భారత్, చైనా సరిహద్దు వివాదం: టిబెట్‌పై జిన్‌పింగ్ తాజా ప్రకటన ఆంతర్యమేమిటి.. టిబెట్ చైనాలో భాగమేనని ఇండియా చెప్పిందా?

ప్రచురణ

భారత్, చైనాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో టిబెట్‌కు సంబంధించి చైనా ఒక కీలక ప్రకటన చేసింది. ఆధునిక సామ్యవాద టిబెట్ నిర్మాణానికి చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ పిలుపునిచ్చారు.

దీనికిముందు చైనా విదేశీ వ్యవహారాల మంత్రి వాంగ్ యీ టిబెట్‌ను సందర్శించారు. భారత సరిహద్దుల్లో చేపట్టిన నిర్మాణాలను పరిశీలించారు.

టిబెట్‌పై బీజింగ్‌లో జరిగిన ఒక ఉన్నత స్థాయి సమావేశంలో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు.

టిబెట్‌ సుస్థిరత, జాతీయ ఐక్యతను కాపాడడానికి చైనా మరిన్ని ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.

మరోవైపు టిబెట్ ప్రజలకు వారి సంస్కృతికి చైనా ద్రోహం చేసిందని బౌద్ధ ఆధ్యాత్మిక గురువు దలైలామా మద్దతుదారులు విమర్శిస్తున్నారు.

టిబెట్ భవిష్యత్తు పాలనను దృష్టిలో పెట్టుకుని చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ సాధించిన విజయాలను ఈ సమావేశంలో పాల్గొన్న పలువురు కమ్యూనిస్ట్ పార్టీ సీనియర్ నాయకులు ప్రశంసించారు. ఫ్రంట్ లైన్‌లో పని చేస్తున్న అధికారులను కూడా ప్రశంసించారు.

అయితే ఆ ప్రాంతాన్ని మరింత బలోపేతం చెయ్యడానికి, అక్కడ ఐక్యత సాధించడానికి మరిన్ని ప్రయత్నాలు చేయాల్సిన ఆవశ్యకత ఉందని సూచించారు.

చైనా అధికారిక వార్తాపత్రిక షిన్‌హువా ప్రకారం..టిబెట్ పాఠశాలల్లో రాజకీయ, సైద్ధాంతిక బోధనలకు ప్రాధాన్యం ఇవ్వాలని, తద్వారా పిల్లల్లో చైనా పట్ల ప్రేమను పెంపొందించాలని ఆ సమవేశంలో షీ జిన్‌పింగ్ అన్నారు.

టిబెట్‌లో కమ్యూనిస్ట్ పార్టీని బలోపేతం చెయ్యాలని, అక్కడ జాతీయ స్థాయి బృందాలను ఏకతాటిపైకి తేవాలని ఆయన తెలిపారు.

"మనమంతా ఐక్యత నిండిన, సంపన్నమైన, అందమైన, నాగరికతతో కూడిన ఆధునిక సామ్యవాద టిబెట్‌ను నిర్మించాలనే సంకల్పం చేపట్టాలని" షీ జిన్‌పింగ్ పిలుపునిచ్చారు.

టిబెట్‌లోని బౌద్ధ ధర్మాన్ని కూడా సామ్యవాదానికి, చైనాలోని పరిస్థితులకు అనుగుణంగా తీర్చిదిద్దాల్సిన ఆవశ్యకత ఉందని ఆయన అన్నారు.

అయితే, ఈ సమావేశంలో షీ జిన్‌పింగ్ చెప్పినట్టుగా నిజంగా చైనా, టిబెట్‌కు అంత ప్రయోజనం చేకూర్చినట్లైతే, వేర్పాటువాదానికి భయపడాల్సిన అవసరం లేదని, టిబెట్ ప్రజలకు కొత్త రాజకీయ పాఠాలు బోధించాల్సిన అవసరం ఉండదని విమర్శకులు అంటున్నారు.

అమెరికా, చైనాల మధ్య ఉద్రిక్తతల విషయం..

