అమెరికా డమ్మీ షిప్‌ను పేల్చివేసిన ఇరాన్

యూఎస్ డమ్మీ నౌక

ఫొటో సోర్స్, EPA

ప్రచురణ

హర్మజ్ జలసంధిలో యుద్ధ విన్యాసాలను నిర్వహించిన ఇరాన్‌.. అమెరికా నౌకను పోలిన డమ్మీ నౌక ఒక దానికి తన క్షిపణులతో పేల్చేసింది.

ఈ ఘటనపై వెంటనే స్పందించిన అమెరికా తన వార్‌బేస్‌లను అలర్ట్‌ చేసింది.

ఇరాన్‌ చర్యలను యూఎస్ నేవీ తీవ్రంగా ఖండించింది. "ఇది బాధ్యతారహితమైన పని'' అని వ్యాఖ్యానించింది. తమను రెచ్చగొట్టడానికి, బెదిరించడానికి ఇరాన్‌ చేసిన ప్రయత్నంగా ఈ ఘటనను అభివర్ణించింది.

గల్ఫ్ జలాల్లో అమెరికా, ఇరాన్‌ల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్న తరుణంలో ఈ సంఘటన జరిగింది.

అమెరికా నౌకను పోలిన డమ్మీ నౌకపై ప్రయోగించిన ఇరాన్ క్షిపణి

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, అమెరికా నౌకను పోలిన డమ్మీ నౌకపై ప్రయోగించిన ఇరాన్ క్షిపణి

ప్రొఫెట్ మహ్మద్‌ 14 అనే పేరుతో సాగిన ఈ యుద్ధ విన్యాసాలను ఇరాన్‌ అధికార వార్తా సంస్థ ప్రసారం చేసింది.

గల్ఫ్‌ జలాల్లో అమెరికా తరచూ తిప్పే నౌకను పోలిన నౌకను ఇరాన్‌ సిద్ధం చేసింది. దీనిపై యుద్ధ విమానాల మోడళ్లు కూడా ఉన్నాయి. అమెరికా నౌకలా కనిపించే ఒక వెస్సెల్‌పై ఇరాన్‌ క్షిపణులతో విరుచుకుపడింది. ఒకపక్క క్షిపణి దాడి జరుగుతుండగా, మరోవైపు హెలీకాప్టర్ల నుంచి ఈ ఫేక్‌ వార్‌షిప్‌పై బాంబుల విసిరింది. వివిధ కోణాల నుంచి మిసైళ్లు ఈ డమ్మీనౌకపై దాడి చేశాయి.

" మా యుద్ధనౌకలు, వాయుసేనలు సర్వసన్నద్ధంగా, శత్రుదుర్భేద్యంగా ఉన్నాయని చూపడమే ఈ విన్యాసాల లక్ష్యం" అని ఇరాన్‌ రివల్యూషనరీ గార్డ్స్‌ కమాండర్‌ మేజర్‌ జనరల్‌ హోస్సీన్‌ సలామీ ఆ దేశ అధికార మీడియాతో అన్నారు.

భూమి నుంచి కూడా మిసైల్స్‌ దూసుకెళ్లాయి

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, భూమి పై నుంచి కూడా మిసైల్స్‌ దూసుకెళ్లాయి
మాక్‌ డ్రిల్‌లో భాగంగా అమెరికా డమ్మీ నౌకపై దిగిన ఇరాన్‌ సైన్యం

ఫొటో సోర్స్, EPA

ఇరాన్‌ జరిపిన బాలిస్టిక్‌ క్షిపణి పరీక్షలను తాము గుర్తించామని, యుఏఈ, ఖతార్‌లలో ఉన్న తమ సేనలను అప్రమత్తం చేశామని అమెరికా మిలటరీ వర్గాలు వెల్లడించాయి.

" మేం మా మిత్రదేశాలకు తీర ప్రాంత రక్షణపై అవగాహన కల్పించేందుకు డ్రిల్స్‌ నిర్వహించాం. కానీ ఇరాన్‌ మమ్మల్ని బెదిరించేందుకు, కవ్వించేందుకు విన్యాసాలు నిర్వహిస్తోంది'' అని బహ్రయిన్‌లోని యూఎస్‌ నేవీ ఫిఫ్త్‌ ఫ్లీట్ అధికార ప్రతినిధి కమాండర్‌ రెబెకా రెబ్రయిచ్‌ వ్యాఖ్యానించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)