పర్యటించడం ఇదే తొలిసారి.

  7. బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం

    హలో ఆల్, గుడ్ మార్నింగ్! బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.

    తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన లైవ్ అప్‌డేట్స్‌తో పాటు జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం ఈ పేజీ చూస్తూఉండండి.