అమిత్ షాకు జగన్ విన్నపం.. విభజన హామీలు నెరవేర్చాలి - ప్రెస్ రివ్యూ

ప్రచురణ

విభజనతో ఏపీ తీవ్రంగా నష్టపోయిందని దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశంలో సీఎం జగన్‌ అన్నారని సాక్షి దినపత్రిక వార్తా కథనం ప్రచురించింది.

'రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్‌ తీవ్రంగా నష్టపోయింది. ఉమ్మడి రాష్ట్రాన్ని విభజించి ఏడేళ్లు దాటినప్పటికీ పునర్విభజన చట్టంలోని హామీలను కేంద్రం ఇప్పటికీ పూర్తిగా అమలు చేయడం లేదు.

దాంతో రాష్ట్రం మరింతగా నష్టపోతోంది. కేంద్రం తక్షణం జోక్యం చేసుకుని విభజన చట్టం హామీలను అమలు చేయాలి' అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

తిరుపతిలో ఆదివారం కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా అధ్యక్షతన నిర్వహించిన దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశంలో ఆయన రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణకు సంబంధించిన అనేక కీలక అంశాలపై మాట్లాడారని సాక్షి తన కథనంలో రాసింది.

‘‘2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజన తర్వాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ మధ్య విభజనకు సంబంధించి అనేక అంశాలు అపరిష్కృతంగానే ఉన్నాయని చెప్పారు.

దాంతో రెండు రాష్ట్రాలు ఆర్థికంగా నష్టపోతున్నాయని, రెండు రాష్ట్రాల మధ్య సంబంధాలపై కూడా అవి ప్రభావం చూపుతున్నాయని పేర్కొన్నారు.

ప్రధానంగా ఏపీ ఎంతగానో నష్టపోతున్న దృష్ట్యా పెండింగ్‌లో ఉన్న అంశాలను త్వరగా పరిష్కరించాలని కోరారని’’ సాక్షి కథనంలో పేర్కొన్నారు.

దొంగఓట్లు వేయడానికి బయటివారు వచ్చారు-చంద్రబాబు

కుప్పంలో దొంగ ఓట్లు వేయించేందుకు బయటి ప్రాంతాల వారిని తీసుకొచ్చారని, వెంటనే వారందరినీ పంపించేసేలా చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు డిమాండ్‌ చేశారని ఆంధ్రజ్యోతి దిన పత్రిక వార్తా కథనం ప్రచురించింది.

తప్పుచేసిన వారిని వదిలేసి తెలుగుదేశం కార్యకర్తలపైనే పోలీసులు జులుం ప్రదర్శిస్తున్నారని, దీనిపై చర్యలు తీసుకోవాలని చంద్రభాబు అన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు చంద్రబాబు ఈ విషయంపై ఆదివారం లేఖ రాశారు.

''కుప్పం మున్సిపాలిటీలో సోమవారం పోలింగ్‌ జరగనుంది. దానికి 48 గంటల ముందే ప్రచారం ఆపేయాలి. బయటి ప్రాంతాల వారు వెళ్లిపోవాలి.

దీనికి భిన్నంగా వైసీపీ అక్కడ ప్రచారం నిర్వహించి డబ్బు పంపిణీ చేసింది. తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికల్లో చేసినట్లు ఇక్కడ కూడా బయటివారిని తీసుకొచ్చి వారితో ఓట్లు వేయించేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకుంది.

పోలీసులకు పిర్యాదు చేస్తుంటే.. వారు తెలుగుదేశం నేతలపైనే కేసులు పెడుతున్నారు. కుప్పం మున్సిపాలిటీలోని 23, 24 వార్డుల్లో బయటివారు వచ్చి డబ్బులు పంపిణీ చేయడం చూసిన టీడీపీకి చెందిన నగర అధ్యక్షుడు రాజ్‌కుమార్‌ అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఆయనపై వారు దాడి చేసి కులం పేరుతో తిట్టారు.

ఫిర్యాదు చేసేందుకు పోలీస్‌ స్టేషన్‌కు వెళ్తే వైసీపీ నేతలు మీపై ఫిర్యాదు చేశారంటూ, కస్టడీలోకి తీసుకుంటున్నామని చెప్పారు. దీనిపై రాష్ట్ర ఎన్నికల సంఘం తగు చర్యలు తీసుకోవాలి. ఎన్నికల నిబంధనలు అమలు చేయాలి'' అని చంద్రబాబు డిమాండ్‌ చేశారు.

వైసీపీ నేత, మొదలియార్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ బుల్లెట్‌ సురేశ్‌ బయటి ప్రాంతం వారని, ఆయన బుల్లెట్‌ ఫ్రూఫ్‌కారు కుప్పంలోనే ఉందని చంద్రబాబు ఆరోపించారని ఆంధ్రజ్యోతి వివరించింది.

రిక్షావాలాకు రూ. కోటి ఆస్తి రాసి ఇచ్చేసిన బామ్మ

ఒక బామ్మ తన కుటుంబానికి అండగా ఉన్న రిక్షావాలాకు కోటి రూపాయల ఆస్తి రాసినట్లు నమస్తే తెలంగాణ దినపత్రిక వార్త ప్రచురించింది.

ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా తమ కుటుంబానికి సేవ చేస్తున్న ఓ రిక్షావాలా రుణాన్ని తీర్చుకున్నారు ఓ బామ్మ.

ఏకంగా కోటి రూపాయల విలువైన తన ఆస్తిని రాసిచ్చారు. ఈ ఘటన ఒడిశాలో ఇటీవల చోటుచేసుకున్నది.

మినతీ పట్నాయక్‌ (63) గత పాతికేండ్లుగా కటక్‌లో ఉంటున్నారు. గతేడాది ఆమె భర్త మరణించారు. ఈ ఏడాది కూతురు కూడా చనిపోయింది.

దీంతో మినతీ ఎంతో కుంగిపోయారు. బంధువులు ఎవ్వరూ ఆమెను చేరదీయలేదు. దుఃఖంతో కుంగిపోయిన ఆమెకు బుదా సామల్‌ అనే రిక్షావాలా దంపతులు ఆసరాగా నిలిచారు.

అనారోగ్యం బారినపడ్డ ఆ వృద్ధురాలికి సేవ చేశారు. తన కోసం ఇంత చేసిన బుదాకు ఏమైనా సాయం చేయాలని ఆ బామ్మ అనుకున్నారు. తన మూడంతస్తుల భవనం, బంగారు ఆభరణాలను రాసిచ్చి కృతజ్ఞతను చాటుకున్నారని పత్రిక వివరించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)