You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కరోనా వైరస్: దేశవ్యాప్తంగా విద్యుత్ లైట్లు ఆర్పేసి దీపాలు, కొవ్వొత్తులు వెలిగించిన ప్రముఖులు
ప్రపంచవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 12 లక్షలు దాటింది. 66,542 మంది చనిపోయారు. 2,52,615 మంది కోవిడ్ వ్యాధి నుంచి కోలుకున్నారు.
లైవ్ కవరేజీ
దీపాలు వెలిగించిన సీఎం జగన్, అధికారులు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, అధికారులు కలిసి దీపాలు వెలిగించారు.
జ్యోతి వెలిగించిన మోదీ
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దిల్లీలోని తన అధికారిక నివాసంలో జ్యోతిని వెలిగించారు.
దీపాలతో తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ రావు
దీపాలు వెలిగించి సంఘీభావం తెలిపిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్
దేశమంతా దీపాల వెలుగు.. మోదీ పిలుపుపై పెద్ద ఎత్తున స్పందించిన ప్రజలు
దేశమంతా ప్రధాని మోదీ పిలుపు మేరకు ఇళ్లలో లైట్లు ఆర్పివేసి గుమ్మాల ముందు, బాల్కనీల్లో నిల్చుని కొవ్వొత్తులు, దీపాలు వెలిగించారు.
తమ మొబైల్ ఫోన్లలోని టార్చ్ ఆన్ చేశారు కొందరు. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు ఇందులో పాలుపంచుకున్నారు.
మహారాష్ట్రలో 45 మంది మృతి
మహారాష్ట్రలో కరోనా మృతుల సంఖ్య భారీగా పెరిగింది.
ఆదివారం ఒక్క రోజే 13 మంది మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య 45కి పెరిగింది.
ఏపీలో 252 కేసులు.. ఒక్క కర్నూలులోనే కొత్తగా 26
ఆంధ్రప్రదేశ్‌లో ఆదివారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల మధ్య కొత్తగా 26 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
దీంతో మొత్తం కేసుల సంఖ్య 252కి పెరిగింది.
కొత్తగా నమోదైన 26 కేసులూ కర్నూలు జిల్లాలోనే నమోదయ్యాయి.
ప్రస్తుతం కర్నూలు జిల్లాలో అత్యధికంగా 53 కేసులుండగా, నెల్లూరులో 34, గుంటూరులో 30, కృష్ణా జిల్లాలో 28 కేసులతో పరిస్థితి తీవ్రంగా ఉంది.
భారత్‌లో కరోనా మృతులు 83 మంది.. పాజిటివ్ కేసులు 3,577
భారత్‌లో కరోనావైరస్ మరణాలు పెరుగుతున్నాయి.
ఆదివారం సాయంత్రానికి మృతుల సంఖ్య 83కి పెరిగింది.
పాజిటివ్ కేసుల సంఖ్య కూడా 3,577కి పెరిగింది. మహారాష్ట్రలో అత్యధికంగా 690 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
తూర్పుగోదావరి జిల్లాలో 150 మందితో ప్రార్థనలు చేయించిన పాస్టర్ అరెస్ట్
కరోనావైరస్ నేపథ్యంలో దేశమంతటా లాక్‌డౌన్ అమలవుతున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లాలో ఆదివారం ఒక చర్చిలో 150మందితో సామూహిక ప్రార్థనలు చేయించిన పాస్టర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
కరోనా కట్టడిలో ప్రభుత్వానికి మా పూర్తి సహకారం: ఉత్తమ్ కుమార్ రెడ్డి
కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు కాంగ్రెస్ శ్రేణులు సహకరించాలని, సహాయ చర్యల్లో పాల్గొనాలని ఆ పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.
కరోనావైరస్ నిరోధానికి కేంద్రం, తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు తమ పార్టీ నుంచి పూర్తి మద్దతు ఉంటుందని చెప్పారు.
కాంగ్రెస్ శ్రేణులు స్వీయ రక్షణ చర్యలు పాటిస్తూ అన్ని వర్గాలకూ సహాయ సహకారాలు అందించాలని ఉత్తమ్ పిలుపునిచ్చారు.
దిల్లీలో జమాత్‌కు వెళ్లొచ్చినవారు, వారి కాంటక్ట్స్‌కు వీలైనంత వేగంగా టెస్టులు చేయండి: సీఎం జగన్
కరోనావైరస్ వ్యాప్తిని నివారించడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఏపీ సీఎం జగన్ కొద్దిసేపటి కిందట ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.
