You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కరోనా ఎఫెక్ట్: హైదరాబాద్‌లో చికెన్ 'వెరీ చీప్'.. ‘కిలో రూ.30’ - ప్రెస్ రివ్యూ
కరోనావైరస్ వ్యాప్తి ప్రభావం చికెన్ ధరలపై తీవ్రంగా పడుతోందంటూ ఆంధ్రజ్యోతి దినపత్రిక ఓ కథనం రాసింది.
రోజురోజుకీ చికెన్ ధరలు పతనమవుతున్నాయి. ఫౌల్ట్రీ పరిశ్రమ కుదేలవుతోంది.
''నేను రోజూ చికెన్ తింటాను.. మా ఇంట్లో కూడా అంతా చికెన్ తింటారు'' అంటూ స్వయానా తెలంగాణ మంత్రి కేటీఆర్ సహా పలువురు నేతలు ప్రకటనలు చేసినా.. చికెన్ అమ్మకాలు పుంజుకోవడం లేదు.
దీంతో, హైదరాబాద్‌లో చికెన్ వ్యాపారులు ప్రత్యేక ఆఫర్లు ప్రకటిస్తున్నారు.
శుక్రవారం సైదాబాద్ శంకేశ్వర్‌బజార్‌లో కిలో లైవ్ చికెన్ ధర రూ.30, విత్‌స్కిన్ రూ.42, స్కిన్‌లెస్ రూ.50కే అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి చికెన్ సెంటర్లు అమ్మకాలు జరిపాయి.
చికెన్ ధరలపై ఆందోళనలతో అఖిల భారత ఫౌల్ట్రీ బ్రీడర్స్ సంఘ ప్రతినిధులు శుక్రవారం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడును కలిశారు.
చికెన్, కోడిగుడ్లు తింటే కరోనావైరస్ సోకదనే భరోసాను ప్రజలకు కలిగించాలని భారతీయ వైద్య పరిశోధన సంస్థ డీజీ ప్రొఫెసర్ బలరాం భార్గవను ఉపరాష్ట్రపతి ఆదేశించారు.
మరోవైపు వరంగల్ ఎంజీఎంలో కరోనా ఉన్నట్లు అనుమానిస్తున్న నిట్ పీహెచ్‌డీ స్కాలర్ ఇంటికి వెళ్తానని మారాం చేస్తున్నారు.
''నాకు ఏమీ కాలేదు. నన్ను ఇబ్బంది పెడుతున్నారు. నేను మా ఇంటికి పోతా'' అంటూ వరంగల్ ఎంజీఎంలో వైద్య పరీక్షలు చేసేందుకు వస్తున్న సిబ్బందిని సతాయిస్తున్నారు.
వైద్యులు సముదాయించి ఆయనకు చికిత్స అందిస్తున్నారు.
తెలంగాణలో మూడు కొత్త విమానాశ్రయాల ఏర్పాటుకు ప్రతిపాదనలు
తెలంగాణలో మూడు కొత్త విమానాశ్రయాలు ఏర్పాటు కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపినట్లు రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీ రామారావు (కేటీఆర్) తెలిపారని ఈనాడు దినపత్రిక ఓ వార్త ప్రచురించింది.
భద్రాద్రి కొత్తగూడెం, నిజామాబాద్‌లోని జక్రాన్‌పల్లి, మహబూబ్‌నగర్‌లోని గుడిబండలో కొత్త విమానాశ్రయాల కోసం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని కేటీఆర్ చెప్పారు.
వరంగల్ సమీపంలోని మామునూరు, పెద్దపల్లి జిల్లాలోని బసంత్‌నగర్, ఆదిలాబాద్‌లోని పాత విమానాశ్రయాలను పునర్వినియోగంలోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు.
హైదరాబాద్‌లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్న 'వింగ్స్ ఇండియా 2020' కార్యక్రమానికి కేటీఆర్ శుక్రవారం ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సభలో ఆయన మాట్లాడుతూ, మామునూరు విమానాశ్రయాన్ని సత్వరమే అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు.
ఇది హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి 150 కిలోమీటర్ల దూరంలో ఉందని, ఇప్పటికే ఉన్న ఒప్పందాలకు ఇది ఏ మాత్రం అడ్డంకి కాదని తెలిపారు.
ఏపీలో వైఎస్సార్ కాపరి బంధు
గొర్రెల కాపరుల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త పథకాన్ని అమలులోకి తీసుకువస్తున్నట్లు సాక్షి దినపత్రిక ఓ వార్త ప్రచురించింది.
ఎన్‌సీడీసీ (నేషనల్ కో ఆపరేటివ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్) ఆర్థిక సాయంతో 'వైఎస్సార్ కాపరి బంధు' పథకాన్ని ప్రభుత్వం అమలు చేయనుంది.
ఒక్కో లబ్ధిదారునికి 20 గొర్రెలు, ఒక పొట్టేలు కొనుగోలు చేసేందుకు ఆర్థిక సాయం చేయనుంది.
