ఫిలిప్పీన్స్: జైలులోని తల్లి నుంచి పోలీసులు దూరంచేసిన 3 నెలల ఆడ శిశువు మృతి.. దేశవ్యాప్తంగా ఆగ్రహం

ప్రచురణ

జైల్లో ఉన్న ఒక తల్లి నుంచి అధికారులు దూరం చేసిన మూడు నెలల శిశువు చనిపోవడంతో ఫిలిప్పీన్‌లో ఆగ్రహావేశాలు వెల్లువెత్తాయి.

ఇద్దరినీ కలిపే ఉంచాలని ఎన్నో పిటిషన్లు వచ్చినప్పటికీ కోర్టు దానికి అంగీకరించలేదని బీబీసీ ప్రతినిధి ప్రీతీ ఝా తెలిపారు.

మానవ హక్కుల కార్యకర్త ‘రీనా మే నాసినో’ను గత ఏడాది మనీలాలో అరెస్ట్ చేసినప్పుడు తను గర్భవతి అని ఆమెకు తెలియదు.

ఆ సమయంలో రాత్రి పూట దాడులు చేసిన పోలీసులు ఆమెతోపాటూ మరో ఇద్దరు కార్యకర్తలను కూడా కస్టడీలోకి తీసుకున్నారు.

జైల్లో పరీక్షలు చేసిన తర్వాత 23 ఏళ్ల నాసినోకు తాను గర్భవతిననే విషయం తెలిసింది.

అనంతరం ఆమె బిడ్డకు జన్మనిచ్చిన కొన్నాళ్ల తరువాత తల్లీబిడ్డలను వేర్వేరుగా ఉంచారు.

అధికారులు నాసినోకు దూరం చేసిన ఆడ శిశువు గతవారం చనిపోయింది.

దీంతో జైల్లోని ఫిలిప్పీన్ మహిళల పట్ల వ్యవహరిస్తున్న తీరుపై ప్రశ్నలు వెల్లువెత్తాయి.

బిడ్డను కాపాడలేకపోయిన న్యాయ వ్యవస్థపై దేశంలో ఆగ్రహం వ్యక్తమైంది.

కోర్టులో సవాలు చేశారు

పట్టణ పేదల కోసం పోరాడే ఒక బృందంలో పనిచేసే నాసినోను 2019 నవంబర్‌లో ఒక ఆఫీసులో ఉన్నప్పుడు మరో ఇద్దరు కార్యకర్తలతో కలిసి అరెస్ట్ చేశారు.

అక్రమంగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు తమ దగ్గర ఉంచుకున్నారనే ఆరోపణలతో వారిని అరెస్ట్ చేశారు. కానీ వారు ఆ ఆరోపణలను ఖండించారు.

వామపక్షాల వైపు ఉన్న కార్యకర్తల అణచివేతకు వారే పేలుడు పదార్థాలను పెట్టారని ఆరోపించారు.

“అలాంటి పరిస్థితుల్లోనూ తల్లి అవుతన్నందుకు నాసినో చాలా సంతోషించారు. విచారణకు ఎక్కువ సమయం పడుతుందని తెలిసినా, కస్టడీలో బిడ్డకు జన్మనివ్వడాన్ని ఆమె కోర్టులో సవాలు చేశారు” అని ఆమె లాయర్ జోసలీ డీన్లా చెప్పారు.

కానీ, ఫిలిప్పీన్స్ లో కోవిడ్-19 వ్యాపించడంతో ఆమె గురించి ఆందోళన వ్యక్తమైంది. దేశంలోని లాయర్ల సంఘం నాసినో తరఫున ఎన్నో పిటిషన్లు వేసింది. ఆమెను విడుదల చేయాలని కోరాయి.

ఏప్రిల్‌లో అత్యంత బలహీనంగా కరోనా వ్యాపించే స్థితిలో ఉన్న 22 మంది ఖైదీలను విడుదల చేయాలన వారు మొదటి పిటిషన్ వేశారు. ఆ ఖైదీల్లో నాసినో కూడా ఉన్నారు. తర్వాత బిడ్డతో సహా ఆమెను ఆస్పత్రిలో లేదంటే మనీలా సిటీ జైల్లో ఉంచాలని కోరారు.

“కోర్టు మా అభ్యర్థనకు నిరాకరించడంతో మేమంతా షాకయ్యాం. న్యాయమూర్తి మానవతా దృష్టితో తన కోణం నుంచి అందుకు అగీకరించి ఉండాల్సింది. కానీ, దురదృష్టవశాత్తూ కోర్టు ఆ తల్లీబిడ్డలపై ఎలాంటి దయా చూపించలేకపోయింద”ని అని డీన్లా అన్నారు.

తల్లీబిడ్డలకు మద్దతుగా పిటిషన్లు

మాసినో పాప పేరు రివర్ మాసినో. జులై 1న పాప పుట్టినపుడు బరువు చాలా తక్కువగా ఉంది, కొన్ని రోజులకు, నాసినా బిడ్డతో మనీలా జైలుకు తిరిగొచ్చారు. అక్కడ తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ఒక గదిలో ఉన్నారు.

