You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

ఆర్‌బీఐ డిజిటల్ కరెన్సీ విడుదల చేస్తుంది, ఆర్‌బీఐ పరిధిలోని డిజిటల్ కరెన్సీల లావాదేవీలపై పన్ను ఉంటుంది: నిర్మల సీతారామన్

కృష్ణా-గోదావరి, కృష్ణా-పెన్నా నదులను అనుసంధానిస్తామని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. మేక్ ఇన్ ఇండియా ద్వారా 60 లక్షల కొత్త ఉద్యోగాలు వస్తాయని ఆమె తెలిపారు. రాబోయే పాతికేళ్లకు ఈ బడ్జెట్ బ్లూ ప్రింట్ లాంటిదని ఆమె అభివర్ణించారు.

లైవ్ కవరేజీ

  1. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ రూ. 39,44,909 కోట్ల అంచనా వ్యయంతో 2022-23 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్‌ను మంగళవారం పార్లమెంటుకు సమర్పించారు.

    ఈ బడ్జెట్‌కు సంబంధించిన అప్డేట్స్‌ను ‘బీబీసీ న్యూస్ తెలుగు’ ఎప్పటికప్పుడు అందించింది.

    పాఠకులకు ధన్యవాదాలు చెబుతూ ఈ లైవ్ పేజీని ఇంతటితో ముగిస్తున్నాం.

  2. ఆర్‌బీఐ డిజిటల్ కరెన్సీ విడుదల చేస్తుంది, ఆర్‌బీఐ పరిధిలోని డిజిటల్ కరెన్సీల లావాదేవీలపై పన్ను ఉంటుంది’

    ‘‘ఆర్‌బీఐ డిజిటల్ కరెన్సీని విడుదల చేస్తుంది. ఆర్‌బీఐ పరిధిలో లేకుండా వ్యక్తులు సృష్టించే ఆస్తులు, లావాదేవీల ద్వారా వచ్చే లాభాలపై 30 శాతం పన్ను విధిస్తున్నాం’’ అని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు.

    క్రిప్టో కరెన్సీకి సంబంధించిన ప్రతీ లావాదేవీని వాటిపై 1 శాతం టీడీఎస్ విధించడం ద్వారా ట్రాక్ చేస్తున్నామని చెప్పారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఆమె మీడియాతో మాట్లాడారు.

    పరిశ్రమల కోసం ప్రత్యేక క్రెడిట్‌ గ్యారెంటీ పథకం ప్రకటించినట్టు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు.

    దానికోసం 2 లక్షల నిధులు కేటాయించినట్లు చెప్పారు.

  3. 2022 బడ్జెట్ కాదిది, 25 ఏళ్ల బ్లూప్రింట్: జేపీ నడ్డా

    కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రశంసించారు. చిన్న, భారీ పారిశ్రామికవేత్తలతో పాటు అన్ని వర్గాల ఆశలను ఈ బడ్జెట్ నెరవేర్చిందని ఆయన అన్నారు.

    ఇది కేవలం ఈ ఏడాది కోసం రూపొందించిన బడ్జెట్‌లా లేదని.. రానున్న 25 ఏళ్లలో దేశాభివృద్ధికి సంబంధించిన బ్లూ ప్లింట్‌లా ఉందని ఆయన అన్నారు.

  4. ఇది ప్రగతిశీల బడ్జెట్: నరేంద్ర మోదీ

    2022 బడ్జెట్ ప్రగతిశీల బడ్జెట్ అంటూ ప్రధాని మోదీ నిర్మల సీతారామన్‌ను అభినందించారు.

    ‘మన జీవన విధానంలో అన్ని రంగాల్లో సాంకేతికత ప్రవేశించింది. వ్యవసాయంలో డ్రోన్ టెక్నాలజీ వచ్చింది. కిసాన్ డ్రోన్లు, వందేభారత్ రైళ్లు, డిజిటల్ కరెన్సీకి ఈ బడ్జెట్‌లో ప్రాధాన్యం కల్పించారు. బ్యాంకింగ్ రంగంలో డిజిటల్ యూనిట్లు వస్తున్నాయి. జాతీయ ఆరోగ్య పథకం కింద డిజిటల్ ఎకో సిస్టమ్ తీసుకొస్తున్నాం. ఈ బడ్జెట్‌తో అనేక రంగాలకు లబ్ధి కలిగించారు’’ అని మోదీ అన్నారు.

