You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

బిహార్ ఎన్నికల ఫలితాలు: ఆర్‌జేడీ అతి పెద్ద పార్టీ.. రెండో స్థానంలో బీజేపీ... ఎన్‌డీఏ విజయం

బిహార్‌లోని 243 అసెంబ్లీ స్థానాల్లో 75 సీట్లు గెలుచుకున్న ఆర్‌జేడీ అతి పెద్ద పార్టీగా నిలిచింది. 74 సీట్లతో బీజేపీ రెండో స్థానంలో నిలిచింది. అయితే.. బీజేపీతో కూడిన ఎన్‌డీఏ కూటమి 125 స్థానాలను కైవసం చేసుకుని అధికారాన్ని నిలుపుకుంది.

లైవ్ కవరేజీ

  1. ప్రధాన అభ్యర్థుల పరిస్థితి ఏమిటి?

    ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ (రఘోపుర్), ఆయన అన్నయ్య తేజ్ ప్రతాప్(హసన్‌పుర్)ల ఆధిక్యం కొనసాగుతోంది.

    ఆర్జేడీ నాయకుడు అనంత్ సింగ్, హిందుస్తాన్ అవామీ మోర్చా నాయకుడు జీతన్ రామ్ మాంఝీ కూడా తమ తమ నియోజకవర్గాల్లో ముందంజలో ఉన్నారు. మరోవైపు శతృఘ్న సిన్హా కుమారుడు లవ్ సిన్హా.. బంకీపుర్ నియోజకవర్గంలో వెనుకపడ్డారు.

    జేడీయూ మాజీ నాయకుడు శరద్ యాదవ్ కుమార్తె, కాంగ్రెస్ అభ్యర్థి సుభాషిణి.. బిహారీ గంజ్ స్థానంలో వెనుకపడ్డారు.

  2. జేడీయూ కార్యాలయం బయట సంబరాలు

    బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నడుమ పట్నాలోని జేడీయూ కార్యాలయం వెలుపల పండుగ వాతావరణం నెలకొంది.

    ఎన్నికల సంఘం వెల్లడించిన వివరాల ప్రకారం.. 127 సీట్లతో ఎన్‌డీఏ కూటమి ముందంజలో ఉంది. మహాకూటమి 105 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఎల్‌జేపీ రెండు చోట్ల ముందుంది.

    మరోవైపు స్వతంత్రులు ఐదు స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.

  3. రెండు నియోజకవర్గాల్లో తేడా పది కంటే తక్కువే

    రెండు నియోజకవర్గాల్లో అభ్యర్థుల మధ్య తేడా పది కంటే తక్కువే ఉన్నట్లు ఎన్నికల కమిషన్ తెలిపింది.

    1. కస్బా: ప్రదీప్ కుమార్ దాస్ (ఎల్‌జేపీ) – ఐదు ఓట్ల ఆధిక్యం

    2. తరారీ: నరేంద్ర కుమార్ పాండే (స్వతంత్ర అభ్యర్థి)- ఎనిమిది ఓట్ల ఆధిక్యం

  4. ముందంజలో ఎవరున్నారు...

    ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం బిహార్ ఎన్నికల్లో వినిధ పార్టీల ఆధిక్యాలు ఈ విధంగా ఉన్నాయి.

  5. ఓట్ల లెక్కింపు ఆలస్యం కావొచ్చు: ఎన్నికల సంఘం

    2015తో పోలిస్తే.. ఇప్పుడు ఎన్నికల కేంద్రాల సంఖ్యను పెంచామని, దీంతో ఈవీఎంల సంఖ్య కూడా పెరిగిందని, ఫలితంగా కౌంటింగ్ ప్రక్రియ ఆలస్యం అవుతోందని ఎన్నికల కమిషన్ తెలిపింది. ఓట్ల లెక్కింపుకు సమయం ఎక్కువ అవసరం అవుతుందని పేర్కొంది. ఇప్పటివరకు కోటికి పైగా ఓట్లను లెక్కించారు.

  6. ఆర్జేడీకి కాంగ్రెస్ భారంగా మారిందా?

    బిహార్‌లో ఆర్జేడీకి కాంగ్రెస్ భారంగా మారినట్లు కనిపిస్తోంది. మహాకూటమిలో భాగంగా కాంగ్రెస్‌కు 70 సీట్లు కేటాయించారు. అయితే వీటిలో 21 స్థానాల్లోనే పార్టీ ఆధిక్యంలో ఉంది.

    మరోవైపు సీపీఐ(ఎంఎల్) 19 స్థానాల్లో పోటీచేస్తే 14 స్థానాల్లో ముందుంది. కాంగ్రెస్‌కు అనవసరంగా చాలా ఎక్కువ సీట్లను ఆర్జేడీ కేటాయించిందని విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు ఎలాంటి ప్రయోజనమూ లేని సీట్లనే కాంగ్రెస్‌కు కట్టబెట్టినట్లు మరికొందరు విశ్లేషిస్తున్నారు.

