తెలంగాణ సీఎం కేసీఆర్: ఆకస్మిక తనిఖీలకు వస్తా - ప్రెస్ రివ్యూ

ప్రచురణ
చదివే సమయం: 4 నిమిషాలు

పల్లెలు, పట్టణాల్లో జరుగుతున్న ప్రగతి తీరును, అధికారుల పనితీరును పరిశీలించేందుకు ఈ నెల 19 తర్వాత తానే స్వయంగా ఆకస్మిక తనిఖీలు చేపడుతానని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారని నమస్తే తెలంగాణ పత్రిక పేర్కొంది.

పల్లెప్రగతి, పట్టణప్రగతి కార్యక్రమాల క్షేత్రస్థాయి పనితీరును సమీక్షించడానికి ఆదివారం (ఈ నెల 13న) అదనపు కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారుల (డీపీవో)లతో ప్రగతిభవన్‌లో సమావేశాన్ని ఏర్పాటుచేయనున్నామని తెలిపారు.

సీజనల్‌ వ్యాధులను అరికట్టేందుకు ముందస్తు చర్యలను సిద్ధం చేసుకునే చార్టును రూపొందించుకోవాలని, ఈ సంసృతిని ఆయాశాఖలు అభివృద్ధి చేసుకోవాలని ఆదేశించారు.

రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పట్టిందని, పాజిటివిటీ రేటు 1.47 శాతానికి పడిపోయిందని తెలిపారు. కరోనా పూర్తిగా తగ్గాక మరో విడుత పల్లెప్రగతి, పట్టణప్రగతి కార్యక్రమాలను చేపడుతామని వివరించారు.

రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంచడానికి అటవీశాఖ ప్రత్యేక కార్యాచరణను కొనసాగించాలని చెప్పారు. పల్లెప్రగతి, పట్టణ ప్రగతి తీరు, అందుకనుగుణంగా అదనపు కలెక్టర్లు, డీపీవోలు సహా మున్సిపల్‌, పంచాయతీరాజ్‌ సిబ్బంది పనితీరు, చేపట్టాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ శుక్రవారం ప్రగతిభవన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారని ఈ వార్తలో రాశారు.

'ఆహర భద్రతలో లోపాలు సవరించాలి.. విశాఖ స్టీల్ స్టీల్‌పై పునరాలోచించండి..' కేంద్రానికి ఏపీ సీఎం జగన్ విజ్ఞప్తి

జాతీయ ఆహార భద్రతా చట్టం కింద హేతుబద్ధతలేని పరిమితి కారణంగా పేదలు తీవ్రంగా నష్టపోతున్నారని, వీరందరి రేషన్‌ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తోందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కేంద్రం దృష్టికి తీసుకెళ్లారని సాక్షి పత్రిక తెలిపింది.

మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్‌ తదితర రాష్ట్రాలు ఆర్థికంగా బాగా అభివృద్ధి చెందాయని, అలాంటి రాష్ట్రాలకు కుటుంబాల ప్రాతిపదికన ఎక్కువ శాతం రేషన్‌ కేటాయిస్తున్నారని జగన్ తెలిపారు. ఈ హేతుబద్ధత లేని విధానం వల్ల తమ రాష్ట్రం తీవ్రంగా నష్టపోతోందని గణాంకాలతో సహా వివరించారు. ఈ విధానాన్ని సరిదిద్ది రాష్ట్రంలోని అర్హులైన 1.47 కోట్ల రేషన్‌కార్డులకు రేషన్‌ అందేలా చూడాలని కోరారు. ఉచిత రేషన్‌ బియ్యం కింద కేంద్రం.. ఏపీ పౌర సరఫరాల కార్పొరేషన్‌కు చెల్లించాల్సిన బకాయిలు రూ.3,229 కోట్లు వెంటనే చెల్లించాలని విన్నవించారు.

శుక్రవారం ఆయన కేంద్ర రైల్వే, పరిశ్రమలు, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్‌ గోయెల్‌తో సుమారు గంట సేపు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పరిస్థితులను వివరించారు.

విశాఖపట్నం స్టీల్‌ప్లాంటు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని పునరాలోచించాలని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి కోరారు. విశాఖ ఉక్కు పరిశ్రమ వల్ల సుమారు 20 వేల మంది ఉద్యోగులు ప్రత్యక్షంగా, వేలాది మంది పరోక్షంగా ఉపాధి పొందుతున్నారని తెలిపారు.

విశాఖ ఉక్కు ఉద్యమ సమయంలో 32 మంది ప్రాణాలు కోల్పోయారని, ప్రజల త్యాగాల పునాదుల మీద ఈ పరిశ్రమ వచ్చిందన్నారు. 2002 –2015 మధ్య స్టీల్‌ప్లాంట్‌ మంచి పనితీరును కనబరిచిందని, లాభాలు కూడా ఆర్జించిందని తెలిపారు.

స్టీల్‌ ప్లాంట్‌ ఆధ్వర్యంలో ప్రస్తుతం 19,700 ఎకరాల భూమి ఉందని, దీని విలువ సుమారు రూ.లక్ష కోట్లు పైనే ఉంటుందన్నారు. 7.3 మిలియన్‌ టన్నుల సామర్థ్యం ఉన్న స్టీల్‌ ప్లాంట్‌.. విస్తరణ నిమిత్తం పలు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుందని తెలిపారు. ఇదే సమయంలో అంతర్జాతీయంగా ఉక్కు పరిశ్రమకు వచ్చిన గడ్డు పరిస్థితుల దృష్ట్యా 2014–15 నుంచే కష్టాలు వచ్చాయని వివరించారు.

