You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
రిలయన్స్ జియోను బహిష్కరించాలని నిర్ణయించిన రైతు సంఘాలు - Newsreel
నూతన వ్యవసాయ చట్టాలపై రైతులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ఆయా చట్టాలకు కొన్ని సవరణలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధపడింది. ఈ సవరణలను రైతు సంఘాల నాయకులకు చూపించింది. కానీ, ఆ సవరణలు తమకు ఆమోదయోగ్యం కాదని, తమ ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని రైతు సంఘాల నాయకులు తెలిపారు.
ఈ ఆందోళనలో భాగంగా రిలయన్స్ జియోను, రిలయన్స్, అదానీ మాల్స్‌ను, ఆ రెండు సంస్థలకు చెందిన ఉత్పత్తులను బహిష్కరించాలని నిర్ణయించినట్లు రైతు సంఘాల ప్రతినిధులు ఒక ప్రకటనలో తెలిపారు.
12వ తేదీన టోల్ గేట్ల వద్ద నిరసన తెలపాలని, 14వ తేదీన ఉత్తర భారత రైతులంతా చలో దిల్లీ నిర్వహించాలని నిర్ణయించారు.
సీరం ఇన్‌స్టిట్యూట్, భారత్ బయోటెక్ కోవిడ్ వ్యాక్సిన్ల ఎమర్జెన్సీ వినియోగ అనుమతి దరఖాస్తును 'రిజెక్ట్' చేశారన్న వార్తలు ఫేక్ న్యూస్ - కేంద్ర ప్రభుత్వం
సీరం ఇన్‌స్టిట్యూట్, భారత్ బయోటెక్ సంస్థలు తమ తమ కోవిడ్ వ్యాక్సిన్లను అత్యవసర పరిస్థితుల్లో వినియోగించేందుకు అనుమతి కోరుతూ చేసుకున్న దరఖాస్తులను కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చిందంటూ మీడియాలో వచ్చిన వార్తలు ఫేక్ న్యూస్ అని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తెలిపిందని ఏఎన్ఐ వార్తా సంస్థ పేర్కొంది.
ఫైజర్ సంస్థ తయారు చేసిన వ్యాక్సిన్‌ను యూకేలో ఇప్పటికే వినియోగంలోకి తీసుకువచ్చారు. అమెరికాలో ఈ వ్యాక్సీన్‌ను అత్యవసరంగా వినియోగించేందుకు అనుమతి లభించింది.
ఇదే తరహాలో భారత్‌లో కూడా ఫైజర్ సంస్థ తమ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి దరఖాస్తు చేసుకుంది.
భారత్ బయోటెక్, సీరం ఇన్‌స్టిట్యూట్ సంస్థలు కూడా తమతమ వ్యాక్సిన్లను అత్యవసర పరిస్థితుల్లో వాడేందుకు అనుమతి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నాయి.
ఈ దరఖాస్తులపై నియంత్రణ సంస్థలు తగు నిర్ణయం తీసుకుంటాయని, కొన్ని వారాల్లోనే కనీసం ఒక వ్యాక్సిన్‌కు అయినా అనుమతి లభిస్తుందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి మంగళవారం విలేకరుల సమావేశంలో తెలిపారు.
కాగా, భారత్ బయోటెక్, సీరం ఇన్‌స్టిట్యూట్ సంస్థల దరఖాస్తులను కేంద్రం తోసిపుచ్చిందని బుధవారం వార్తలు వెలువడ్డాయి.
భద్రతా కారణాల రీత్యా ఈ దరఖాస్తులు అనుమతి పొందలేదని కూడా పలు కథనాల్లో పేర్కొన్నారు.
ఈ వ్యాక్సిన్లకు సంబంధించి మరింత సమాచారం కోరారని మరికొన్ని వార్తలు వెలువడ్డాయి.
కాగా, భద్రత, సామర్థ్యానికి సంబంధించిన తగిన సమాచారంతో తమ వ్యాక్సిన్ వచ్చే ఏడాది త్రైమాసికానికి అందరికీ అందుబాటులోకి వస్తుందని భారత్ బయోటెక్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సుచిత్ర ఎల్లా చెప్పారని ఏఎన్ఐ వార్తా సంస్థ పేర్కొంది.