  7. ఆర్జేడీ, బీజేపీల కంటే జేడీయూకు తక్కువ ఆధిక్యం

    ఎన్‌డీఏలో జేడీయూ కాస్త వెనుకబడినట్లు కనిపిస్తోంది. బీజేపీ 121 స్థానాల్లో, జేడీయూ 122 స్థానాల్లో పోటీచేశాయి. అయితే ఎన్నికల కమిషన్ వివరాల ప్రకారం.. 72 స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉంటే.. జేడీయూ 48 స్థానాల్లో ముందంజలో ఉంది. మరోవైపు మహాకూటమిలో భాగంగా 144 స్థానాల్లో ఆర్జేడీ పోటీ చేయగా.. 66 స్థానాల్లో ముందంజలో ఉంది.

    కాంగ్రెస్ 70 స్థానాల్లో తమ అభ్యర్థులను బరిలోకి దింపింది. అయితే 20 చోట్ల మాత్రమే పార్టీ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. మరోవైపు సీపీఐ(ఎంఎల్) 19 చోట్ల అభ్యర్థుల్ని నిలబెడితే.. వారు 14 చోట్ల ఆధిక్యం కనబరుస్తున్నారు.

  8. ఈవీఎంలపై కాంగ్రెస్ సందేహాలు

    బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నడుమ ఈవీఎంలపై కాంగ్రెస్ సందేహాలు వ్యక్తంచేసింది. ఈ అంశంపై కాంగ్రెస్ నాయకుడు ఉదిత్ రాజ్ ట్వీట్ చేశారు.

    ‘‘అంగారకుడు, చంద్రుడిపైకి వెళ్లే ఉపగ్రహాలను భూమి పైనుంచే నియంత్రించగలిగే.. ఈవీఎంలను ఎందుకు హ్యాక్ చేయలేం?’’అంటూ ఆయన ప్రశ్నించారు.

  9. ఆధిక్యంలో తేజ్‌ప్రతాప్

    హసన్‌పుర్ నియోజకవర్గంలో ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ ఆధిక్యంలో ఉన్నారు. ఆయనకు 15,541 ఓట్లు వచ్చాయి. మరోవైపు ఇక్కడి జేడీయూ అభ్యర్థికి 12,058 ఓట్లు దక్కాయి. ఇద్దరికి మధ్య దాదాపు 3500 ఓట్ల వ్యత్యాసం కనిపిస్తోంది. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచే తేజ్ ప్రతాప్ గెలుపొందారు.

  10. కొనసాగుతున్న బీజేపీ ఆధిక్యం

  11. బిహార్‌లో అతిపెద్ద పార్టీ దిశగా బీజేపీ

    బిహార్‌లో మహా కూటమి కంటే ఎన్‌డీఏ కాస్త ముందంజలో ఉన్నట్లు కనిపిస్తోంది. పార్టీల విషయానికి వస్తే బీజేపీ, ఆర్జేడీల మధ్య హోరాహోరీ పోటీ నడుస్తోంది. ఎన్నికల కమిషన్ తాజా సమాచారం ప్రకారం బీజేపీ 70 స్థానాల్లో ఆధిక్యంలో ఉంటే.. ఆర్జేడీ 62 స్థానాల్లో ముందంజలో ఉంది. జనతా దళ్ (జేడీయూ) 48 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ 20 స్థానాల్లో ముందంజలో ఉంది.

  12. 62 స్థానాల్లో బీజేపీ ఆధిక్యం

    ఎన్నికల కమిషన్ తాజా సమాచారం ప్రకారం పార్టీల వారీగా ఆధిక్యం..

    బీజేపీ 62

    ఆర్జేడీ 61

    జేడీయూ 49

    కాంగ్రెస్ 18

    ఎల్జేపీ 5

  13. సీమాంచల్‌లో ఎవరు ఆధిక్యంలో ఉన్నారు?

    ఇప్పటివరకు 37 జిల్లాల్లో ప్రాథమిక ఫలితాలు వెల్లడయ్యాయి. సీమాంచల్‌లోని నాలుగు స్థానాలు, కోశిలోని మూడు స్థానాల్లో ఎన్‌డీఏ ఆధిక్యంలో ఉంది.

  14. 23 స్థానాల్లో బీజేపీ ఆధిక్యం

    ఎన్నికల కమిషన్ వివరాల ప్రకారం..

    • బీజేపీ 23 స్థానాల్లో ముందంజలో ఉంది
    • ఆర్జేడీ 17 స్థానాల్లో ఆధిక్యం కనబరుస్తోంది.
    • 14 స్థానాల్లో జేడీయూ ముందుంది.
    • కాంగ్రెస్ 12 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.
  15. బిహార్ ఎన్నికలు: ఇప్పుడు ఏం జరుగుతోంది?

