అమెరికా సైన్యం అఫ్గానిస్తాన్ నుంచి వైదొలగడంపై భారత్ ఎందుకు ఆందోళన చెందుతోంది

ఫొటో సోర్స్, ODED BALILTY/AFP VIA GETTY IMAGES
- రచయిత, అమృతా శర్మ
- హోదా, బీబీసీ మానిటరింగ్
- ప్రచురణ
దశాబ్దాల యుద్ధం తరువాత అమెరికా దళాలు అఫ్గానిస్తాన్ నుంచి వైదొలగడానికి సిద్ధమవుతున్నాయి. ఈ ప్రక్రియను భారతదేశం జాగ్రత్తగా గమనిస్తోంది.
2020లో దోహాలో అమెరికా, తాలిబన్ల మధ్య సంధి కుదిరిన తరువాత అమెరికా దళాలు అఫ్గానిస్తాన్ విడిచిపెట్టాలనే నిర్ణయానికొచ్చాయి.
ఈ ఏడాది సెప్టెంబర్ 11లోగా అమెరికా సైనిక దళాలు అఫ్గానిస్తాన్ నుంచి వెనుదిరుగుతాయని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఏప్రిల్‌లో అధికారికంగా ప్రకటించారు.
ఈ నేపథ్యంలో అఫ్గానిస్తాన్ శాంతి ప్రక్రియపై తాము ఓ కన్నేసి ఉంచామని భారత్ తెలిపింది.
2021 సెప్టెంబర్ 11 నాటికి అమెరికాపై ఉగ్రవాద దాడి జరిగి ఇరవై ఏళ్లు పూర్తి కానుంది.
2001లో 9/11 దాడి తరువాతే అఫ్గానిస్తాన్‌లోని తాలిబాన్ స్థావరాలపై అమెరికా దాడికి దిగింది.

ఫొటో సోర్స్, GETTY IMAGES
భారతదేశం ఎందుకు ఆందోళన చెందుతోంది?
అఫ్గానిస్తాన్ నుంచి అమెరికా దళాలు వెళ్లిపోతే తాలిబన్ల ప్రాబల్యం పెరిగి, అస్థిరతకు దారి తీసే ప్రమాదం ఉందని భారత్ ఆందోళన చెందుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు.
ఈ విషయంలో పాకిస్తాన్, చైనాల పాత్ర పట్ల కూడా భారత్ ఆందోళన చెందుతున్నట్లు వారు భావిస్తున్నారు.
అఫ్గానిస్తాన్‌లో ప్రజాస్వామ్యం నెలకొల్పే దిశగా భారతదేశం సాయం అందిస్తూనే వస్తోంది.
దోహా, జెనీవా, దుషన్‌బే సమావేశాలతో పాటు అఫ్గాన్ శాంతి ప్రక్రియకు సంబంధించిన పలు సదస్సుల్లో భారతదేశం పాల్గొంది.
ప్రస్తుతం అమెరికా సైన్యం అఫ్గానిస్తాన్ నుంచి వైదొలగితే, అక్కడ మళ్లీ అస్థిరత ఏర్పడే అవకాశాలున్నాయని భారతదేశం ఆందోళన చెందుతోంది.
కాబూల్‌లో పెరుగుతున్న పాకిస్తాన్ జోక్యం కారణంగా అక్కడ అస్థిరత నెలకొనే ప్రమాదం పొంచి ఉందని విశ్లేషకుడు అవినాష్ పాలివాల్ అంటున్నారు.
తాలిబన్ల ప్రాబల్యం పెరిగి, అఫ్గానిస్తాన్ మళ్లీ తీవ్రవాదుల స్థావరంగా మారే ప్రమాదం ఉందని భారతదేశం కలవరపడుతోంది.
ట్రంప్ హయాంలో జాతీయ భద్రతా మండలి సభ్యురాలు లిసా కర్టిస్ కూడా గతంలో ఇదే విషయం చెప్పారు.
"అఫ్గానిస్తాన్ నుంచి అమెరికా దళాలను ఉపసంహరించుకోవడం వలన అక్కడ తాలిబన్ల ప్రాబల్యం మళ్లీ పెరుగుతుందేమోనని ప్రాంతీయ దేశాలు ముఖ్యంగా భారతదేశం ఆందోళన చెందే అవకాశం ఉంది" అని ఆమె అన్నారు.
ఈ ఆందోళనలు సహేతుకమే. ఎందుకంటే 1990లలో లష్కర్-ఎ-తోయిబా, జైషే మొహమ్మద్ వంటి సంస్థల నుంచి తీవ్రవాదులను నియమించుకుని తాలిబన్లు భారత వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించారు.
1991లో భారత విమానం హైజాక్, 2001లో భారత పార్లమెంటుపై దాడి వాటిలో కొన్ని.
