కరోనావైరస్: కొన్ని దేశాలు వ్యాక్సీన్ కొని ఎందుకు వదిలేస్తున్నాయి... టీకాతో కొందరిలో రక్తం గడ్డ కడుతుందన్నది నిజమేనా?

ప్రచురణ

కోవిడ్‌ వ్యాక్సీన్ డోసులు తమకు అందలేదని కొన్ని దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తుండగా, మరికొన్నిదేశాలు మాత్రం తాము కొనుగోలు చేసిన కొన్ని కంపెనీల వ్యాక్సీన్‌ను ఎలా వదిలించుకోవాలా అని ఆలోచిస్తున్నాయి.

భద్రతా కారణాలతో కొన్ని వ్యాక్సీన్‌లను ఉపయోగించడానికి పలు దేశాలు వెనకడుగు వేస్తున్నాయి.

టీకా తీసుకున్న తర్వాత శరీరంలో రక్తం గడ్డ కడుతోందన్న భయంతో ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా, జాన్సన్ అండ్ జాన్సన్‌ తయారు చేసిన వ్యాక్సీన్‌లను కొన్ని దేశాలు నిషేధించాయి.

డెన్మార్క్‌ ఆస్ట్రా-జెనెకా వ్యాక్సిన్‌ వాడకాన్నిమానేయగా, ఆ దేశంలో మిగిలిపోయిన ఆ టీకాను కొనడానికి మరికొన్ని దేశాలు ముందుకొస్తున్నాయి. చెక్ రిపబ్లిక్, ఎస్తోనియా, లాత్వియా, లిథువేనియాలు ఈ వ్యాక్సీన్ కొనుగోలుకు ఆసక్తి చూపించాయి.

లా ఎందుకు జరుగుతోంది?

టీకా తీసుకున్న కొందరిలో రక్తం గడ్డకట్టినట్లు కొన్ని రిపోర్టులు వచ్చాయి. ముఖ్యంగా యువతలో ఇలాంటి పరిస్థితి కనిపించింది. అయితే కోవిడ్-19తో ఏర్పడిన ముప్పు దీనికంటే చాలా పెద్దదని గ్లోబల్ హెల్త్‌ రెగ్యులేటరీ అథారిటీ అధికారులు చెబుతున్నారు.

అమెరికాకు చెందిన హెల్త్‌ రెగ్యులేటర్‌ అందించిన డేటా ప్రకారం కోటిమందికి ఆస్ట్రాజెనెకా వ్యాక్సీన్ ఇస్తే, అందులో 40 మందికి రక్తం గట్టకట్టే సమస్య ఏర్పడిందని, ఇందులో 10 మంది చనిపోయారని తేలింది. అంటే 10 లక్షల మందిలో ఒకరు చనిపోయారని ఈ గణాంకాలు చెబుతున్నాయి.

ఇది పెద్ద ప్రమాదం కాదని నిపుణులు చెబుతున్నప్పటికీ ఆస్ట్రా-జెనెకా వాడకాన్ని నిషేధించాలని డెన్మార్క్‌ ప్రభుత్వం నిర్ణయించింది. తమ వద్ద ఇతర వ్యాక్సీన్లు కూడా ఉన్నాయని, వైరస్ తీవ్రత ఉంది కాబట్టి తాము సైడ్ ఎఫెక్ట్స్ విషయంలో కూడా జాగ్రత్త పడుతున్నామని అక్కడి ఆరోగ్య అధికారులు చెబుతున్నారు.

ఇప్పటికే దాదాపు రెండున్నర కోట్ల డోసుల ఆస్ట్రా జెనెకా టీకాను కొన్న డెన్మార్క్‌ ఇకపై దానిని కొనబోమని తేల్చి చెప్పింది.

మరోవైపు జాన్సన్ అండ్ జాన్సన్ తయారీ టీకా వల్ల కూడా రక్తం గడ్డకడుతోందన్న రిపోర్టులతో అమెరికా కూడా దీనిని పరిశీలనలో పెట్టింది. భద్రతా తనిఖీలు జరిగే వరకు ఈ టీకాను అమెరికాలో వాడరు. అయితే ఇప్పటికే 10 కోట్ల డోసులకు అమెరికా ఆర్డర్ ఇచ్చింది.

మరోవైపు జాన్సన్ అండ్ జాన్సన్ టీకా వాడకాన్ని దక్షిణాఫ్రికా నిలిపేసింది. దీంతో ఈ టీకా నిల్వలు ఆ దేశంలో పేరుకు పోయాయి. అయితే కోవిడ్-19 పై ఈ టీకా ప్రభావం ఎక్కువగా ఉంటుందని పరిశోధనల్లో తేలింది.

కొత్త వేరియంట్‌పై తక్కువ ప్రభావం చూపుతోందన్న కారణంతో అంతకు ముందే ఆస్ట్రాజెనెకాను దక్షిణాఫ్రికా ప్రభుత్వం నిషేధించింది. దీంతో ఆస్ట్రాజెనెకా డోసులు కూడా పెద్ద ఎత్తున అక్కడ మిగిలిపోయాయి.

14 ఆఫ్రికన్ దేశాలకు కోటి డోసుల ఆస్ట్రాజెనెకా టీకాను దక్షిణాఫ్రికా సరఫరా చేసింది.

