కర్నూలులో విషాదం: కార్తీక దీపం వదులుతూ దంపతులు మృతి - ప్రెస్‌రివ్యూ

ప్రచురణ

కార్తీక మాస దీప కార్యక్రమంలో కర్నూలులోని కేసీ కాలువలో ప్రమాదవశాత్తు పడిన దంపతులు మృతి చెందారని 'ఈనాడు' కథనం తెలిపింది.

'కర్నూలులోని అబ్బాస్‌ నగర్‌లో నివాసం ఉండే రాఘవేంద్రప్రసాద్‌(44) టీజీవీ గ్రూప్‌ సంస్థలో పని చేస్తుండేవారు. ఆయనకు భార్య ఇందిర(41), ఇద్దరు కుమారులు.

కార్తీక పౌర్ణమి కావడంతో రాఘవేంద్ర ప్రసాద్‌ దంపతులు శుక్రవారం ఉదయం 5 గంటలకు వినాయక్‌ ఘాట్‌ వద్ద కేసీ కాల్వ పక్కనే ఉన్న గుడికి వెళ్లారు.

ఇందిర కాలువలో దీపం వదులుతూ అదుపుతప్పి అందులో పడిపోయారు.

ఆమెను కాపాడేందుకు వెళ్లి రాఘవేంద్రప్రసాద్‌ కూడా కాల్వలో పడిపోయారు.

స్థానికులు గమనించి వీరిని కాపాడేందుకు ప్రయత్నించగా.. ప్రవాహం ఉద్ధృతంగా ఉండటంతో ఇద్దరూ అప్పటికే కొట్టుకుపోయారు.

సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వచ్చి విస్తృతంగా గాలింపు చేపట్టారు.

చివరికి ఘటన స్థలం నుంచి సుమారు 4 కి.మీ దూరంలోని జొహరాపురం వద్ద ఆ దంపతుల మృతదేహాలను గుర్తించారని ఆ కథనంలో తెలిపారు.

తెలంగాణలో మద్యంషాపులకు పోటెత్తిన దరఖాస్తులు

తెలంగాణలో కొత్త మద్యం దుకాణాలకు మొత్తం 67,849 దరఖాస్తులు వచ్చాయని 'ఆంధ్రజ్యోతి' కథనం తెలిపింది.

''గురువారం అర్ధరాత్రి ఒంటి గంట వరకు దరఖాస్తులకు అవకాశమివ్వగా.. గడువులోగా దాఖలైన దరఖాస్తుల రూపేణా ప్రభుత్వానికి రూ.1,357 కోట్ల ఆ దాయం వచ్చింది.

2015-17లో 35 వేల దరఖాస్తులు దాఖలుకాగా.. రూ.498 కోట్ల ఆదాయం సమకూరింది.

రాష్ట్రంలో ప్రస్తుతం 2,620 మద్యం దుకాణాలున్నాయి. సగటున ఒక్కో దుకాణానికి 26 మంది చొప్పున పోటీ పడుతున్నారు.

34 ఎక్సైజ్‌ జిల్లాల్లో శనివారం లాటరీ ద్వారా మద్యం దుకాణాలను కేటాయించనున్నారు.

జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో లాటరీ ప్రక్రియ కొనసాగుతుంది. తక్కువ దరఖాస్తులు వచ్చిన మద్యం దుకాణాలపై విచారణ చేసిన తర్వాత లాటరీ తీయాలని ఎక్సైజ్‌ శాఖ భావిస్తోంది.

లాటరీ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు.

ఊహించిన విధంగానే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మద్యం దుకాణాలకు దరఖాస్తులు వెల్లువెత్తాయి. ఏపీలోని కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన వ్యాపారులు సరిహద్దు షాపుల కోసం భారీగా దరఖాస్తులు చేయడంతో గతంలోకంటే ఈసారి ఎక్సైజ్‌ శాఖ భారీగా ఆదాయం వచ్చింది.

రాష్ట్రవ్యాప్తంగా ఖమ్మం జిల్లా 6,212 దరఖాస్తులతో ఒకటో స్థానంలో, భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా(3,718 దరఖాస్తులు) రెండోస్థానంలో నిలిచింది.

కృష్ణా జిల్లాకు సరిహద్దున ఉన్న ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం రాజుపాలెం దుకాణానికి 121, ఎర్రుపాలేనికి 100, ముదిగొండ మండలంలోని వల్లభికి 108 చొప్పున దరఖాస్తులు వచ్చాయి. పెనుబల్లి, కల్లూరు, వేంసూరు, నేలకొండపల్లి, మధిర, వైరా, సరిహద్దుల్లోనూ అధికసంఖ్యలో దరఖాస్తులు అందాయి.

పశ్చిమగోదావరి సరిహద్దున ఉన్న అశ్వారావుపేట ఎక్సైజ్‌ సర్కిల్‌లో 762 దరఖాస్తులు రాగా.. ఇక్కడ గోదావరి జిల్లాలకు చెందిన వ్యాపారులదే హవా ఉన్నట్లు తెలుస్తోంద''ని ఆ కథనంలో పేర్కొన్నారు.

