చికెన్ పకోడీ తీసుకురాలేదని పదో తరగతి విద్యార్థిని కారుతో ఢీకొట్టి చంపేశాడు.. తూర్పుగోదావరిలో దారుణం - ప్రెస్ రివ్యూ

ప్రచురణ

చెప్పిన వెంటనే చికెన్‌ పకోడీ తేలేదన్న కోపంతో ఓ వ్యక్తి కారుతో ఢీకొట్టి, ఆపై ఇనుపరాడ్డుతో కొట్టి ఓ బాలుడి ప్రాణం తీశాడని ఆంధ్రజ్యోతి పత్రిక తన కథనంలో రాసింది. తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడి మండలం వీరవరం గ్రామంలోఈ దారుణం జరిగినట్లు తెలిపింది.

‘‘పోలీసుల కథనం మేరకు వీరవరం గ్రామానికి చెందిన సింగం ఏసు చికెన్‌ పకోడీ బండి నిర్వహిస్తుండగా, పదో తరగతి చదువుతున్న ఆయన కుమారుడు శివబాబు తండ్రికి సాయంగా పకోడీ బండి వద్ద ఉన్నాడు. అదే గ్రామానికి చెందిన కొవ్వూరి వీరబాబు ఆదివారం రాత్రి వీరి పకోడీ బండి సమీపంలో మద్యం తాగుతున్నాడు.

తనకు చికెన్ పకోడీ తీసుకురావాలని శివబాబును వీరబాబు ఆదేశించాడు. అయితే వెంటనే పకోడీ తీసుకెళ్లకపోవడంతో వీరబాబు ఆగ్రహం చెందాడు. తన స్కార్పియో వాహనంలో అక్కడి నుంచి వెళ్లిపోయి, కొద్దిసేపటికే తిరిగి వచ్చి నేరుగా పకోడీ బండిని స్కార్పియోతో ఢీకొట్టాడు. దీంతో శివబాబుకు గాయాలయ్యాయి.

అనంతరం వీరబాబు స్కార్పియో దిగి ఇనుపరాడ్డుతో శివబాబును తీవ్రంగా కొట్టాడు. బాలుడిని కాకినాడ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం మరణించాడు.దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో గ్రామంలో పోలీసులను మోహరించారు. కిర్లంపూడి, జగ్గంపేట, గండేపల్లి ఎస్‌ఐలు బందోబస్తు నిర్వహిస్తున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని, కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ అప్పలరాజు తెలిపార’’ని ఆంధ్రజ్యోతి కథనం పేర్కొంది.

మాస్క్‌ ధరించకుంటే రెండేళ్ల వరకు జైలు

కరోనా మరోసారి విజృంభిస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం నిబంధనలను మరింత కఠినతరం చేసిందని, వీటిని ఉల్లంఘించిన వారికి రూ. వెయ్యికి తగ్గకుండా జరిమానా, రెండేండ్ల జైలుశిక్ష పడేలా చట్టాలను అమలు చేయాలని నిర్ణయించిందని నమస్తే తెలంగాణ పత్రిక ఒక కథనం ఇచ్చింది.

మాస్కులు ధరించడాన్ని తప్పనిసరి చేస్తూ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ఈ మేరకు ఉత్తర్వులు జారీచేశారు. మాస్క్‌ లేకుండా బహిరంగ ప్రదేశాల్లోకి వచ్చేవారికపై డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ చట్టం-2005లోని సెక్షన్‌ 51 నుంచి 60 కింద, ఐపీసీ సెక్షన్‌ 188 కింద చర్యలు తీసుకోవాలని కలెక్టర్లు, మేజిస్ట్రేట్లు, పోలీస్‌ కమిషనర్లు, ఎస్పీలను సోమేశ్‌కుమార్‌ ఆదేశించారు.

ఈ నిబంధనల ఆధారంగా మాస్క్‌ లేకుండా కనిపించేవారిపై కనీసం వెయ్యి రూపాయల జరిమానా విధించనున్నారు. ఆయా పరిస్థితులను బట్టి జరిమానా మొత్తం మరింత పెంచే అవకాశాలు ఉన్నాయి.

మాస్క్‌ లేకుండా బయట తిరిగేవారిని గత ఏడాదిలాగే సీసీటీవీ పుటేజీల ద్వారా గుర్తించి జరిమానాలు విధించేందుకు పోలీసులు సిద్ధం అవుతున్నారని, డిజాస్టర్‌మేనేజ్‌మెంట్‌ యాక్ట్‌ 2005లోని కొన్ని సెక్షన్ల కింద రెండేళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా విధించే అవకాశం ఉంటుందని నమస్తే తెలంగాణ కథనం పేర్కొంది.

