డోనల్డ్ ట్రంప్: 'వాతావరణ మార్పుల గురించి సైన్స్‌కు తెలుసని నేననుకోను' BBC Newsreeel

ప్రచురణ
చదివే సమయం: 2 నిమిషాలు

ఇటీవల కార్చిచ్చు అంటుకున్న కాలిఫోర్నియాను సందర్శించిన యూఎస్ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వాతావరణ మార్పులపై వినిపిస్తున్న ఆందోళనలను తోసిపుచ్చారు. "గ్లోబల్ వార్మింగ్ గురించి సైన్స్‌కు తెలుసని నేననుకోను" అని అక్కడ ఒక అధికారితో అన్నారు.

"సైన్స్‌ను విస్మరించవద్దు" అనే మాటలకు బదులిస్తూ, "వాతావరణం క్రమంగా చల్లబడుతుంది, మీరు గమనిస్తూ ఉండండి" అని అన్నారు.

యూఎస్‌లో ఆగస్ట్ ప్రారంభంలో రేగిన కార్చిచ్చు వలన అనేక ప్రాంతాలు దగ్ధమయిపోయాయి. 36 మంది ప్రాణాలు కోల్పోయారు.

మానవుల వలనే ప్రపంచ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

అయితే, కాలిఫోర్నియా, ఒరెగాన్, వాషింగ్టన్ రాష్ట్రాల్లో లక్షల ఎకరాలు కార్చిచ్చులో దగ్ధమయిపోవడానికి కారణం అటవీ నిర్వాహణలోని లోపాలేనని ట్రంప్ అన్నారు.

వాతావరణంలోని మార్పులే కార్చిచ్చుకు కారణమనుకుంటున్నారా అని ఒక రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ "నిర్వహణలో లోపాలే దీనికి కారణమని" ట్రంప్ అన్నారు.

వాతావరణంలో మార్పులే కారణమైతే మిగతా దేశాల్లో కార్చిచ్చు ఎందుకు అంటుకోవట్లేదని ట్రంప్ అడిగారు. ఆస్ట్రేలియాలాంటి పెద్ద పెద్ద అడవులున్న దేశాల్లో నిప్పంటుకోవట్లేదని, ఈ స్థాయిలో కార్చిచ్చు రేగట్లేదని ఆయన అన్నారు.

వాతావరణ మార్పుల గురించి మాట్లాడుతూ, "ఇండియా, చైనా, రష్యాలాంటి దేశాల్లో వారి పద్ధతులను మార్చుకుంటారా?" అని ప్రశ్నించారు.

వాతావరణ మార్పులు అనేది కల్పితమని, ఒక బూటకమని గతంలో ట్రంప్ వ్యాఖ్యానించారు.

చైనాను కంగుతినిపించి ఐరాస కౌన్సిల్‌లో స్థానం సంపాదించిన భారత్

ఐక్యరాజ్య సమితిలోని ఆర్గనైజేషన్ ఆఫ్ ఎకనమిక్ అండ్ సోషల్ కౌన్సిల్‌లో ‘కమిషన్ ఆన్ స్టేటస్ ఆఫ్ ఉమెన్’ సభ్యత్వం భారత్ సంపాదించింది. దీని కోసం చైనా, అప్గానిస్తాన్‌లూ పోటీ పడగా భారత్ అత్యధిక ఓట్లను సాధించి కౌన్సిల్‌కు ఎన్నికైంది.

భారత్, చైనా, అఫ్గానిస్తాన్ పోటీపడగా చైనాకు సగం ఓట్లు కూడా రాలేదు.

ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి టి.ఎస్‌.తిరుమూర్తి ఈ మేరకు ట్విటర్‌లో ఈ సమాచారం పంచుకున్నారు.

"భారతదేశం ప్రతిష్టాత్మక EcoSoc బాడీలో ఒక స్థానాన్ని గెలుచుకుంది. మహిళల స్థితిగతులపై కమిషన్‌ సభ్యదేశంగా భారతదేశం ఎన్నికైంది. లింగ సమానత్వం, మహిళా సాధికారతను ప్రోత్సహించడంలో మా నిబద్ధతకు ఇది నిదర్శనం.

మద్దతు ఇచ్చినందుకు సభ్య దేశాలకు మా ధన్యవాదాలు" అని తిరుమూర్తి ట్విటర్‌లో పేర్కొన్నారు.

కమిషన్‌లో భారత్‌‌కు నాలుగేళ్లపాటు సభ్యత్వం ఉంటుంది.

టిక్‌టాక్‌కు ప్రత్యామ్నాయంగా యూట్యూబ్‌ షార్ట్స్‌

టిక్‌టాక్‌కు పోటీగా త్వరలో బీటా వర్షన్‌ను పరీక్షించబోతున్నట్లు యూట్యూబ్‌ ప్రకటించింది. దాదాపు టిక్‌టాక్‌లో ఉండే ఫీచర్లతో, 15 సెకండ్ల నిడివిగల వీడియోలను పోస్టు చేయడానికి వీలుగా యూట్యూబ్‌ షార్ట్స్‌ పేరుతో ఈ ట్రయల్‌ నిర్వహిస్తామని యూట్యూబ్‌ తెలిపింది.

చైనాతో వైరం కారణంగా ఆ దేశంతో సంబంధం ఉన్న టిక్‌టాక్‌ సోషల్ మీడియా యాప్‌ను భారత్‌ నిషేధిందింది. దీంతో పలు దేశీయ కంపెనీలు దీనికి ప్రత్యామ్నాయంగా కొత్త సోషల్ ప్లాట్‌ఫామ్‌ను తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తుండగా, యూట్యూబ్ కూడా అందులో చేరింది.

మొబైల్‌ ఫోన్లతో రికార్డు చేసే చిన్న చిన్న వీడియోలను ఇందులో పోస్ట్ చేయవచ్చని యూట్యూబ్‌ ప్రోడక్ట్‌ మేనేజ్‌మెంట్ వైస్‌ ప్రెసిడెంట్‌ ‌క్రిస్‌ జాఫ్‌ అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)