అలాగే, భారత ప్రభుత్వం నిర్ణయించినట్లుగా తొలిదశ వ్యాక్సినేషన్ కార్యక్రమానికి కూడా తమ వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుందని ఆమె తెలిపారు.
కరోనావైరస్ వ్యాక్సీన్ అధ్యయనం కోసం హైదరాబాద్ చేరుకున్న 64 దేశాల రాయబారులు
కరోనావైరస్ వ్యాక్సీన్ తయారు చేస్తున్న భారత్ బయోటెక్ సంస్థను సందర్శించటానికి భారతదేశంలోని 64 దేశాల రాయబారులు, హైకమిషనర్లు బుధవారం హైదరాబాద్ వచ్చారు.
దేశంలో కోవిడ్ వ్యాక్సీన్ అభివృద్ధి గురించి ప్రపంచ దేశాలకు తెలియజేయటం కోసం భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఈ పర్యటనను ఏర్పాటు చేసింది.
దిల్లీ కేంద్రంగా పనిచేసే విదేశాల రాయబారులు, దౌత్యాధికారుల బృందం ప్రత్యేక విమానంలో బుధవారం ఉదయం హైదరాబాద్ చేరుకున్నారు. ఇక్కడ భారత్ బయోటెక్, బయోలాజికల్-ఇ సంస్థలను సందర్శిస్తుంది.
ఈ సందర్భంగా దేశంలో కరోనా వ్యాక్సీన్ల తయారీ, పురోగతి గురించి విదేశీ ప్రతినిధులు తెలుసుకుంటారు. టీకాల అభివృద్ధిపై ప్రదర్శనను తిలకిస్తారు. అనంతరం శాస్త్రవేత్తలతో భేటీ అవుతారు.
వీరు రెండు బృందాలుగా విడిపోతారు. ఒక బృందం భారత్ బయోటెక్‌ను, మరొక బృందం బయోలాజికల్-ఇని సందర్శిస్తుంది. కార్యక్రమం పూర్తయిన తర్వాత సాయంత్రం తిరిగి బయల్దేరి వెళతారు.
కరోనావైరస్: కోవిడ్ వ్యాక్సీన్‌ను సంపన్న దేశాలు పేద దేశాలకు అందకుండా చేస్తున్నాయా?
పేద దేశాలకు కోవిడ్ వ్యాక్సీన్ అందకుండా ధనిక దేశాలు అడ్డుపడుతున్నాయని 'ది పీపుల్స్ వ్యాక్సీన్ అలయన్స్' ఆరోపించింది. 70 పేద దేశాలలో పదిమందిలో ఒకరు మాత్రమే వ్యాక్సీన్‌ను పొందగలుగుతారని ఆ సంస్థ చెబుతోంది.
అయితే, తాము తయారు చేసే వ్యాక్సీన్‌లో 64 శాతాన్ని అభివృద్ధి చెందుతున్న దేశాలకు అందిస్తామని ప్రపంచంలో అందరికీ వ్యాక్సీన్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా సంస్థ తెలిపింది.
తమ వ్యాక్సీన్ కోవ్యాక్స్‌ను 92 పేద దేశాలకు అందించేందుకు ఇప్పటికే ఆయా ప్రభుత్వాలతో ఒప్పందాలు కుదుర్చుకున్నామని ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా వెల్లడించింది.
ఈ వ్యాక్సీన్ ఏమాత్రం సరిపోదని, ఫార్మా కంపెనీలు తమ టెక్నాలజీని ఇతర కంపెనీలకు పంచి ఎక్కువ వ్యాక్సీన్ ఉత్పత్తి అయ్యేలా సహకరించాలని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్, ఆక్స్‌ఫామ్, గ్లోబల్ జస్టిస్ నౌలాంటి సంస్థలు అంటున్నాయి.
ధనిక దేశాలు ఇప్పటికే అవసరమైనదానికన్నా మూడింతలు ఎక్కువ మొత్తాన్ని కొనుగోలు చేశాయని ఈ సంస్థల ప్రతినిధులు చెబుతున్నారు.
