పిల్లలకు కరోనా వ్యాకీన్: 'జైకోవ్-డి' టీకాకు డీజీసీఐ అత్యవసర అనుమతి: ప్రెస్ రివ్యూ

ప్రచురణ

భారత్‌లో 12 ఏళ్ల వయసు దాటినవారికి తొలిసారిగా కోవిడ్‌ టీకా అందుబాటులోకి వచ్చిందని ఆంధ్రజ్యోతి వార్తా పత్రిక ఒక వార్త ప్రచురించింది.

ఇప్పటివరకు 18 ఏళ్లు పైబడిన వారికే వ్యాక్సీన్‌ ఇస్తుండగా.. ఇకపై ఆలోపు వయస్సు ఉన్న వారికీ టీకా అందనుంది.

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన జైడస్‌ క్యాడిలా సంస్థ రూపొందించిన జైకొవ్‌-డి టీకాకు డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ) శుక్రవారం అత్యవసర వినియోగ అనుమతులు మంజూరు చేసింది.

అంతకుముందు నిపుణుల కమిటీ.. డీసీజీఐకి ఈ మేరకు సిఫారసు చేసింది. తమ టీకాకు అనుమతి కోరుతూ జైడస్‌ క్యాడిలా జూలై 1న డీసీజీఐకి దరఖాస్తు చేసుకుంది.

వయోజనులతో పాటు, 12 నుంచి 18 ఏళ్ల వయసు వారిపైనా తమ టీకా ప్రభావవంతంగా పనిచేస్తుందని అందులో స్పష్టం చేసిందని పత్రిక రాసింది.

కాగా, జై కొవ్‌-డి టీకా అన్ని రకాల వేరియంట్ల నుంచి రక్షణ కల్పిస్తుందని కేంద్రం పేర్కొంది.

ప్రస్తుత, ప్రత్యేకించి డెల్టా వేరియంట్‌తో పాటు భవిష్యత్‌లో వచ్చే వైరస్‌ మ్యుటేషన్లనూ ఎదుర్కొనగలదని వివరించింది.

మరోవైపు 28 వేలమందిపై చేసిన మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌లో జై కొవ్‌-డి టీకా సామర్థ్యం 66.66గా ఉన్నట్లు కేంద్రం తెలిపిందని ఆంధ్రజ్యోతి చెప్పింది.

కేంద్ర బయో టెక్నాలజీ శాఖ, ఐసీఎంఆర్‌ భాగస్వామ్యంతో 'మిషన్‌ కొవిడ్‌ సురక్ష' కింద అభివృద్ధి చేసిన జైకొవ్‌-డి టీకాను 2 నుంచి 8 డిగ్రీల ఉష్ణోగ్రతలో నిల్వ చేయొచ్చు.

ఏటా 10 కోట్ల నుంచి 12 కోట్ల టీకాలను ఉత్పత్తి చేయగలమని సంస్థ గతంలో తెలిపింది.

భారత్‌ బయోటెక్‌ ఉత్పత్తి కొవాగ్జిన్‌ తర్వాత మనదేశంలో తయారై వినియోగ అనుమతులు పొందిన రెండో టీకా జై కొవ్‌-డి.

అనుమానంతో కాబోయే భార్యపై హత్యాయత్నం

ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లాలో అనుమానంతో ఒక యువకుడు కాబోయే భార్యపై హత్యాయత్నం చేసినట్లు ఈనాడు దిన పత్రిక కథనం ప్రచురించింది.

దానిప్రకారం.. శ్రీకాకుళంజిల్లా రణస్థలం మండలం నారువకి చెందిన వాళ్లె రాంబాబు(24), పూసపాటిరేగ మండలం చౌడువాడకు చెందిన గాలి రాములమ్మ (22) రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెద్దలు వారి పెళ్లికి అంగీకరించారు. అక్టోబరులో పెళ్లి చేద్దామని ఏర్పాట్లు చేసుకున్నారు.

ఇంతలో రాములమ్మ వేరే యువకుడితో మాట్లాడుతోందని రాంబాబు ఆమెపై అభాండాలు వేశాడు. పెళ్లికి నిరాకరించడంతో రాములమ్మ తల్లిదండ్రులు రాంబాబు కుటుంబసభ్యులతో మాట్లాడినా సయోధ్య కుదరలేదు. పది రోజుల క్రితం పెద్దల సమక్షంలో పోలీసులు రాజీ కుదర్చడంతో రాంబాబు పెళ్లికి అంగీకరించాడు.

ఇంతలో గురువారం అర్ధరాత్రి యువతి ఇంటికి వచ్చి నిద్రిస్తున్న రాములమ్మపై పెట్రోలు పోసి నిప్పంటించి, అక్కడ నుంచి పరారయ్యాడు. మంటల్లో చిక్కుకున్న రాములమ్మ దుప్పటి విసిరేయగా, అది పక్కనే ఉన్న సోదరి సంతోషి, ఆమె కుమారుడు అరవింద్‌ మీద పడి, వాళ్లకూ మంటలు అంటుకున్నాయని పత్రిక రాసింది.

వీరి కేకలు విని చుట్టుపక్కల వారు వచ్చి మంటలను అదుపు చేసి బాధితులను ఆసుపత్రికి తరలించారు. పోలీసులు రాంబాబును అదుపులోకి తీసుకున్నారు.

