హుజూరాబాద్,
బద్వేలుతోపాటు దేశంలోని మరికొన్ని నియోజకవర్గాలకూ అక్టోబరు 30న ఉప ఎన్నికలు
నిర్వహించారు. మొత్తం 14 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతం దాద్రా నగర్ హవేలీలోని 3 పార్లమెంటు స్థానాలు, 29 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి.
ప్రస్తుతం ఈ అన్ని నియోజకవర్గాల కౌంటింగ్ జరుగుతోంది.
ఒక లోక్‌సభ
స్థానంలో శివసేన ఆధిక్యంలో ఉండగా, మరోచోట బీజేపీ, వేరొకచోట కాంగ్రెస్ ముందంజలో
ఉన్నాయి.
హిమాచల్ ప్రదేశ్‌లోని
మండి లోక్‌సభ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి బ్రిగేడియర్ కుశాల్ ఠాకుర్, కాంగ్రెస్
అభ్యర్థి ప్రతిభా సింగ్ మధ్య పోటీ హోరాహోరీగా ఉంది. ఠాకుర్‌పై ప్రతిభ దాదాపు
నాలుగు వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
మధ్యప్రదేశ్‌లోని
ఖంద్వారాలో కాంగ్రెస్ అభ్యర్థి రాజ్‌నారాయణ్ సింగ్‌పై బీజేపీ అభ్యర్థి ధ్యానేశ్వర్
పాటిల్ 8,000 పైచిలుకు ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
మరోవైపు
దాద్రానగర్ హవేలీలో బీజేపీ అభ్యర్థి మహేశ్ భాయ్‌పై శివసేన అభ్యర్థి కళాబెన్
దేల్కర్ ఆధిక్యంలో ఉన్నారు.
అసెంబ్లీ నియోజకవర్గాలలో ఇలా..
బిహార్‌లోని
కుశేశ్వర్ స్థాన్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఆర్జేడీ అభ్యర్థి అమన్ భూషణ్ ఆధిక్యంలో
ఉన్నారు. అసోంలోని రెండు నియోజకవర్గాల్లోనూ బీజేపీ ముందంజలో ఉంది.
హిమాచల్‌లోని మూడు
అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ రెండు చోట్ల ఆధిక్యంలో ఉంది. ఒకచోట స్వతంత్ర
అభ్యర్థి ముందంజలో ఉన్నారు.
హరియాణాలో ఒకచోట
ఇండియన్ నేషనల్ లోక్ దళ్, మరొకచోట బీజేపీ ఆధిక్యంలో ఉన్నాయి. రాజస్థాన్‌లో రెండు
నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్ ముందంజలో ఉంది.
పశ్చిమ బెంగాల్‌లోని
ఎన్నికలు నిర్వహించిన నాలుగు స్థానాల్లో రెండు చోట్ల బీజేపీపై తృణమూల్ భారీ
ఆధిక్యంలో ఉంది.