You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కోవిడ్ వ్యాక్సీన్: రెండు వందల కోట్ల డోసులు ఎవరికి ఇచ్చారు.. టీకా తయారీలో ఎదురవుతున్న ఇబ్బందులేంటి
- రచయిత, పాబ్లో ఉచోవా
- హోదా, బీబీసీ వరల్డ్ సర్వీస్
- ప్రచురణ
రెండు వందల కోట్ల డోసుల వ్యాక్సీన్‌ను సిద్దం చేయడమంటే మామూలు విషయమేమీ కాదు. ఈ వైరస్‌ను మహమ్మారిగా ప్రకటించినప్పటి నుంచి రికార్డు సమయంలో రెండు వందల కోట్ల డోసులను సిద్ధం చేయగలిగాయి ఫార్మా సంస్థలు.
ఇప్పటి దాకా అనుకున్న ప్రణాళికలన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఈ ఏడాది చివరి నాటికి ప్రపంచవ్యాప్తంగా సుమారు 580 కోట్ల మందికి టీకాలు ఇవ్వడం పూర్తి కావచ్చు.
ఇక బాధపడాల్సిన, భయపడాల్సిన అంశాలు ఏమిటంటే టీకా సరఫరాలో తరచూ ఎదురవుతున్న సమస్యలు. అంటే భౌగోళికంగా టీకాల తయారీ ఒకే చోట ఎక్కువగా జరుగుతుండటం, కొన్ని దేశాలు టీకాను అధికంగా సేకరించడం లాంటివి.
ఇలాంటి అడ్డంకుల కారణంగా అందరికీ సమానంగా టీకా అందించాలన్న భావనకు అవరోధాలు ఏర్పడుతున్నాయి.
ఆరంభంలో ఒడుదొడుకులు ఎదురైనా ఈ ఏడాది చివరి త్రైమాసికానికి పూర్తి స్థాయిలో టీకా ఉత్పత్తి జరుగుతుందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఈ ఏడాది చివరినాటికి 1200 కోట్ల డోసులను తయారు చేసే సత్తా ఉత్పత్తి సంస్థలకు ఉందని డ్యూక్స్ గ్లోబల్ హెల్త్ ఇన్నోవేషన్ సెంటర్ (జీహెచ్ఐసీ) పేర్కొంది.
మరోవైపు 1100 కోట్ల డోసులు మాత్రమే సిద్దమయ్యే అవకాశం ఉందని వ్యాక్సీన్ ఉత్పత్తిని మానిటర్ చేసే ఎయిర్ ఫినిటీ అనే సంస్థ అంచనా వేస్తోంది.
ఈ లెక్కన ఈ ఏడాది చివరినాటికి 75 శాతం మంది ప్రజలకు టీకా వేయాలన్న లక్ష్యానికి అవసరమైన 1082 కోట్ల డోసులు అందుబాటులోకి వచ్చినట్లేనని ఎయిర్‌ఫినిటి సంస్థ అన్నది.
కానీ ప్రపంచ వ్యాప్తంగా మనకు సవ్యమైన సరఫరా వ్యవస్థలు లేవని జీహెచ్ఐసీ అసిస్టెంట్ డైరక్టర్ (ప్రోగ్రామ్స్) ఆండ్రియా టేలర్ అన్నారు.
''లొకేషన్ అన్నది పెద్ద సమస్యగా మారింది. పెద్ద పెద్ద మాన్యుఫ్యాక్ఛరింగ్ కంపెనీలన్నీ అమెరికా, యూరప్ పరిసర ప్రాంతాలలో ఉన్నాయి. అందుకే అవి ముందుగా పూర్తి స్థాయిలో టీకాలను పొందగలిగాయి. వాటిని ముందుగా వాడుకునే అన్ని అవకాశాలు ఆ దేశాలకు ఉన్నాయి'' అని ఆండ్రియా అన్నారు.
సప్లై చైన్ సమస్యలు
ఇక రవాణ సదుపాయాల సమస్య కూడా తీవ్రంగానే ఉంది. ముఖ్యంగా ముడి పదార్థాలను ఒకచోటకు చేర్చడం పెద్ద సవాల్. వివిధ దేశాల మధ్య టెక్నాలజీ షేరింగ్‌లో ఆలస్యం కూడా వ్యాక్సీన్ తయారీపై ప్రభావం చూపుతోంది. దీంతో కొత్తగా వ్యాక్సీన్ తయారు చేసేందుకు ఏర్పాటు చేసిన సంస్థలు పని లేక ఖాళీగా ఉంటున్నాయి.
