You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఛత్తీస్‌గఢ్ ఎదురుకాల్పులు: 22మంది జవాన్లు మృతి- 25 మందికి పైగా మావోయిస్టులు చనిపోయారంటున్న పోలీసులు
ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా-బీజాపూర్ పరిధిలో భద్రతా దళాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన భారీ ఎదురుకాల్పుల్లో 22 మంది భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయినట్లు ఏఎన్‌ఐ వార్తా సంస్థ వెల్లడించింది.
బీజాపూర్ ఎస్పీ కమలోచన్ కశ్యప్ దీన్ని ధృవీకరించినట్లు ఏఎన్‌ఐ పేర్కొంది.
మరోవైపు ఈ ఎదురుకాల్పుల్లో 25 నుంచి 30 మంది మావోయిస్టులు కూడా చనిపోయారని సీఆర్‌పీఎఫ్ డీజీ కుల్దీప్ సింగ్ చెప్పారు.
నిఘా వైఫల్యం కానీ, బలగాల వైఫల్యం కానీ ఏమీ లేదని ఆయన చెప్పారు.
ఒక జవాను ఆచూకీ ఇంకా తెలియలేదని.. గాలిస్తున్నామని అధికారులు తెలిపారు.
ఈ ఘటనలో దాదాపు రెండు డజన్ల ఆయుధాలను జవాన్ల నుంచి మావోయిస్టులు అపహరించుకుపోయారని సీఆర్‌పీఎఫ్ వర్గాలు వెల్లడించినట్లు ఏఎన్‌ఐ తెలిపింది.
అంతకు ముందు ఈ ఎదురు కాల్పుల ఘటనలో గాయపడిన ఏడుగురిని రాయ్‌పూర్ ఆసుపత్రికి తరలించామని, వారు ఇప్పుడు క్షేమంగా ఉన్నారని ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ భాగెల్ గువాహటీలో వెల్లడించారు.
కేంద్ర హోంమంత్రి తనతో మాట్లాడారని, గువాహటిలో ఎన్నికల ప్రచారంలో ఉన్న ఛత్తీస్‌గఢ్ సీఎం భాగెల్ సాయంత్రానికి సొంత రాష్ట్రానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
ఎన్‌కౌంటర్ సమయానికి అస్సాంలో ఎన్నికల ప్రచారంలో ఉన్న కేంద్రం హోం మంత్రి అమిత్ షా హుటాహుటిన దిల్లీ చేరుకుని ఉన్నతాధికారులతో పరిస్థితిని సమీక్షించారు.
వారి త్యాగం వృథా పోదు - ప్రధాని మోదీ
ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌లో భద్రతా సిబ్బంది మరణంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. వారి త్యాగం వృథా పోదన్నారు.
మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేస్తూ, గాయపడిన జవాన్లు త్వరగా కోలుకోవాలని మోదీ ట్వీట్ చేశారు.
శాంతికి విఘాతంగా మారిన శత్రువులతో పోరాటం కొనసాగుతుంది - అమిత్ షా
జవాన్ల మరణ వార్త తెలుసుకున్న హోంమంత్రి అమిత్‌షా, ఈ ఘటన పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
వీర జవాన్ల త్యాగాలకు తాను శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని అమిత్ షా ట్వీట్ చేశారు.
అభివృద్ధికి, శాంతికి విఘాతంగా మారిన శత్రువులతో తమ పోరాటం కొనసాగుతుందని అమిత్ షా తన ట్వీట్‌లో అన్నారు.
పరిస్థితిని సమీక్షించేందుకు అమిత్‌షా ఎన్నికల ప్రచార ర్యాలీలను కుదించుకుని దిల్లీకి తిరిగివచ్చారు.
రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి-రాహుల్ గాంధీ
ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌లో జవాన్ల మృతి పట్ల కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కనిపించకుండ పోయిన జవాన్ల కోసం విస్తృతంగా గాలింపు నిర్వహించాలని, గాయపడిన వారు త్వరగా కోలుకునేలా రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోవాలంటూ ఆయన ట్వీట్ చేశారు.
అసలేం జరిగింది?