రాష్ట్రంలో కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి జిల్లాలో ఒక కరోనావైరస్ టెస్టింగ్ ల్యాబ్ ఏర్పాటు చేయాలని, ఇప్పుడున్న ల్యాబ్‌ల కెపాసిటీ పెంచాలని, ప్రతి ఆసుపత్రిలో ఐసోలేషన్ వార్డు ఏర్పాటు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.
జగన్ దిల్లీలో జమాత్‌కు వెళ్లినవారు, వారి ప్రైమరీ కాంటాక్ట్స్‌కు పరీక్షలు వీలైనంత వేగంగా పూర్తిచేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
కరోనావైరస్ లక్షణాలతో ఎవరు వచ్చినా వారిని కోవిడ్-19 రోగిగానే భావించి వైద్య సిబ్బంది తగు జాగ్రత్తలు తీసుకుని చికిత్స అందించాలని సూచించారు.
ఏప్రిల్ 14 తర్వాత కేంద్రం ఇచ్చే మార్గ దర్శకాల ఆధారంగా తగిన చర్యలు తీసుకోవడంపై సమాయత్తం కావాలని అధికారులకు సూచించారు.
భారత్‌లో 3,374కి చేరిన కరోనా కేసులు.. 79 మంది మృతి, ప్రతి నాలుగు రోజులకూ పాజిటివ్ కేసులు రెట్టింపవుతున్నాయి: కేంద్రం
దేశంలో 274 జిల్లాలు కరోనావైరస్ ప్రభావానికి గురయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ చెప్పారు.
ఇప్పటివరకు దేశంలో మొత్తం 3374 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని.. 79 మంది మరణించారని, 267 మంది కోలుకున్నారని ఆయన తెలిపారు.
నిన్నటి నుంచి ఇప్పటి వరకు దేశంలో 11 మంది కరోనాతో మరణించారని లవ్ అగర్వాల్ చెప్పారు.
ఇప్పటివరకు కేసులు పెరుగుతున్న తీరు చూస్తుంటే సగటున 4.1 రోజులకు కేసులు రెట్టింపవుతున్నాయని.. తబ్లిగీ జమాత్ కేసులు లేకుంటే ఈ రెట్టింపు రేటు సగటున 7.4 రోజులుగా ఉండేదని ఆయన తెలిపారు.
లాక్‌డౌన్‌తో గంగా ప్రక్షాళన
లాక్‌డౌన్ కారణంగా కర్మాగారాలు మూతపడడంతో గంగానదిలో కాలుష్యం తగ్గిందని.. నీరు శుభ్రంగా కనిపిస్తోందని వారణాసి ఐఐటీ(బీహెచ్‌యూ) కెమికల్ ఇంజినీరింగ్, టెక్నాలజీ ప్రొఫెసర్ డాక్టర్ పీకే మిశ్రా చెప్పారు.
ప్రస్తుతం గంగానదిలో నీటి నాణ్యత 40 నుంచి 50 శాతం మెరుగుపడిందన్నారు.
ప్రణబ్, మన్మోహన్, సోనియా, కేసీఆర్, మమత, నవీన్, ములాయం, ఇతర నేతలకు మోదీ ఫోన్
కరోనావైరస్‌పై చర్చ ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం మాజీ రాష్ట్రపతులు ప్రణబ్ ముఖర్జీ, ప్రతిభా పాటిల్.. మాజీ ప్రధానమంత్రులు మన్మోహన్ సింగ్, హెచ్‌డీ దేవెగౌడలతో మాట్లాడారు. కోవిడ్-19కి సంబంధించి వారితో చర్చించారు. వీరితో పాటు దేశంలోని వివిధ రాజకీయ పార్టీల నేతలతోనూ ప్రధాని ఫోన్లో సంభాషించారు. ప్రధాని ఫోన్ చేసినవారిలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, సమాజ్‌వాది పార్టీ నేతలు ములాయం సింగ్ యాదవ్, అఖిలేశ్ యాదవ్, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ.. బిజూ జనతాదళ్ అధ్యక్షుడు, ఒడిశా సీఎం నవీన్ పట్నాయిక్.. తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్, డీఎంకే నేత ఎంకే స్టాలిన్, శిరోమణి అకాలీదళ్ నేత ప్రకాశ్ సింగ్ బాదల్ కూడా ఉన్నారు.