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ముగ్గురినీ ఎస్పీ దీపిక ఎం.పాటిల్‌ పరామర్శించారు. 'రాములమ్మ సోదరి ఫోన్లో దిశయాప్‌ బటన్‌ నొక్కడంతో పోలీసులు సకాలంలో వెళ్లి, వారికి మెరుగైన వైద్యం అందించడానికి వీలైంది. స్టేషన్‌కు 20 కి.మీ దూరంలో ఉన్న చౌడువాడకు 20 నిమిషాల్లో చేరుకొని బాధితులను ఆసుపత్రికి తరలించారు' అని చెప్పారని ఈనాడు వివరించింది.

మన లక్ష్యం 2024 ఎన్నికలు- సోనియా గాంధీ

2024 లక్ష్యంగా పోరాడాలని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ విపక్షాలకు పిలుపునిచ్చినట్లు సాక్షి దినపత్రిక వార్తా కథనం ప్రచురించింది.

కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ విపక్ష నేతలతో సమావేశమయ్యారు. శుక్రవారం సాయంత్రం సోనియా అధ్యక్షతన వర్చువల్‌గా ఈ సమావేశం జరిగింది.

కేంద్రంలోని మోదీ సర్కార్‌పై ఐక్యంగా పోరాడటమే లక్ష్యం ప్రతిపక్ష పార్టీల భేటీ జరిగింది. స్వాతంత్రోద్యమ విలువలు, రాజ్యాంగ సూత్రాలు, నిబంధనలను విశ్వసించే ప్రభుత్వాన్ని అందించాలనే ఏకైక ఉద్దేశ్యంతో పోరాడాలని సోనియా పిలుపునిచ్చారని పత్రిక రాసింది.

2024 లోక్‌సభ ఎన్నికలే లక్ష్యంగా ఐక్యంగా, ప్రణాళికా బద్ధంగా ముందుకు సాగాలని సోనియా ప్రతిపక్ష పార్టీలను కోరారు.

మనందరికీ ఎవరి సిద్దాంతాలు వారికి ఉన్నప్పటికీ వాటన్నిటినీ అధిగమించి దేశ ప్రయోజనాల కోసం ఏకం కావాల్సిన సమయం వచ్చిందన్నారు.

ఇదొక చాలెంజ్‌. ఐకమత్యాన్ని మించిన ప్రత్యామ్నాయం లేదు. 2024 ఎన్నికలే అంతిమ లక్ష్యంగా అందరం కలిసికట్టుగా పోరాడాలని సోనియా సూచించారు.

సమాఖ్య వ్యవస్థను, రాజ్యాంగ సంస్థలను దెబ్బతీస్తున్నారంటూ మోదీ సర్కార్‌పై ధ్వజమెత్తిన ఆమె పరిమితులు, ప్రతిబంధకాలను అధిగమించి ఐక్యంగా పోరాడాలన్నారు. పార్లమెంటులో ప్రతిపక్షాలు ఐక్యతను చాటినట్టుగానే పార్లమెంటు బయట కూడా అదే స్థాయిలో పోరాడాలన్నారు.

ప్రతిపక్షాల ఐక్యత వల్ల ప్రభుత్వం వ్యాక్సినేషన్ పాలసీని మార్చుకుందన్న సోనియా మూడు వ్యవసాయ చట్టాలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

రోజురోజుకు నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయంటూ సోనియా గాంధీ ఆందోళన వ్యక్తం చేశారని సాక్షి వివరించింది.

హైదరాబాద్‌ వాటర్ ప్లస్

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌కు వాటర్ ప్లస్ గుర్తింపు లభించిందని నమస్తే తెలంగాణ దిన పత్రిక వార్తా కథనం ప్రచురించింది.

మహానగరానికి మరో ఖ్యాతి లభించింది. జలవనరుల శుభ్రతతోపాటు గ్రేటర్‌వ్యాప్తంగా గృహాలు, వాణిజ్య సముదాయాల నుంచి వచ్చే మురుగు జలాలను శుద్ధి చేసి పునర్వినియోగం చేస్తున్నందుకు వాటర్‌ ప్లస్‌ గుర్తింపు లభించింది.

ఈ మేరకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ప్రకటించింది. జీహెచ్‌ఎంసీ ప్రతిపాదన మేరకు స్వచ్ఛభారత్‌ మిషన్‌లో భాగంగా కేంద్ర అధికారుల బృందం జూలై 31 నుంచి ఈనెల 13వ తేదీ వరకు నగరంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించి మురుగునీటి నిర్వహణ, శుద్ధి ప్రక్రియలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి వాటర్‌ప్లస్‌ గుర్తింపునకు సిఫార్సు చేసిందని పత్రిక తెలిపింది.

జలమండలి,హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో గ్రేటర్‌వ్యాప్తంగా 28 మురుగునీటి శుద్ధి కేంద్రాలు (ఎస్‌టీపీలు) పనిచేస్తున్నాయి.

వీటిల్లో నిత్యం సుమారు 772 ఎంఎల్‌డీల మురుగు జలాలను శుద్ధి చేసి దిగువనకు వదులుతారు. ఇలా శుద్ధయిన నీటిని పార్కులు, గార్డెనింగ్‌లు, నర్సరీలు, టాయిలెట్ల నిర్వహణకు వినియోగిస్తున్నారు.

మూసీ పరీవాహకంలో కొన్నిచోట్ల వ్యవసాయానికి వాడుతున్నారని నమస్తే తెలంగాణ వివరించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)