తెలంగాణ: 'ప్రేమలేని లోకంలో నేనుండలేను' ప్రేమికుల రోజే రిమాండ్ ఖైదీ ఆత్మహత్య-ప్రెస్ రివ్యూ

ప్రచురణ

ప్రేమలేని ఈ లోకంలో నేనుండలేనంటూ 'ప్రేమికుల దినోత్సవం' రోజునే రిమాండ్‌ ఖైదీగా ఉన్న వరంగల్ జిల్లాకు చెందిన యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడని ఈనాడు దిన పత్రిక వార్తా కథనం ప్రచురించింది.

పోలీసుల కథనం ప్రకారం.. వరంగల్‌ జిల్లాలోని పర్వతగిరి గ్రామానికి చెందిన తేళ్ల భానుచందర్‌(24) డ్యాన్సర్‌. అదే గ్రామంలో ఉంటున్న..తనకంటే రెండేళ్లు పెద్దదైన మేనమామ కుమార్తె స్వర్ణలతను ప్రేమించాడు.

యువతి తరఫు వారు పెళ్లికి అంగీకరించకపోవడంతో గతేడాది మార్చి 10న గుడిలో పెళ్లి చేసుకున్నారు. యువకుడికి ఆస్తి లేదన్న కారణంతో అమ్మాయి తరఫు కుటుంబ సభ్యులు వారి వివాహాన్ని అంగీకరించలేదు. ఇద్దర్నీ దూరం పెట్టారు.

పెళ్లయి నెలలు గడుస్తున్నా భర్తతో కలిసి జీవించే అవకాశంలేకపోవడం, పెద్దవాళ్లు అంగీకరిస్తారనే నమ్మకం సన్నగిల్లిన క్రమంలో యువతి జనవరి 5న ఆత్మహత్య చేసుకుంది.

స్వర్ణలత ఆత్మహత్యకు భర్తే కారణమంటూ ఆమె కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. భానుచందర్‌పై పోలీసులు వరకట్న వేధింపులు సహా పలు సెక్షన్‌ల కింద కేసు నమోదుచేసి జనవరి 24న సంగారెడ్డి జిల్లా కేంద్ర కారాగారానికి రిమాండ్‌ ఖైదీగా తరలించారు.

అక్కడే సోమవారం ఉదయం 6 గంటల సమయంలో అతను స్నానాల గదిలో దుప్పటితో వెంటిలేటర్‌ చువ్వలకు ఉరేసుకున్నాడని పత్రిక చెప్పింది.

భార్య తరఫు వాళ్లే తమ కుమారుడి చావుకు కారణమయ్యారని మృతుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు సంగారెడ్డి గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేశారు.

తన చావుకు ఎవరూ కారణం కాదని, ఎవర్నీ ఇబ్బంది పెట్టొద్దంటూ 14 పేజీల సూసైడ్‌ లేఖలో బాధితుడు పోలీసులకు విజ్ఞప్తి చేశాడని ఈనాడు వివరించింది.

వివేకానంద రెడ్డి హత్య కేసులో అవినాశ్ రెడ్డి అనుమానితుడు-సీబీఐ

వైఎస్‌ వివేకానంద రెడ్డి 'గుండెపోటుతో మరణించారు' అని ఎంపీ వైఎస్‌ అవినాశ్‌ రెడ్డి, దేవిరెడ్డి శంకర్‌ రెడ్డే తొలుత ప్రచారం చేశారని సీబీఐ తేల్చి చెప్పినట్లు ఆంధ్రజ్యోతి వార్తా పత్రిక కథనం ప్రచురించింది.

ఆ కథనం ప్రకారం.. 2019 మార్చి 15వ తేదీన పులివెందులలో జరిగిన వివేకా హత్యపై గత ఏడాది అక్టోబరు 10న తొలి చార్జిషీటు, గతనెల 31వ తేదీన మరో నివేదికను కోర్టుకు సమర్పించింది.