  5. మోదీ ప్రభుత్వం విపత్కర మార్గంలో పయనిస్తోంది: జైరామ్ రమేశ్

    ‘‘ఓవైపు బడ్జెట్‌లో పర్యావరణ పరిరక్షణ గురించి మాట్లాడారు. మరోవైపు నదులను అనుసంధానం చేస్తామని చెప్పారు. భాషతో ఆడుకోవడం మంచిదే. కానీ చెప్పిన పనులు చేయడం మరింత ముఖ్యం. మోదీ ప్రభుత్వం విపత్కర మార్గంలో పయనిస్తోంది’’ అని కేంద్ర మాజీ మంత్రి జైరామ్ రమేశ్ ట్వీట్ చేశారు.

  6. సామాన్యుడిని పట్టించుకోలేదు: మమత బెనర్జీ

    పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా బడ్జెట్‌పై ట్విట్టర్ వేదికగా విమర్శలు చేశారు.

    ‘‘సామాన్యుడి కోసం బడ్జెట్ సున్నా. ద్రవ్యోల్బణం, నిరుద్యోగంతో సతమతమవుతోన్న వారికి బడ్జెట్‌లో ఎలాంటి ప్రాధాన్యత దక్కలేదు’’ అని ట్వీట్ చేశారు

  7. మోదీ సర్కారు జీరోసమ్ బడ్జెట్: రాహుల్ గాంధీ

    2022-23 ఆర్థిక సంవత్సరానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌ను.. జీరోసమ్ బడ్జెట్‌ అని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్‌గాంధీ విమర్శించారు. ఈ బడ్జెట్‌లో వేతన తరగతికి, మధ్య తరగతికి, పేదలు – అణగారిన వారికి, యువతకు, రైతులకు, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఏమీ లేదని ఆయన ట్వీట్ చేశారు.

  8. కేంద్ర బడ్జెట్ 2022: ఆదాయ పన్నుల్లో మార్పుల్లేవ్... సదుపాయాల కల్పనకు పెద్దపీట...

    ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ రూ. 39,44,909 కోట్ల అంచనా వ్యయంతో 2022-23 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్‌ను మంగళవారం పార్లమెంటుకు సమర్పించారు.

    మధ్యతరగతి ప్రజలు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న వ్యక్తిగత ఆదాయ పన్ను స్లాబుల్లో మార్పులేవీ ఈ బడ్జెట్‌లో చేయలేదు.

    కోవిడ్ మహమ్మారి వల్ల జనం దగ్గర డబ్బులు లేవని.. ఆర్థికవ్యవస్థ బలపడటానికి జనం చేతుల్లో డబ్బులు పెట్టటం ముఖ్యమని, ఆదాయ పన్ను మినహాయింపు పరిమితిని పెంచటం ద్వారా కొంతవరకూ ఆ పని చేయవచ్చునని ఆర్థిక నిపుణులు సూచిస్తూ వచ్చారు.

    కానీ.. ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 9.25 శాతం వృద్ధి రేటును సాధించిందని ప్రకటించని నిర్మలా సీతారామన్.. ఆదాయ పన్ను స్లాబుల్లో ఎలాంటి మార్పులూ చేయలేదు.

    అయితే.. హైవేలు, రైల్వేలు, వ్యవసాయ సదుపాయాలు, గృహనిర్మాణం తదితర మౌలిక వసతుల నిర్మాణానికి ఈ బడ్జెట్‌లో పెద్దపీట వేసినట్లు కనిపిస్తోంది.

    ఆర్థికమంత్రి బడ్జెట్ ప్రసంగం ముగిసిన అనంతరం.. పార్లమెంటును బుధవారానికి వాయిదా వేశారు.

  9. పెట్టుబడి వ్యయం రూ. 10.58 లక్షల కోట్లు

    2022-23 సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌లో పెట్టుబడి వ్యయం అంచనా 10.58 లక్షల కోట్లుగా ఆర్థికమంత్రి తెలిపారు.

    ఇది జీడీపీలో 4.1 శాతమని చెప్పారు. ఆర్థిక వ్యవస్థ స్థిరంగా, బలంగా ఉండటానికి ద్రవ్యలోటు స్థాయిని 4.5 శాతం కన్నా తక్కువగా ఉంచాల్సి ఉంటుందని ఆమె పేర్కొన్నారు.

