కోవిడ్ వ్యాక్సీన్‌ను భారతీయులకు అన్యాయం చేసి ఎగుమతి చేయలేదన్న సీరం ఇనిస్టిట్యూట్

ప్రచురణ

భారతీయులను కాదని కోవిడ్ వ్యాక్సీన్‌ను బయట దేశాలకు ఎగుమతి చేయలేదని దేశంలోని అతి పెద్ద వ్యాక్సీన్ ఉత్పత్తి సంస్థ సీరం ఇనిస్టిట్యూట్ తెలిపింది.

"గత కొద్ది రోజులుగా భారత ప్రభుత్వం, వ్యాక్సీన్ ఉత్పత్తి సంస్థల మధ్య వ్యాక్సీన్ ఎగుమతిపై చర్చలు జరుగుతున్నాయి. ఇందులో సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) కూడా భాగం పంచుకుంటోంది" అని ఆ సంస్థ తెలిపింది.

ఎలాంటి నిర్థరణకైనా వచ్చే ముందు అనేక అంశాలను పరిగణించాల్సి ఉంటుందని ఎస్ఐఐ అంటోంది.

ఇండియాలో కోవిడ్ వ్యాక్సీన్ ప్రచారానికి మద్దతుగా తాము చేయగలిగినదంతా చేస్తూనే ఉంటామని ఆ సంస్థ స్పష్టం చేసింది.

ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన రెండు దేశాల్లో భారతదేశం ఒకటని అందరూ గుర్తుంచుకోవాలని ఈ సంస్థ సీఈఓ అదార్ పూనావాలా అన్నారు.

ఇంత పెద్ద దేశంలో 2-3 నెలల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేయడం అసాధ్యమని, ప్రపంచంలో మొత్తం జనాభాకు వ్యాక్సీన్ అందించడానికి రెండు మూడు సంవత్సరాలు పట్టవచ్చని ఆయన అన్నారు.

"అంటువ్యాధులు భౌగోళిక లేదా రాజకీయ సరిహద్దులకు మాత్రమే పరిమితం కావని మనం అర్థం చేసుకోవాలి. ప్రపంచంలోని ప్రతీ వ్యక్తి ఈ వైరస్‌ను ఓడించేంతవరకూ మనమంతా సురక్షితంగా ఉండలేమని గుర్తించాలి. ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్‌ను అంతం చేసే దిశలో కోవాక్స్ కూటమి నిబంధనలకు మేం కట్టుబడి ఉన్నాం" అని సీరం తెలిపింది.

90 కన్నా ఎక్కువ అభివృద్ధి చెందుతున్న దేశాలు, పేద దేశాల్లోని ప్రజలకు టీకాలు పంపిణీ చేసే దిశగా ప్రారంభమైన అంతర్జాతీయ కార్యక్రమాన్ని కోవాక్స్ అని అంటున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)