ప్రపంచ వ్యాప్తంగా ఈ ఏడాది మూడు ప్రధాన కంపెనీల వ్యాక్సీన్‌లు ఎక్కువమందికి అందుబాటులో ఉంటాయని ఎయిర్‌ఫినిటి అంచనా వేసింది. అందులో మొదటిది ఫైజర్/బయోఎన్‌టెక్. ఇది 247 కోట్ల డోసులు ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఆక్స్‌ఫర్డ్/ఆస్ట్రాజెనెకా 196 కోట్లు, సినోవాక్ 135కోట్ల డోసులను టార్గెట్‌గా పెట్టుకన్నాయి. ఇప్పటి వరకు ఫైజర్, సినోవాక్‌లు తమ ప్రాథమిక లక్ష్యాలను చేరుకోగల స్థితిలో ఉన్నాయి.
కానీ 300 కోట్ల డోసులను లక్ష్యంగా పెట్టుకున్న ఆస్ట్రాజెనెకా వివిధ ప్రాంతాలలో తన ఉత్పాదక భాగస్వాములు ఉత్పత్తి సామర్థ్యాన్నే నమ్ముకుంది. టెక్నాలజీ షేరింగ్ ఉత్పాదక మీద ప్రభావం చూపుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఆస్ట్రాజెనెకాకు భిన్నగా ఫైజర్, సినోవాక్ అక్కడికక్కడే తమ వ్యాక్సీన్‌ను ఉత్పత్తి చేస్తున్నాయి.
స్వదేశంలోనే వ్యాక్సీన్లు..
ఎగుమతులపై ఆంక్షలు కూడా ప్రపంచ దేశాలకు వ్యాక్సీన్ల పంపిణీలో అసమానతకు కారణమవుతున్నాయి. ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలపై ఈ ప్రభావం ఎక్కువగా పడుతోందని ఎయిర్‌ఫినిటీ సీనియర్ అనలిస్ట్ మ్యాట్ లిన్లీ అన్నారు.
''ఫైజర్ ఎక్కువ వ్యాక్సీన్లు ఉత్పత్తి చేయనున్నట్లు అంచనాలు ఉన్నాయి. అయితే, ఈ వ్యాక్సీన్లు అన్నీ వీటిని ఉత్పత్తి చేస్తున్న ధనిక దేశాల్లోనే ఉంటాయి. మరోవైపు ఆస్ట్రాజెనెకా భారీ స్థాయిలో ఐరోపా, భారత్‌లలో వ్యాక్సీన్లు ఉత్పత్తి చేస్తోంది. ఇవి ఉత్పత్తి చేసిన చోటుకే పరిమితం అవుతున్నాయి'' అన్నారు లిన్లీ.
వ్యాక్సీన్లను భారీగా ఎగుమతి చేస్తున్న మొదటి దేశం చైనాయేనని ఎయిర్‌ఫినిటీ తెలిపింది. మొత్తంగా 26.3 కోట్ల డోసులను చైనా ఎగుమతి చేసినట్లు వెల్లడించింది. ఐక్యరాజ్యసమితి కోవాక్స్ కార్యక్రమం పంపిణీ చేసిన టీకాల కంటే చైనా ఎగుమతి చేసినవే ఎక్కువ.
''వ్యాక్సీన్ల పంపిణీపై చైనా ప్రభావం చాలా ఎక్కువగా ఉంటోంది. చాలా వ్యాక్సీన్లకు రష్యా హామీ ఇచ్చింది. కానీ, అవి నెరవేరడం లేదు''. అన్నారు మ్యాట్ లిన్లీ.
ఎయిర్‌ఫినిటీ సమాచారం ప్రకారం మే 17 వరకు రష్యా 4.2 కోట్ల డోసుల స్పుత్నిక్ వీ వ్యాక్సీను ఉత్పత్తి చేసింది. అయితే 1.3 కోట్ల డోసులను మాత్రమే ఎగుమతి చేసింది.
సాంకేతికత బదిలీ ఒప్పందాల విషయంలో స్పుత్నిక్ వీ అవరోధాలను ఎదుర్కొంటోంది. ఈ వ్యాక్సీన్ ఉత్పత్తికి ప్రపంచ వ్యాప్తంగా 18 తయారీ సంస్థలను రష్యా సంప్రదించింది. అయితే, ఇప్పుడు రష్యా వెలుపల ఒకచోట (కజఖ్‌స్తాన్‌లో) మాత్రమే ఈ వ్యాక్సీన్ ఉత్పత్తి అవుతోంది.
ఆగస్టు నుంచి స్పుత్నిక్ వీ ని ఉత్పత్తి చేస్తామని భారత అధికారులు తెలిపారు. 85 కోట్ల డోసులను ఉత్పత్తి చేయనున్నట్లు వారు వివరించారు.