    2021-22 ఆర్థిక సంవత్సరంలో సవరించిన పెట్టుబడి వ్యయం రూ. 6.3 లక్షల కోట్లని వెల్లడించారు.

    2022 జనవరిలో మొత్తం జీఎస్‌టీ వసూళ్లు రూ. 1,40,985 కోట్లుగా ఉన్నాయని నిర్మలా సీతారామన్ తెలిపారు.

    జీఎస్‌టీ అమలులోకి వచ్చినప్పటి నుంచీ ఇదే అత్యధిక ఆదాయమన్నారు.

  10. డిజిటల్ ఆదాయం మీద 30 శాతం పన్ను

    కార్పొరేట్ సర్‌చార్జ్‌ను, కో-ఆపరేటివ్ సర్‌చార్జ్‌ను 12 శాతం నుంచి 7 శాతానికి తగ్గిస్తున్నట్లు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు.

    వర్చువల్ డిజిటల్ ఆస్తుల బదిలీ ద్వారా వచ్చే ఆదాయం మీద 30 శాతం పన్ను విధిస్తున్నట్లు ప్రకటించారు.

    ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 80 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేయటానికి రాబోయే ఆర్థిక సంవత్సరంలో రూ. 48,000 కోట్లు కేటాయిస్తున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు.

  11. రాష్ట్రాలకు లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలు

    పన్ను చెల్లింపుదారులు.. పన్ను రిటర్నుల్లో పొరపాటును సరిచేయటానికి.. సదరు అసెస్‌మెంట్ సంవత్సరానికి సంబంధించిన సవరించిన రిటర్నును రెండేళ్ల వరకూ దాఖలు చేయటానికి అవకాశం కల్పిస్తున్నట్లు నిర్మలా సీతారామన్ చెప్పారు.

    ఆర్థికవ్యవస్థలో పెట్టుబడులను బలోపేతం చేయటం కోసం.. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాలకు సాయంగా రూ. 1 లక్ష కోట్లు కేటాయిస్తున్నట్లు మంత్రి చెప్పారు.

    ఈ మొత్తాన్ని 50 ఏళ్ల పాటు వడ్డీ లేని రుణాలుగా అందిస్తామని.. సాధారణ రుణాలకు అదనంగా ఇవి ఇస్తామని తెలిపారు.

    ఈ నిధులను పీఎం గతిశక్తి తదితర ఉత్పాదక రంగంలో పెట్టుబడి వ్యయాలుగా ఉపయోగించాల్సి ఉంటుందన్నారు.

  12. బ్లాక్‌చెయిన్ టెక్నాలజీతో డిజిటల్ రూపీ జారీ చేస్తాం

    భారతీయ రిజర్వు బ్యాంకు బ్లాక్‌చెయిన్, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తూ.. డిజిటల్ రూపీని జారీచేస్తుందని ఆర్థికమంత్రి ప్రకటించారు.

    2022-23 సంవత్సరం నుంచి ఈ డిజిటల్ రూపీ అందుబాటులోకి వస్తుందన్నారు.

    దీనిద్వారా ఆర్థికవ్యవస్థకు భారీ మద్దతు లభిస్తుందని పేర్కొన్నారు.

  13. రూ. 44,605 కోట్లతో కెన్ బేత్వా అనుసంధాన ప్రాజెక్టు

    ఆత్మనిర్భరతను పెంపొందించటానికి, రక్షణ పరికరాల దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించటానికి, రక్షణ కొనుగోళ్లకు సంబంధించి పెట్టుబడి బడ్జెట్‌లో 68 శాతాన్ని దేశీయ పరిశ్రమలకు కేటాయిస్తామని ఆర్థికమంత్రి చెప్పారు.

    ఇది గత బడ్జెట్‌లొ 58 శాతంగా ఉండగా.. దానిని మరో 10 శాతం పెంచుతున్నట్లు ఆమె తెలిపారు.

    కెన్ బేత్వా అనుసంధాన ప్రాజెక్టును రూ. 44,605 కోట్ల అంచనా వ్యయంతో అమలు చేస్తామన్నారు.

    దీనివల్ల 9 లక్షల హెక్టార్ల వ్యవసాయ భూమికి సాగునీటి ప్రయోజనాలు అందుతాయని, 62 లక్షల మంది జనాభాకు తాగునీరు అందుతుందని, 103 మెగావాట్ల జలవిద్యుత్, 27 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి అవుతుందని చెప్పారు.