కరోనా నుంచి కోలుకున్న ఏపీ గవర్నర్‌.. వరదల పరిస్థితిపై సీఎం జగన్‌తో చర్చ

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వ భూషణ్ హరిచందన్ కరోనా నుంచి కోలుకున్నారని 'సాక్షి' కథనం తెలిపింది.

''కాగా, గవర్నర్‌కు ఈ నెల 17న కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో హైదరాబాద్‌లోని ఎఐజి హాస్పిటల్‌లో చేర్పించారు. ప్రస్తుతం ఆయన సాధారణంగానే ఆక్సిజన్ తీసుకుంటూ వేగంగా కోలుకుంటున్నట్లు వైద్యులు నిర్ధారించారు.

కరోనా బారి నుంచి కోలుకున్న గవర్నర్‌.. ఏపీలో వరద పరిస్ధితిపై సీఎం జగన్‌తో ఫోన్లో చర్చించారు.

పలు జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాలు, వరద పరిస్ధితి, సహాయక చర్యలపై ఆరా తీసారు. ప్రభుత్వం చేపడుతున్న సహాయ కార్యక్రమాలని సీఎం జగన్‌ గవర్నర్‌కి వివరించారు.

వరదల నేపధ్యంలో అప్రమత్తంగా ఉండాలని గవర్నర్‌ ప్రజలకు సూచించార''ని ఆ కథనంలో తెలిపారు.

'ఈమెది కూడా 'జైభీమ్' సినతల్లి లాంటి కథే.. కానీ, న్యాయం ఇంకా జరగలేదు'

కేరళకు చెందిన ఓ మహిళ అయిదేళ్లుగా న్యాయం కోసం పోరాడుతోందని 'నమస్తే తెలంగాణ' కథనం తెలిపింది.

''భాగ్యవతిది కూడా 'జై భీమ్‌' చిత్రంలో సినతల్లి పాత్రను తలపించే కథే. ఇద్దరు కూతుళ్ల మరణానికి కారణమైన మృగాళ్లను ఉరితీయాలంటూ ఆ దళిత మహిళ ఐదేండ్లుగా పోరాడుతూనే ఉన్నది. ఎప్పట్లానే న్యాయ దేవత తక్కెడ పెద్దలవైపే తూగింది. అయినా, భాగ్యమ్మ నిరాశపడలేదు.

కేరళలోని పాలక్కడ్‌ జిల్లా వలయార్‌ ప్రాంతానికి చెందిన భాగ్యవతికి ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు. 2017లో భార్యాభర్తలిద్దరూ కూలీపనికి వెళ్లొచ్చే సమయానికి.. పదమూడేండ్ల పెద్ద కూతురు తాము ఉంటున్న షెడ్డులో శవమై కనిపించింది.

పోస్ట్‌మార్టమ్‌ నివేదికలో ఆ బాలిక లైంగిక దాడికి గురైనట్లు వెల్లడైంది. అదే సమయంలో ఇంట్లోంచి ఇద్దరు మగవాళ్లు బయటికి రావడాన్ని కండ్లారా చూశానని భాగ్యమ్మ చిన్న కూతురు పోలీసులకు చెప్పింది. ఆ సంఘటన జరిగిన కొద్ది రోజులకే చిన్న కూతురు కూడా అదే ఇంట్లో శవమై వేలాడింది.

అప్పటి నుంచీ తమకు న్యాయం కావాలంటూ భాగ్యవతి తిరగని చోటు లేదు. రెండేండ్ల క్రితం, పోక్సో ప్రత్యేక కోర్టు నిందితులను నిర్దోషులుగా భావించి విడుదల చేసింది. ఆ బాలికలు ఆత్మహత్య చేసుకున్నట్లు నిర్ధారించింది. అయినా ఆ తల్లి వెనక్కి తగ్గలేదు. ఆ పట్టుదలకు, గత ఏడాది సీబీఐ రంగంలో దిగింది. రెండు వేర్వేరు కేసులు నమోదు చేసి, విచారణ మొదలుపెట్టింది.

తమ విషయంలో పాలకుల నిర్లిప్తతకు నిరసనగా.. గత ఎన్నికల్లో సీఎం పినరయి విజయన్‌కు వ్యతిరేకంగా నామినేషన్‌ కూడా వేసిందామె. అలా, ఒక దళిత కుటుంబం న్యాయం కోసం ఎదురు చూస్తున్నదని ముఖ్యమంత్రికి తెలిసేలా చేసింది. 'సీబీఐ విచారణ పూర్తయ్యే వరకు వేచి చూస్తాం.

నా కూతుళ్లను కిరాతకంగా చంపారన్నది వాస్తవం. హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటున్న నా కొడుకుని కూడా బెదిరిస్తున్నారు. దయచేసి మాలాంటి దళితులకు న్యాయం జరిగేలా చూడండి' అని పాలకులకు విజ్ఞప్తి చేస్తున్నది భాగ్యవతి'' అని ఆ కథనంలో పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.