దీని ప్రకారం... వివేకా గుండెపోటుతో మరణించారనే తప్పుడు ప్రచారం వెనుక అవినాశ్‌ రెడ్డి పాత్ర ఉందని స్పష్టం చేసింది.

''అప్పటికి బాత్‌రూమ్‌లో... రక్తపు మడుగులో వివేకానంద రెడ్డి మృతదేహం పడి ఉంది. డి.శంకర్‌ రెడ్డితో కలిసి ఎంపీ అవినాశ్‌ రెడ్డి అక్కడికి వచ్చారు.

ఆయన గుండెపోటుతో మరణించారనే థియరీ అప్పటికప్పుడే మొదలుపెట్టారు. ఈలోపు వైఎస్‌ భాస్కర్‌ రెడ్డి (అవినాశ్‌ రెడ్డి తండ్రి), వైఎస్‌ మనోహర్‌ రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి కూడా అక్కడికి చేరుకున్నారు.

గుండెపోటుతో మరణించారని ప్రచారం చేయడంపై అందరూ చర్చించుకున్నారు. గంగిరెడ్డి, శంకర్‌ రెడ్డి మరికొందరితో కలిసి పనివాళ్లతో బెడ్‌రూమ్‌లో, బాత్‌రూమ్‌లో రక్తపు మరకలను శుభ్రం చేయించారు.

వివేకా శరీరంపై ఉన్న గాయాలు కనిపించకుండా చక్కగా కట్లు కట్టించి... అంబులెన్స్‌లో పులివెందుల ఆస్పత్రికి తరలించారు'' అని సీబీఐ తెలిపింది.

సీబీఐ ఈ హత్య కేసులో అవినాశ్‌ రెడ్డిని అనుమానితుడిగా పేర్కొంది. ''కడప ఎంపీ టికెట్‌ తనకు లేదా వైఎస్‌ షర్మిలకు, అదీకాకపోతే వైఎస్‌ విజయమ్మకు దక్కాలని వివేకానందరెడ్డి గట్టిగా చెప్పేవారు. వైఎస్‌ అవినాశ్‌ రెడ్డికి టికెట్‌ ఇవ్వకూడదని భావించేవారు. ఈ నేపథ్యంలో... తనకు సన్నిహిత అనుచరుడైన డి.శంకర్‌రెడ్డితో అవినాశ్‌ రెడ్డే ఈ హత్య చేయించారనే అనుమానం ఉంది. అయితే... ఈ కోణంలో ఇంకా దర్యాప్తు సాగుతోంది'' అని సీబీఐ పేర్కొందని ఆంధ్రజ్యోతి వివరించింది.

ఆర్టీసీతో కలిసి డ్రైవింగ్ స్కూళ్ల ఏర్పాటు- ఏపీ సీఎం

ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గంలో ఒక డ్రైవింగ్‌ స్కూలు ఏర్పాటుకు ఆర్టీసీతో కలసి చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారని సాక్షి దినపత్రిక వార్త ప్రచురించింది.

ఈ సదుపాయాలను ఆర్టీసీ డ్రైవింగ్‌ శిక్షణ తదితరాల కోసం వినియోగించుకోవచ్చని సూచించారు. రహదారి భద్రత నిధికి సంబంధించి ప్రత్యేకంగా ఖాతా, అధికారులతో లీడ్‌ ఏజెన్సీ ఏర్పాటుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు.

సోమవారం సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన రాష్ట్ర రహదారి భద్రతా మండలి (ఆంధ్రప్రదేశ్‌ రోడ్‌ సేఫ్టీ కౌన్సిల్‌) సమావేశంలో పలు అంశాలపై చర్చించారు.

కొత్త జిల్లాలకు అనుగుణంగా ప్రతి చోటా ట్రామా కేర్‌ సెంటర్లను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశించారు.