ఈ వ్యాక్సీన్‌లు వేరే చోట ప్రమాదం కాదా?

ప్రమాదకరమే. కానీ, తమ వద్ద మిగిలిపోయిన వ్యాక్సీన్‌ను అమ్మాలని లేదా ఉచితంగా ఇవ్వాలని కొన్ని దేశాలు కోరుకుంటున్నాయి. డెన్మార్క్ తమ వద్ద ఉన్న టీకాను అమ్మాలని భావిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ యూరోపియన్ డైరక్టర్ హన్స్ ‌క్లగ్ వెల్లడించారు.

దీంతో డెన్మార్క్ ‌పొరుగు దేశాలు కొన్ని, ఈ మిగిలిపోయిన టీకాను కొనడానికి ముందుకొచ్చాయి. ''అవసరమైన వాటికంటే తక్కువ డోసుల టీకాలు మా దగ్గరున్నాయి. కాబట్టి డెన్మార్క్‌ నుంచి డోసులను తీసుకోవాలనుకుంటున్నాం'' అని లిథువేనియా ప్రధాని ఇంగ్రిడా సిమియోనైట్ అన్నారు.

చెక్ రిపబ్లిక్‌ హోంమంత్రి కూడా తాము ఈ డోసులను కొనడానికి సిద్దంగా ఉన్నామని ట్విటర్‌లో ప్రకటించారు. అయితే డెన్మార్క్‌ ప్రభుత్వం దీనిపై స్పందించ లేదు.

ఆస్ట్రాజెనెకా, జాన్సన్ అండ్ జాన్సన్‌ టీకాలను సాధారణ ఫ్రిజ్‌ ఉష్ణోగ్రతల వద్ద భద్రపరిచే అవకాశం ఉండగా, ఫైజర్‌ వ్యాక్సిన్‌ను -70 డిగ్రీలను మెయింటెయిన్ చేయాల్సి ఉంది.

ఎన్ని టీకాలు వాడారు?

యూరోపియన్ సెంటర్ ఫర్ డిసీజ్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్‌ అంచనాల ప్రకారం ఏప్రిల్ 15 నాటికి డెన్మార్క్‌ రెండు లక్షల డోసులకు పైగా ఆస్ట్రాజెనెకా టీకాను కొనుగోలు చేసింది. ఇందులో 150,671 డోసులు వాడగా, 52,249 డోసులు మిగిలి ఉన్నాయి.

యూఎస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం అమెరికాలోని చాలా రాష్ట్రాల్లో అవసరమైన దానికన్నా వ్యాక్సీన్ అదనంగా ఉంది.

పలు రాష్ట్రాల్లో వ్యాక్సీన్ మిగిలిపోవడానికి కారణం ఆయా రాష్ట్రాల్లో చాలామంది వ్యాక్సీన్‌ వేసుకోవడానికి ఇష్టపడక పోవడమేనని నిపుణులు చెబుతున్నారు.

మిగిలిపోయిన వ్యాక్సీన్‌ సరఫరా చేస్తారా ?

వివిధ దేశాలలో ఇలా మిగిలిపోయిన వ్యాక్సీన్‌ను అవసరం ఉన్న దేశాలకు కోవాక్స్ ప్రణాళిక ద్వారా సరఫరా చేస్తారు.

కోవాక్స్ అనేది ఒక అంతర్జాతీయ ప్రణాళిక. ఐక్యరాజ్య సమితి, గ్లోబల్ వ్యాక్సీన్ అలయన్స్( గావి), కౌన్సిల్‌ ఫర్ ఎపిడెమిక్ ప్రిపేర్డ్‌నెస్ ఇన్నోవేషన్స్‌ (సెపి) ఆధ్వర్యంలో నడిచే ఈ ప్రణాళిక ముఖ్య ఉద్దేశం ప్రపంచంలో అందరికీ పేద, ధనిక తేడాలు లేకుండా వ్యాక్సీన్‌ను అందించడం.

2021 చివరి నాటికి, 190 దేశాల ప్రజలు రెండు బిలియన్ డోసులను కోవాక్స్ ద్వారా అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

ధనిక దేశాలు తమ వద్ద మిగిలిపోయిన టీకాను పేద దేశాలకు విరాళంగా ఇవ్వడం కూడా కోవాక్స్ ప్రణాళికలో ఒక భాగం.

బ్రిటన్ 45 మిలియన్‌ డోసుల వ్యాక్సీన్‌ను ఆర్డర్ చేయగా, మిగిలిన వ్యాక్సీన్‌ ను పేద దేశాలకు అందించేందుకు కట్టుబడి ఉంది. అయితే చాలా దేశాలు తమ వద్ద ఎంత వ్యాక్సీన్ మిగిలి ఉంది, ఎంత విరాళంగా ఇవ్వదలుచుకున్నాయి అన్న విషయాన్ని ఇప్పటి వరకు వెల్లడించ లేదు.

ప్రస్తుతం ధనిక దేశాలు తమ ప్రజలకు వ్యాక్సీన్‌ను అందించడంతో పాటు కోవాక్స్‌కు నిధులు సమకూర్చడంపై దృష్టి సారించాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)