డబ్ల్యూహెచ్‌వో: ‘అధిక పని గంటల వల్ల ఏటా 7,45,000 మంది మృతి’

ప్రచురణ

ఎక్కువ పని గంటల కారణంగా ఏటా లక్షల్లో ప్రాణాలు కోల్పోతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లూహెచ్ఓ) పేర్కొంది.

రోజుకు నియమిత సమయం కంటే ఎక్కువసేపు పని చేస్తున్నవారికి గుండె జబ్బులు వస్తున్నాయని, ఈ కారణంగా 2016లో 7,45,000 ప్రాణాలు కోల్పోయారని ఒక అంతర్జాతీయ పరిశోధనలో తేలింది.

ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి అధ్యయనం జరగడం ఇదే మొదటిసారి.

సౌత్ ఈస్ట్ ఆసియా, పశ్చిమ పసిఫిక్ దేశాల్లో నివసిస్తున్న ప్రజలు ఓవర్ టైం కారణంగా అధికంగా ప్రభావితం అవుతున్నారని ఈ అధ్యయనంలో తేలింది.

ప్రస్తుతం కరోనా మహమ్మారి కారణంగా ఈ ట్రెండ్ మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది.

సాధారణ పని గంటలు కాకుండా వారానికి 55 గంటలు లేదా అంతకన్నా ఎక్కువసేపు పని చేస్తున్నవారికి హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదం 35 శాతం అధికమని.. హార్ట్ అటాక్ వల్ల చనిపోయే ప్రమాదం 17 శాతం అధికమని ఈ అధ్యయనం వెల్లడించింది.

సాధారణ పని గంటలు అంటే వారానికి 35 నుంచి 40 గంటలు.

ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ (ఐఎల్‌ఓ)తో కలిసి చేసిన ఈ అధ్యయనంలో.. అదనపు పని గంటల కారణంగా మరణించినవారిలో మూడొంతులమంది మధ్య వయస్కులు లేదా అంతకన్నా పెద్దవారేనని తేలింది.

అయితే, పని చేస్తున్నప్పుడు కాకుండా దాని ప్రభావం కొన్నేళ్ల తరువాత కనిపిస్తోంది.

ఈ అధ్యయనం కోవిడ్ మహమ్మారి కాలాన్ని పరిగణనలోకి తీసుకోలేదు.

కానీ, ఆఫీసులకు దూరంగా ఇంటి నుంచి పని చేయడం, ఆర్థిక వ్యవస్థ కుంగుబాటు కారణంగా అదనపు పని వేళలు, దాని వలన కలిగే రిస్క్ కూడా పెరిగే అవకాశం ఉందని డబ్ల్యూహెచ్ఓ అధికారులు తెలిపారు.

"వివిధ దేశాల్లో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించినప్పుడు ఉద్యోగాల్లో పని గంటలు సుమారు 10% పెరిగాయని చెప్పడానికి మాకు కొన్ని ఆధారాలు లభించాయి" అని డబ్ల్యూహెచ్ఓ సాంకేతిక అధికారి ఫ్రాంక్ పెగా తెలిపారు.

వృత్తిపరమైన వ్యాధులలో ఎక్కువసేపు పని చేయడం వలన వచ్చేవి మూడింట ఒక వంతు ఉన్నాయని ఈ అధ్యయనం తెలిపింది.

తమ దగ్గరి పనిచేసేవారి విషయంలో ఆరోగ్యపరమైన నష్టాలను లెక్కిస్తున్నప్పుడు అదనపు పని గంటల వలన కలిగే నష్టాన్ని కూడా యజమానులు కలుపుకోవాలని డబ్ల్యూహెచ్ఓ సూచిస్తోంది.

నిర్దిష్ట పని గంటలు ఉండడం ఉత్పాదకతను పెంచుతుందని, అదే యజమానికి, సంస్థలకు లాభదాయకమని పెగా అంటున్నారు.

"ఆర్థిక సంక్షోభం తలెత్తినప్పుడు పనిగంటలు పెంచకుండా ఉండడమే తెలివైన నిర్ణయం" అని ఆయన అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)