You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
టోక్యో ఒలింపిక్స్: హాకీ సెమీ ఫైనల్లో బెల్జియం చేతిలో 5-2 తేడాతో భారత పురుషుల జట్టు ఓటమి
టోక్యో ఒలింపిక్స్ హాకీ సెమీ ఫైనల్లో బెల్జియం భారత జట్టుపై 5-2 గోల్స్ తేడాతో విజయం సాధించింది.
ఈ ఓటమితో భారత జట్టు కాంస్యం కోసం మరోసారి తలపడాల్సి ఉంటుంది.
మ్యాచ్ మొదట్లోనే గోల్ చేసిన బెల్జియం భారత్‌పై పైచేయి సాధించినట్లు కనిపించింది. కానీ తర్వాత భారత్ తరఫున హర్మన్‌ప్రీత్ గోల్ చేసి రెండు టీమ్స్ గోల్స్ సమానం చేశాడు.
ఆ తర్వాత కాసేపటికి భారత్‌కు చెందిన మన్‌ప్రీత్ మరో గోల్ చేశాడు. కానీ బెల్జియం కూడా మరో గోల్ చేసి 2-2 సమం చేసింది.
తర్వాత సెకండాఫ్‌లో మరో రెండు గోల్స్ చేసిన బెల్జియం భారత్‌పై 4-2తో పైచేయి సాధించింది.
ఆట చివర్లో ఐదో గోల్ చేసిన బెల్జియం చివరకు భారత్‌పై విజయం సాధించింది.
భారత ఆటగాడు మన్‌ప్రీత్‌కు గ్రీన్ కార్డ్
హాఫ్ టైమ్ తర్వాత రెఫరీ మన్‌ప్రీత్‌కు గ్రీన్ కార్డ్ చూపించారు.
దాంతో, ఆయన రెండు నిమిషాల వరకూ గేమ్ నుంచి బయటికి వెళ్లాల్సి వచ్చింది.
ప్రధాని ట్వీట్
సెమీ ఫైనల్లో ఓటమిపాలైన భారత జట్టుకు ప్రధాని మోదీ ట్వీట్ ద్వారా ధైర్యం చెప్పారు.
"గెలుపు ఓటములు జీవితంలో భాగం. మన పురుషుల హాకీ జట్టు టోక్యో ఒలింపిక్స్‌లో తమ బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చింది. అదే ముఖ్యం. వారి తర్వాత మ్యాచ్, భవిష్యత్ మ్యాచ్‌లకు శుభాకాంక్షలు. భారత్ తన క్రీడాకారులను చూసి గర్విస్తోంది" అన్నారు.
అంతకు ముందు భారత-బెల్జియం హాకీ పురుషుల మ్యాచ్‌ను చూస్తున్నట్లు ప్రధాని ట్వీట్ చేశారు.
ఇక కాంస్య పతకం కోసం పోరాటం
బెల్జియం చేతుల్లో ఓటమితో ఇప్పుడు భారత్ టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతకం కోసం మరో మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది.
భారత్ ఇప్పుడు ఆస్ట్రేలియా-అర్జెంటీనా మధ్య జరిగే రెండో సెమీ ఫైనల్లో ఓడిపోయే జట్టుతో ఆడాల్సి ఉంటుంది.
ఐదేళ్ల క్రితం రియో ఒలింపిక్స్ క్వార్టర్ ఫైనల్లో బెల్జియం చేతుల్లో 1-3తో ఓడిన భారత్ పోటీల నుంచి వైదొలిగింది.
ఈ సెమీ ఫైనల్లో బెల్జియంను ఓడించి దానికి ప్రతీకారం తీర్చుకోవాలనుకున్న భారత్ ఆశలు ఫలించలేదు.
ఈ మ్యాచ్‌కు ముందు అందరూ భారత్‌ను ఫేవరెట్‌గా భావించారు. బెల్జియంపై గత ఐదు మ్యాచ్‌ల్లో భారత్ నాలుగు సార్లు గెలిచింది.
2020లో ఎఫ్ఐహెచ్ ప్రో లీగ్‌లో భారత్ ఒక మ్యాచ్‌లో బెల్జియంను ఓడించి, మరో మ్యాచ్‌లో ఓడిపోయింది.
అంతకు ముందు 2019లో బెల్జియంలో పర్యటించిన భారత జట్టు వరసగా మూడు మ్యాచ్‌లు గెలిచింది.
టోక్యో ఒలింపిక్స్ ప్రయాణం
టోక్యో ఒలింపిక్స్‌లో న్యూజీలాండ్‌పై 3-2 తేడాతో గెలిచిన భారత పురుషుల హాకీ జట్టు తమ ప్రస్థానం ప్రారంభించింది.
కానీ తర్వాత మ్యాచ్‌లోనే 7-1 తేడాతో ఆస్ట్రేలియా చేతిలో ఘోర ఓటమి భారత జట్టు సామర్థ్యంపై ప్రశ్నలను లేవనెత్తింది.
తర్వాత స్పెయిన్‌ను 3-0తో ఓడించిన భారత్, గత ఒలింపిక్స్ విజేత అర్జెంటీనాను 3-1తో, జపాన్‌ను 5-3తో ఓడించి క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది.
