తెలంగాణ: లాక్‌డౌన్ జూన్ 9 వరకు పొడిగింపు.. అతి తక్కువ మందితో రాష్ట్రావతరణ వేడుకలు - ప్రెస్ రివ్యూ

ప్రచురణ

తెలంగాణలో లాక్‌డౌన్‌ను సోమవారం నుంచి మరో పది రోజుల (జూన్‌ 9) పాటు కొనసాగించాలని మంత్రిమండలి నిర్ణయించినట్లు ఈనాడు ఒక కథనంలో తెలిపింది.

ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు సడలింపు ఇచ్చింది. బయట ఉన్నవారు ఇళ్లకు చేరడానికి మరో గంట అంటే మధ్యాహ్నం 2 గంటల వరకు వెసులుబాటు కల్పించింది.

మధ్యాహ్నం 2 గంటల నుంచి మర్నాటి ఉదయం 6 వరకు కఠినంగా లాక్‌డౌన్‌ అమలు చేయాలని ఆదేశించింది.

దుకాణాలు, వాణిజ్య సముదాయాలు, హోటళ్లు, బార్లు, రెస్టారెంట్లు మూసి ఉంటాయంది.

భూములు, ఆస్తులు, వాహనాల రిజిస్ట్రేషన్‌లకు అనుమతించింది. విదేశాలకు వెళ్లే విద్యార్థులకు వెంటనే కరోనా టీకాలు ఇవ్వాలని సూచించింది.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతిభవన్‌లో జరిగిన మంత్రిమండలి సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు.

కరోనా కట్టడిలో భాగంగా మే 12 నుంచి రాష్ట్రంలో లాక్‌డౌన్‌ అమలవుతోంది. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు సడలింపులున్నాయి.

అయితే కరోనా కేసుల్లో తగ్గుదల ఉన్నా.. వ్యాధి నియంత్రణ ఆశించిన స్థాయిలో లేనందున లాక్‌డౌన్‌ను కొనసాగించాలని, సడలింపు సమయాన్ని పెంచాలని మంత్రి మండలి నిర్ణయించింది.

మినహాయింపులున్నవారు తప్ప లాక్‌డౌన్‌ సమయంలో ప్రజలెవ్వరూ బయట తిరగకుండా కఠిన ఆంక్షలు అమలుచేయాలని మంత్రిమండలి డీజీపీని ఆదేశించింది.

కరోనా నిబంధనలను పాటిస్తూ రాష్ట్రావతరణ వేడుకలను అతి తక్కువ మందితో జరుపుకోవాలన్నారు. ప్రగతిపథంలో ముఖ్యమంత్రి, ఆయా జిల్లాల్లో మంత్రులు అమరవీరులకు నివాళులర్పించి, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించాలని నిర్ణయించిందని ఈ వార్తలో రాశారు.

కరోనా కాలంలో ఆదివాసీ పిల్లలకు టీచరుగా మారిన ఎస్‌ఐ

కరోనా కారణంగా బడికి తాళం పడితే, ఆసిఫాబాద్ జిల్లాలో ఒక ఎస్ఐ వీధినే బడిగా మార్చారని, ఆయా గూడేల్లోని ప్రహరీలపై అక్షరాలు, అంకెలు రాయించి వినూత్న బోధనకు శ్రీకారం చుట్టారని సాక్షి ఒక కథనాన్ని ప్రచురించింది.

గత విద్యాసంవత్సరం ప్రభుత్వం ఆన్‌లైన్‌ తరగతులకు అనుమతి ఇచ్చినా మారుమూల ఏజెన్సీ ప్రాంతమైన కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో చాలా గ్రామాలకు నెట్‌వర్క్‌ సిగ్నల్స్‌ లేక విద్యాబోధన సాగలేదు.

తిర్యాణి మండలంలో 60 శాతానికిపైగా గ్రామాల్లో అదే దుస్థితి. గతంలో నేర్చుకున్న అంశాలనూ విద్యార్థులు క్రమంగా మర్చిపోయే పరిస్థితి ఏర్పడింది.

ఈ విషయాన్ని గ్రహించిన తిర్యాణి ఎస్సై రామారావు తన స్వంత ఖర్చుతో మండలంలోని 30 ఆదివాసీ గూడేల్లోని కూడళ్ల వద్ద గోడలపై తెలుగు, ఇంగ్లిష్‌ వర్ణమాల, గుణింతాలు, అంకెలు రాయించారు.

పైతరగతి విద్యార్థులు కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ కింది తరగతి విద్యార్థులకు వీటిని నేర్పించే ఏర్పాటు చేశారు.

ఆదివాసీ విద్యార్థుల కోసం పోలీసులు గోడలపై ఇలా రాయించడం అభినందనీయమని ఆయా గ్రామాల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారని ఈ కథనంలో తెలిపారు.

