ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాలపై మళ్లీ కదలిక - ప్రెస్‌ రివ్యూ

ప్రచురణ

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటుపై మళ్లీ చర్చ మొదలైందని ‘ఈనాడు’ కథనం రాసింది.

‘‘వైసీపీ లోక్‌సభ సభ్యులతో సమావేశమైనప్పుడు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో కొత్త జిల్లాల అంశం మరోమారు తెరపైకొచ్చింది.

గతేడాది కొత్త జిల్లాల ఏర్పాటుకు వీలుగా నోటిఫికేషన్ల జారీకి సిద్ధం కావాలన్న సీఎంవో ఆదేశాలతో అధికారులు అప్రమత్తమయ్యారు.

తదుపరి ఆదేశాలు రాకపోవడంతో రెవెన్యూ శాఖ అధికారులు కొత్త జిల్లాల ఏర్పాటు చర్యలను తాత్కాలికంగా పక్కనపెట్టారు.

మరోవైపు ఈ ఏడాది మార్చిలో జనగణన పూర్తయ్యే వరకూ దేశంలోని ఏ రాష్ట్రంలోనూ భౌగోళిక సరిహద్దులను మార్చడానికి వీల్లేదని భారత రిజిస్ట్రార్‌ కార్యాలయం స్పష్టం చేసింది.

ఈ నేపథ్యంలో వైకాపా పార్లమెంటు సభ్యులతో శుక్రవారం జరిగిన సమావేశంలో కొత్తగా జిల్లాల ఏర్పాటుతో కేంద్రం నుంచి నిధులు వస్తాయన్న దానిపై చర్చ జరిగింది.

ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు జగన్‌ పేర్కొనడంతో ఈ అంశం మరోమారు చర్చల్లో నిలిచింది. ప్రతి లోక్‌సభ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా ప్రకటిస్తామని.. ఇవి 25 లేదా 26 ఉంటాయని గతేడాది ఆగస్టులోనే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

కొత్త జిల్లాల కోసం ఏర్పాటైన రాష్ట్ర స్థాయి కమిటీ, ఉప సంఘాలు, జిల్లా కమిటీల వరుస సమావేశాలు హడావుడిగా జరిగాయి.

రాష్ట్రంలో ప్రస్తుతం 13 జిల్లాలు ఉన్నాయి. జిల్లా కేంద్రం కానున్న పట్టణానికి మిగిలిన నియోజకవర్గ కేంద్రాల నుంచి దూరం, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని తాత్కాలిక, మధ్యకాలిక, శాశ్వత ప్రణాళికలతో వివరాలను సిద్ధం చేశారు.

లోక్‌సభ స్థానాలు ప్రామాణికంగా కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తే అవి 25కు పెరుగుతాయి. అరకు నియోజకవర్గ విస్తీర్ణం పెద్దగా ఉండటంతో దీన్ని రెండు జిల్లాలుగా ఏర్పాటు చేయనున్నారు.

కొత్త జిల్లాల ఏర్పాటుకు వీలుగా ప్రభుత్వ, ప్రైవేట్‌ కళాశాలలు, ఇతర భవనాలు, ప్రధాన రహదారుల వివరాలు సేకరించారు. వాటిని పరిశీలించారు.

లోక్‌సభ నియోజకవర్గాల సరిహద్దులు, భౌగోళిక విస్తీర్ణం, రెవెన్యూ డివిజన్లు, మండలాలు, గ్రామాలు, ఇతర వివరాలను హడావుడిగా సిద్ధం చేశారు.

కొత్తగా ఏర్పాటయ్యే జిల్లాల్లో పోలీసు జిల్లా కార్యాలయాల భవనాలు, స్థలాల సేకరణ, సిబ్బంది కేటాయింపు ఇతర అంశాలపై పోలీసు శాఖ కూడా కొంత కసరత్తు చేసింది.

తర్వాత వాటన్నింటినీ తాత్కాలికంగా పక్కనపెట్టారు. అయితే తాజాగా సీఎం చేశారంటున్న వ్యాఖ్యలపై అధికారికంగా తమకు ఎటువంటి సమాచారం రాలేదని సీనియర్‌ అధికారులు చెబుతున్నారు’’ అని ఆ కథనంలో పేర్కొన్నారు.

బాగా మాట్లాడతారు.. ఏమీ చేయరు: నిర్మాత డి.సురేశ్ బాబు

‘సినిమావాళ్లకు ప్రభుత్వాలు గౌరవం ఇస్తాయి. బాగానే మాట్లాడతారు. ఏదడిగినా చేస్తాం అంటారు. కానీ ఏమీ చేయరు. బహుశా ఈ పరిస్థితికి ప్రభుత్వానికీ సినీ పెద్దలకూ మధ్య మిస్‌ కమ్యూనికేషన్‌ కారణమేమో!’ అని సినీ నిర్మాత డి.సురేశ్‌బాబు వ్యాఖ్యానించారని ‘ఆంధ్రజ్యోతి’ కథనం రాసింది.

