శంషాబాద్ ఎయిర్ పోర్టుకు మెట్రో.. పూర్తయిన డీపీఆర్: ప్రెస్ రివ్యూ

ప్రచురణ

హైదరాబాద్ మెట్రో రైలును శంషాబాద్ విమానాశ్రయం వరకూ విస్తరించడానికి డీపీఆర్ సిద్ధమైనట్లు నమస్తే తెలంగాణ దినపత్రిక వార్తా కథనం ప్రచురించింది.

హైదరాబాద్‌ నగరానికి మణిహారంలా ఉన్న మెట్రో రెండో దశకు వడివడిగా అడుగులు పడుతున్నాయి.

ఇప్పటికే ఉన్న 69 కిలోమీటర్లకు తోడు మరో 80 కిలోమీటర్ల మేర మెట్రోకారిడార్‌ నిర్మించాలని సీఎం కేసీఆర్‌ సంకల్పించారు.

అత్యంత కీలకమైన ఐటీ కారిడార్‌ నుంచి శంషాబాద్‌ విమానాశ్రయం వరకు 31 కిలోమీటర్ల మార్గానికి అత్యంత ప్రాధాన్యమిచ్చారు.

ఇందుకోసం హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టు మెట్రో లిమిటెడ్‌ పేరుతో స్పెషల్‌ పర్పస్‌ వెహికిల్‌ (ఎస్‌పీవీ)ని ఏర్పాటుచేశారు.

ఇందులో హైదరాబాద్‌ మెట్రో రైలుతోపాటు హెచ్‌ఎండీఏ, టీఎస్‌ఐఐసీ, జీఎంఆర్‌ ఎయిర్‌పోర్టుతో కలిసి ఎయిర్‌పోర్టు మెట్రో కారిడార్‌ను నిర్మించాలని నిర్ణయించారు.

ఈ కారిడార్‌ నిర్మాణం కోసం ఢిల్లీ మెట్రోరైలు సంస్థతో డీపీఆర్‌ను సైతం సిద్ధంచేశారు. శంషాబాద్‌ మెట్రో కారిడార్‌కు భూసేకరణ అవసరం లేకపోగా.. సుమారు 4 వేల కోట్లు వెచ్చిస్తే సరిపోతుందని అంటున్నారు.

ఇప్పటికే ప్రభుత్వం బడ్జెట్‌లో రూ.1000 కోట్లు కేటాయించింది. హెచ్‌ఎండీఏతోపాటు టీఎస్‌ఐఐసీ, జీఎంఆర్‌ ఎయిర్‌పోర్టు సైతం కొంత మొత్తాన్ని వెచ్చించేందుకు సిద్ధంగా ఉన్నాయి.

దీనికితోడు బ్యాంకుల నుంచి రుణం తీసుకోవడం ద్వారా రెండేండ్లలోనే ఈ ప్రాజెక్టు పూర్తికి ప్రణాళికలు రూపొందిస్తున్నారని నమస్తే తెలంగాణ వివరించింది.

ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు రుణంపై ఎలక్ట్రిక్ స్కూటర్లు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు రుణంపై ఎలక్ట్రిక్ స్కూటర్లు అందించాలనే ప్రతిపాదన ముఖ్యమంత్రికి చేరినట్లు సాక్షి కథనం ప్రచురించింది.

ఏపీలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు రుణాలపై ఎలక్ట్రిక్‌ స్కూటర్లను అదించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

ఇందుకోసం కేంద్ర ప్రభుత్వ సంస్థలైన ఎన్‌టీపీసీ/ఈఈఎస్‌ఎల్‌ వంటి సంస్థలతో కలిసి నెడ్‌క్యాప్‌ ఒక పథకాన్ని రూపొందించినట్లు ఇంధన శాఖ తెలిపింది.

రుణాన్ని 24 నెలల నుంచి 60 నెలల్లో తీర్చే విధంగా వివిధ సంస్థలతో చర్చిస్తున్నామని, వాహన ధర బ్యాటరీ సామర్థ్యంపై ఆధారపడి ఉంటుందని పేర్కొంది.