భారత్‌లో చిక్కుకున్న బ్రిటన్ వాసుల కోసం ప్రత్యేక విమానాలు
భారత్‌లో లాక్ డౌన్ కారణంగా చిక్కుకున్న బ్రిటన్ వాసులకు సాయం చేసేందుకు ఆ దేశ ప్రభుత్వం ముందుకొచ్చింది. వారి కోసం ఏడు ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది.
దేశంలో మొత్తం 35 వేలమంది బ్రిటన్ వాసులు చిక్కుకొని ఉంటారని భావిస్తున్నారు. వారిలో 20 వేల మంది వరకు బ్రిటిష్ హై కమిషన్‌ను సంప్రదించి తమను తక్షణం స్వదేశానికి తీసుకు వెళ్లే ఏర్పాటు చేయాలని అభ్యర్థించారు.
వారి కోసం ఏర్పాటు చేసిన విమానాలు దేశంలో న్యూ దిల్లీ, ముంబై, గోవాల నుంచి ఈ నెల 8 నుంచి 12 తేదీల మధ్య బయల్దేరనున్నాయి.
బ్రిటన్‌కు వెళ్లే విమానాల వివరాలు • ముంబయి నుంచి ఏప్రిల్ 9,11 తేదీలలో • న్యూ దిల్లీ నుంచి ఏప్రిల్ 9,11 తేదీలలో • గోవా నుంచి ఏప్రిల్ 8,10,12 తేదీలలో గడిచిన కొన్ని వారాలుగా భారత్‌లో చిక్కుకున్న బ్రిటన్ వాసులు ఎంతగా ఆందోళన చెందుతున్నారో తమకు తెలుసునని ఇండియాలో బ్రిటన్ హై కమిషనర్‌గా వ్యవహరిస్తున్న జాన్ థాంప్సన్ అన్నారు. ప్రస్తుతం తాము చేసిన ఏర్పాట్లు వారికి గొప్ప ఊరట నిస్తాయని భావిస్తున్నట్లు చెప్పారు.
ఆంధ్రప్రదేశ్‌లో 34 కొత్త కేసులు... మొత్తం బాధితులు 226, కర్నూలు జిల్లాలో ఒకేసారి 23 కొత్త కేసులు
ఏపి లో 226 కి పెరిగిన కేసులు. కొత్తగా కర్నూల్ 23, చిత్తూరు 7, ఒంగోలు 2, నెల్లూరు 2 కేసులు నమోదు. మొత్తం నిన్న రాత్రి 9 గంటల నుంచి ఇవాళ ఉదయం 9 గంటల వరకు మొత్తం 34 కేసులు నమోదయ్యాయి.
తమిళనాడులో కరోనావైరస్ కారణంగా మరో 2 మరణాలు. మొత్తం ఇప్పటి వరకు ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.
ఇప్పటి వరకు నెల్లూరులో అత్యధికంగా 34 కేసులు నమోదు కాగా, 30 పాజిటివ్ కేసులతో రెండో స్థానంలో గుంటూరు ఉంది. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలలో ఇప్పటి వరకు ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు..
క్వారంటీన్ సెంటర్‌గా షారుఖ్ ఖాన్ ఆఫీస్
కరోనా సంక్షోభ సమయంలో బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ తన నాలుగు అంతస్తుల ఆఫీసు భవనాన్ని క్వారంటీన్ సెంటర్‌గా మార్చాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందులో చిన్నపిల్లలు, మహిళలు, వృద్ధులకు ఆశ్రయం ఇస్తామని ప్రకటించారు.
గ్రేటర్ ముంబయి కార్పొరేషన్ తమ అధికారిక ట్విటర్ ఖాతా నుంచి ఈ విషయంపై ట్వీట్ చేసింది. నాలుగు అంతస్తుల భవనాన్ని క్వారంటీన్ సెంటర్‌గా మార్చేందుకు ముందుకువచ్చినందుకు షారుఖ్ ఖాన్, ఆయన భార్య గౌరీ ఖాన్‌లకు కృతజ్ఞతలు చెప్పింది.
ఇది సమయోచితంగా చేసిన సాయమని ప్రశంసించింది. షారుఖ్ తన రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్, ఐపీఎల్ జట్టు కోల్‌కతా నైట్‌రైడర్స్, మీర్ సంస్థల ద్వారా వివిధ సాయాలు ప్రకటించారు.
పీఎమ్ కేర్స్ ఫండ్‌తో పాటు మహారాష్ట్ర సీఎం రిలీఫ్ ఫండ్‌కు తోడ్పాటు అందిస్తామని తెలిపారు. పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, దిల్లీల్లో చేపట్టనున్న వివిధ సహాయ కార్యక్రమాల గురించి కూడా వివరాలు వెల్లడించారు.
