తెలంగాణలో మరో పది రోజులు లాక్ డౌన్ పొడిగింపు, పగటి పూట సడలింపు: ప్రెస్ రివ్యూ

ప్రచురణ

తెలంగాణ ప్రభుత్వం పగటి పూట లాక్ డౌన్ సడలించినట్లు నమస్తే తెలంగాణ దినపత్రిక వార్తా కథనం ప్రచురించింది.

రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని అరికట్టడానికి విధించిన లాక్‌డౌన్‌ను రాష్ట్ర ప్రభుత్వం మరో పదిరోజులు పొడిగించింది.

అదే సమయంలో సడలింపు సమయాన్ని ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పొడిగించింది.

ఈ మేరకు మంగళవారం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నది. ప్రజలు తమ గమ్యస్థానాలకు చేరుకొనేందుకు సాయంత్రం ఆరు గంటల వరకు వెసులుబాటు కల్పించింది.

మరో పది రోజులపాటు సాయంత్రం 6 గంటల నుంచి తిరిగి మర్నాడు ఉదయం 6 గంటల వరకు లాక్‌డౌన్‌ అమలులో ఉంటుంది.

ఆ సమయంలో నిబంధనలను కఠినంగా అమలుచేయాలని మంత్రివర్గం పోలీస్‌శాఖను ఆదేశించింది. మరోవైపు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వైరస్‌ విస్తరణ ఇంకా అదుపులోకి రాలేదు.

ఆయా ప్రాంతాల్లో ప్రస్తుతమున్న విధంగానే మధ్యాహ్నం ఒంటి గంట నుంచి ఉదయం ఆరు గంటలవరకు లాక్‌డౌన్‌ కొనసాగుతుంది.

సత్తుపల్లి, మధిర, నల్లగొండ, నాగార్జునసాగర్‌, దేవరకొండ, మునుగోడు, మిర్యాలగూడ నియోజకవర్గాల పరిధిలో యథాతథ స్థితిని కొనసాగించాలని మంత్రివర్గం నిర్ణయించింది.

ఈ ఏడు నియోజకవర్గాల పరిధిలో లాక్‌డౌన్‌ను ఇప్పుడున్న మాదిరిగానే ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సడలిస్తారు.

లాక్‌డౌన్‌ సమయంలో ఈ-పాస్‌ ఉన్నవారికి మాత్రమే మినహాయింపు ఇచ్చింది. అంతర్రాష్ట్ర రవాణాపై నిషేధాన్ని కొనసాగించింది.

సరిహద్దుల వద్ద ప్రయాణికుల వాహనాలను రోజంతా నియంత్రించనున్నారు. ఆరోగ్యసిబ్బంది, ఎమర్జెన్సీ మెడికల్‌ సర్వీసెస్‌కు చెందిన వాహనాలకు మినహాయింపు కొనసాగుతుందని నమస్తే తెలంగా వివరించింది.

సుప్రీంకోర్ట్ చీఫ్ జస్టిస్‌కు కేరళ, విజయవాడ విద్యార్థుల లేఖలు

కేరళ, విజయవాడ విద్యార్థులు రాసిన లేఖకు ముచ్చటపడిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వీ రమణ వారికి ప్రత్యుత్తరం రాశారని ఈనాడు దిన పత్రిక కథనం ప్రచురించింది.

సర్వోన్నత న్యాయపీఠాన్ని అధిరోహించినందుకు అభినందనలు తెలుపుతూ.. విజయవాడకు చెందిన ఇంటర్‌ రెండో ఏడాది విద్యార్థి దర్శిత్‌.. గత నెల 6న జస్టిస్‌ ఎన్‌వీ రమణకు లేఖ రాశారు.

కనీస సౌకర్యాలు లేని మారుమూల పల్లె పొన్నవరం నుంచి స్వయంకృషితో సాగిన జీవనం.. నేటి తరం విద్యార్థులకు ఆదర్శప్రాయమంటూ అందులో పేర్కొన్నారు.

మీ ఈ మార్గం నేటి యువతరానికి అనుసరణీయం కావాలంటూ విద్యార్థి అచ్చ తెలుగులో రాసిన ఈ ఉత్తరంపైనా భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ స్పందించారు.

తిరిగి ఆ విద్యార్థికి శుభాశీస్సులు తెలుపుతూ ప్రత్యుత్తరం రాశారు. చక్కని తెలుగులో స్వదస్తూరీతో రాసిన ఉత్తరం.. తనకు అమితమైన ఆనందాన్ని కలిగించిందని జస్టిస్‌ ఎన్‌వీ రమణ పేర్కొన్నారు.

కరోనా రెండో దశ ఉద్ధృతి తీవ్రత సమయంలో జోక్యం చేసుకుని సకాలంలో ఆక్సిజన్‌ అందేలా చేసి ప్రజల ప్రాణాలను కాపాడినందుకు కేరళకు చెందిన 5వ తరగతి చిన్నారి లిడ్వినా జోసెఫ్‌ కూడా సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు తెలుపుతూ లేఖ రాసింది.

న్యాయమూర్తులు తమ విధి నిర్వహణలో భాగంగా సుత్తితో కొట్టి వైరస్‌ను నిర్మూలిస్తున్నారని చాటుతూ గీసిన చిత్రంతో పాటు లేఖను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణకు ఆ విద్యార్థిని పంపింది.

చిన్నారి లేఖకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ ఆత్మీయంగా స్పందించారు.

