You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
విజయవాడ: వేధింపులు భరించలేక అపార్ట్‌మెంట్ మీద నుంచి దూకి బాలిక ఆత్మహత్య- ప్రెస్ రివ్యూ
విజయవాడలోని ఒక అపార్ట్‌మెంట్‌లో ఒక పెద్దమనిషి వేధింపులు తాళలేక ఒక బాలిక ఆత్మహత్య చేసుకుందని ఈనాడు దినపత్రిక ఒక కథనం ప్రచురించింది.
ఆ కథనం ప్రకారం నగరంలోని కుమ్మరిపాలెం సెంటర్లో ఈ ఘటన జరిగింది. సమాజంలో పెద్ద మనిషిగా చలామణి అవుతున్న ఒక వ్యక్తి కుమార్తె వయసున్న బాలిక పట్ల వక్రబుద్ధిని ప్రదర్శించాడు.
ఆయన అసభ్యకర మాటలు, లైంగిక చేష్టలు భరించలేకపోయిన బాలిక నిస్సహాయ స్థితిలో తనువు చాలించిందని ఈనాడు చెప్పింది.
తాము నివాసం ఉండే అపార్ట్‌మెంట్ భవనం పైనుంచి దూకి బాలిక ఆత్మహత్యకు పాల్పడింది.
శనివారం సాయంత్రం జరిగిన ఈ ఘటనకు సంబంధించి బాలిక రాసిన లేఖ ఆదివారం వెలుగు చూడడంతో సంచలనంగా మారింది.
ఇదే అపార్ట్‌మెంట్ నాలుగో అంతస్తులో నివసించే వినోద్ జైన్(55) బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లుగా పోలీసుల ప్రాథమిక విచారణలోనూ తేలింది.
ఆయనపై లైంగిక వేధింపులు, ఆత్మహత్యకు ప్రేరేపించడంపై 306, 354 సెక్షన్లతోపాటూ మృతురాలు మైనర్ కావడంతో పోక్సో కింద కేసులు పెట్టారు. ఎస్సై ప్రసాద్ ఈ కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఈనాడు వివరించింది.
పార్లమెంటు సమావేశాలను అడ్డుకోండి-సీఎం కేసీఆర్
కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు సరైన కేటాయింపులు లేకపోతే పార్లమెంట్ సమావేశాలను అడ్డుకోవాలని టీఆర్‌ఎస్ ఎంపీలను ఆ పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ ఆదేశించారని ఆంధ్రజ్యోతి దిన పత్రిక కథనం ప్రచురించింది.
రాష్ట్రానికి అన్యాయం జరిగితే సహించవద్దని సీఎం సూచించారు.
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఆదివారం ప్రగతి భవన్‌లో టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
''బీజేపీ సర్కారు రాష్ట్రానికి చేసిందేమీ లేదు. ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్లినా ప్రయోజనం లేదు. నేను స్వయంగా అనేకసార్లు ప్రధానమంత్రిని కలిశాను. లేఖలు ఇచ్చాను.
కేంద్రమంత్రులను కలిశాను. అయినా సమస్యలకు పరిష్కారం దొరకలేదు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా కేంద్రంలోని బీజేపీ సర్కారును ఉపేక్షించాల్సిన అవసరం లేదు. గట్టిగా నిలదీయాల్సిందే. మన రాష్ట్రానికి న్యాయంగా రావాల్సిన నిధుల కోసం పట్టుబట్టాల్సిందే.
ఈ విషయంలో కలిసివచ్చే బీజేపీయేతర రాష్ట్రాల ఎంపీలతో మాట్లాడండి. వారిని కూడా కలుపుకొని పోవాలి. ఇదే సమస్యను చాలా రాష్ట్రాలు ఎదుర్కొంటున్నాయి. బీజేపీయేతర రాష్ట్రాలు కేంద్ర వివక్షకు గురవుతున్నాయి. వారితో కూడా సంప్రదింపులు జరపండి. వారితో కలసి పోరాటం చేయండి.
పార్లమెంట్ జరిగే సమయంలో రాష్ట్రంలోనూ ఆందోళనలు చేస్తాం. సోమవారం సికింద్రాబాద్‌లో దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ కార్యాలయం ముందు భారీ ధర్నా నిర్వహిస్తాం. ఇక్కడ క్షేత్రస్థాయిలో పోరాటం చేస్తాం. మీరక్కడ పార్లమెంట్‌లో కేంద్రాన్ని నిలదీయండి'' అని సీఎం కేసీఆర్ ఎంపీలకు దిశానిర్దేశం చేశారని పత్రిక రాసింది.
