You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
వరల్డ్ కప్ 2019: పాకిస్తాన్ అభిమానులు ఈరోజు న్యూజీలాండ్ గెలవాలని ప్రార్థిస్తున్నారు... ఎందుకంటే?
క్రికెట్ వరల్డ్ కప్‌లో మొన్న ఇంగ్లండ్‌పై భారత్ గెలవాలని ప్రార్థించిన పాకిస్తాన్ అభిమానులు, ఈసారి న్యూజీలాండ్ విజయం సాధించాలని ప్రార్థిస్తున్నారు.
ఎందుకంటే, మంగళవారం ఇంగ్లండ్, న్యూజీలాండ్ మధ్య జరిగే మ్యాచ్ పాక్‌కు చాలా కీలకం. సెమీస్‌లో తలపడేది ఎవరో దీంట్లో తేలిపోయే అవకాశాలున్నాయి.
భారత్, ఆస్ట్రేలియా ఇప్పటికే సెమీస్ చేరాయి. మిగతా రెండు బెర్తుల కోసం సాంకేతికంగా నాలుగు జట్లు పోటీలో ఉన్నాయి. అవి న్యూజీలాండ్, ఇంగ్లండ్, పాకిస్తాన్, శ్రీలంక.
న్యూజీలాండ్ 11 పాయింట్లతో, ఇంగ్లండ్ 10 పాయింట్లతో, పాకిస్తాన్ 9 పాయింట్లతో, శ్రీలంక 8 పాయింట్లతో ఉన్నాయి. లీగ్ దశలో వీటన్నింటికీ ఒక్కో మ్యాచ్ మాత్రమే మిగిలుంది.
ఇంగ్లండ్‌తో న్యూజీలాండ్, బంగ్లాదేశ్‌తో పాకిస్తాన్, భారత్‌తో శ్రీలంక ఈ మ్యాచ్‌లు ఆడనున్నాయి.
ఇంగ్లండ్ గెలిస్తే..
మంగళవారం న్యూజీలాండ్‌పై గెలిస్తే, ఇంగ్లండ్ 12 పాయింట్లతో సెమీస్‌లో చోటు ఖాయం చేసుకుంటుంది. న్యూజీలాండ్‌కు కూడా పెద్ద ముప్పేమీ లేదు.
ఒకవేళ బంగ్లాదేశ్‌పై పాకిస్తాన్ గెలిచినా, న్యూజీలాండ్‌తో సమానంగా 11 పాయింట్లు మాత్రమే సాధించగలుగుతుంది. కానీ, నెట్ రన్ రేట్ విషయంలో న్యూజీలాండ్ (0.572) కన్నా పాకిస్తాన్ (-0.792) చాలా వెనుకబడి ఉంది. ఆ ఒక్క మ్యాచ్‌తో దాన్ని దాటడం దాదాపుగా అసాధ్యం.
ఇక భారత్‌తో ఆడే మ్యాచ్‌లో శ్రీలంక గెలిచినా మొత్తంగా 10 పాయింట్లే దక్కుతాయి కాబట్టి, ఆ జట్టు కూడా టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది.
న్యూజీలాండ్ విజయం సాధిస్తే..
ఇంగ్లండ్‌పై న్యూజీలాండ్ గెలవడం పాక్‌కు చాలా అవసరం.
అలా జరిగితే, న్యూజీలాండ్ 13 పాయింట్లతో సెమీస్ చేరుకుంటుంది. ఇంగ్లండ్‌కు పది పాయింట్లే ఉంటాయి.
అప్పుడు, పాక్ బంగ్లాదేశ్‌ను ఓడిస్తే చాలు. 11 పాయింట్లతో సెమీస్‌కు అర్హత సాధిస్తుంది. శ్రీలంకకు అవకాశాలు ఉండవు.
శ్రీలంక రేసులో ఉందా..
సాంకేతికంగా శ్రీలంకకు సెమీస్ చేరే అవకాశాలున్నా, అది జరగడం దాదాపు అసాధ్యమే.
ఇంగ్లండ్‌పై న్యూజీలాండ్, పాక్‌పై బంగ్లాదేశ్ గెలిచి.. తాము భారత్‌ను ఓడిస్తే శ్రీలంకకు సెమీస్ చేరే అవకాశాలు ఉంటాయి.
కానీ, నెట్ రన్ రేట్ విషయంలో ఇంగ్లండ్ (1) కన్నా శ్రీలంక (-0.934) మెరుగ్గా ఉండాలి. అది జరగడం చాలా చాలా కష్టం.
ఇవి కూడా చదవండి:
- ఇంగ్లండ్‌లో పుట్టి పెరిగిన భారత సంతతివారు కూడా ఆ జట్టుకు మద్దతు ఇవ్వట్లేదు
- మగాళ్ళ గర్భనిరోధక జెల్ ఎలా పని చేస్తుంది...
- 'దంగల్' అమ్మాయి జైరా వసీం సినిమా రంగాన్ని ఎందుకు వదిలేసింది...
- భారత్ ఓటమికి ధోనీని విలన్‌గా చూపడం సబబేనా?
- నాయకుడెవరూ లేకపోయినా.. యాప్స్ ద్వారా భారీ ఉద్యమం ఎలా సాధ్యమైంది?
- హైటెక్ వ్యవసాయం... వందేళ్లలో ఎంత మారింది?
- క్రికెట్ బంతిని ఎలా తయారు చేస్తారో చూశారా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)