కాకినాడ ప్రత్యేక ఆర్థిక మండలిలో పెట్రో కాంప్లెక్స్‌ ఏర్పాటు చేస్తామని ఆంధ్రప్రదేశ్‌ పునర్‌ వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న విషయాన్ని సీఎం జగన్‌ కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. కేంద్ర ఉక్కు, పెట్రోలియం, సహజ వనరుల శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో ఆయన సుమారు గంట సేపు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కాకినాడలో పెట్రో కాంప్లెక్స్, విశాఖపట్నం ఉక్కు పరిశ్రమలపై విస్తృతంగా చర్చించారు.

సీఎం జగన్‌మోహన్‌రెడ్డి విజ్ఞప్తులపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ సానుకూలంగా స్పందించారు. ఆంధ్రప్రదేశ్‌లో కచ్చితంగా పెట్రో కాంప్లెక్స్‌ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. వయబిలిటీ గ్యాప్‌ ఫండ్‌ విషయంలోనూ సానుకూలత వ్యక్తం చేశారని ఈ కథనంలో తెలిపారు.

టోల్‌ఫ్రీ నంబర్‌కు కాల్ చేయండి.. ఉచితంగా ఆక్సిజన్ సిలిండర్ ఇంటికి వస్తుంది.. అనంతపురంలో సోనూసూద్ సేవలు

కోవిడ్‌ నేపథ్యంలో అనంతపురం జిల్లాలోనూ సినీనటుడు సోనూసూద్‌ సేవలు ప్రారంభమయ్యాయి. టోల్‌ ఫ్రీ నంబరుకు ఫోన్‌ చేస్తే కోవిడ్‌ బాధితుల ఇంటికే ఆక్సిజన్‌ సిలిండర్‌ సరఫరా చేసే ఏర్పాట్లు చేశారు. శుక్రవారం నుంచి ఈ సేవలకు శ్రీకారం చుట్టినట్లు సోనూసూద్‌ ట్రస్టు ప్రతినిధి అమిత్‌ పురోహిత్‌ మీడియా సమావేశంలో స్పష్టం చేశారని ఆంధ్రజ్యోతి ఒక కథనాన్ని ప్రచురించింది.

కరోనా కేసులు అధికంగా నమోదవుతున్న జిల్లాల్లో అనంతపురం కూడా ముందు వరుసలో ఉంటోంది. దీంతో ఈ జిల్లాలో కరోనా బాధితులెవరూ ఆక్సిజన్‌ అందక ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో సోనూసూద్‌ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.

సోనూసూద్‌ ట్రస్టు ద్వారా జిల్లాలో 24 గంటలూ సేవలందిస్తామని వెల్లడించారు. కరువు జిల్లా, అందులోనూ పేదలు అధికంగా ఉన్న నేపథ్యంలో ఒక్కో సిలిండర్‌కు వేల రూపాయలు ఖర్చు చేయలేని పరిస్థితి ఉందని, అందుకే సోనూసూద్‌ అనంతపురం జిల్లాను ఎంచుకున్నారని తెలిపారు.

కరోనా బాధితులు టోల్‌ఫ్రీ నంబరు 70699 99961కు ఫోన్‌ చేసిన వెంటనే ట్రస్టు ప్రతినిధులు కోవిడ్‌ బాధితుడి ఇంటికే వెళ్లి ఆక్సిజన్‌ సిలిండర్‌ అందజేస్తారన్నారు. బాధితులు ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. ఈ సందర్భంగా ట్రస్టు ప్రతినిధి పురోహిత్‌ చేసిన వీడియో కాల్‌లో సోనూసూద్‌ మాట్లాడుతూ.. ప్రజలు తమ సేవలను వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారని ఈ వార్తలో రాశారు.

తెలంగాణలో వేతనాలపై కొత్త జీవోలు.. 30 శాతం ఫిట్‌మెంట్

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, అధికారులు, పింఛన్‌దారుల వేతనాల సవరణపై ఆ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం పది (జీవో నం.51 - 60వరకు) ఉత్తర్వులు జారీ చేసిందని ఈనాడు పత్రిక తెలిపింది.

వీటి ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 9,21,037 మంది ప్రభుత్వ, ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగులు, పింఛన్‌దారులకి 30 శాతం ఫిట్‌మెంట్‌ అమలు కానుంది.

తాజా ఉత్తర్వుల ప్రకారం తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగుల కనీస వేతనం రూ.13 వేల నుంచి రూ.19 వేలకు.. గరిష్ఠ వేతనం రూ.1,10,850 నుంచి 1,62,070కు పెరిగింది. 2018 జులై మొదటి తేదీ నుంచి పీఆర్‌సీ అమల్లోకి వస్తుంది. ఆ తేదీన ఉన్న డీఏ 30.392 శాతం మూలవేతనంలో కలుస్తుంది.

మొత్తం 30 శాతం ఫిట్‌మెంట్‌తో కలిపి ఉద్యోగుల వేతన సవరణ స్కేళ్లను ప్రభుత్వం ప్రకటించింది. 32 గ్రేడ్లు, 80 సెగ్మెంట్లను కొనసాగించేందుకు ఆదేశించింది. పెరిగిన వేతనాలు జూన్‌ నెల నుంచి (జులైలో చెల్లింపు) అందనున్నాయి. ఏప్రిల్‌, మే నెలల బకాయిలను ఈ ఆర్థిక సంవత్సరంలోనే చెల్లిస్తామని పేర్కొంది.

పీఆర్‌సీ అమలు ఉత్తర్వుల జారీపై ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపాయని ఈ వార్తలో రాశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)