‘‘లాక్‌డౌన్‌లో విద్యుత్‌ బిల్లుల చెల్లింపుల విషయంలో థియేటర్ల యాజమాన్యాలకు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు ఇప్పటికీ నెరవేర్చలేదని సురేశ్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు.

ఇటీవల ఓటీటీలో విడుదలైన ‘దృశ్యం2’ సినిమాకు మంచి ఆదరణ దక్కుతున్న సందర్భంగా శనివారం సురేశ్‌బాబు మీడియాతో మాట్లాడారు.

ఏపీలో టికెట్‌ రేట్ల వ్యవహారంపై ఆయన స్పందిస్తూ ‘దృశ్యం 2’ సినిమాను ఓటీటీలో విడుదల చేయడానికి చాలా కారణాలు ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్‌ రేట్ల తగ్గింపు ఇందులో ఒక కారణం మాత్రమేనని చెప్పారు. ‘ఏ సెంటర్లలో టికెట్‌ రేటు రూ.100 అంటే ఫరవాలేదు.

కానీ బీ,సీ సెంటర్లలోనూ రూ.20, రూ.30 పెడితే నిర్మాతకు చాలా నష్టం వస్తుంది. వాటితో థియేటర్‌ కరెంట్‌ బిల్లు కూడా కట్టలేరు. ప్రభుత్వం అలా చేయడం సమంజసం కాదు.

తన ఉత్పత్తిని ఎంత రేటుకు అమ్ముకోవాలనేది నిర్మాత హక్కు. సినిమా చూడాలా వద్దా అనేది ప్రేక్షకుడి ఇష్టం.

కరోనా వల్ల చిత్ర పరిశ్రమ తీవ్ర ఇబ్బందులకు గురైనా ఇన్నాళ్లుగా రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ చేసిన సాయం శూన్యం. తక్కువ ధరలకు టికెట్లు అమ్మడం వల్ల ప్రభుత్వాలకు ప్రజల్లో పలుకుబడి పెరుగుతుందేమో కానీ థియేటర్ల మనుగడకు తీవ్ర నష్టం చేస్తుంది. ప్రభుత్వాలు కూడా చిత్ర పరిశ్రమను చిన్నచూపు చూస్తున్నాయి’ అని డి.సురేశ్‌బాబు అన్నారని ఆ కథనంలో పేర్కొన్నారు.

ఏపీ నుంచి భారీగా ఆహార, ఆక్వా ఉత్పత్తుల ఎగుమతులు

ఏపీ నుంచి ఆహార ఉత్పత్తుల ఎగుమతులు పెరిగాయని ‘సాక్షి’ కథనం తెలిపింది.

‘‘కరోనా మహమ్మారి కారణంగా లాక్‌డౌన్, ఆంక్షలు ఉన్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలతో ఆహార, ఆక్వా ఉత్పత్తుల ఎగుమతులు కొనసాగాయి.

లాక్‌డౌన్‌ ఎత్తివేయగానే మరింత జోరందుకుని, ఎగుమతులు కొత్త పుంతలు తొక్కాయి.

టీడీపీ హయాంలో ఒక ఏడాదిలో జరిగిన ఎగుమతుల కంటే గత ఆర్థిక సంవత్సరం (2020–21)లో 21 లక్షల టన్నులకు పైగా ఎక్కువగా ఆహార, ఆక్వా ఉత్పత్తుల ఎగుమతులు జరిగాయి.

రాష్ట్రం నుంచి ఆక్వా ఉత్పత్తులు, బియ్యం, మొక్కజొన్న, అపరాలు, శుద్ధి చేసిన పండ్లు, పండ్ల రసాలు, కూరగాయలు, బెల్లం ఉత్పత్తులు భారీగా ఎగుమతవుతున్నాయి.

ఎక్కువగా అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూరోపియన్, అరబ్‌ దేశాలకు ఎగుమతవుతున్నాయి.

గత ఆర్థిక సంవత్సరం 2020–21లో రికార్డు స్థాయిలో రూ.29 వేల కోట్ల విలువైన 55.68 లక్షల మెట్రిక్‌ టన్నుల ఆహార, ఆక్వా ఉత్పత్తులు ఎగుమతి కాగా, ఈ ఏడాది (2021–22) తొలి ఆరు నెలల్లోనే (ఏప్రిల్‌ నుంచి సెప్టెంబరు వరకు) రూ.19 వేల కోట్ల విలువైన 38.86 లక్షల మెట్రిక్‌ టన్నులు ఎగుమతి అయ్యాయి.

ఇది అరుదైన రికార్డు అని వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల అభివృద్ధి సంస్థ (ఎపెడా) చెబుతోంది" అని ఆ కథనంలో రాశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)