You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
డెల్టాప్లస్: తెలంగాణలోనూ కరోనావైరస్ కొత్త వేరియంట్ కేసులు - ప్రెస్‌రివ్యూ
కరోనావైరస్ కొత్త వేరియంట్ డెల్టాప్లస్ కేసులు తెలంగాణలోనూ వెలుగులోకి వస్తున్నాయని ఈనాడు ఓ కథనం ప్రచురించింది.
‘‘ఈ నెల 23 నాటికి రాష్ట్రంలో రెండు డెల్టాప్లస్ కేసులు నమోదైనట్లు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. దీంతో తెలంగాణలో డెల్టా ప్లస్ ఉనికి ఉందని స్పష్టమైంది.
దేశవ్యాప్తంగా ఇప్పటి వరకూ 70 డెల్టాప్లస్ కేసులను గుర్తించినట్లు కేంద్రం తెలిపింది. కరోనావైరస్ ఇప్పటికే ఆల్ఫా, బీటా, గామా, డెల్టా వేరియంట్లుగా మారి వ్యాపిస్తోంది.
రెండో వేవ్‌లో దేశవ్యాప్తంగా డెల్టా వేరియంట్ విజృంభించింది. ఇప్పుడు ఆ డెల్టా రకం మరికొన్ని మార్పులతో డెల్టా ప్లస్‌గా మారింది.
దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే ఆందోళన చెందుతున్నాయి. అత్యధికంగా మహారాష్ట్రలో 23, మధ్యప్రదేశ్‌లో 11, తమిళనాడులో 10 ప్లస్ కేసులు ఉన్నాయి.
తెలంగాణలో శుక్రవారం కొత్తగా 614 కరోనా పాజిటివ్ కేసులు వచ్చాయి. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 6,44,330గా నమోదైంది. కరోనా చికిత్స పొందుతూ మరో నలుగురు చనిపోవడంతో మృతుల సంఖ్య 3,800కు చేరింది’’అని ఈనాడు తెలిపింది.
అర్హులైన పేదలకు 90 రోజుల్లోనే ఇంటి స్థలాల పట్టాలు
ఆంధ్రప్రదేశ్‌లో అర్హులైన పేదలందరికీ దరఖాస్తు చేసుకున్న 90 రోజుల్లో ఇంటి స్థలాలను ప్రభుత్వం మంజూరుచేస్తుందని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి చెప్పినట్లు ఆంధ్రజ్యోతి ఓ కథనం ప్రచురించింది.
‘‘పేదలు ఆక్రమించుకొని ఉంటున్న ప్రాంతాల్లో వారికి కనీస సదుపాయాలు లేని పరిస్థితి ఉండకూడదనే భారీఎత్తున 30 లక్షలకుపైగా ఇళ్ల స్థలాలు మంజూరుచేశామని, వాటిలో 15 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించామని జగన్ అన్నారు.
రోడ్లు-భవనాల శాఖతో సమన్వయం చేసుకుని మున్సిపాలిటీలు, నగరాల్లో రోడ్ల మరమ్మతులకు కార్యాచరణ రూపొందించుకోవాలని, వర్షాకాలం ముగియగానే దీనిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. శుక్రవారం మున్సిపల్‌శాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.
‘పట్టణాలు, నగరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. రోడ్ల మరమ్మతులకు ప్రాధాన్యమిచ్చి చేపట్టాలి. నిర్మాణాల కూల్చివేతలతో పట్టణాలు, నగరాల్లో పోగుపడే వ్యర్థాలపై దృష్టి పెట్టాలి’ అని సీఎం కోరారు. అయితే, విశాఖ, విజయవాడ, తిరుపతిలో ఇప్పటికే వ్యర్థాల ప్లాంట్లు ఉన్నాయని.. రాజమహేంద్రవరం, కాకినాడ, ఏలూరు, గుంటూరు, నెల్లూరు, కర్నూలు, అనంతపురంలో కూడా వాటిని ఏర్పాటుచేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని సీఎంకు అధికారులు వివరించారు.
కాగా, గ్రామ, వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియకు సన్నద్ధం కావాలని సీఎం ఆదేశించారు. దీనివల్ల ప్రతి రెండు వేల జనాభాకు ఒక రిజిస్ట్రేషన్ ఆఫీసు వచ్చి.. ప్రజలకు సేవలు మరింత చేరువవుతాయన్నారు. దీంతోపాటు ఆ గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలోని భూములపై తగిన పర్యవేక్షణ ఉండి, ఆక్రమణలు, అన్యాక్రాంతాలకు ఆస్కారం ఉండదని తెలిపారు. అర్హులైన వారు రాజమార్గంలో పట్టా తీసుకునే పరిస్థితిని రాష్ట్రంలో సృష్టించామని వ్యాఖ్యానించారు’’అని ఆంధ్రజ్యోతి తెలిపింది.