ఫిలిప్పీన్ చట్టాల ప్రకారం కస్టడీలో ఉన్న వారు తల్లి అయినపుడు మొదటి నెల రోజులు మాత్రమే బిడ్డ ఆమెతో ఉండవచ్చు. ఈ నియమాలు ఒక్కో దేశంలో ఒక్కోలా ఉన్నాయి.

మలేసియాలో జైల్లో ఒక తల్లి తన బిడ్డను మూడు నాలుగేళ్లు వచ్చే వరకూ తనతోనే ఉంచుకోవచ్చు. అదే బ్రిటన్‌లో బిడ్డకు 18 నెలల వయసు వచ్చేవరకూ తల్లి తనతోనే ఉంచుకోవచ్చు.

నాసినో, ఆమె శిశువును జైలు నుంచి విడుదల చేయించేందుకు అధికారులపై ఒత్తిడి తీసుకురావాలని చాలా ప్రయత్నాలు జరిగాయి.

“మేం సుప్రీంకోర్టు గేటుకు బ్లూ రిబ్బన్లు కూడా కట్టాం. అవి రివర్‌కు గుర్తు. బయట కాండిల్స్ వెలిగించాం. కానీ వారు పట్టించుకోలేద”ని ఫిలిప్పీన్‌లో రాజకీయ ఖైదీల స్నేహితులు, కుటుంబాలకు అండగా నిలిచే కపాటిడ్ గ్రూపు సభ్యుడు ఫిడెస్ లిమ్ అన్నారు.

ఈ సంస్థ సాయంతో నాసినో తల్లి లిమ్ కూడా దాదాపు ప్రతి వారం అధికారులకు ఫొటోలు, లేఖలు అందించేవారు. తన కూతురిని విడుదల చేయాలని వేడుకునేవారు.

పాపకు తల్లి పాలు ఎంత ముఖ్యమో మాకు తెలుసన్న లిమ్ రాజకీయ ఖైదీగా ఉన్న తన 70 ఏళ్ల భర్త విడుదల కోసం కూడా ప్రయత్నిస్తున్నారు.

“నాసినో బిడ్డకు జన్మనిచ్చిన ఆస్పత్రిలో వైద్యులు బిడ్డ తల్లితోనే ఉండాలని సిఫారసు చేశారు. కానీ, జైలు అధికారులు మాకు తగిన వనరులు లేవని, సాకులు చెప్పారు. తల్లిపాలు పొందే బిడ్డ హక్కును కాలరాశారు” అని లాయర్ డీన్లా చెప్పారు.

బ్యాంకాక్ రూల్స్- మహిళా ఖైదీలతో ఎలా వ్యవహరించాలనేదానిపై ఉన్న ఐక్యరాజ్యసమితి మార్గదర్శకాల ప్రకారం ఒక బిడ్డను తల్లి నుంచి వేరు చేయాల్సి వస్తే, ఆ నిర్ణయం బిడ్డ ప్రయోజనాల ఆధారంగానే తీసుకోవాలి.

దీనిపై ఫిలిప్పీన్స్ జైలు అధికారుల నుంచి స్పందన తీసుకోవడం వెంటనే సాధ్యం కాలేదు.

తల్లి నుంచి వేరు చేశాక.

ఆగస్టు 13న పాప రివర్‌ను తల్లి నుంచి వేరు చేశారు. దానిని నాసినో భరించలేకపోయారని ఆమె లాయర్ చెప్పారు. ఆమె బిడ్డను ఇవ్వాలనుకోలేదు. ఇంకొంత కాలం తనతో ఉంచాలని వాళ్లను వేడుకున్నారు అన్నారు.

కోవిడ్-19 వల్ల ఖైదీల నిబంధనలను కఠినతరం చేశారు. డీన్లా ఆమె సహచరులు నాసినోతో ఫోన్లో మాత్రమే మాట్లాడగలిగారు.

శిశువును నాసినో తల్లి లిన్‌కు అప్పగించిన తర్వాత నెలకే పాపకు విరేచనాలు కావడంతో ఆమె చాలా భయపడిపోయారు.

శిశువు పరిస్థితి మరింత ఘోరంగా మారడంతో సెప్టెంబర్ 24న ఆస్పత్రిలో చేర్చారు. కానీ నాసినోకు తన బిడ్డను చూడ్డానికి అనుమతి ఇవ్వలేదు.

గత వారం మూడు నెలల రివర్ న్యుమోనియాతో చనిపోయింది. పాప మరణంతో ఫిలిప్పీన్‌లో చాలా మందిని కదిలించింది. సోషల్ మీడియాలో చిన్నారి మృతికి సంతాప సందేశాలు వెల్లువెత్తాయి.

చాలా మంది దేశ న్యాయవ్యవస్థపై ఆగ్రహం వ్యక్తం చేస్తే, మరికొందరు సంపన్నులను మాత్రం తమ పిల్లల పెళ్లిళ్లకు ఇతర కార్యక్రమాలకు తాత్కాలికంగా విడుదల చేస్తున్నారని, సామాన్యులకు అన్యాయం జరుగుతోందని ఆరోపించారు.

పాప అంత్యక్రియలకు హాజరయ్యేందుకు కోర్టు మంగళవారం ఉదయం నాసినోకు మూడు రోజుల సెలవు ఇచ్చింది. తర్వాత జైలు అధికారులు ఆమె కారుణ్య విడుదల కాలాన్ని తగ్గించడానికి ప్రయత్నించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)