ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్: 'పౌరుల వినతిపత్రాలకు తిరస్కరించడానికి వీల్లేదు’ - ప్రెస్ రివ్యూ

ప్రచురణ

స్పందన వినతుల పరిష్కారానికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని, కలెక్టర్ల పని తీరుకు ఈ కార్యక్రమాన్ని ప్రామాణికంగా భావిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారని సాక్షి కథనంలో పేర్కొన్నారు.

గ్రామ, వార్డు సచివాలయాలే లక్ష్యంగా మరింత ఆధునీకరించిన స్పందన నూతన పోర్టల్‌ను శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ప్రారంభించారు.

పౌరుడు వినతిపత్రం ఇచ్చాక అది పరిష్కారం అయ్యే తీరును నేరుగా అధికారులు, ఉన్నతాధికారులు ట్రాక్‌ చేయాలని సూచించారు. ఈ ట్రాకింగ్‌ మెకానిజం చాలా పటిష్టంగా ఉండాలన్నారు.

పౌరుల గ్రీవెన్స్‌లను పరిష్కరించకుండా పక్కన పడేసే పరిస్థితి ఉండకూడదని చెప్పారు. నేరుగా సీఎం కార్యాలయ అధికారులు కూడా గ్రీవెన్స్‌ల పరిష్కారంపై ఎప్పటికప్పుడు పరిశీలన, సమీక్ష చేయాలని ఆదేశించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజల నుంచి వచ్చిన వినతులు.. పరిష్కారానికి అర్హమైనవిగా గుర్తించిన తర్వాత తప్పకుండా వాటిని పరిష్కరించి తీరాల్సిందేనని స్పష్టం చేశారు.

నిర్ణీత సమయంలోగా పరిష్కారం కాకపోతే అది ఏస్థాయిలో నిలిచిపోయిందన్నది తెలియాలని, సంబంధిత సిబ్బంది, అధికారికి అలర్ట్స్‌ వెళ్లాలని సూచించారు. ఒకవేళగ్రీవెన్స్‌ను తిరస్కరిస్తున్నప్పుడు ఎందుకు తిరస్కరిస్తున్నారో కచ్చితంగా కారణం చెప్పగలగాలన్నారని ఈ కథనంలో తెలిపారు.

23 శాతం దేవాదాయ భూముల ఆక్రమణ..కాగ్ నివేదిక

తెలంగాణ రాష్ట్రంలో 23 శాతం దేవాదాయ భూములు ఆక్రమణల్లో ఉన్నట్టు శుక్రవారం అసెంబ్లీలో విడుదల చేసిన కాగ్‌ నివేదిక బహిర్గతం చేసిందని నవతెలంగాణ ఒక కథనంలో పేర్కొంది.

ఆక్రమణకు గురైన భూమి 20,124 ఎకరాల 3 గుంటలు కాగా...3,488 ఎకరాలకు(17.33 శాతం) సంబంధించి మాత్రమే దేవాదాయ ట్రిబ్యునల్‌లో సహాయక కమిషనర్లు కేసులు దాఖలు చేయడం దారుణమంటూ ఆ శాఖ పనితీరులోని డొల్లతనాన్ని ఎత్తిచూపింది.

దేవాదాయ భూముల పరిరక్షణ కోసం సరైన యంత్రాంగం లేకపోవడం వల్ల మరిన్ని భూములు అన్యాక్రాంతమయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది.

కాగ్‌ తన నివేదికలో నమూనాగా తీసుకున్న 19 దేవాలయాలకుగానూ ఎనిమిది దేవాలయాల ఆధీనంలో ఉన్న భూమిలో 48.41 శాతానికి సమానమైన 3,861 ఎకరాల 38 గుంటల దేవాదాయ భూమికి పట్టాదారు పాసుపుస్తకాలు లేకపోవడాన్ని కాగ్‌ గుర్తించింది.

మొత్తం 87,235 ఎకరాల 39 గుంటల దేవాదాయ భూములకుగానూ 59,898 ఎకరాల 32 గుంటల భూమికి కమిషనర్‌ పట్టాదారు పాసుపుస్తకాలను పొందలేదని తెలిపింది. 1948లో 3.26 ఎకరాలను, 1983లో 7.09 ఎకరాలను రెండు దేవాలయాలకు దానం చేస్తే ఇప్పటివరకు సహాయక కమిషనర్‌ ఆ భూములను స్వాధీనం చేసుకోకపోవడంలో ప్రదర్శించిన తీవ్ర నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపింది.

