హుజూరాబాద్‌లో 86.33 శాతం, బద్వేల్‌లో 68.12 శాతం పోలింగ్
హుజురాబాద్, బద్వేల్ ఉప ఎన్నికల పోలింగ్ ముగిసింది.
కోవిడ్ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ పోలింగ్ సమయం పెంచడంతో ఉదయం 7 నుంచి సాయంత్రం 7 గంటల వరకు 12 గంటల పాటు పోలింగ్ జరిగింది.
హుజూరాబాద్‌లో సాయంత్రం 7 గంటల వరకు 86.33 శాతం పోలింగ్ నమోదైంది.
బద్వేల్‌లో సాయంత్రం 7 గంటల సరికి 68.12 శాతం పోలింగ్ నమోదైంది.
2018 అసెంబ్లీ ఎన్నికల్లో హుజూరాబాద్ నియోజకవర్గంలో 84.4 శాతం పోలింగ్ నమోదు కాగా బద్వేల్‌లో 2019 శాసనసభ ఎన్నికలలో 76.37 శాతం పోలింగ్ నమోదైంది.
హుజూరాబాద్‌లో..
పోలింగ్ ప్రారంభం నుండే ఇల్లందకుంట, జమ్మికుంట,హుజూరాబాద్,కమలాపూర్ మండలాల్లో పలుచోట్ల టీఆర్ఎస్, బీజేపి వర్గాలమధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది.
వీణవంక మండలం గన్ముక్కుల లో టీఆర్ఎస్ నాయకుడు పాడి కౌశిక్ రెడ్డి, బీజేపి కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది.
హిమ్మత్ నగర్ ఉమ్మడి కరీంనగర్ జెడ్పీ మాజీ అధ్యక్షురాలు తుల ఉమ, టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ భార్య గెల్లు శ్వేత ల మధ్య మాటలయుద్దం కాస్తా రెండు వర్గాలు కొట్టుకునేందుకు దారితీసింది.
కమలాపూర్ మండలం మరిపల్లిగూడెం వద్ద ఈటల రాజేంధర్ కాన్వాయ్ లో అనుమతి లేని వాహనాలు తిరుగుతున్నాయని ఓ వాహనం స్వాధీనం చేసుకుని , ఈటల పీఆర్వో తో పాటు మరో ఇద్దరిని అదుపులో తీసుకున్నారు.
పోలింగ్ ముసిగిన వెంటనే ఈవీఎం లను ప్రత్యేక భధ్రతా ఏర్పాట్ల మధ్య కరీంనగర్ తరలిస్తున్నారు. నవంబర్ 2న కరీంనగర్ ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజ్‌లో కౌంటింగ్ నిర్వహిస్తారు.
బద్వేల్‌లో
బద్వేల్ ఉప ఎన్నిక ప్రశాంతంగా ముగిసినట్లు కడప జిల్లా కలెక్టర్ విజయరామరాజు ప్రకటించారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదని ఆయన చెప్పారు.
కాగా.. బద్వేల్ ఉప ఎన్నిక సందర్భంగా పలు గ్రామాలలో వైసీపీ, బీజేపీ కార్యకర్తల మధ్య వాగ్వాదాలు జరిగాయి. దొంగ ఓట్లు వేస్తున్నారంటూ వైసీపీ కార్యకర్తలను బీజేపీ అభ్యర్థి సురేశ్ అడ్డుకున్నారు.
అయితే, దొంగ ఓట్లు వేస్తున్నారనేది అవాస్తవమని ఏపీ ఎన్నికల ప్రధానాధికారి విజయానంద్ చెప్పారు.