ఏపీలో జూన్ 30 వరకు స్కూళ్లకు సెలవులు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని అన్ని స్కూళ్లకు జూన్ 30వ తేదీ వరకు సెలవులు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని వెలుగు వార్తాపత్రిక తెలిపింది.

ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు తదితర అన్ని యాజమాన్యాలలో గల స్కూళ్లలో చదువుతున్న 1వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులకు వేసవి సెలవులు ఈనెల 30తో ముగుస్తున్న విషయం తెలిసిందే.

ఈ నేపధ్యంలో ప్రభుత్వం సెలవులను జూన్‌ 30వ తేదీ వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే పదో తరగతి పరీక్షలు వాయిదా వేసిన విషయం తెలిసిందే.

కరోనా అదుపులోకి రాని పరిస్థితులు, టీచర్లు అనేక మంది కరోనా బారినపడి చనిపోతుండడంతో విద్యారంగంలో ఆందోళనకర పరిస్థితులు కొనసాగుతున్నాయి.

ఈ నేపధ్యంలో అన్ని వర్గాల సూచనల మేరకు ప్రభుత్వం సెలవులు పొడిగించింది.

అయితే, టీచర్లు, ప్రధానోపాధ్యాయులు మాత్రం పాఠశాలకు హాజరు కావాల్సి ఉంటుందని విద్యాశాఖ స్పష్టం చేసింది.

కరోనా మహమ్మారి ఇప్పట్లో అంతమయ్యే పరిస్థితులు లేకపోవడం.. ప్రత్యక్ష క్లాసులు ఇప్పట్లో మొదలుపెట్టడం ప్రమాదకరంగా కనిపిస్తుండడంతో విద్యార్థులకు డీడీ, రేడియో, యూట్యూబ్‌ వంటి మాధ్యమాల ద్వారా ఆన్‌లైన్‌లో క్లాసులు నిర్వహించడానికి వీలుగా ప్రణాళికల సిద్ధం చేయాలని SCERT డైరెక్టర్‌ను ఆదేశించింది.

జూన్‌ 12వ తేదీ నుంచి అన్ని క్లాసులకు ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని పేర్కొంది. పదో తరగతి విద్యార్థులకు ఆయా స్కూల్స్ హెడ్‌ మాస్టర్లు జూన్‌ 1వ తేదీ నుంచే అవసరమై విద్యాపరమైన సహాయం అందిస్తూ పర్యవేక్షణ చేయాలని ఆదేశించిందని ఈ వార్తలో తెలిపారు.

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో 300 పడకలతో కోవిడ్ కేర్ సెంటర్

విశాఖ స్టీల్ ప్లాంటులోని గురజాడ కళాక్షేత్రంలో కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల, స్టీల్‌ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వర్చువల్‌ పద్ధతిలో ఆదివారం కోవిడ్‌ కేర్‌ సెంటర్‌ను ప్రారంభించారని ప్రజాశక్తి ఒక వార్త రాసింది.

వెయ్యి పడకల సామర్థ్యంగల ఈ సెంటర్‌లో మొదటి దశలో 300 పడకలను ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా ధర్మేంద్ర ప్రధాన్‌ మాట్లాడుతూ ఆక్సిజన్‌ ఉత్పత్తి చేస్తూ ఎంతోమంది ప్రాణాలను కాపాడిన విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌ కృషిని ప్రశంసించారు.

మహారాష్ట్రకు మొట్టమొదటి ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌ పంపడానికి ఉక్కు కార్మికులు చేసిన కృషిని అభినందించారు.

కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగ్గన్‌ సింగ్‌ కులస్తే మాట్లాడుతూ లిక్విడ్‌ మెడికల్‌ ఆక్సిజన్‌ సరఫరాకు విశాఖ ఉక్కు కార్మికులు చేసిన కృషిని అభినందనీయమన్నారు.

ఎంపి విజయసాయిరెడ్డి మాట్లాడుతూ దేశం మెడికల్‌ లిక్విడ్‌ ఆక్సిజన్‌ సంక్షోభంతో కొట్టమిట్టాడుతున్న సమయంలో నేనున్నానంటూ దేశానికి ప్రాణవాయువు అందించిన ఘనత వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌దేనని ప్రశంసించారు.

స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరించి ఉంటే దేశానికి ఈ సేవలు అందించగలిగేదా? అని ఒక్కసారి ఆలోచించాలని కేంద్ర మంత్రిని కోరారు.

ప్రైవేటీకరణ అంశాన్ని ప్రస్తావించాల్సిన సందర్భం కాకపోయినా మరొక్కసారి ఆ నిర్ణయాన్ని పునర్‌ సమీక్షించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారని పత్రిక వివరించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)