శనివారం నుంచి కొనసాగుతున్న ఈ ఎన్‌కౌంటర్‌లో నిన్నటి వరకు ఐదుగురు చనిపోయినట్లు, 20 మందికి పైగా జవాన్లు కనిపించకుండా పోయినట్లు వార్తలు వచ్చాయి.
తాజాగా 17 మంది జవాన్ల మృతదేహాలను గుర్తించడంతో ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన భద్రతా సిబ్బంది సంఖ్య 22కు చేరుకుంది. మరికొందరు ఇప్పటికీ కనిపించడం లేదని, వారి కోసం గాలింపు జరుపుతున్నట్లు సీఆర్‌పీఎఫ్ వర్గాలు తెలిపారు.
ఇటీవలి కాలంలో జరిగిన అతి పెద్ద ఎన్‌కౌంటర్‌గా భావిస్తున్నారు. అయితే ఈ ఎన్‌కౌంటర్‌లో నక్సలైట్లు కూడా భారీగానే నష్టపోయారని వార్తలు వస్తున్నాయి.
ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం సీఆర్‌పీఎఫ్, స్పెషల్ టాస్క్‌ఫోర్స్, కోబ్రా బెటాలియన్లకు చెందిన 2059మంది జవాన్లు శుక్రవారం సుక్మా, బీజాపూర్‌లో నక్సల్ ప్రభావిత ప్రాంతాలకు వెళ్లారు.
వీరిలో నర్సాపూర్ క్యాంప్‌లో 420మంది జవాన్లు, మినాపా క్యాంప్‌లో 483మంది, ఉసూర్ క్యాంప్‌లో 200మంది, పామ్హేడ్ క్యాంప్‌లో 195మంది, టారెం క్యాంప్‌లో 760మంది జవాన్లు ఉన్నారు.
శనివారంనాడు నక్సల్స్ ఆపరేషన్ ముగించుకుని తిరిగి వస్తున్న భద్రతాదళాలపై టారెం పోలీస్‌స్టేషన్‌కు సమీపంలోని జొన్నగుండా అటవీ ప్రాంతంలో నక్సలైట్లు దాడి చేశారు.
ఇవి కూడా చదవండి:
- సెక్స్‌కు ఒకసారి ఒప్పుకుంటే... ప్రతిసారీ ఒప్పుకున్నట్లేనా?
- లాక్డౌన్: జనతా కర్ఫ్యూకి ఏడాది.. దేశంలో మళ్లీ లాక్డౌన్.. ఎక్కడెక్కడంటే
- రూ. 2000 నోట్ల ముద్రణను రిజర్వు బ్యాంక్ ఆపేసింది... పెద్ద నోటు మళ్లీ రద్దవుతుందా?
- బ్యాంకుల సమ్మె ఎందుకు? మోదీ ప్రభుత్వం.. ప్రభుత్వ బ్యాంకులను ఎందుకు ప్రైవేటీకరిస్తోంది?
- IPO అంటే ఏమిటి... దరఖాస్తు చేసిన వారందరికీ షేర్లు కేటాయిస్తారా? కేటాయించకపోతే ఏం చేయాలి?
- మ్యూచువల్ ఫండ్స్: మహిళలు పెట్టుబడి పెట్టేందుకు అద్భుతమైన మార్గం ఇదేనా?
- విశాఖపట్నం: సాగర తీరంలో టీయూ-142 యుద్ధ విమానం... దీని చూస్తే ఎందుకు ఉద్వేగం ఉరకలేస్తుంది?
- మియన్మార్‌లో 'సరోంగ్ విప్లవం': మహిళలు నడుముకు కట్టుకునే 'సరోంగ్' వస్త్రం.. నిరసనకారుల ఆయుధంగా మారిన వైనం
- యాంటీకిథెరా: రెండు వేల ఏళ్ల కిందటి 'పురాతన కంప్యూటర్'.. గుట్టు వీడబోతోందా
- గుజరాత్: టీ షర్ట్ ధరించి వచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యేను సభ నుంచి పంపించేసిన స్పీకర్
- బిర్యానీ పక్కాగా వండాలంటే కచ్చితమైన లెక్కలు ఉంటాయా? దీనికో ఆల్గారిథమ్ ఉందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)