ఒక్క కెనడాను ఉదాహరణగా తీసుకుంటే తమ దేశ ప్రజలకు అవసరమైనదానికన్నా ఐదింతల వ్యాక్సీన్‌కు ఆ దేశం ఆర్డర్ ఇచ్చిందని వారు వెల్లడించారు.
ప్రపంచ జనాభాలో 14%శాతంగా ఉన్న ధనికదేశాలు, తయారుకాబోయే వ్యాక్సీన్‌లో 53శాతాన్ని కొనేశాయని తెలిపారు.
"నివసించే దేశం, జేబులో ఉన్న డబ్బు ఆధారంగా ప్రాణాధార వ్యాక్సీన్‌ను ఎవరికివ్వాలో నిర్ణయించడం సరి కాదు" అని ఆక్స్‌ఫామ్ సంస్థ హెల్త్ పాలసీ మేనేజర్ అనా మారియట్ వ్యాఖ్యానించారు.
"అద్భుతాలు జరిగితే తప్ప ప్రపంచంలోని ప్రజలంతా రాబోయే రోజుల్లో ఈ వ్యాక్సీన్‌ను పొందడం సాధ్యంకాదు" అన్నారామె. ప్రపంచ ఆరోగ్య సంస్థతో కలిసి వ్యాక్సీన్ తయారీ టెక్నాలజీని ఫార్మా సంస్థలు పంచుకోవాలని ఆమె సూచించారు.
ఆక్స్‌ఫర్డ్, ఆస్ట్రా-జెనెకా సంస్థలు తాము లాభాపేక్ష లేకుండా వ్యాక్సీన్ తయారు చేస్తున్నామని వెల్లడించగా, ఒక్క కంపెనీ తయారు చేసే వ్యాక్సీన్ ప్రపంచమంతటికీ సరిపోదని ఆక్స్‌ఫామ్‌లాంటి సంస్థలు వాదిస్తున్నాయి.
పీఎం-వాణి.. పబ్లిక్ వైఫైలకు కేబినెట్ ఆమోదం
దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ వినియోగాన్ని పెంచేందుకు పబ్లిక్ వైఫైలను ప్రోత్సహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ మేరకు పీఎం వాణి పేరిట పబ్లిక్ వైఫై వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర క్యాబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది.
దేశం నలుమూలలా ఈ పబ్లిక్ వైఫైలను ఏర్పాటు చేస్తారు. ఒక యాప్ ద్వారా ఈ వైఫై సేవలను పొందే అవకాశం కల్పిస్తారు. ఈ వైఫైల ఏర్పాటుకు ఎలాంటి లైసెన్స్ ఫీజును వసూలు చేయకూడదని, తద్వారా వీటి ఏర్పాటుకు ప్రోత్సాహం లభిస్తుందని క్యాబినెట్ నిర్ణయించింది. ఈ పబ్లిక్ వైఫైలు దేశంలో ఇంటర్నెట్ వినియోగాన్ని పెంచడమే కాకుండా ప్రజలకు ఉపాధి అవకాశాలను కూడా మెరుగుపరుస్తాయని క్యాబినెట్ పేర్కొంది.
మహిళా సైనికులపై లైంగిక దాడులు, హత్యలు.. అమెరికాలో సైనికాధికారులపై వేటు
టెక్సస్‌లోని ఫోర్ట్ హుడ్ సైనిక స్థావరంలో హత్య, లైంగిక దాడి, వేధింపులు వంటి హింసాత్మక చర్యల కారణంగా.. 14 మంది కమాండర్లు, కింది స్థాయి సైనికాధికారులను అమెరికా సైన్యం విధుల నుంచి తొలగించింది.
ఈ ఏడాది వెనెసా గిలెన్ అనే సైనికురాలి హత్య నేపథ్యంలో ఫోర్ట్ హుడ్ స్థావరంలోని సమస్యలపై దర్యాప్తు ప్రారంభించారు.
నాయకత్వ వైఫల్యాల కారణంగానే ఇక్కడ సమస్యలు తలెత్తాయని సైనిక మంత్రి రియాన్ మెక్‌కార్తీ పేర్కొన్నారు.
అదృశ్యమైన సైనికుల వ్యవహారంపై కొత్త విధానాన్ని అమలు చేయాలని కూడా సైన్యం ఆదేశించింది.