  14. వ్యవసాయ గ్రామీణ పరిశ్రమల కోసం నాబార్డు నిధి

    వ్యవసాయ, గ్రామీణ పరిశ్రమలు, స్టార్టప్‌లకు నిధులు సమకూర్చేందుకు నాబార్డుకు నిధిని అందిస్తామని ఆర్థికమంత్రి తెలిపారు.

    పంటలను అంచనా వేయటానికి, భూమి రికార్డులు డిజిటైజ్ చేయటానికి, పురుగుమందులు, ఎరువులు చల్లటానికి కిసాన్ డ్రోన్ల వినియోగాన్ని ప్రోత్సహిస్తామన్నారు.

    పట్టణ ప్రాంతాల్లో ప్రజా రవాణా వినియోగాన్ని బదిలీ చేయటానికి.. జీరో ఫాజిల్ ఫ్యూల్ పాలసీతో కూడిన ప్రత్యేక మొబిలిటీ జోన్లను ప్రవేశపెడతామని చెప్పారు.

  15. సెజ్ చట్టం స్థానంలో కొత్త చట్టం తెస్తాం-నిర్మల

    యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్ అండ్ కామిక్స్ (ఏవీజీసీ) రంగం.. యువత ఉపాధికి ఎంతో అవకాశమున్న రంగమని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.

    ‘‘ఇది సాకారం కావటానికి అవసరమైన సిఫారసుల కోసం, మన మార్కెట్లకు, గ్లోబల్ డిమాండ్లకు సేవలందించే సామర్థ్యాన్ని దేశీయంగా నిర్మించటానికి.. భాగస్వాములందరితో ఒక ఏవీజీసీ ప్రొమోషన్ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటుచేస్తాం’’ అని చెప్పారు.

    వ్యాపారాలు, బిజినెస్ హబ్‌ల అభివృద్ధి కోసం స్పెషల్ ఎకానమిక్ జోన్స్ చట్టం స్థానంలో కొత్త చట్టం తెస్తామన్నారు.

  16. ప్రపంచ స్థాయి విద్య కోసం డిజిటల్ యూనివర్సిటీ: నిర్మల

    ‘‘యువతకు నైపుణ్యాలు కల్పించే కార్యక్రమాలను పునఃప్రవేశపెడతాం. ఇందుకోసం డిజిటల్ దేశ్ ఈ-పోర్టల్‌ను ప్రారంభిస్తాం’’ అని నిర్మలా సీతారామన్ చెప్పారు.

    ప్రాంతీయ భాషల్లో 1 నుంచి 12 తరగతుల వరకూ అదనపు విద్యను అందించటానికి.. ‘ఒన్ క్లాస్ – ఒన్ టీవీ చానల్’ను.. 12 నుంచి 200 టీవీ చానళ్లకు పెంచుతామన్నారు.

    విద్యార్థులకు ఐఎస్‌టీఈ ప్రమాణాలతో ప్రపంచ స్థాయి విద్యను అందించటానికి ఒక డిజిటల్ యూనివర్సిటీని అభివృద్ధి చేస్తామని చెప్పారు.

    మానసిక ఆరోగ్యం మీద కౌన్సిలింగ్ కోసం నేషనల్ టెలీ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్‌ను ప్రారంభిస్తామన్నారు.

  17. నదులను అనుసంధానిస్తాం-నిర్మలా సీతారామన్

    కృష్ణా-గోదావరి, కృష్ణా-పెన్నా నదులను అనుసంధానిస్తామని ఆర్థికమంత్రి ప్రకటించారు.

    దేశంలో నదుల అనుసంధానానికి పెద్ద పీట వేస్తామని నిర్మలా సీతారామన్ చెప్పారు.

    కృష్ణా-గోదావరి, కృష్ణా-పెన్నా, పెన్నా-కావేరి నదులను అనుసంధానిస్తామని తెలిపారు.

    2023 సంవత్సరాన్ని చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించారు.

    రైతులు ప్రకృతి సేద్యాన్ని అవలంబించటానికి వీలుగా.. రాష్ట్ర ప్రభుత్వాలకు సమగ్ర ప్యాకేజీలను ప్రవేశపెడతామన్నారు.

  18. ‘పీఎం గతి శక్తి’కి రూ.20,000 కోట్లు-నిర్మలా సీతారామన్

    చిన్న రైతులు, వ్యాపారుల కోసం రైల్వేలు సమర్థవంతమైన సదుపాయాలను అభివృద్ధి చేస్తాయని ఆర్థిక మంత్రి చెప్పారు.

