హారతి ఆరిపోయింది.. కుంకుమ కిందపడింది.. ఆయుష్షు తీరిందని యువతి ఆత్మహత్య - ప్రెస్‌రివ్యూ

ఫొటో సోర్స్, Getty Images
‘‘దేవుడికి హారతి ఇస్తుండగా మధ్యలోనే హారతి ఆరిపోయింది.. బొట్టు పెట్టుకునేందుకు కుంకుమ భరణె చేతులోకి తీసుకోగానే అది చేతులో నుంచి జారి కిందపడిపోయింది. దీంతో తనకు ఆయుష్షు తీరిందని భావించిన ఓ వివాహిత సెల్ఫీ వీడియో ఆన్‌చేసి సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది’’అని సాక్షి ఓ కథనం ప్రచురించింది.
‘‘ఈ ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. జార్ఖండ్‌కు చెందిన ఓంప్రకాశ్, కబిత తమ నాలుగేళ్ల కూతురుతో కలిసి జూబ్లీహిల్స్ రోడ్ నెం.78లోని పద్మాలయ అంబేడ్కర్‌నగర్ బస్తీలో అద్దెకుంటున్నారు.
ఈ నెల 2వ తేదీన ఉదయం భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. దీంతో ఓంప్రకాశ్ తాను డ్రైవింగ్ చేసే చోటకు కూతురిని తీసుకొని వెళ్లిపోయాడు.
రాత్రి 7.30 గంటలకు డ్యూటీ ముగించుకొని ఇంటికి వచ్చి తలుపుతట్టగా భార్య ఎంతకూ తలుపు తీయలేదు. కిటికీలో నుంచి లోనికి చూడగా ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది.
దీంతో ఇంటి యజమాని సహాయంతో తలుపులు తీసి చూడగా అప్పటికే ఆమె చనిపోయినట్లు నిర్ధారించారు. అక్కడే ఉన్న సెల్‌ఫోన్ చూడగా ఆన్‌లోనే ఉంది.
సెల్‌ఫోన్‌లో వీడియో ఆన్‌చేసి ఆత్మహత్య చేసుకోవడమే కాకుండా అంతకుముందు హారతి ఆరిపోవడాన్ని, కుంకుమ భరణి కిందపడిపోవడాన్ని సైగలతో చూపించి తనకు ఆయుష్షు తీరిపోయిందని చెప్పినట్లు గుర్తించారు. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు’’అని సాక్షి తెలిపింది.

ఫొటో సోర్స్, YANIV BERMAN
పునాదులు తవ్వుతుంటే .. 98 బంగారు నాణేలు బయటపడ్డాయ్!
ఇంటి నిర్మాణం కోసం పునాదులు తవ్వుతుంటే బంగారు నాణేలు ఉన్న బిందె బయటపడిన ఘటన జోగులాంబ గద్వాల జిల్లాలోని మండల కేంద్రమైన మనపాడులో జరిగిందని ఈనాడు తెలిపింది.
‘‘బంగారు నాణేలు తీసుకున్న తొమ్మిదిమందిని పోలీసులు అరెస్టు చేసి వారి వద్ద నుంచి బంగారం, నగదు స్వాధీనం చేసుకున్నామని సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు.
జనార్దన్‌రెడ్డికి చెందిన ఇంటి నిర్మాణం కోసం పునాదులు తవ్వుతుండగా బంగారు నాణేలు బయటపడినట్లు పత్రికల్లో కథనాలు రావడంతో పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
ఇంటినిర్మాణ పనుల్లో పాల్గొన్న తొమ్మిది మంది కూలీలను అదుపులోకి తీసుకుని విచారించారు. పునాదులు తవ్వుతుంగా కుండ బయటపడిందని, అందులో 98 బంగారు నాణేలు ఉన్నాయని కూలీలు విచారణలో అంగీకరించారు.
బంగారు నాణేల విషయం ఇంటి యజమానికి చెప్పకుండా తామే పంచుకున్నామని కూలీలు ఒప్పుకున్నారు. ఒక్కో బంగారు నాణెం సుమారు 3 గ్రాములు ఉందని తెలిపారు. బంగారు నాణేలను కొందరు ఆభరణాల రూపంలోకి మార్చుకోగా, మరి కొందరు అమ్ముకుని సొమ్ము చేసుకున్నారు.
కూలీల వద్ద నుంచి 12.12 తులాల బంగారు ఆభరణాలు, రూ.4.6లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్టు సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు’’అని ఈనాడు తెలిపింది.

