అఫ్గానిస్తాన్: కాబుల్‌లోని స్కూల్ వద్ద భారీ బాంబు పేలుడు, 50 మంది మృతి

ప్రచురణ

శనివారం నాడు కాబుల్‌లోని ఒక స్కూల్ నుంచి విద్యార్థులు వెళ్లిపోతున్న సమయంలో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడుకు సంబంధించి సోషల్ మీడియాలో కొందరు ఫొటోలు పోస్ట్ చేశారు. ఆ ఫొటోల్లో విద్యార్థుల పుస్తకాల బ్యాగులు రోడ్డు మీద చెల్లాచెదురుగా పడి ఉండడం కనిపించిందని బీబీసీ ప్రతినిధులు తెలిపారు.

ఈ దాడిలో 50 మంది చనిపోయారు. మరో 52 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో అమ్మాయిలు ఎక్కువగా ఉన్నారని విద్యా శాఖ అధికార ప్రతినిధి తెలిపారు. ఈ దాడికి పాల్పడింది ఎవరన్నది ఇంకా తెలియలేదు. ఎవరూ కూడా అందుకు తామే బాధ్యులమని చెప్పుకోలేదు.

పశ్చిమ కాబుల్ లోని దష్త్-ఏ-బార్చిగా పిలిచే ఈ ప్రాంతంలో ఎక్కువగా షియా హజరస్‌లు నివసిస్తుంటారు. వీళ్లను తరచూ సున్నీ మిలిటెంట్లు లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తుంటారు.

సరిగ్గా ఏడాది కిందట ఇక్కడి స్థానిక ఆస్పత్రిలోని ప్రసూతి విభాగం మీద బాంబు దాడి జరిగింది. ఆ దాడిలో 24 మంది మహిళలు, పిల్లలు, శిశువులు చనిపోయారు.

వచ్చే వారం రంజాన్ పండుగ సందర్భంగా వీధులన్నీ షాపింగ్ కోసం వచ్చిన వాళ్లతో రద్దీగా ఉన్నట్లు నగర వాసులు తెలిపారు. ఆ సమయంలో విద్యార్థులు కూడా బడి నుంచి బయటకు వస్తున్నారు. విద్యా మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి నజీబా అరియన్ రాయిటర్స్ వార్తా సంస్థతో మాట్లాడుతూ, ఆ ప్రభుత్వ పాఠశాలలో బాలురు, బాలికలు ఇద్దరూ చదువుకుంటారని చెప్పారు.

సాయంత్రం మూడు తరగతుల్లో ఎక్కువగా అమ్మాయిలు ఉంటారని, అందువవల్ల ఈ దాడిలో వారే ఎక్కువగా గాయపడ్డారని నజీబా చెప్పారు.

అఫ్గానిస్తాన్‌లోని యురోపియన్ యూనియన్ మిషన్ ఈ ఘటనపై ట్వీట్ చేసింది. "పాఠశాలలో ప్రధానంగా బాలికలను టార్గెట్ చేసుకుని ఈ దాడి జరిగింది. ఇది భవిష్యత్తు అఫ్గానిస్తాన్‌పై జరిగిన దాడి" అని ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.

అఫ్గానిస్తాన్‌లోని అమెరికా సేనలను సెప్టెంబర్ 11 నుంచి ఉపసంహరిస్తామని అమెరికా ప్రకటించిన తరువాత ఈ ప్రాంతంలో హింసాత్మక దాడులు మరింతగా పెరిగాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)