ఏపీలో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్లు
ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయబోయే కొత్త జిల్లాల్లో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్లు నెలకొల్పేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తోందని సాక్షి దిన పత్రిక వార్తా కథనం ప్రచురించింది.
ప్రధానమైన జిల్లా కార్యాలయాలన్నింటినీ ఒకేచోట ఏర్పాటుచేయడం ద్వారా వాటిని ప్రజలకు మరింత అందుబాటులోకి తీసుకువచ్చినట్లవుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
దీనివల్ల భూమి అవసరం, వ్యయం కూడా చాలావరకు తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. తెలంగాణలో ఏర్పాటుచేసిన కొత్త జిల్లాల్లో పలుచోట్ల ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ కాంప్లెక్స్‌లు నిర్మించారు.
ఇతర రాష్ట్రాల్లో మరికొన్నిచోట్ల ఇలాంటివే ఉన్నాయి. వాటన్నింటినీ పరిశీలించి మన రాష్ట్ర పరిస్థితులు, అవసరాలను బట్టి ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్లు ఎలా ఏర్పాటుచేయాలనే దానిపై ఒక అవగాహనకు వచ్చినట్లు అధికార వర్గాలు తెలిపాయని సాక్షి వివరించింది.
తెలంగాణలో రేపటి నుంచి స్కూళ్లు
తెలంగాణలో మంగళవారం నుంచి పాఠశాలలు సహా అన్ని విద్యాసంస్థలు పునఃప్రారంభం కానున్నాయని మన తెలంగాణ పత్రిక వార్తా కథనం ప్రచురించింది.
కొవిడ్ కేసులు పెరుగుతున్నప్పటికీ, తీవ్రత తక్కువగా ఉండటం, ఇతర రాష్ట్రాలలో పాఠశాలలు ప్రారంభించడం వంటి కారణాలతో ప్రభుత్వం విద్యాసంస్థల ప్రారంభానికి అనుమతించింది.
అయితే పాఠశాలలు, కాలేజీల్లో కచ్చితంగా కొవిడ్ నిబంధనలు పాటించాలని ఇప్పటికే విద్యాశాఖ పాఠశాలలకు ఆదేశాలు జారీ చేసింది.
కొవిడ్ నేపథ్యంలో ఇప్పటికే టీచర్లకు వ్యాక్సినేషన్ పూర్తి కాగా, అర్హులైన విద్యార్థులందరికీ వ్యాక్సినేషన్ చేపట్టేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.
పిల్లల ఆరోగ్య భద్రత ముఖ్యమైన అంశం కాబట్టి, ప్రభుత్వం దానిపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా 15 నుంచి 18 ఏళ్ల విద్యార్థులందరికీ వ్యాక్సినేషన్ వేసేలా చర్యలు తీసుకుంటున్నారు.
మాస్కులు ధరించడంతో పాఠశాలల్లో భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని పాఠశాలలకు సూచించింది.
ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో పాఠశాలల్లో తరగతి గదులు, పరిసర ప్రాంతాల్లో కూడా పూర్తిగా శానిటైజ్ చేయడంతో పాటు కొవిడ్ నిబంధనలు పాటించేలా స్కూళ్లలో ఏర్పాట్లు చేస్తున్నారు.
పిల్లల్లో ఎవరికైనా జ్వరం, జలుబు వంటి కొవిడ్ లక్షణాలు కనిపిస్తే మాత్రం వారికి సెలవులు ఇవ్వనున్నట్లు తెలిసిందని పత్రిక వివరించింది.
ఇవి కూడా చదవండి:
- కోవిడ్19 లక్షణాలు ఉన్నవారికి టెస్టులు చేయకుండానే కరోనా కిట్లు పంచడం కరెక్టేనా?
- బ్యాంకు హ్యాక్ అయితే ఖాతాదారుల పరిస్థితి ఏంటి? వారి డబ్బు ఎవరు చెల్లిస్తారు?
- హైమెనోప్లాస్టీ: కన్వత్వ శస్త్రచికిత్సలపై ఎందుకు నిషేధం విధించాలని చూస్తున్నారు?
- అమెరికాలో పరమహంస యోగానంద ఆశ్రమంలో మహాత్ముడి అస్థికలు.. గాంధీ వారసులకు దీనిపై అభ్యంతరం ఎందుకు
- కరీంనగర్లో రోడ్డు పక్కన పనిచేసుకుంటున్నవారిపైకి దూసుకెళ్లిన కారు, నలుగురు మహిళల దుర్మరణం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)