You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
హైదరాబాద్: ‘గాంధీ ఆసుపత్రిలో అత్యాచారం జరగలేదు.. అక్కాచెల్లెళ్లు ఇద్దరూ కల్లుకు బానిసలై కట్టుకథలు చెప్పారు’ : పోలీసులు - ప్రెస్ రివ్యూ
'గాంధీ ఆసుపత్రిలో అక్కాచెల్లెళ్లపై సామూహిక అత్యాచారం' కేసుపై విచారణ చేపట్టిన అనంతరం అసలు అక్కడ అత్యాచారమే జరగలేదని తేలిందని ఆంధ్రజ్యోతి ఓ కథనం ప్రచురించింది.
''గాంధీ ఆసుపత్రిలో తనతోపాటు అక్కపైనా అక్కడి సిబ్బంది అత్యాచారానికి పాల్పడ్డారని ఓ మహిళ ఆరోపించడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది.
ఈనెల 5న మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్న వ్యక్తి (అక్క భర్తను)ని అక్కాచెల్లెళ్లు గాంధీలో చేర్పించారు. ఇద్దరూ కల్లుకు బానిసలు. అతడిని ఆసుపత్రిలో చేర్పించిన తర్వాత ఐదు రోజులపాటు వారు కల్లు తాగలేదు. ఆల్కహాల్ విత్‌డ్రాయల్ సిండ్రోమ్‌తో చిత్తభ్రమకు లోనయ్యారు. ఇందులో భాగంగానే, ఈనెల 11న భర్తను ఆసుపత్రిలోనే వదిలేసి అక్క ఎటో వెళ్లిపోయింది. ఆమె చెల్లి 15 దాకా ఆసుపత్రిలోనే ఉంది.
ఆసుపత్రి పరిసరాల్లో ఎక్కడా కల్లు దొరక్కపోవడంతో మానసిక సమస్యలను ఎదుర్కొంది. ఈ క్రమంలో 12, 14 తేదీల్లో తన ఇష్టపూర్వకంగా అక్కడి సెక్యూరిటీ గార్డుతో ఆమె సన్నిహితంగా మెలిగినట్లు పోలీసులు గుర్తించారు.
సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించడంతో ఈ విషయం బయటపడింది. అయితే తనపై అత్యాచారం జరిగినట్లుగా పేర్కొన్న ఆ మహిళ, తాను సన్నిహితంగా గడిపిన వ్యక్తి పేరును చెప్పడం ఇష్టం లేక మరో వ్యక్తి పేరును చెప్పడం, పైగా సామూహిక అత్యాచారం జరిగిందని పేర్కొనడంతో కేసు దారి మళ్లింది.
ఇక 11వ తేదీనే ఆసుపత్రి నుంచి బయటకొచ్చిన అక్క.. ముషీరాబాద్, భోలక్‌పూర్ వైపు వెళ్లిపోయింది. కాగితాలు ఏరుకునే ఓ వ్యక్తి ఆమెకు ఆశ్రయం కల్పించాడు. గురువారం ఆమెను పోలీసులకు గుర్తించారు''అని ఆంధ్రజ్యోతి తెలిపింది.
సంతోష్‌నగర్ కేసు కూడా అవాస్తవమే..
హైదరాబాద్‌లో ఓ యువతి బాయ్ ఫ్రెండ్‌ను ఇరికించేందుకు గ్యాంగ్ రేప్ డ్రామా ఆడిందని పోలీసుల విచారణలో తేలినట్లు వెలుగు దినపత్రిక ఓ కథనం ప్రచురించింది.
‘‘సంతోష్ నగర్‌లో ఆటో ఎక్కిన యువతిపై గ్యాంగ్ రేప్ జరిగినట్టు బుధవారం పోలీసులకు ఓ కంప్లయింట్ వచ్చింది.
సంతోష్ నగర్‌లో ఆటో ఎక్కిన ఆ యువతి.. తనను ముగ్గురు ఆటో డ్రైవర్లు కిడ్నాప్ చేసి గ్యాంగ్ రేప్ చేశారని పోలీసులకు తెలిపింది. తల్లితో కలిసి కంప్లయింట్ చేసింది.