పక్కా ప్రణాళికేమీ లేదు
భారత్‌కు చెందిన సీరం ఇన్‌స్టిట్యూట్ తయారుచేస్తున్న ఆస్ట్రాజెనెకా వ్యాక్సీన్ పైనే చాలా అభివృద్ధి చెందుతున్న దేశాలు ఆశలు పెట్టుకున్నాయి. కరోనా మహమ్మారి వ్యాప్తికి ముందు, ప్రపంచ టీకాల్లో 60 శాతాన్ని సీరం ఇన్‌స్టిట్యూట్ తయారుచేసేది.
అయితే, దేశంలో విజృంభిస్తున్న రెండో వేవ్‌ను కట్టడి చేసేందుకు సంస్థ ఎగుమతులపై భారత్ ఆంక్షలు విధించింది. దీంతో అల్ప, మధ్యాదాయ దేశాలకు వెళ్లాల్సిన వ్యాక్సీన్లపై ప్రభావం పడింది.
''వ్యాక్సీన్ల విషయంలో భారత్‌పై అతిగా ఆధారపడటంతో వ్యాక్సీన్ల పంపిణీ ప్రమాదంలో పడింది. ఈ వ్యూహం విఫలం కావడం దురదృష్టకరం. ఇక్కడ వేరే ప్రణాళికేదీ లేదు. సీరం ఇన్‌స్టిట్యూట్ లాంటి సంస్థ ప్రపంచంలో మరొకటి లేదు.'' అని ఆండ్రియా టేలర్ అన్నారు..
ఈ ఆంక్షలు ప్రపంచ ఆరోగ్య సంస్థ కోవాక్స్ కార్యక్రమాన్ని కూడా ప్రభావితం చేస్తున్నాయి. ముఖ్యంగా పేద దేశాలకు వ్యాక్సీన్లను అందించడమే లక్ష్యంగా కోవాక్స్‌ను తెర పైకి తీసుకొచ్చారు.2021 చివరినాటికి 200 కోట్ల డోసులను ప్రపంచ దేశాలకు అందించాలని కోవాక్స్‌కు లక్ష్యంగా నిర్దేశించారు. ప్రతి దేశంలోనూ కనీసం 20 శాతం జనాభాకు వ్యాక్సీన్లు వేయాలని, ఆరోగ్య సిబ్బందికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలని లక్ష్యంగా పెట్టారు.
అయితే, ఇప్పటి వరకు 125 దేశాలకు కేవలం 7.2 కోట్ల డోసులను మాత్రమే కోవాక్స్ కింద సరఫరా చేయగలిగారని యూనిసెఫ్ తెలిపింది.
వ్యాక్సీన్ దౌత్యం...
వ్యాక్సీన్ల కోసం దౌత్యవేత్తల సంప్రదింపులు, సంఘీభావ ప్రకటనలు జరుగుతున్నప్పటికీ... విదేశాలకు వ్యాక్సీన్లు పంపించేందుకు చాలా దేశాలు ముందుకు రావడం లేదు.
ప్రస్తుతంలానే పంపిణీ కొనసాగితే, 2021 చివరినాటికి 260 కోట్ల డోసులు కొన్ని దేశాల వద్దే పోగు పడి ఉండిపోతాయని, ఇది కోవాక్స్‌కు నిర్దేశించిన లక్ష్యం కంటే చాలా ఎక్కువని ఎయిర్‌ఫినిటీ అంచనావేసింది.
90 శాతం మిగులు టీకాలు యూరోపియన్ యూనియన్, అమెరికా, జపాన్, బ్రిటన్, బ్రెజిల్, కెనడాల వద్దే ఉండిపోతాయని సంస్థ అంచనా వేసింది. ఈ వ్యాక్సీన్లను షేర్ చేయడం ద్వారా కోవాక్స్‌కు సాయం చేసినట్లు అవుతుందని, పేద దేశాలకూ వ్యాక్సీన్లు చేరుతాయని లిన్లీ వ్యాఖ్యానించారు.
''అయితే, ఇప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం చాలా కష్టం. ఎందుకంటే కొన్ని ధనిక దేశాలు ఇప్పటికే బూస్టర్ డోసులను ఇవ్వడం మొదలు పెట్టాయి. తమ టీకాల కార్యక్రమంలో టీనేజీ పిల్లలనూ చేర్చేశాయి.'' అని యునిసెఫ్‌లోని సప్లై డివిజన్ సీనియర్ మేనేజర్ అన్నా ఒట్టోసెన్ అన్నారు.