అమెరికా, చైనాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో కూడా టిబెట్ ప్రస్తావన కూడా వచ్చింది.

జులైలో అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపేయో మాట్లాడుతూ.. అమెరికా, టిబెట్‌లో దౌత్యపరమైన ప్రవేశాన్ని నిరోధిస్తుందని, మానవహక్కుల ఉల్లంఘనకు పాల్పడిన చైనా అధికారుల వీసాలను అడ్డుకుంటుందని ఆరోపించారు.

అమెరికా టిబెట్ స్వయంప్రతిపత్తి పాలనకు మద్దతిస్తుందని కూడా తెలిపారు.

టిబెట్, చైనా ఆధీనంలోకి ఎప్పుడు, ఎలా వచ్చింది?

13వ శతాబ్దం మధ్య కాలం నుంచీ టిబెట్ చైనాలో తమ దేశంలో భాగమని చైనా అంటోంది. కానీ అనేక శతాబ్దాలుగా తమది స్వతంత్ర్య రాజ్యమని టిబెట్ చెబుతోంది.

మంగోల్ రాజు కుబ్లయి ఖాన్ యువాన్ టిబెట్‌లో రాజ్యస్థాపన చెయ్యడమే కాక చైనా, వియత్నాం, కొరియాలకు తన రాజ్యాన్ని విస్తరించాడు.

తరువాత 17వ శతాబ్దంలో చైనాకు చెందిన చింగ్ రాజవంశం టిబెట్‌తో సత్సంబంధాలు నెరిపింది.

260 సంవత్సరాల తరువాత చింగ్ సైన్యం టిబెట్‌పై దండెత్తి ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుంది. కానీ తరువాత మూడేళ్లలో టిబెటన్లు చైనా సైన్యాన్ని తిప్పికొట్టారు.

1912లో మూడవ దలైలామా టిబెట్‌ను స్వతంత్ర్య రాజ్యంగా ప్రకటించారు.

తరువాత 1951 లో చైనా సైన్యం మరోసారి టిబెట్‌ను స్వాధీనం చేసుకుంది. అదే సమయంలో టిబెట్ ప్రతినిధి బృందంతో చేసుకున్న ఒప్పందం ప్రకారం టిబెట్ సార్వభౌమత్వాన్ని చైనాకు అప్పగించారు.

దలైలామా భారత భూభాగానికి పారిపోయి వచ్చారు. అప్పటినుంచీ టిబెట్ స్వయం ప్రతిపత్తి కోసం పోరాడుతూనే ఉన్నారు.

చైనా టిబెట్‌ను స్వాధీనం చేసుకున్నప్పటినుంచీ అక్కడి ప్రజల భాష, సంస్కృతి, సంప్రదాయాల లక్ష్యంగా చైనీకరణ ప్రారంభమైంది.

టిబెట్‌ చైనాలో భాగమని వాజపేయీ చెప్పారా?

2003 జూన్‌లో టిబెట్, చైనాలో భాగమని భారతదేశం అధికారికంగా అంగీకరించింది.

అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి, చైనా అధ్యక్షుడు జియాన్ జెమిన్‌తో సమావేశం అయిన అనంతరం టిబెట్‌ని చైనాలో భాగంగా అంగీకరిస్తున్నామని భారత్ తెలిపింది.

ఈ పరిణామం భారత్-చైనాల మధ్య సంబంధంలో ఒక ముఖ్యమైన అంశంగా గుర్తించాలి.

దీని తరువాత చైనా సిక్కిం మీదుగా భారత్‌తో వాణిజ్య సంబంధాలు నెరపడానికి అంకీగరించింది. సిక్కింను భారత భూభాగంలోని ప్రాంతంగా అంగీకరించింది.

అయితే భారత్, మొత్తం టిబెట్‌ను చైనాలో భాగంగా అంగీకరించలేదని, చైనాలో భాగమైన పెద్ద భూభాగాన్ని మాత్రమే అంగీకరించిందనీ అప్పట్లో అధికారులు స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)