నెలవారీ చెల్లించే రుణం కిస్తీ (ఈఎంఐ) రూ.2,000 నుంచి రూ.2,500 ఉండేలా చూస్తున్నామంది. ఒకసారి చార్జింగ్‌ చేస్తే 40 కి.మీ. నుంచి 100 కి.మీ. వరకు తిరేగా వివిధ బ్రాండ్‌ల వాహనాలు అందుబాటులో ఉన్నట్లు తెలిపింది.

తొలి దశలో లక్ష వాహనాలను సరఫరా చేయడానికి ఆసక్తి గల సంస్థల నుంచి బిడ్లను కోరామని, ఇప్పటికే 10కి పైగా సంస్థలు ముందుకొచ్చినట్లు నెడ్‌క్యాప్‌ అధికారులు పేర్కొన్నారు.

ప్రభుత్వ ఉద్యోగులకు ఈ పథకం ఐచ్చికమన్నారు. ఈ మేరకు ఇంధన శాఖ నుంచి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వద్దకు ప్రతిపాదన చేరింది. ఆయన కూడా దీనిపై సానుకూలంగా స్పందించినట్లు తెలిసిందని సాక్షి వివరించింది.

తెలంగాణలో మహారాష్ట్ర వేరియంట్

మహారాష్ట్ర నుంచి తెలంగాణలోకి డబుల్ మ్యూటెంట్ వేరియంట్ రావడంతో సరిహద్దు జిల్లాల్లో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయని ఆంధ్రజ్యోతి దినపత్రిక వార్తాకథనం రాసింది.

తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఫిబ్రవరి తర్వాత ఆకస్మికంగా రాష్ట్రంలో వేగంగా కేసుల పెరుగుదలకు దారితీసిన ప్రధాన కారణమేంటి? అనే ప్రశ్నను లేవనెత్తే అందరి దృష్టి ఇప్పుడు మహారాష్ట్రపైకే మళ్లుతోంది.

అక్కడ నమోదవుతున్న కరోనా కేసుల్లో సగానికిపైగా 'డబుల్‌ మ్యుటెంట్‌' (బి.1.617) కరోనా వైరస్‌ వేరియంట్‌వే ఉంటున్నాయని కేంద్ర ప్రభుత్వానికి చెందిన 'ఇండియన్‌ సార్స్‌ కరోనా వైరస్‌-2 జినోమిక్‌ కన్సార్టియం' (ఐఎన్‌ఎ్‌సఏసీఓజీ) తాజా అధ్యయనంలో వెల్లడైంది.

ప్రత్యేకించి తెలంగాణను ఆనుకొని ఉన్న విదర్భ ప్రాంతంలో ఈ వేరియంట్‌కు సంబంధించిన కేసులు భారీగా నిర్ధరణ అవుతున్నాయి.

ఆ ప్రాంతం పరిధిలోని గడ్చిరోలి, చంద్రాపూర్‌, యావత్‌మల్‌, నాందేడ్‌, ధర్మాబాద్‌, దేగ్లూర్‌ సహా పలు పట్టణాల నుంచి తెలంగాణలోని నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, మెదక్‌ ఉమ్మడి జిల్లాల మధ్య నిరంతరం ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు.

ఈక్రమంలోనే అత్యంత వేగంగా వ్యాపించే స్వభావం కలిగిన బి.1.617 వేరియంట్‌ మహారాష్ట్ర సరిహద్దుల మీదుగా తెలంగాణలోకి ప్రవేశించి ఉండొచ్చనే అంచనాలు వెలువడుతున్నాయి.

ఇటీవల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల నుంచి సేకరించిన శాంపిళ్ల జన్యుక్రమాలను హైదరాబాద్‌లోని సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ (సీసీఎంబీ) శాస్త్రవేత్తలు విశ్లేషించగా.. 2 శాతం కేసుల్లో 'డబుల్‌ మ్యుటెంట్‌' వేరియంట్‌ను గుర్తించారు.