షారుఖ్ ఖాన్ సాయానికి ముందుకు రావడాన్ని మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, దిల్లీ ముఖ్యమంత్రులు స్వాగతించారు. ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.
పాకిస్తాన్‌లో 2,800 దాటిన కరోనావైరస్ కేసులు, 'అల్లా పాకిస్తానీలకు కరోనావైరస్ సోకకుండా చూస్తారనే భ్రమల్లో ఉండొద్దు'
పాకిస్తాన్‌లో కరోనావైరస్ సోకిన వారి సంఖ్య 2,800 దాటింది. కరోనావైరస్ వల్ల పాకిస్తాన్ ప్రభావితం కాదనే భ్రమల్లో ప్రజలు ఉండకూడదని ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ అన్నారు.
శనివారం కరోనా రిలీఫ్ పండ్ ఏర్పాటు చేసిన ఇమ్రాన్ ఖాన్, "అల్లా పాకిస్తానీలను కరోనావైరస్‌కు ప్రభావితం కాకుండా సృష్టించాడనే వ్యాఖ్యలను నేను సోషల్ మీడియాలో చూస్తున్నాను. ప్రజలను అలాంటి దురభిప్రాయంలో ఉంచకూడదు. కరోనా ఎవరినీ విడిచి పెట్టదు" అని అన్నారు.
కరోనా విషయంలో ప్రజలను మోసగించవద్దని, అందరూ అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు.
"మీకు ఏమీ జరగదని అనుకుంటే, న్యూయార్క్ నగరాన్ని చూడండి. అక్కడ చాలా మంది ధనికులు ఉంటున్నారు. ఇప్పుడు వారి పరిస్థితి ఎలా ఉందో గమనించండి" అని ఇమ్రాన్ చెప్పారు.
వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడం, పాకిస్తాన్‌లోని పేద ప్రజలను ఆదుకోవడం తమ ముందున్న పెద్ద సవాలు అని చెప్పిన ఇమ్రాన్, ఎవరినీ ఆకలితో అలమటించకుండా చూసుకుంటామని అన్నారు.
కరోనావైరస్; ప్రపంచవ్యాప్తంగా 64,753 కోవిడ్ మృతులు, 12 లక్షలు దాటిన వైరస్ బాధితులు, న్యూయార్క్ నగరంలో వైరస్ మరణాలతో అతలాకుతలం అవుతోంది. ఒక్కరోజే ఇక్కడ 630 మంది చనిపోయారు.
ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. వైరస్ సోకిన వారి సంఖ్య 12 లక్షలు దాటింది. 64,753 మంది చనిపోయారు. అయితే, వైరస్ సోకినవారిలో ఇప్పటివరకు 2,46,457 మంది కోలుకున్నారు.
అమెరికాలో 3,11 లక్షల మందికి కరోనావైరస్ సోకింది. దాదాపు 8,500 మంది చనిపోాయారు. ఒక్క న్యూయార్క్ నగరంలోనే 3,500లకు పైగా మరణాలు సంభవించాయి.గత 24 గంటల్లోనే ఈ మహా నగరంలో మహమ్మారి బారిన పడి 630 మంది చనిపోయారు.
అమెరికాలోని మొత్తం కేసుల్లో మూడింట ఒక వంతు, అంటే 1,13,000 కేసులు న్యుయార్క్‌లో నమోదయ్యాయి.రాబోయే 4 - 14 రోజుల్లో వైరస్ సోకిన వారి సంఖ్య మరింత ఎక్కువగా పెరిగే అవకాశాలున్నాయని గవర్నర్ ఆండ్ర్యూ కువోమో అన్నారు.
న్యూయార్క్ నగరానికి అవసరమైన సహకారాన్ని అందిస్తామని గవర్నర్ కువోమోకు హామీ ఇచ్చినట్లు దేశాధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ తెలిపారు.
ఇటలీలో వైరస్ దెబ్బకు ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. 1,24,632 వైరస్ బాధితులున్న ఇటలీలో ఇప్పటివరకు 15,362 మరణాలు నమోదయ్యాయి.
ఇటలీ తరువాత అత్యధిక సంఖ్యలో మరణాలు స్పెయిన్‌లో సంభవిస్తున్నాయి. ఈ దేశంలో దాదాప 12,000 మంది చనిపోయారు.
భారతదేశంలో 3,113 మందికి వైరస్ సోకింది. ఇప్పటివరకు 75 మంది చనిపోయినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.