యూనిట్ల కొనుగోలుకు మంజూరు చేసే రుణంలో 30 శాతం సబ్సిడీ ఇవ్వనుంది. గొర్రెల రేట్లు అధికంగా ఉండటంతో ఒక యూనిట్ (20 గొర్రెలు, ఒక పొట్టేలు) కొనుగోలుకు రూ.1.50 లక్షలు మంజూరు చేయనుంది.
సంవత్సరానికి 12,500 మంది చొప్పున నాలుగు సంవత్సరాలకు 50 వేల మంది లబ్ధిదారులకు ప్రయోజనం కలిగించే విధంగా ఈ పథకాన్ని రూపొందించారు.
ఎన్‌సీడీసీ ఈ పథకానికి తొలుత రూ.200 కోట్లు కేటాయించేందుకు అంగీకరించిందని అధికారులు తెలిపారు.
పన్నులు, విద్యుత్ చార్జీలు పెంచుతాం: కేసీఆర్
వ్యవస్థలను ఆర్థికంగా బలోపేతం చేసేలా విద్యుత్ చార్జీలు, మున్సిపల్, గ్రామ పంచాయతీ పన్నులు కొంతమేర పెంచక తప్పదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు (కేసీఆర్) తెలిపినట్లు నమస్తే తెలంగాణ ఓ వార్త రాసింది.
పేదలపై ఎలాంటి భారం లేకుండా.. చెల్లించే స్థోమత ఉన్నవారి నుంచే వసూలు చేసేలా ఈ పెంపు ఉంటుందని కేసీఆర్ చెప్పారు.
ప్రజలకు నాణ్యమైన విద్యుత్‌ను అందిస్తున్నామని.. దాన్ని ఇస్తున్న సంస్థ బతకాలంటే విద్యుత్ చార్జీలు పెంచాకతప్పదని ఆయన అన్నారు.
పంచాయతీలు, మున్సిపాలిటీల్లో మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి కోసం పన్నుల రూపంలో కొంత భారం వేయాలని నిర్ణయించామని చెప్పారు.
ఈ నిర్ణయాన్ని ముందే ధైర్యంగా చెబుతున్నామని, వసూలైన పన్నుల్లో ప్రతిపైసా ప్రజలకోసమే ఖర్చుచేస్తామని తెలిపారు.
పన్నులు పెంచకుండానే పనులు చేస్తామని ప్రజలను మభ్యపెట్టలేమని.. పేదలకు భారం కలగకుండా పెంపు ఉంటుందని సీఎం చెప్పారు.
ఉదాహరణకు విద్యుత్‌చార్జీలనే తీసుకుంటే ఎస్సీ, ఎస్టీలకు 101 యూనిట్ల విద్యుత్ ఉచితంగా ఇస్తున్నామని.. వారికి రూపాయి కూడా చార్జీ పెంచేదిలేదని చెప్పారు. పన్ను చెల్లించే సామర్థ్యం ఉన్నవారికి మాత్రం చార్జీలు పెంచుతామని పేర్కొన్నారు.
పన్నులు వసూలుచేయని సర్పంచ్‌లు, గ్రామకార్యదర్శి ఉద్యోగాలు తీసేలా చట్టం ఉందని, దాన్ని వందశాతం అమలుచేస్తామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
- కరోనావైరస్: ఇంక్యుబేషన్ పీరియడ్ ఏమిటి? వైరస్ - ఫ్లూ మధ్య తేడా ఏమిటి? - ప్రజలు అడిగిన పది కీలక ప్రశ్నలు... నిపుణుల సమాధానాలు
- కరోనావైరస్: దిల్లీలో ఓ మహిళ మృతి.. భారత్‌లో రెండుకు చేరిన మరణాల సంఖ్య; కొన్ని రాష్ట్రాల్లో విద్యాసంస్థలు, థియేటర్లు బంద్
- కరోనావైరస్ భయాన్ని సైబర్ నేరగాళ్లు ఎలా సొమ్ము చేసుకుంటున్నారు ?
- ‘సీఏఏ వ్యతిరేక నిరసనలను చల్లార్చడానికే దిల్లీలో అలర్లు చేయించారు’
- కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో భార్యకు కరోనా.. బ్రెజిల్ అధ్యక్షుడికి కోవిడ్-19 పరీక్షలు
- యస్ బ్యాంకులో చిక్కుకుపోయిన ‘దేవుడి’ డబ్బులు... రూ.545 కోట్లు వెనక్కి వస్తాయా?
- కరోనావైరస్: మహమ్మారిని నిరోధించటానికి వివిధ దేశాలు చేపడుతున్న చర్యలు ఏమిటి?
- ఫరూక్ అబ్దుల్లా: ఏడు నెలల నిర్బంధం నుంచి కశ్మీర్ నాయకుడి విడుదల
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)