వ్యాక్సీన్ల పంపిణీ లక్ష్యాల్లో చాలా ముందున్న కొన్ని దేశాలు.. తమ దేశంలోని మిగిలిన ప్రజలకు వ్యాక్సీన్ల కోసం ఒప్పందాలు కుదుర్చు కుంటున్నాయని ఒట్టోసెన్ వెల్లడించారు.
''మే 21నాటికి మొత్తం ఆర్డర్లలో 54 శాతం ధనిక దేశాలు పెట్టినవే. వీరి జనాభా మొత్తం జనాభాలో 19 శాతం కంటే తక్కువే''అని డ్యూక్ జీహెచ్ఐసీ తెలిపింది.''సరఫరాల్లో అంతరాలను పూరించేందుకు పేద దేశాలతో ధనిక దేశాలు తమ వ్యాక్సీన్లను పంచుకోవాలి''అని ఒట్టోసెన్ అన్నారు.
ఇస్తామని అంటున్నారు...
6 కోట్ల ఆస్ట్రాజెనెకా డోసులను పేద దేశాలకు అందిస్తామని అమెరికా ప్రకటించింది. అయితే, ఈ వ్యాక్సీన్‌కు ఇంకా ఆమోదం తెలపలేదు. వీటికి అదనంగా అమెరికా ఆమోదించిన మరో వ్యాక్సీన్ రెండు కోట్ల డోసులను తాము ఇస్తామని అధ్యక్షుడు జో బైడెన్ హామీ ఇచ్చారు.
జూన్ చివరినాటికి 5 లక్షల డోసులను కోవాక్స్ కింద తాము అందిస్తామని ఫ్రాన్స్ ప్రకటించింది. ''ప్రస్తుతం ముందెన్నడూ లేనంత స్థాయిలో వ్యాక్సీన్ల ఉత్పత్తి జరుగుతోంది. అయితే, వీటిని అందరికీ అందేలా సరఫరా చేయడమే అతిపెద్ద సవాల్''అని ఒట్టోసెన్ అన్నారు.
వ్యాక్సీన్ల తయారీని అన్ని ప్రాంతాలకు ఎలా విస్తరించాలనే అంశంపై ప్రపంచ ఆరోగ్యరంగానికి చెందిన నాయకులు చర్చలు జరుపుతున్నారు. ముఖ్యంగా అల్ప, మధ్యాదాయ దేశాలకు వ్యాక్సీన్లు ఎలా అందించాలనే అంశంపైనే వారు ప్రధానంగా దృష్టి సారిస్తున్నారు.
అయితే, ఈ సమస్యకు తక్షణ పరిష్కార మార్గాలేమీ కనిపించకపోవచ్చు. ''కరోనా మహమ్మారికి కళ్లెం వేయాలంటే, మన దగ్గర పరిమిత స్థాయిలో ఉన్న వ్యాక్సీన్లను మనం మెరుగ్గా పంపిణీ చేయాలి''అని ఒట్టోసెన్ అన్నారు.
ఇవి కూడా చదవండి:
- అంగారకుడి మీద ఒకప్పుడు ప్రవహించిన నీరంతా ఆ గ్రహం పైపొరలోనే బందీగా ఉందా?
- చైనా: సరికొత్త శాశ్వత అంతరిక్ష కేంద్రం ఏర్పాటు దిశగా భారీ రాకెట్ ప్రయోగం
- అంగారక గ్రహం మీద విజయవంతంగా ఎగిరిన నాసా హెలికాప్టర్
- మార్స్ మీద మొదటిసారిగా శ్వాసించదగిన ఆక్సిజన్ తయారు చేసిన నాసా రోవర్
- మేడ మీదే విమానం తయారీ
- చైనా రాకెట్ భూమ్మీదకు దూసుకొచ్చింది... ముక్కలు ముక్కలై హిందూ మహాసముద్రంలో పడిపోయింది
- స్కైల్యాబ్: ‘అంతరిక్షంలో వ్యోమగాముల తిరుగుబాటు’ వెనకున్న అసలు కథ ఇది..
- చైనా సైన్యం 'కెప్టెన్ అమెరికా', 'ఐరన్ మ్యాన్' లాంటి సూపర్ హీరోలను సృష్టిస్తోందా
- సైన్యంలో చేరాలని రెండు సార్లు ఫెయిలైన వ్యక్తి ఇప్పుడు దేశాన్నే గుప్పిట్లో పెట్టుకున్నాడు
- రఫేల్ విమానాల విషయంలో ఎవరి మాటల్లో నిజముంది?
- ‘నేవీ నుంచి బయటపడటానికి విమానాన్ని దొంగిలించా’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)