ఫొటో సోర్స్, Getty Images
జల వివాదాలపై ఆంధ్రప్రదేశ్ పిటిషన్ విచారించను –సీజేఐ ఎన్‌వీ రమణ
కృష్ణా జలాల వివాదంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను తాను విచారించబోనని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ స్పష్టంచేశారని నమస్తే తెలంగాణ తెలిపింది.
‘‘జల వివాదంపై సీజేఐ సూచించిన మధ్యవర్తిత్వ పరిష్కారానికి ఏపీ అంగీకరించకపోవటంతో పిటిషన్‌ను మరో బెంచ్‌కు బదిలీ చేశారు.
పలు ప్రాజెక్టుల్లో జలవిద్యుత్తు ఉత్పత్తిపై తెలంగాణ ప్రభుత్వం జారీచేసిన జీవో 34ను వ్యతిరేకిస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే.
ఆ పిటిషన్‌పై గత సోమవారం చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా వివాదాన్ని మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవాలని, అందుకు తాను సహకారం అందిస్తానని సీజేఐ సూచించారు.
బుధవారం పిటిషన్‌ను మరోసారి విచారించిన ధర్మాసనం, మధ్యవర్తిత్వంపై రెండు రాష్ర్టాల అభిప్రాయం కోరింది. ఈ ప్రతిపాదనను ఏపీ సర్కారు వ్యతిరేకించింది. తమకు మధ్యవర్తిత్వం అవసరం లేదని, కోర్టు తీర్పు ద్వారానే సమస్యను పరిష్కరించుకోవాలని కోరుకుంటున్నామని ఏపీ తరఫు న్యాయవాదులు తెలిపారు.
దాంతో మధ్యవర్తిత్వానికి ఎవరినీ బలవంతం చేయలేమని, అదేవిధంగా ఈ పిటిషన్‌ను సీజేఐ ధర్మాసనం విచారించబోదని జస్టిస్ రమణ స్పష్టం చేశారు.
పిటిషన్‌ను సీజేఐ ధర్మాసనమే విచారించాలని కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా విజ్ఞప్తి చేసినా అందుకు సీజేఐ అంగీకరించలేదు. తాను రెండు రాష్ర్టాలకు చెందినవాడినని, కచ్చితంగా విచారించాల్సి వస్తే, విచారణ నుంచి తాను తప్పుకొంటానని గత సోమవారమే సీజేఐ ప్రకటించారు’’అని నమస్తే తెలంగాణ తెలిపింది.

ఫొటో సోర్స్, Twitter/Dr.RSPraveenKumar
నా స్పీచ్ టైంలోనే పవర్ కట్ చేస్తున్నారు – ప్రవీణ్ కుమార్
ప్రభుత్వ రాజప్రసాదాలకు పవర్ కట్ చేసే రోజులు దగ్గరపడ్డాయని మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హెచ్చరించినట్లు వెలుగు దినపత్రిక ఓ కథనం ప్రచురించింది.
‘‘తాను పాల్గొన్న సభలలో.. తాను మాట్లాడే సమయంలోనే కావాలనే పవర్ కట్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
అదేవిధంగా తనతో మాట్లాడుతున్న వారిపై ప్రత్యేక నిఘా పెట్టారని ఆయన అన్నారు. దీనికి సంబంధించి ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయన ట్వీట్ చేశారు.
‘ఇప్పటికి వరుసగా మూడు సభల్లో సరిగ్గా నా స్పీచ్ టైంలోనే పవర్ కట్ అయింది. నాతో మాట్లాడుతున్న వ్యక్తులపై నిఘా సంగతి ఇక చెప్పనక్కరలేదు. మా శ్రమను దోపిడి చేసి కట్టుకున్న మీ రాజప్రసాదాలకు తెలంగాణ ప్రజలు పవర్ కట్ చేసే రోజులు దగ్గర పడ్డాయి. దయచేసి గుర్తుంచుకోండి’ అంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్వీట్ చేశారు’’అని వెలుగు తెలిపింది.
ఇవి కూడా చదవండి:
- అందం కోసం సెక్స్ ఒప్పందాలు: ‘నాకు కాస్మోటిక్ సర్జరీ చేయిస్తే నా శరీరం ఆరు నెలలు నీదే’
- కోవిడ్-19ను మనం నోరోవైరస్లా ఎందుకు చూడాలి? అసలు నోరోవైరస్ అంటే ఏమిటి
- పెగాసస్ స్పైవేర్: ఇప్పటికీ సమాధానాలు దొరకని కీలక ప్రశ్నలు
- ఒకప్పటి భారతదేశానికి ఇప్పటి ఇండియాకు తేడా ఇదే
- తెలంగాణ: ఇప్పటివరకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు, ఇంకా ఎన్ని ఇస్తారు?
- ప్రమాదం అని తెలిసినా చైనాలో ప్లాస్టిక్ సర్జరీల సంఖ్య ఎందుకు పెరుగుతోంది
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
























