స్టార్ హోటళ్లలో వ్యాక్సినేషన్ ప్యాకేజీలపై కేంద్రం ఆగ్రహం.. వెంటనే ఆపేయాలని ఆదేశం: ప్రెస్ రివ్యూ

ప్రచురణ

కొన్ని స్టార్ హోటళ్లు టీకా వేయిస్తామని ప్రకటనలు ఇవ్వడంపై కేంద్రం సీరియస్ అయినట్లు ఈనాడు దినపత్రిక కథనం ప్రచురించింది.

కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు, స్టార్‌ హోటళ్లతో కలిసి కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్యాకేజీ ప్రకటనలు జారీ చేయడంపై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది.

హోటళ్లలో టీకా వేయడం జాతీయ కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ కార్యక్రమ నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేసింది.

అందువల్ల అలాంటిచోట వ్యాక్సినేషన్‌ కార్యక్రమం నిర్వహించకూడదని పేర్కొంటూ కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ అదనపు కార్యదర్శి మనోహర్‌ రాష్ట్రాలకు లేఖ రాశారని ఈనాడు చెప్పింది.

కేవలం నాలుగుచోట్ల మాత్రమే టీకాల కార్యక్రమం నిర్వహించాలని తెలిపారు. అందుకు అతీతంగా ఎక్కడా చేపట్టడానికి వీల్లేదని స్పష్టం చేశారు.

వ్యాక్సీన్‌ వేయాల్సిన ప్రదేశాలు

1. ప్రభుత్వ వ్యాక్సినేషన్‌ సెంటర్‌

2. ప్రైవేటు ఆసుపత్రి నిర్వహించే ప్రైవేటు కొవిడ్‌ టీకా సెంటర్‌

3. ప్రభుత్వ కార్యాలయాల పరిధిలో ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రైవేటు కంపెనీల పరిధిలో ప్రైవేటు ఆసుపత్రులు నిర్వహించే వర్క్‌ ప్లేస్‌ కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ సెంటర్లు

4. వయోవృద్ధులు, దివ్యాంగుల కోసం గ్రూప్‌ హౌసింగ్‌ సొసైటీలు, రెసిడెంట్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ కార్యాలయాలు, కమ్యూనిటీ సెంటర్లు, పంచాయతీ భవనాలు, స్కూళ్లు, కాలేజీలు, వృద్ధాశ్రమాల్లో తాత్కాలిక ప్రాతిపదికన ఏర్పాటు చేసిన కేంద్రాలు

ఈ నాలుగు చోట్ల తప్ప మిగతా ఎక్కడా వ్యాక్సీన్ అందించడానికి వీల్లేదని పేర్కొన్నారని ఈనాడు చెప్పింది.

స్టార్‌ హోటళ్లలో వ్యాక్సిన్‌ అందించడం నిబంధనలకు విరుద్ధం కాబట్టి తక్షణం ఆ కార్యక్రమాన్ని ఆపేయాలని ఆదేశించారు. అలాంటి సంస్థలపై తక్షణం పరిపాలన, చట్టపరమైన చర్యలు చేపట్టాలని నిర్దేశించారని పత్రిక వివరించింది.

సిద్దిపేట శ్మశానంలో తలదాచుకున్న కుటుంబానికి డబుల్ బెడ్ రూం ఇల్లు

కోవిడ్ వల్ల నిరాశ్రయులై శ్మశానంలో తలదాచుకున్న ఒక కుటుంబానికి మంత్రి హరీశ్ రావు డబుల్ బెడ్ రూం ఇల్లు అందించారని నమస్తే తెలంగాణ దిన పత్రిక కథనం ప్రచురించింది.

ఇంటిపెద్దను కోల్పోయి, సొంతిల్లు లేక శ్మశానవాటికలో తలదాచుకుంటున్న కొవిడ్‌ బాధిత కుటుంబానికి రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు కొండంత అండగా నిలిచారు.

డబుల్‌ బెడ్‌రూం ఇల్లు మంజూరుచేయడంతోపాటు తక్షణసాయంగా రూ.10 వేలు, నెలకు సరిపడా సరుకులు ఇప్పించారని పత్రిక రాసింది.

సిద్దిపేట పట్టణానికి చెందిన కొత్వాల్‌ శ్రీనివాస్‌ క్షౌరవృత్తితో కుటుంబాన్ని పోషించుకొనేవాడు. ఇటీవల కరోనా బారినపడటంతో హోమ్‌ ఐసొలేషన్‌లో ఉంటూ మూడురోజుల క్రితం మృతిచెందాడు.

ఆ ఇంట్లో ఉండటానికి వీల్లేదని యజమాని స్పష్టం చేయడంతో శ్రీనివాస్‌ భార్య సుజాత, కుమారుడు రుచిత్‌, కూతురు దీక్ష శ్రీరామకుంట శ్మశానవాటికలో తలదాచుకుంటున్నారు.

శనివారం ట్విట్టర్‌ ద్వారా ఈ విషయం తెలుసుకున్న మంత్రి హరీశ్‌రావు తక్షణమే స్పందించారు. సిద్దిపేట అర్బన్‌ తాసిల్దార్‌ విజయ్‌సాగర్‌ను అక్కడికి పంపించారు.