    స్థానిక ఉత్పత్తుల సప్లై చైన్‌కు సాయం చేయటానికి ‘ఒక స్టేషన్ – ఒక ఉత్పత్తి’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామన్నారు.

    పీఎం గతి శక్తి కింద రాబోయే కొన్నేళ్లలో 100 కార్గో టెర్మినళ్లను అభివృద్ధి చేస్తామని నిర్మల తన ప్రసంగంలో తెలిపారు.

    పీఎం గతి శక్తి కింద.. రాష్ట్రాల మధ్య మల్టీ-మోడల్ అనుసంధానానికి ఏడు చోదకాలు ఉంటాయని, ఈ పథకాన్ని వేగవంతం చేయటానికి ప్రభుత్వం రూ. 20,000 కోట్లు కేటాయిస్తుందని ప్రకటించారు.

    మెట్రో ప్రాజెక్టుల నిర్మాణానికి నిధులు అందించటానికి, వేగవంతంగా అమలు చేసేయటానికి ప్రభుత్వం వినూత్న మార్గాలను ప్రోత్సహిస్తుందని నిర్మల చెప్పారు.

    ప్రజా రవాణాకు, రైల్వే స్టేషన్లకు మధ్య మల్టీమోడల్ అనుసంధానానికి ప్రాధాన్యం ఇస్తామన్నారు.

  19. మేక్ ఇన్ ఇండియా ద్వారా 60 లక్షల కొత్త ఉద్యోగాలు-నిర్మల

    భారత స్వాతంత్ర్య 75 వసంతాల నుంచి శతవార్షికోత్సవం జరుపుకునే రాబోయే 25 ఏళ్లను ‘అమృత కాలం’గా అభివర్ణించిన ఆర్థికమంత్రి.. ఆ కాలంలో ఆర్థికవ్యవస్థకు ఈ బడ్జెట్ పునాది నిర్మిస్తుందని చెప్పారు.

    2022-23లో నేషనల్ హైవే నెట్‌వర్క్‌ను 25,000 కిలోమీటర్ల మేర విస్తరిస్తామన్నారు.

    వైద్య మౌలిక సదుపాయాలను బలోపేతం చేయటం, వ్యాక్సీనేషన్ కార్యక్రమాన్ని వేగవంతం చేయటం.. కోవిడ్ మహమ్మారి ప్రస్తుత వేవ్‌ను దేశవ్యాప్తంగా బలంగా ఎదుర్కోవటం అందరికీ కనిపిస్తోందని చెప్పారు.

    ఆత్మనిర్భర్ భారత్‌ను సాధించటానికి చేపట్టిన ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సహ పథకానికి (పీఎల్ఐ స్కీమ్‌కు) అద్భుత స్పందన లభించిందన్నారు.

    దీనిద్వారా 60 లక్షల కొత్త ఉద్యోగాలను కల్పించే అవకాశముందని, రాబోయే సంవత్సరాల్లో అదనంగా మరో 30 లక్షల ఉద్యోగాలు వచ్చే అవకాశముందని చెప్పారు.

  20. రాబోయే పాతికేళ్లకు బ్లూ ప్రింట్ ఈ బడ్జెట్-ఆర్థిక మంత్రి

    రాబోయే పాతికేళ్లకు బ్లూప్రింట్ ఈ బడ్జెట్: నిర్మలా సీతారామన్

    2022-23 కేంద్ర బడ్జెట్ రాబోయే 25 సంవత్సరాలకు బ్లూప్రింట్ వంటిదని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అభివర్ణించారు.

    ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 9.27 శాతం వృద్ధి రేటును సాధించినట్లు అంచనాగా చెప్పారు.

    2022 కేంద్ర బడ్జెట్‌ ప్రసంగాన్ని మంగళవారం ఉదయం 11 గంటలకు ఆమె పార్లమెంటులో ప్రారంభించారు.

    ‘‘మనం ఒమిక్రాన్ వేవ్ మధ్యలో ఉన్నాం. మన వ్యాక్సినేషన్ వేగం చాలా ఉపయోగపడింది. అందరి కృషితో మనం బలమైన అభివృద్ధిని కొనసాగిస్తామని నేను ధీమాగా ఉన్నాను’’ అని ఆమె పేర్కొన్నారు.