మంగళవారం ఉద్యోగాల్లోంచి తొలగించిన సైనికాధికారుల్లో మేజర్ జనరళ్లు స్కాట్ ఎఫ్లాండ్, జెఫ్రీ బ్రాడ్‌వాటర్‌లు కూడా ఉన్నారు.
వెనెసా హత్యోదంతం ''మన అంతఃచేతనను దిగ్భ్రాంతికి గురిచేసింది.. ఫోర్ట్ హుడ్‌లోను, అమెరికా సైన్యంలోను లోతుగా పాతుకుపోయిన సమస్యలను ముందుకు తెచ్చింది'' అని మెక్‌కార్తీ వ్యాఖ్యానించారు.
''ఇది మన వ్యవస్థలను, మన విధానాలను, మనల్ని మనం ఆత్మవిమర్శ చేసుకునేలా పురిగొల్పింది'' అని ఆయన విలేకరులతో చెప్పారు.
ఇరవై ఏళ్ల వెనెసా అదృశ్యమైన రెండు నెలల తర్వాత గత జూన్ చివరలో శవమై కనిపించారు. ఫోర్ట్ హుడ్‌లో ఆమెను తీవ్రంగా కొట్టి చంపారని దర్యాప్తు అధికారులు చెప్తున్నారు.
ఆమె హత్యలో అనుమానితుడైన స్పెషలిస్ట్ ఆరన్ రాబిన్సన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకోవటానికి ప్రయత్నిస్తుండటంతో.. అతడు జూలై 1వ తేదీన ఆత్యహత్య చేసుకున్నాడు.
ఆరన్ రాబిన్సన్ తమ కుమార్తెను వేధించాడని వెనెసా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే.. ఆమెపై లైంగిక దాడి జరిగిందని కానీ, వేధింపులు జరిగాయని కానీ తమకు ఎలాంటి ఫిర్యాదూ అందలేదని అధికారులు చెప్తున్నారు.
ఈ కేసులో ఇంకా దర్యాప్తు కొనసాగుతోంది.
ఫోర్ట్ హుడ్ సైనిక స్థావరంలో ఏడాది కాలంలో ఆత్మహత్యలు, హత్యలు, ప్రమాదాల్లో 25 మంది సైనికులు చనిపోయారని అసోసియేటెడ్ ప్రెస్ వార్తా సంస్థ పేర్కొంది. ఈ నేపథ్యంలో సైనికాధికారులపై తాజాగా చర్యలు చేపట్టినట్లు చెప్పింది.
ఇవి కూడా చదవండి:
- జీహెచ్ఎంసీ: టీఆర్ఎస్ ఎవరితో పొత్తు పెట్టుకోకుండానే మేయర్ పీఠం దక్కించుకోవచ్చా?
- హైదరాబాద్ హంగ్ ఫలితాలకు, వైయస్ రాజశేఖర రెడ్డికీ ఉన్న సంబంధం ఏంటి?
- జర్మనీ: ఇక్కడి ప్రజలు పబ్లిగ్గా న్యూడ్‌గా తిరగడానికి ఎందుకు ఇష్టపడతారు?
- ఒక ఉల్కను అమ్మేసి, రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అవుదామనుకున్నాడు. కానీ...
- వ్యాపారం కోసం వచ్చి ఇండియాలో మారణహోమం సాగించిన కంపెనీ కథ
- బ్రిటిష్ వారిని గడగడలాడించిన టిప్పు సుల్తాన్ కథ ఎలా ముగిసిందంటే...
- కంభం చెరువుకు అంతర్జాతీయ గుర్తింపు ఎలా వచ్చింది... స్థానిక రైతులు ఏం ఆశిస్తున్నారు?
- ‘మోడలింగ్ జాబ్ ఉందంటే వెళ్లా... అది గ్యాంగ్ రేప్ కోసం పన్నిన ఉచ్చు అని అర్థమైంది’
- ఔరంగజేబ్ నిజంగానే వేల హిందూ దేవాలయాలను కూల్చారా?
- తేనెలో కల్తీ: ‘చైనీస్ సుగర్ సిరప్‌లను కలిపి, అమ్మేస్తున్నారు’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)