సీసీ ఫుటేజ్ లు పరిశీలించిన పోలీసులు... ఈ కంప్లయింట్‌లో నిజం లేదని స్పష్టంచేశారు. బాయ్ ఫ్రెండ్‌కు మరో వివాహం నిశ్చయం కావడంతో... అతడిని కేసులో ఇరికించేందుకు ఇలా డ్రామా ఆడిందని పోలీసులు తేల్చారు.
ఫిబ్రవరిలో కూడా ఘట్ కేసర్‌లో ఇలాంటి కేసే నమోదైంది. కాలేజీ నుంచి ఇంటికి వెళ్తున్న ఫార్మసీ విద్యార్థిని... తనపై ఆటో డ్రైవర్లు గ్యాంగ్ రేప్ చేశారని ఆరోపించింది.
దర్యాప్తు చేసిన రాచకొండ పోలీసులు.. ఇది తప్పుడు ఆరోపణ అని క్లారిటీ ఇచ్చారు.
ఈ సంఘటన వైరల్ కావడంతో.. అవమాన భారంతో.. ఫార్మసీ స్టూడెంట్ కొద్దిరోజులకే సూసైడ్ చేసుకుని చనిపోయింది’’అని వెలుగు తెలిపింది.
కోవిడ్-19: పెరుగుతున్న ‘బ్రేక్‌త్రూ’ ఇన్‌ఫెక్షన్‌లు..
కరోనా వ్యాక్సీన్ తీసుకున్న తర్వాత వైరస్ బారినపడుతున్న (Breakthrough Infections) కేసుల సంఖ్య పెరుగుతోందని ఈనాడు ఓ కథనం ప్రచురించింది.
‘‘భారత్‌లో ఇప్పటివరకు దాదాపు 2.6లక్షల మందిలో బ్రేక్‌త్రూ ఇన్‌ఫెక్షన్‌లు బయటపడినట్లు కేంద్ర ప్రభుత్వ నివేదికలు వెల్లడిస్తున్నాయి. కేవలం ఒక్క కేరళ రాష్ట్రంలోనే ఇటువంటి కేసులు అధికంగా ఉండడం ప్రస్తుతం ఆందోళన కలిగిస్తోంది.
అయినప్పటికీ అక్కడ కొత్త వేరియంట్ వెలుగు చూసిన దాఖలాలు లేవని జీనోమ్ సీక్వెన్సింగ్‌లో తేలినట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. రెండు డోసులు తీసుకున్న వారిలో బ్రేక్ త్రూ ఇన్‌ఫెక్షన్ బారినపడే అవకాశాలు తక్కువగానే ఉన్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ వర్గాలు పేర్కొన్నాయి.
దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 56కోట్ల కరోనా వ్యాక్సీన్ డోసులను ప్రభుత్వం పంపిణీ చేసింది. వీటిలో 44కోట్ల మందికి తొలి డోసు అందించగా.. 12 కోట్ల మందికి రెండు మోతాదులు పూర్తయ్యాయి.
ఇదే సమయంలో వ్యాక్సీన్ తీసుకున్న తర్వాత వైరస్ బారినపడే అవకాశాలు, రీ-ఇన్‌ఫెక్షన్, వైరస్ ఉత్పరివర్తనాలతో పాటు కొత్త వేరియంట్లపై కేంద్ర ఆరోగ్యశాఖ నేతృత్వంలో ఏర్పాటైన ఇండియన్ సార్స్-కోవ్-2 జీనోమ్ సీక్వెన్సింగ్ కన్సార్టియం (INSACOG) ఎప్పటికప్పుడు అంచనా వేస్తోంది.
ఇందులో భాగంగా వ్యాక్సీన్ తీసుకున్న మొత్తం జనాభాలో తొలి డోసు తీసుకున్న లక్షా 70వేల మందిలో కరోనా వైరస్ బయటపడినట్లు గుర్తించింది. ఇక రెండు డోసులు తీసుకున్న తర్వాత వైరస్ బారినపడిన వారి సంఖ్య 87వేలుగా ఉన్నట్లు పేర్కొంది’’అని ఈనాడు వివరించింది.