'లిడ్వినా.. దేశంలో జరుగుతున్న పరిణామాలను నీవు గమనిస్తున్న తీరు, మహమ్మారి సమయంలో ప్రజల యోగక్షేమాల గురించి వ్యక్తం చేసిన భావన నన్నెంతో ప్రభావితం చేసింది. బాధ్యతాయుతమైన పౌరురాలిగా ఎదిగి ఈ దేశ నిర్మాణానికి ఇతోధిక చేయూతనిస్తావని నమ్ముతున్నాను. నీవు సర్వతోముఖాభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ దీవిస్తున్నాను' అని సీజేఐ తన లేఖలో పేర్కొన్నారు.

లేఖతో పాటు తాను సంతకం చేసిన రాజ్యాంగ ప్రతిని చిన్నారికి ప్రధాన న్యాయమూర్తి బహుమానంగా పంపారు.

ప్రైవేటు ఆస్పత్రుల్లో వ్యాక్సిన్ ధరలు

ప్రైవేటు ఆస్పత్రుల్లో వేసే కోవిడ్ టీకాలకు ప్రభుత్వం ధరలు నిర్ణయించినట్లు సాక్షి దిన పత్రిక కథనం ప్రచురించింది.

కరోనా మహమ్మారి సోకకుండా వేసుకునే వ్యాక్సిన్‌పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

18 ఏళ్ల పైబడిన వారందరికీ ఉచితంగా వ్యాక్సిన్‌ అందిస్తామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటన చేసిన విషయం తెలిసిందే.

అయితే ప్రైవేటులో వేసుకోవాలనుకునే వారు నగదు చెల్లించి వేసుకోవచ్చని చెప్పారు.

దీంతో ప్రైవేటు ఆస్పత్రుల్లో వ్యాక్సిన్‌ ధర విషయమై కేంద్ర ప్రభుత్వం ఓ స్పష్టత ఇచ్చింది. నిర్ధిష్ట ధర విధిస్తూ ఈ మేరకు మంగళవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రైవేట్ ఆస్పత్రుల్లో వ్యాక్సిన్ ధరలు ఇలా ఉన్నాయి. కోవిషీల్డ్‌ రూ.780, కోవాగ్జిన్‌ రూ.1,410, స్పుత్నిక్ రూ.1,145, 5 శాతం జీఎస్‌టీ, రూ.150 సర్వీస్‌ ఛార్జీ అదనం.

నిర్దేశించిన ధరల కన్నా అదనంగా డబ్బులు వసూలు చేస్తే ఆస్పత్రులపై కఠిన చర్యలు ఉంటాయని కేంద్రం హెచ్చరించింది.

అధిక ధరలు వసూళ్లపై రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాలని సూచించింది. వ్యాక్సిన్‌పై పూర్తి బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని ప్రధానమంత్రి సోమవారం ప్రసంగంలో స్పష్టం చేశారని పత్రిక చెప్పింది.

ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్‌ ప్రక్రియ చర్యలు చేపట్టింది. ఇప్పటికే వ్యాక్సిన్‌ ఉత్పత్తి పెంచేందుకు ఆర్డర్లు కూడా ఇచ్చేసింది. త్వరలోనే ప్రజలందరికీ కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్‌ ఉచితంగా అందించనుందని సాక్షి వివరించింది.

భధ్రాద్రి కొత్తగూడెం జిల్లాలో శ్మశానంలో కోవిడ్ రోగుల ఐసొలేషన్

తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొందరు గ్రామస్థులు శ్మశానంలో ఐసొలేషన్లో ఉన్నారని ఆంధ్రజ్యోతి దిన పత్రిక కథనం ప్రచురించింది.

కరోనా బాధితులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఐసొలేషన్‌ కేంద్రాలకు వెళ్లడమో.. హోం ఐసొలేషన్‌లో ఉండటమో చేస్తుంటే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలోని గిరిజన గ్రామం మొద్దులమడ వాసులు భిన్నంగా వ్యవహరించారు.

150 జనాభా ఉన్న ఈ గ్రామం లో 50 మందికి పాజిటివ్‌ వచ్చింది. ఇంటికొకరు వైరస్‌ బారినపడ్డారు. దీంతో తమ ద్వారా మిగతావారికి వ్యాపించకుండా ఉండేందుకు వైకుంఠధామం (శ్మశానం)ను ఐసొలేషన్‌ కేంద్రంగా ఎంచుకున్నారు.

ఈ మేరకు రెండు రోజుల నుంచి వైకుంఠధామంలోనే ఉంటున్నారు. సామూహిక వంటలకు ఏర్పాట్లు చేసుకున్నారు. వీరికి అవసరమైన ఆహార సామగ్రిని ఊరి ప్రజలు సమకూర్చారని పత్రిక చెప్పింది.

చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, బంధువులూ కొంతసాయం చేశారు. టీఆర్‌ఎస్‌ నాయకుడు బిర్రం వెంకటేశ్వరరావు నిత్యావసర వస్తువులను అందజేశారు. చిప్పల బాబు భోజనాలు పంపిస్తున్నారు.

కాగా, మొద్దులమడలో కరోనా సోకినవారిని ఐసొలేషన్‌ కేంద్రానికి తరలించి వైద్యం అందించాలని జిల్లా కలెక్టర్‌ ఆదేశించారు. దీనికి వారు అంగీకరించడం లేదు. ఇక్కడే తమకు స్వేచ్ఛగా ఉందని చెబుతున్నారని ఆంధ్రజ్యోతి వివరించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)