రాష్ట్రంలో చాపకింద నీరులా ఆ స్ట్రెయిన్‌ ప్రబలుతోంది అనేందుకు వైద్యనిపుణులు ఈ గణాంకాలను నిదర్శనంగా చూపుతున్నారు.

పకడ్బందీగా కరోనా కట్టడి చర్యలు చేపట్టకపోతే రాష్ట్రాల మధ్య కరోనా వేరియంట్ల వ్యాప్తి మరింత వేగాన్ని పుంజుకోవచ్చని హెచ్చరిస్తున్నారు.

నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, మెదక్‌ ఉమ్మడి జిల్లాల్లో కొవిడ్‌-19 పాజిటివిటీ రేటు అకస్మాత్తుగా పెరగడానికి కూడా డబుల్‌ మ్యుటెంట్‌ వేరియంటే కారణమై ఉండొచ్చని చెబుతున్నారని ఆంధ్రజ్యోతి వివరించింది.

జగనన్న విద్యాదీవెన తొలివిడత నేడు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తొలి త్రైమాసికం జగనన్న విద్యాదీవెన మొత్తాన్ని ఈరోజు విడుదల చేస్తున్నట్లు ఈనాడు దినపత్రిక కథనం ప్రచురించింది.

జగనన్న విద్యాదీవెన కింద ప్రస్తుత విద్యా సంవత్సరం(2020-21)లో తొలి త్రైమాసికం బోధనా రుసుముల్ని రాష్ట్ర ప్రభుత్వం సోమవారం విడుదల చేయనుంది.

తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగే కార్యక్రమంలో సీఎం జగన్‌ ఆన్‌లైన్‌ ద్వారా రూ.671.45 కోట్లను విడుదల చేస్తారు. 10,88,439 మంది విద్యార్థులు ఈ దఫా లబ్ధి పొందుతారు.

రాష్ట్రప్రభుత్వం తొలిసారిగా బోధనా రుసుముల్ని కళాశాలల యాజమాన్యాలకు బదులుగా విద్యార్థుల తల్లులు/ సంరక్షకుల ఖాతాలో జమచేయనుంది.

ఇందుకోసం ఇప్పటికే విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల సేకరణను సాంఘిక సంక్షేమశాఖ పూర్తిచేసింది.

బోధనా రుసుముల్ని విద్యార్థుల తల్లుల ఖాతాలో జమచేస్తే ఫీజులు చెల్లించేందుకు ఏటా నాలుగుసార్లు కళాశాలకు వెళ్తారని, అక్కడ సదుపాయాలు, బోధనా పద్ధతుల్ని పరిశీలించి యాజమాన్యాన్ని ప్రశ్నించే అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో ఈ విధానానికి శ్రీకారం చుడుతున్నట్లు ప్రభుత్వం గతంలో ప్రకటించింది.

జగనన్న విద్యాదీవెన ద్వారా ప్రభుత్వం ఏటా నాలుగు విడతల్లో బోధనా రుసుముల్ని విడుదల చేయనుంది. సోమవారం తొలివిడత, జులైలో రెండు, డిసెంబరులో మూడు, ఫిబ్రవరి 2022లో నాలుగో విడత నిధులు జమచేస్తుంది.

జగనన్న వసతిదీవెన తొలివిడత సాయాన్ని ప్రభుత్వం ఈ నెల 28న విడుదల చేయనుంది. డిసెంబరులో రెండో విడత విడుదల చేస్తామని సంక్షేమ క్యాలెండర్‌లో ప్రకటించింది.

ఈ పథకం ద్వారా ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్‌ వారికి రూ.15 వేలు, డిగ్రీ ఆపై కోర్సులు చదివే వారికి రూ.20 వేలు వసతి, ఆహార ఖర్చుల కోసం ప్రభుత్వం అందిస్తోందని ఈనాడు వివరించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)