యెమెన్‌: మిలటరీ పెరేడ్‌పై క్షిపణులు, డ్రోన్ బాంబుల దాడి... 32 మంది మృతి

ప్రచురణ

యెమన్‌లో ఒక మిలిటరీ పెరేడ్‌పై జరిగిన దాడిలో 32 మంది మృతిచెందారు. హూతీ తిరుగుబాటుదారులు ఈ పెరేడ్‌ను క్షిపణులు, డ్రోన్‌తో టార్గెట్ చేశారు.

ఈ పెరేడ్ యెమెన్ దక్షిణ ప్రాంతంలో ఉన్న తీరప్రాంత నగరం అదన్‌లో జరిగినట్లు హూతీ తిరుగుబాటుదారులు నడిపే ఒక టీవీ ఛానల్ చెప్పింది.

యెమెన్‌లో అంతర్జాతీయ గుర్తింపు పొందిన అదన్ నగరం ప్రభుత్వానికి బలమైన కేంద్రం.

ఈ దాడికి ముందు అదన్ నగరంలోని ఒక పోలీస్ స్టేషన్లో ఆత్మాహుతి బాంబు పేలుడు జరిగింది. ఈ దాడిలో పది మంది మృతిచెందారు. అయితే ఇప్పటివరకూ ఈ రెండు ఘటనలకు ఏదైనా సంబంధం ఉందా అనేదానిపై స్పష్టత లేదు.

ప్రభుత్వం అండతో భద్రతా దళాలు తమపై మరో దాడి చేయడానికే పెరేడ్ చేస్తున్నాయని హూతీ తిరుగుబాటుదారులు చెప్పారు. అయితే, ప్రభుత్వం మాత్రం ఇది కొత్తగా శిక్షణ పొందిన సైనికుల 'గ్రాడ్యుయేషన్ సెరెమనీ' అని చెబుతోంది.

మిలిటరీ పెరేడ్‌పై దాడి తర్వాత అక్కడ భయానక స్థితి ఏర్పడింది. "అక్కడ నేలపై మృతదేహాల భాగాలు చెల్లాచెదురుగా పడ్డాయి, సైనికులు ఏడుస్తున్నారు" అని ఒక ప్రత్యక్ష సాక్షి వార్తా సంస్థ రాయిటర్స్‌కు చెప్పాడు.

"కార్యక్రమం నిర్వహిస్తున్న స్టాండ్ వెనుక పేలుడు జరిగింది. నేను సైనికులు ఒక శవం దగ్గర ఏడుస్తుండడం చూశాను. బహుశా అది వాళ్ల కమాండర్ మృతదేహమేమో" అన్నాడు.

సౌదీ సైనిక కూటమి దాడులు

ఈ దాడిలో చాలామంది గాయపడ్డారని అంతర్జాతీయ మెడికల్ ఏజెన్సీ ఎంఎస్ఎఫ్ కూడా చెప్పింది.

దాడి జరిగిన సైనిక శిబిరం ప్రభుత్వ మద్దతున్న భద్రతాదళాలకు సంబంధించినది. దానిని 'భద్రతా బెల్ట్' అనే పేరుతో పిలుస్తారు.

సుదీర్ఘ కాలంగా జరుగుతున్న యుద్ధంతో యెమెన్ బాధపడుతోంది. ముఖ్యంగా 2015 మార్చిలో హూతీ తిరిగుబాటుదారులు దేశంలో పశ్చిమంగా ఒక పెద్ద ప్రాంతాన్ని ఆక్రమించారు. అప్పటి అధ్యక్షుడు అబద్‌రబూ మన్సూర్ హాదీని యెమెన్ వదిలి వెళ్లిపోయేలా చేశారు.

షియా దేశమైన ఇరాన్ సైనిక మద్దతుతో హూతీ తిరుగుబాటుదారుల బలం అంతకంతకూ పెరుగుతుండడంతో ఆందోళనకు గురైన సౌదీ అరేబియా ఆ ప్రాంతంలోని మిగతా ఆరు సున్నీ దేశాలతో ఒక సైనిక కూటమి ఏర్పాటు చేసింది.

మళ్లీ హాదీ అధికారాన్ని తీసుకొచ్చేందుకు యెమెన్‌లో వైమానిక దళ ఆపరేషన్ కూడా ప్రారంభించింది. సున్నీ దేశాల కూటమికి అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ నుంచి నిఘా సమాచారం, సైనిక ఆపరేషన్లకు ఉపయోగపడే పరికరాలు కూడా అందుతున్నాయి.

సౌదీ మద్దతుతో జరిగిన సైనిక దాడుల్లో ఇప్పటివరకూ 10 వేలు నుంచి 70 వేల మంది వరకూ చనిపోయారు. వీరిలో ఎక్కువ మంది యెమెన్ పౌరులే. వీరిలో దాదాపు మూడొంతుల మంది కేవలం సౌదీ సైనిక కూటమి దాడుల్లోనే చనిపోయారు.

ఐక్యరాజ్యసమితి మిగతా అంతర్జాతీయ సంస్థలు యెమెన్ పరిస్థితిపై తరచూ ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కానీ దానివల్ల ఎలాంటి ప్రభావం కనిపించడం లేదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)