అఫ్గానిస్తాన్ నుంచి సైన్యాన్ని అమెరికా ఉపసంహరించుకోగానే పెద్ద సంఖ్యలో ఉగ్రవాద సంస్థలు ఆ దేశం వైపు మొగ్గు చూపుతాయని ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి సమాచారం అందడం కూడా భారతదేశ ఆందోళనలకు ఒక కారణం.
అఫ్గానిస్తాన్‌లో హింస చెలరేగితే తాలిబన్లు బలపడకుండా ఆపడం కష్టం.
ఇలాంటి పరిస్థితుల్లో ఆ దేశంలో అంతర్యుద్ధం తలెత్తే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకుడు ఎలిజబెత్ రోష్ అభిప్రాయపడ్డారు.
2019లో భారత సైన్యం అప్పటి చీఫ్ బిపిన్ రావత్, అఫ్గానిస్తాన్‌లో తాలిబన్లతో చర్చలకు మద్దతు ఇచ్చారు.
ఆ సమయంలో తాలిబన్లతో ఎలాంటి సంబంధాలు కలిగి ఉండకూడదనే విధానాన్ని భారత్ అనుసరిస్తోంది.
భారతదేశం తాలిబాన్లతో ప్రత్యక్ష చర్చలకు దూరంగా ఉంటూ వచ్చింది. కానీ, మాస్కోలో జరిగిన అఫ్గానిస్తాన్ శాంతి సదస్సులో పాల్గొనేందుకు భారతదేశం ఒక అనధికారిక బృందాన్ని పంపింది.
గత ఏడాది దోహాలో జరిగిన సదస్సులో భారత విదేశాంగ మంత్రి ఎస్. జయశంకర్ పాల్గొన్నారు.
దీన్ని బట్టి చూస్తే, ఈ సమస్య పట్ల ఇండియా గతంలో కంటే కొంత సౌమ్యంగా వ్యవహరిస్తోందని తెలుస్తోంది.

ఫొటో సోర్స్, GETTY IMAGES
పాకిస్తాన్, చైనాల మీద దృష్టి
అమెరికా సైన్యాన్ని ఉపసంహరించుకుంటే అఫ్గానిస్తాన్‌లో పాకిస్తాన్ రాజకీయ జోక్యం పెరుగుతుందనేది భారతదేశానికి ఉన్న ముఖ్యమైన ఆందోళనలలో ఒకటి.
దోహాలో అమెరికా, తాలిబాన్ల మధ్య చర్చలలో పాకిస్తాన్ ముఖ్య పాత్ర పోషించింది.
పాకిస్తాన్‌కు తాలిబాన్‌లతో సంబంధం ఉంది. కానీ తీవ్రవాదులకు మద్దతు ఇస్తున్నారనే ఆరోపణలను ఆ దేశం ఖండిస్తోంది.
అఫ్గానిస్తాన్‌లో పాకిస్తాన్ ప్రభావాన్ని తక్కువగా అంచనా వేయలేమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
"భవిష్యత్తులో అఫ్గానిస్తాన్ రాజకీయాల్లో పాకిస్తాన్ ముఖ్య పాత్ర పోషిస్తుంది. దానికి కారణం ఈ రెండు దేశాల మధ్య ఉన్న సాన్నిహిత్యం, జాతి, మత సామీప్యత. అంతేకాకుండా ఈ శక్తులను భారతదేశానికి వ్యతిరేకంగా ఉపయోగించవచ్చని కూడా పాకిస్తాన్‌కు తెలుసు" అని విశ్లేషకులు దేబీదత్త అరబిందో మహాపాత్ర అన్నారు.
ప్రస్తుతం పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. జూన్‌లో ఐఎంఎఫ్, ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ కలిసి ఆ దేశ ఆర్థిక పరిస్థితిని సమీక్షించనున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ ఎలాంటి దురాలోచనకు పాల్పడే అవకాశం లేదు.
"పాకిస్తాన్ ప్రభుత్వం తెలివిగా వ్యవహరిస్తుందని, ఎలాంటి హానికారక చర్యలకు పాల్పడదని ఒక చిన్న ఆశ" అని విశ్లేషకులు కేఎన్ పండితా అన్నారు.
మరోవైపు, చైనా జోక్యాన్ని భారత్ విస్మరించలేదు.
ఈ పరిస్థితుల్లో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ కలల ప్రాజెక్ట్ 'బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్' అఫ్గానిస్తాన్ వరకు వెళ్లే అవకాశం ఉందని విశ్లేషకులు స్నేష్ అలెక్స్ ఫిలిప్ అభిప్రాయపడ్డారు.
అఫ్గానిస్తాన్ వనరులను తమ సొంత ప్రయోజనాల కోసం వాడుకోవాలని చూసే దేశాల నుంచి ఆ దేశానికి ప్రమాదం పొంచి ఉందని జనరల్ బిపిన్ రావత్ గతంలో అన్నారు.