మూఢ నమ్మకంతో తనను తానే బలిచ్చుకున్న యువతి
మూఢనమ్మకాలతో ఓ యువతి ఏకంగా తనను తానే బలిచ్చుకున్న ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మేరట్ జిల్లాలో కలకలం రేపిందని సాక్షి తెలిపింది.
‘‘ఖర్‌ఖోడా పోలీస్ స్టేషన్ పరిధిలోని కుది గ్రామానికి సమీపంలోని అడవీ ప్రాంతంలో మహా భద్రకాళి ఆలయం ఉంది. ఆ గ్రామానికి చెందిన ఓ యువతి తరచూ గుడికి వెళ్లేది.
ఆ యువతి తనను తాను కాళీమాత కుమార్తెగా భావించడం మొదలు పెట్టింది. తాను మహా భద్రకాళి కూతురునని అమ్మవారి కోసం తన ప్రాణం త్యాగం చేయాలని నిర్ణయించుకుంది.
ఇదే క్రమంలో ఆ యువతి ఒంటరిగా తెల్లవారు జామున ఆలయానికి వెళ్లింది. అటవీ ప్రాంతం కావడంతో ఆ సమయంలో ఆలయంలో ఎవరూ లేరు.
తొలుత గొంతు కోసుకుని ఆ రక్తాన్ని కాళీమాత విగ్రహానికి నైవేద్యంగా సమర్పించింది. గొంతు కోసుకున్న ప్రాంతంలో తీవ్ర గాయం కావడంతో రక్తస్రావమై ఇబ్బంది పడుతూనే గుడి గంటలకు ఉరి తాడు బిగించుకుని ప్రాణ త్యాగానికి పాల్పడింది.
ఆ యువతి మూఢ విశ్వాసాల వల్లే ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది’’అని సాక్షి తెలిపింది.
ఇవి కూడా చదవండి:
- అఫ్గానిస్తాన్: కొత్త తాలిబాన్లు నిజంగానే మారారా? లేదా పీఆర్ టీమ్ సలహాతో మారినట్లు నటిస్తున్నారా?
- అఫ్గానిస్తాన్ శరణార్థులు రాకుండా సరిహద్దుల్లో కంచె వేసిన పాకిస్తాన్
- అష్రఫ్ ఘనీ: ‘1257 కోట్లతో పారిపోయాననడం అబద్ధం.. బూట్లు వేసుకునే సమయం కూడా ఇవ్వలేదు’
- తాలిబాన్‌లోని బలమైన నాయకులు ఎవరు? వారి పాత్ర ఏంటి?
- అమెరికా 'సైగన్ పతనం': 1975లో వియత్నాంలో జరిగిందే ఇప్పుడు కాబుల్‌లో పునరావృతం అయ్యిందా?
- ఆంధ్రప్రదేశ్: జీవోలను ఆన్లైన్లో పెట్టొద్దన్న ప్రభుత్వం, తాజా ఉత్తర్వులపై విమర్శలు
- ఈ ఆర్థిక సంక్షోభం 'రాజకీయ-సామాజిక సంక్షోభం'గా మారనుందా
- అప్పుల ఊబిలో కూరుకుపోతున్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు - అభిప్రాయం
- ఏనుగుల ప్రాణాలు తీస్తున్న చర్మం వ్యాపారం, ఆసియాలో పెరుగుతున్న దారుణం
- నీరజ్ చోప్రా: ఒలింపిక్ గోల్డ్ గెలిచిన భారత అథ్లెట్ కెరీర్లో 5 కీలక మలుపులు
- పాకిస్తాన్లో ప్రధానమంత్రి నివాసాన్ని అద్దెకు ఇవ్వబోతున్నారా, ఇది నిజమేనా?
- కరోనా కాలంలో భారత ‘వ్యాక్సిన్ కింగ్’ ఆస్తి 25 శాతం వృద్ధి
- అంబానీ ఇంటి దగ్గర పేలుడు పదార్ధాల కేసు.. ఆ పోలీస్ అధికారి చుట్టూ ఎందుకు తిరుగుతోంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)