ఐపీసీ సెక్షన్‌ 188 కింద కేసు నమోదు చేస్తే ఆరు నెలల వరకు జైలు శిక్ష, లేదా రూ.వెయ్యి వరకు జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉందని ఓ పోలీస్‌ అధికారి తెలిపినట్లు ఈ కథనం పేర్కొంది.

చెన్నై ఆసుపత్రిలో రోజా-రెండు మేజర్‌ ఆపరేషన్‌లు

ఏపీఐఐసీ చైర్‌పర్సన్, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజాకు శస్త్ర చికిత్స జరిగిందని, చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఆమెకు రెండు మేజర్‌ ఆపరేషన్లు నిర్వహించారని సాక్షి పత్రిక ఒక కథనం ఇచ్చింది.

ప్రస్తుతం ఆమెను ఐసీయూ నుంచి వార్డుకు తరలించినట్లు ఈ కథనం పేర్కొంది.

మేజర్‌ ఆపరేషన్లు జరిగినందువల్ల రోజాకు రెండు వారాలు పూర్తి విశ్రాంతి అవసరమని వైద్యులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆమె ఆరోగ్య విషయమై ఆమె భర్త సెల్వమణి ఆడియో టేప్‌ విడుదల చేశారు.

ఈ ఆపరేషన్లు ఇది వరకే నిర్వహించాల్సి ఉందని, కానీ గతేడాది కరోనా, ఈ జనవరిలో ఎన్నికల కారణంగా వాయిదాపడ్డాయని సెల్వమణి తన ఆడియో టేపులో వివరించారు.

ప్రస్తుతం రోజా ఆరోగ్యం కుదుటపడుతోందని, ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా సందర్శకులు ఎవరూ ఆస్పత్రికి రావొద్దని సెల్వమణి విజ్ఞప్తి చేసినట్లు సాక్షి కథనం పేర్కొంది.

ప్రతి గింజనూ కొంటామన్న సీఎం కేసీఆర్‌

తెలంగాణ రాష్ట్రంలో పండిన ప్రతి ధాన్యపు గింజనూ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, ఇందుకోసం 6,408 కేంద్రాలను ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్‌ వెల్లడించినట్లు ఈనాడు పత్రిక ఒక కథనం ఇచ్చింది.

వచ్చే వానా కాలంలో రాష్ట్రంలో 75 నుంచి 80 లక్షల ఎకరాల్లో పత్తి సాగయ్యేలా రైతులను ప్రోత్సహించాలని, తక్షణం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటయ్యేలా జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను సీఎం ఆదేశించినట్లు ఈ కథనం పేర్కొంది.

ధాన్యం కొనుగోళ్లపై ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించిన కేసీఆర్‌, సేకరణలో ఏయే శాఖలు ఎలాంటి చర్యలు చేపట్టాలి, రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తదితరాలపై అధికారులకు సూచనలు చేశారు.

"కరోనా మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని గడిచిన సీజనులో మాదిరిగానే ధాన్యం కొనుగోలు చేస్తాం. అందుకోసం 3,964 పీఏసీఎస్‌లు, 2,131 ఐకేపీ, ఇతర విభాగాల ద్వారా మరో 313 కేంద్రాలను ఏర్పాటు చేస్తాం.

ప్రస్తుతం యాసంగిలో 52.76 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. 1.38 కోట్ల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా. 1.17 కోట్ల మెట్రిక్‌ టన్నుల లావు(దొడ్డు) రకం, 21 లక్షల మెట్రిక్‌ టన్నుల సన్న రకం మార్కెట్లకు వచ్చే అవకాశం ఉంది. అవసరమైన 20 కోట్ల గోనె సంచులను సిద్ధంగా ఉంచుకోవాలి." అని కేసీఆర్‌ అన్నారు.

రాష్ట్రంలో పండే పత్తికి అంతర్జాతీయ మార్కెట్‌లో మంచి గిరాకీ ఉందని, అధిక ధర లభించే అవకాశం ఉన్నందున వచ్చే వానాకాలంలో 75 నుంచి 80 లక్షల ఎకరాల్లో పత్తి పండించటానికి రైతులు సిద్ధం కావాలని సీఎం అన్నారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం, కొనుగోళ్ల తీరుతెన్నులను స్వయంగా పర్యవేక్షించాలని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డికి ముఖ్యమంత్రి సూచించినట్లు ఈనాడు కథనం వెల్లడించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)