అఫ్గానిస్తాన్‌లో ఒక ట్రిలియన్ డాలర్ల సహజ వనరులు ఉన్నాయని అంచనా వేస్తున్నారు.
చైనా, పాకిస్తాన్‌ల మధ్య స్నేహం కూడా భారత ఆందోళనకు కారణమవుతోంది.

ఫొటో సోర్స్, GETTY IMAGES
వ్యూహాత్మక విధానం అవసరం
భారతదేశం, అఫ్గానిస్తాన్ మధ్య బలమైన భాగస్వామ్యం ఉంది.
అఫ్గానిస్తాన్‌లో ఆస్పత్రులు, విద్యా సంస్థలు, పార్లమెంటు భవన నిర్మాణంతో పాటు పలు అభివృద్ధి ప్రాజెక్టులలో భారత్ రెండు బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టింది.
అఫ్గానిస్తాన్ ప్రజల్లో కూడా భారత్ పట్ల మంచి అభిప్రాయం ఉంది.
ఆ దేశ అభివృద్ధికి భారత్ దోహదపడిందని మహాపాత్రా అన్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో భారతదేశం వ్యూహాత్మకంగా వ్యవహరించడం చాలా ముఖ్యం.
ఇందుకోసం తాలిబన్లతో సహా ఇతర ప్రధాన భాగస్వాములతో సంబంధాలను మెరుగుపరచుకోవాలి.
ఈ పరిస్థితుల్లో తాలిబన్ నాయకులతో చర్చలు జరపాల్సిన ఆవశ్యకత ఇండియాకు ఉందని మహాపాత్రా అభిప్రాయపడ్డారు.
భారత్.. తాలిబన్లతో చర్చలు జరపడం వల్ల తమ ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది లేదని కిందటి ఏడాది భారత పర్యటనకు వచ్చిన అఫ్గాన్ ప్రభుత్వ ప్రతినిధి అబ్దుల్లా అబ్దుల్లా అన్నారు.
"అఫ్గానిస్తాన్‌తో లాభపడాలంటే భారతదేశం ఆర్థిక, సైనిక ఆధిపత్యంతో పాటూ వ్యూహాత్మక దౌత్య సంబంధాలు నెరపాలి" అని మహాపాత్రా అన్నారు.
ఇవి కూడా చదవండి:
- అఫ్ఘానిస్తాన్: తాలిబాన్లతో చర్చలు జరిపిన మహిళ ఫాజియా కూఫీ కథ ఇదీ...
- ఇజ్రాయెల్, పాలస్తీనాల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం
- అఫ్గానిస్తాన్: ఆ ఊరిలో ఏ ఇంట్లో చూసినా మిసైళ్లే
- ప్రిన్సెస్ లతీఫా: బందీగా మారిన దుబయి రాకుమార్తె బతికే ఉన్నారా.. ఇప్పుడు ఎక్కడున్నారు.. ఆ ఇన్‌స్టాగ్రామ్ ఫొటోలు ఏం చెబుతున్నాయి
- అఫ్గానిస్తాన్ కరవు: యుద్ధం కంటే దుర్భిక్షంతోనే ఎక్కువ వలసలు
- మియన్మార్: సైన్యానికి ఎదురు నిలిచిన ఓ చిన్న పట్టణంలోని ప్రజలు ఎలా పోరాడుతున్నారు
- ఇజ్రాయెల్ ఎలా ఏర్పడింది, పాలస్తీనా రెండు భూభాగాలుగా ఎందుకుంది... వందేళ్ల ఈ సంక్షోభానికి ముగింపు లేదా?
- ప్రిన్సెస్ డయానా - మార్టిన్ బషీర్ ఇంటర్వ్యూ విషయంలో బీబీసీ తన తప్పులను కప్పిపుచ్చుకుందన్న లార్డ్ డైసన్ నివేదిక
- సింగపూర్ వేరియెంట్: పిల్లలకు ముప్పు అంటున్న కేజ్రీవాల్, అలాంటిదేం లేదంటున్న సింగపూర్
- రాజీవ్ గాంధీ చివరి రోజు : ‘‘నా కళ్ల ముందే బాంబు పేలింది‘‘
- లాక్ డౌన్ చరిత్ర ఏంటి... 400 ఏళ్ల కిందట రోమ్‌లో ఎందుకు విధించారు?
- జెరూసలేంపై అమెరికాకు జోర్డాన్ హెచ్చరిక
- అఫ్గానిస్తాన్: శాంతిచర్చల రద్దుతో అమెరికాకే ఎక్కువ నష్టం: తాలిబాన్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
