    • ప్రాథమిక ఫలితాలను పరిశీలిస్తుంటే జేడీయూ కాస్త వెనుకబడినట్లు కనిపిస్తోంది. గతంతో పోలిస్తే బీజేపీ కాస్త మెరుగు పడిందనే చెప్పాలి.
    • ఎల్‌జేపీ వల్ల జేడీయూ అవకాశాలకు గండి పడినట్లు కనిపిస్తోంది.
    • వామ పక్షాలు తమ నియోజకవర్గాల్లో ముందంజలోనే ఉన్నాయి.
  16. ఎవరెవరు ఎన్ని స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు?

    ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం ఆర్‌జేడీ కూటమి వందకు పైగా స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది.

  17. అందరి దృష్టి రాఘోపుర్ పైనే..

    వైశాలి జిల్లాలోని రాఘోపుర్ అంసెబ్లీ నియోజకవర్గంపై అందరి దృష్టి ఉంది.ఇక్కడి నుంచే తేజస్వి యాదవ్ ప్రస్తుతం పోటీ చేశారు. 2015 ఎన్నికల్లో ఇక్కడ ఆయన గెలుపొందారు.

    1995, 2000లో ఇక్కడి నుంచి తేజస్వి తండ్రి, ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ గెలుపొందారు. 2005 ఎన్నికల్లో తేజస్వి తల్లి రబ్రీ దేవి కూడా ఇక్కడి నుంచే గెలుపొందారు. అయితే 2010 ఎన్నికల్లో జేడీయూకు చెందిన సతీశ్ రాయ్ చేతిలో ఆమె పరాజయం పాలయ్యారు. ప్రస్తుతం సతీశ్ బీజేపీ నుంచి తేజస్వి యాదవ్‌పై పోటీ చేశారు.

  18. మొదలైన ఓట్ల లెక్కింపు

    ఉదయం ఎనిమిది గంటలకు బిహార్‌లో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మూడు దశల్లో జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 57.05 శాతం మంది ఓట్లు వేసినట్లు ఎన్నికల సంఘం తెలిపింది. 2015లో 56.66 శాతం మంది ఓట్లు వేయగా, ఈసారి అంతకన్నా ఎక్కువమందే ఓట్లు వేశారు.

    మొదటి దశ ఓటింగ్ అక్టోబర్ 28న 71 స్థానాల్లో జరిగింది. రెండో దశ ఓటింగ్ నవంబర్ 3న 94 స్థానాల్లో జరగగా, చివరి దశ నవబర్ 7న 78 స్థానాల్లో జరిగింది.

    నవంబర్ 29తో 2015 శాసన సభ పదవీకాలం ముగుస్తుంది.

    ఈ ఎన్నికల్లో పోటీ చేసిన బీజేపీకి చెందిన నందకిషోర్ యాదవ్ (పాట్నా సాహిబ్), ప్రమోద్ కుమార్ (మోతీహరి), సురేష్ శర్మ (ముజఫర్‌పుర్), శ్రవణ్ కుమార్ (నలంద), జైకుమార్ సింగ్ (దినారా), కృష్ణానందన్ ప్రసాద్ వర్మ (జహానాబాద్)ల గెలుపు ఓటములు ఈరోజు తేలుతాయి.

    అంతేకాకుండా, హసన్‌పూర్‌నుంచీ తేజస్వి యాదవ్ అన్నయ్య తేజ్ ప్రతాప్ యాదవ్, బిహార్ మాజీ ముఖ్యమంత్రి జీతన్ రామ్ మాంఝీ కూడా ప్రస్తుతం రంగంలో ఉన్నారు.

  19. బిహార్ ఎన్నికలు: కాసేపట్లో కౌంటింగ్ ప్రారంభం

    బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మంగళవారం వెలువడనున్నాయి. కౌంటింగ్ ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుంది. బరిలో నిలిచిన నేతల భవిష్యత్తు ఏమిటన్నది ఈవీఎంలను తెరిచి లెక్కించిన కొద్దీ తేలిపోతుంది. రాష్ట్రంలో తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది ఎవరన్నది ఈ సాయంత్రానికి తేలిపోతుందని భావిస్తున్నారు.

    కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో భారతదేశంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన మొదటి రాష్ట్రం బిహార్. ఈ ఎన్నికల ప్రక్రియ సెప్టెంబర్ 7న మొదలై నవంబర్ 5 వరకు కొనసాగింది. దాదాపు రెండు నెలల సుదీర్ఘ కాలం సాగిన ఈ ఎన్నికల సమరంలో 15 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్న నితిశ్ కుమార్ మీద ఆర్‌జేడీ యువనేత తేజస్వి యాదవ్ నాయకత్వంలోని మహాకూటమి బరిలో నిలిచింది.

    ఎన్నికల కౌంటింగ్‌కు సంబంధించిన తాజా సమాచారాన్ని ఈ లైవ్ పేజి మీకు ఎప్పటికప్పుడు అందిస్తుంటుంది.