వారితో మంత్రి హరీశ్‌రావు ఫోన్‌లో మాట్లాడి మనోధైర్యం కల్పించారు. ఆ కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారని నమస్తే తెలంగాణ రాసింది.

సిద్దిపేట కేసీఆర్‌నగర్‌లో నిర్మించిన డబుల్‌ బెడ్‌రూం ఇల్లు మంజూరుచేస్తున్నట్టు తెలిపారు.

అనంతరం మంత్రి ఆదేశాలతో అర్బన్‌ తాసిల్దార్‌ విజయ్‌సాగర్‌, డిప్యూటీ తాసిల్దార్‌ రాజేశం శ్మశానవాటికలో ఉంటున్న వారిని తీసుకెళ్లి, కేసీఆర్‌నగర్‌లోని 127వ బ్లాక్‌లో డబుల్‌ బెడ్‌రూం ఇల్లు అప్పగించారని నమస్తే తెలంగాణ వివరించింది.

తెలంగాణలో లాక్ డౌన్ పై నేడు నిర్ణయం

తెలంగాణలో లాక్‌డౌన్ పొడిగింపుపై ప్రభుత్వం ఇవాళ నిర్ణయం తీసుకోనున్నట్లు ఆంధ్రజ్యోతి దిన పత్రిక కథనం ప్రచురించింది.

రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను పొడిగించాలా? వద్దా? అనే అంశంపై ప్రభుత్వం తర్జనభర్జన పడుతోంది. ఈ విషయాన్ని ఆదివారం జరగనున్న కేబినెట్‌ సమావేశంలో తేల్చనుంది.

సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్‌లో మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ భేటీలో లాక్‌డౌనే ప్రధాన చర్చనీయాంశం కానుంది.

దీంతోపాటు వ్యవసాయం, పంటలు, ధాన్యం సేకరణ, విత్తనాలు, ఎరువుల లభ్యత, రాష్ట్రావతరణ వేడుకల నిర్వహణ తదితర అంశాలపై మంత్రిమండలి చర్చించనుంది.

అయితే లాక్‌డౌన్‌పై ఇప్పటికే ప్రభుత్వం వివిధ వర్గాల నుంచి సమాచారాన్ని సేకరించింది.

లాక్‌డౌన్‌ విధింపు వల్ల రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నట్లు ప్రభుత్వ పెద్దలే ప్రకటిస్తున్నారు. సెకండ్‌ వేవ్‌ విజృంభించిన మొదట్లో కరోనా కేసులు 10 వేల మార్కును దాటాయి.

ఇప్పుడు ఒక్కో రోజు 90 వేలకు పైగా టెస్టులు చేసినా.. మూడు వేల పైచిలుకు కేసులే నమోదవుతున్నాయి. ఇది లాక్‌డౌన్‌ ఫలితమేనని ప్రభుత్వం భావిస్తోంది.

ఈ దృష్ట్యా లాక్‌డౌన్‌ను జూన్‌ 7 వరకు పొడిగిద్దామన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోందని పత్రిక రాసింది.

లాక్‌డౌన్‌ పొడిగిస్తేనే మంచిదని కొంత మంది అభిప్రాయపడగా.. మరికొందరు పొడిగింపు వల్ల ప్రజలకు ఇబ్బందులు ఏర్పడుతాయని, ఇప్పటికే 20 రోజులకు పైగా నానా తిప్పలు పడుతున్నారని ప్రభుత్వానికి చెప్పినట్లు తెలిసిందని ఆంధ్రజ్యోతి వివరించింది.

50 పడకలు దాటితే ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు

ఆంధ్రప్రదేశ్‌లో 50 పడకలు దాటిన ఆస్పత్రులు కచ్చితంగా ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించినట్లు సాక్షి దిన పత్రిక కథనం ప్రచురించింది.

ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇప్పటికే 57 ఆస్పత్రుల్లో పీఎస్‌ఏ ఆక్సిజన్‌ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నామని, ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ 50 పడకలు దాటితే ఆక్సిజన్‌ ప్లాంటు కచ్చితంగా ఏర్పాటు చేయాలని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌ పేర్కొన్నారు.

వారం రోజుల్లో దీనికి సంబంధించిన మార్గదర్శకాలు వస్తాయన్నారు. శనివారం ఆయన మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో మీడియాతో మాట్లాడారు. ఆక్సిజన్‌ ప్లాంట్ల ఏర్పాటుకు పరిశ్రమల శాఖ రాయితీలు ఇస్తుందని, భవిష్యత్‌లో ఎక్కడా ఆక్సిజన్‌ కొరత లేకుండా ఉండాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమన్నారు.

రాష్ట్రంలో 16 చోట్ల సూపర్‌ స్పెషాలిటీ, మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణానికి ప్రభుత్వం ఆహ్వానిస్తోందని, రూ.100 కోట్ల పెట్టుబడి పెట్టే వారికి భూమిలో రాయితీ ఇస్తామని ఇప్పటికే ముఖ్యమంత్రి ప్రకటించారన్నారు.

దీనికోసం భూములు కేటాయించాలని కలెక్టర్లను ఆదేశించామని సింఘాల్ చెప్పినట్లు సాక్షి వివరించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)