గత నాలుగు దశాబ్దాల్లో గ్రూప్ మ్యాచ్‌ల్లో భారత్ ఇంత మెరుగైన ప్రదర్శన ఇవ్వడం ఇదే మొదటి సారి.
తర్వాత జరిగిన క్వార్టర్ ఫైనల్లో భారత్ 3-1తో బ్రిటన్‌ను ఓడించి సెమీ ఫైనల్లో స్థానం సంపాదించింది.
మాస్కో కంటే మెరుగైన ప్రదర్శనా?
టోక్యో ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టు ప్రదర్శనను 1980లో మాస్కో ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలిచినప్పటి ప్రదర్శన కంటే మెరుగ్గా ఉందని భావించారు.
నిజానికి మాస్కో ఒలింపిక్ క్రీడలను పశ్చిమ దేశాలు బాయకాట్ చేశాయి. దాంతో ఎన్నో దిగ్గజ టీమ్‌లు ఆడలేకపోయాయి. కానీ, ఈ ఒలింపిక్స్‌లో భారత్ టాప్ టీములను కూడా ఓడించి సెమీ ఫైనల్ వరకూ వచ్చింది.
ఈసారీ పతకం అందుకోడానికి పోడియంపై నిలబడితే భారత హాకీకి మళ్లీ మంచి రోజులు వచ్చినట్లేనని భావిస్తున్నారు.
1928 నుంచి 1964 వరకూ మధ్య కాలాన్ని భారత హాకీకి స్వర్ణయుగంగా భావిస్తారు. ఆ సమయంలో భారత్ ఏడు స్వర్ణ పతకాలు సాధించింది. వీటిలో ఆరు వరుసగా గెలిచింది.
నిజానికి, మాస్కో ఒలింపిక్స్ తర్వాత భారత హాకీ పతనం మొదలైంది. దీనికి అతిపెద్ద కారణం హాకీ ఆడ్డానికి గడ్డి మైదానాలకు బదులు కృత్రిమ టర్ఫ్ ఉపయోగించడమేనని నిపుణులు భావిస్తారు.
భారత హాకీ జట్టు 2008లో బీజింగ్ ఒలింపిక్స్‌కు కనీసం క్వాలిఫై కూడా కాలేదు. 2012 లండన్ ఒలింపిక్స్‌లో చివరి స్థానంలో నిలిచింది. రియో ఒలింపిక్స్‌లో కాస్త మెరుగుపడిన భారత హాకీ జట్టు 8వ స్థానంలో నిలిచింది.
వీదేశీ కోచ్‌లతో శిక్షణ
భారత్ 2008 బీజింగ్ ఒలింపిక్స్‌కు క్వాలిఫై కూడా కాకపోవడంతో జట్టుకు శిక్షణ ఇవ్వడానికి విదేశీ కోచ్‌ల రాక మొదలైంది.
జోస్ బ్రాసా, మైకేల్ నోబ్స్, టెరీ వాల్ష్, పాల్ వాన్ ఎస్, రోలెంట్ ఓల్ట్‌మెస్ లాంటి ఎంతోమంది కోచ్‌లు భారత్ వచ్చారు. వీరిలో ఎవరికీ భారత హాకీ డైరెక్టర్లతో పొసగలేదు. దాంతో కొంతమంది పదవీకాలం పూర్తి కాకుండానే వెళ్లిపోయారు.
విదేశీ కోచ్‌లు ముఖ్యంగా భారత జట్టు ఫిట్‌నెస్ మీద దృష్టిపెట్టారు. కానీ, చివరకు గ్రాహమ్ రీడ్ జట్టును టోక్యో ఒలింపిక్స్‌లో సెమీ ఫైనల్ వరకూ తీసుకురాగలిగారు.
ఆయన ముఖ్యంగా భారత ఆటగాళ్లు ఏ స్టైల్‌తో ఆడుతారో దానిని మరింత మెరుగు పెట్టడం, జట్టును ఏకతాటిపై నడిపించడం చేశారు.
ఇవి కూడా చదవండి:
- లిబ్రా కరెన్సీ: ఫేస్‌బుక్, వాట్సాప్‌లో డబ్బు దాచుకోవచ్చు, చెల్లింపులు చేయొచ్చు
- రూపాయి చరిత్ర : కరెన్సీ నోట్ల మీదకు గాంధీ బొమ్మ ఎప్పుడు వచ్చింది...
- ఒకప్పటి భారతదేశానికి నేటి ఇండియాకు తేడా ఇదే
- బిట్‌కాయిన్: క్రిప్టో కరెన్సీల భవితవ్యాన్ని భారత్ ఎప్పుడు నిర్ణయిస్తుంది
- ప్రపంచంలో అత్యధికంగా బంగారాన్ని ఉత్పత్తి చేసే కంపెనీ ఇదే
- లబ్‌డబ్బు: గృహరుణం తీసుకోవాలనుకుంటున్నారా? అయితే తప్పక తెలుసుకోవాల్సిన విషయాలివి
- పాకిస్తాన్‌కు ఉన్నట్లుండి విదేశాల నుంచి వచ్చే ఆదాయం ఎలా పెరిగింది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)