కొత్తగా నిర్మిస్తున్న 16 మెడికల్‌ కళాశాలల్లో కూడా ట్రామా కేర్‌ సెంటర్లను నెలకొల్పాలన్నారు. అత్యాధునిక పద్ధతుల్లో అత్యవసర సేవలు అందించాలని స్పష్టం చేశారు.

ప్రమాదాలకు గురైన వారు కోలుకునేందుకు వీలుగా సహాయ, పునరావాస కేంద్రాన్ని విశాఖలో ఉంచాలని, తిరుపతి బర్డ్‌ ఆస్పత్రిలోని కేంద్రాన్ని మెరుగుపరచాలని ఆదేశించారు.

ప్రస్తుతం ఉన్న డ్రైవింగ్‌ లైసెన్స్‌ విధానాన్ని పునఃసమీక్షించాలని అధికారులను ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న చర్యలపై క్రమం తప్పకుండా సమీక్ష చేయాలన్నారు.

జిల్లాలవారీగా ఏర్పాటవుతున్న కమిటీలు కూడా రోడ్డు ప్రమాదాలు, తీసుకుంటున్న చర్యలను పరిశీలించాలన్నారని సాక్షి వివరించింది.

పంజాబ్ ముఖ్యమంత్రి హెలికాప్టర్‌ను అనుమతించని ప్రధాని భద్రతా సిబ్బంది

ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ప‌ర్య‌ట‌న నిమిత్తం పంజాబ్ సీఎం చ‌ర‌ణ్‌జిత్ సింగ్ చ‌న్నీ హెలికాప్ట‌ర్‌కు పీఎం భ‌ద్ర‌తా సిబ్బంది అనుమ‌తి ఇవ్వ‌లేదని నమస్తే తెలంగాణ దిన పత్రిక వార్త ప్రచురించింది.

షెడ్యూల్ ప్ర‌కారం ఎన్నిక‌ల ర్యాలీలో పాల్గొనేందుకు సీఎం చ‌న్నీ హోషీయాపూర్‌కు ఇవాళ వెళ్లాల్సి ఉంది. కానీ మోదీ జ‌లంధ‌ర్‌లో ఎన్నిక‌ల ర్యాలీలో ప‌ర్య‌టిస్తున్న సంద‌ర్భంగా చండీఘ‌ర్‌లోని రాజేంద్ర పార్కు ఏరియాను నో ఫ్లై జోన్‌గా ప్ర‌క‌టించామ‌ని పీఎం భ‌ద్ర‌తా సిబ్బంది తెలిపారు.

ఈ నేప‌థ్యంలో పంజాబ్ సీఎం హెలికాప్ట‌ర్‌కు అనుమ‌తివ్వ‌లేద‌ని పోలీసు వ‌ర్గాలు పేర్కొన్నాయి.

అయితే ఎన్నిక‌ల ర్యాలీలో పాల్గొనేందుకు హోషియాపూర్‌కు రాహుల్ గాంధీ హెలికాప్ట‌ర్‌లో వ‌చ్చారు. రాహుల్ హెలికాప్ట‌ర్‌కు పోలీసులు అనుమ‌తి ఇచ్చారు.

ఈ అంశంపై కాంగ్రెస్ నాయ‌కుడు సునీల్ జ‌ఖ‌ర్ స్పందించారు. హోషియాపూర్‌కు బ‌య‌ల్దేరేందుకు సిద్ధ‌మైన సీఎం చ‌న్నీ హెలికాప్ట‌ర్‌కు పీఎం భ‌ద్ర‌తా సిబ్బంది అనుమ‌తి ఇవ్వ‌క‌పోవ‌డం దారుణ‌మ‌న్నారు. సీఎం ప‌ర్య‌ట‌న‌ను అడ్డుకోవ‌డం సిగ్గుచేటు అని పేర్కొన్నారని పత్రిక వివరించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)