ఎంపీ మాలోత్ కవితకు హైకోర్టులో ఊరట
మహబూబాబాద్ టీఆర్‌ఎస్ ఎంపీ మాలోత్ కవితకు హైకోర్టులో ఊరట లభించిందని వెలుగు దినపత్రిక ఓ కథనం ప్రచురించింది.
‘‘పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓటర్లకు డబ్బు పంచారన్న కేసులో కవితపై 2019లో బూర్గంపహాడ్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది.
దీనిపై ఇటీవల విచారణ చేపట్టిన ప్రజాప్రతినిధుల కోర్టు ఎంపీ కవితకు 6 నెలల జైలు శిక్షతో పాటు రూ.10 వేలు జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది.
అయితే, ప్రజాప్రతినిధుల కోర్టు తీర్పును సవాల్ చేస్తూ కవిత హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
విచారణ చేపట్టిన కోర్టు ప్రజా ప్రతినిధుల కోర్టు తీర్పు అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది’’అని వెలుగు తెలిపింది.
శిల్పా శెట్టికి హైకోర్టులో ఎదురుదెబ్బ
బాలీవుడ్ నటి శిల్పా శెట్టికి బాంబే హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలిందని సాక్షి ఓ కథనం ప్రచురించింది.
‘‘శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రా కేసుకు సంబంధించి వార్తా ప్రసార మాధ్యమాలు, సోషల్ మీడియాలో కథనాలు రాకుండా అడ్డుకోలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది.
అశ్లీల చిత్రాల చిత్రీకరణ కేసులో రాజ్‌కుంద్రా అరెస్టైన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి శిల్పాశెట్టిని కూడా ముంబై పోలీసులు విచారించారు. ఈ నేపథ్యంలో శిల్ప- రాజ్‌కుంద్రా దంపతుల వ్యవహారం గురించి మీడియాలో చాలా కథనాలు వెలువడ్డాయి.
ఈ క్రమంలో... తమ పరువుకు భంగం కలిగించే విధంగా మీడియా వ్యవహరిస్తోందని శిల్పాశెట్టి బాంబే హైకోర్టును ఆశ్రయించారు.
పలు మీడియా సంస్థలు, ట్విటర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ తదితర సామాజిక మాధ్యమాల్లో తమ గురించి ప్రచురితమవుతున్న కథనాలను అడ్డుకోవాలని కోరుతూ... పరువు నష్టం దావా వేశారు. శిల్పా పిటిషన్ శుక్రవారం విచారణకు వచ్చింది.
‘పోలీసులు చెప్పిన వివరాల గురించి ప్రసారం చేయడం పరువుకు నష్టం కలిగించినట్లు కాదు. ఇలా ప్రతి అంశాన్ని అడ్డుకోవాలంటే అది పత్రికా స్వేచ్ఛ మీద తీవ్ర ప్రభావం చూపుతుంది. శిల్పాశెట్టి భావోద్వేగానికి లోనుకావడం వంటి విషయాలు ఇతరుల(పోలీసులు) ముందే జరిగాయి. క్రైం బ్రాంచ్ వర్గాలు చెప్పిన వివరాల ఆధారంగా మీడియా రిపోర్టులు వచ్చాయి’’ అని జస్టిస్ గౌతం పటేల్ వ్యాఖ్యానించినట్లు సాక్షి తెలిపింది.
ఇవి కూడా చదవండి:
- పెగాసస్ స్పైవేర్: ‘హోం మంత్రి అమిత్ షాను తొలగించండి’ - కాంగ్రెస్ డిమాండ్
- ‘ఈ శతాబ్దంలోనే అతిపెద్ద నిఘా కుట్ర’
- గోల్డ్‌ఫిష్: చైనాకు చెందిన ఈ అందమైన చేప రాక్షసిలా ఎలా మారుతోంది?
- అమితాబ్ బచ్చన్: పాత సినిమాల రీళ్లను సంరక్షించేందుకు తపిస్తున్న సూపర్ స్టార్
- ‘సెక్స్ గురించి భారతీయులు మాట్లాడుకోరు, అందుకే నేను వారికి సాయం చేస్తున్నాను’
- వాట్సాప్ మెసేజ్‌లపై భారత ప్రభుత్వం నిఘా
- సిరియా: ‘ఇస్లామిక్ స్టేట్’కి పనిచేసిన బ్రిటిష్ యువకుడి స్మార్ట్‌ఫోన్‌లో ఏముంది
- వాట్సాప్: అప్డేట్, బ్యాకప్, 2FA, ప్రైవసీ ఫీచర్లను వాడుకోవడం ఎలా?
- వాట్సాప్ హ్యాకింగ్ వార్తలపై ఇజ్రాయెల్ కంపెనీ ఏమంటోంది
- పాస్‌వర్డ్‌లతో భద్రత లేదా? బయోమెట్రిక్స్ సురక్షితమేనా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)