6(ఎ) వర్గానికి చెందిన 14 దేవాలయాలకుగానూ 10 దేవాలయాల కార్యనిర్వహణాధికారులు చేసిన 91.87 కిలో గ్రాముల బంగారాన్ని గోల్డ్‌ డిపాజిట్‌ బాండ్‌ స్కీమ్‌లో డిపాజిట్‌ చేయలేదని బహిర్గతం చేసింది.

ప్రభుత్వ భూముల నిర్వహణలో భూ పరిపాలన కమిషనర్‌ పాత్ర అంతంతగానే ఉందని కాగ్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది.

పరిశీలించిన ఎనిమిది జిల్లాల్లోని 24 మండలాల్లో రూ. 1096.45 కోట్ల మార్కెట్‌ విలువ కలిగిన 12,666.25 ఎకరాల ప్రభుత్వం అప్పగించిన భూమి అన్యవ్యక్తుల ఆక్రమణలో ఉందని తేలిందని ఈ కథనంలో తెలిపారు.

గ్రామ నిధుల ఖర్చుపై అధికారం పంచాయితీలదే.. కేసీఆర్ వెల్లడి

గ్రామపంచాయతీలకు విడుదలచేసే నిధులపై గ్రామ ప్రజలు, పంచాయితీ నిర్ణయం తీసుకొని ఖర్చుచేసుకునే వీలు కల్పిస్తున్నట్టు తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారని నమస్తే తెలంగాణ ఒక కథనాన్ని ప్రచురించింది.

తద్వారా ఇకపై స్థానిక అవసరాల మేరకు నిధులను వెచ్చించే వెసులుబాటు పంచాయతీలకు లభిస్తుందని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 142 మున్సిపాలిటీలు, నగరాల్లో కూరగాయలు, మాంసం, పండ్లు, పూల విక్రయానికి అనుకూలంగా సమీకృత మార్కెట్లను నిర్మించాలని నిర్ణయించారు.

సీఎం కేసీఆర్‌ శుక్రవారం ప్రగతిభవన్‌లో పలువురు ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. స్థానిక సంస్థల సాధికారతకు ప్రభుత్వం క్రియాశీలకంగా పనిచేస్తున్నదన్నారు.

ఈ నేపథ్యంలో గ్రామాలు, పట్టణాల్లో మౌలిక వసతుల కల్పన కోసం ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని తెలిపారు. సమీకృత మార్కెట్లు మహిళలకు అందుబాటులో ఉండేలా తగిన విస్తీర్ణంలో ప్రభుత్వ స్థలాలను ఎంపికచేయాలని స్పష్టంచేశారు.

గ్రామాల్లో, పట్టణాల్లో ఇండ్ల మీదుగా పోయే విద్యుత్‌ లైన్లను ప్రభుత్వఖర్చుతోనే మార్చాలని ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావును ఆదేశించారు. నూతన జిల్లా కేంద్రాల్లో కలెక్టరేట్లు, జిల్లా పోలీసు కార్యాలయాల నిర్మాణ పనులను పర్యవేక్షించాలని ఎమ్మెల్యేలకు సూచించారు.

మహిళా పోలీస్‌ విభాగాలు ఏర్పాటుచేయాలని, ఇందుకోసం విధి విధానాలు ఖరారుచేసి ఉత్తర్వులు జారీచేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.

ఆర్‌ అండ్‌ బీ, పంచాయతీరాజ్‌, నీటిపారుదల తదితర శాఖలకు సంబంధించి, ఆయా నియోజకవర్గాల పరిధిలో పట్టణాలు, జిల్లా కేంద్రాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులను మంజూరుచేశారు.

ఆంధ్ర ప్రదేశ్ కొత్త ఎన్నికల కమిషనర్ నీలం సహాని

నూతన రాష్ట్ర ఎన్నికల కమిషనరుగా ముఖ్యమంత్రి ముఖ్యసలహాదారు, మాజీ సిఎస్‌ నీలం సహాని నియమితులయ్యారని ప్రజాశక్తి ఒక కథనంలో తెలిపింది.

ఈ మేరకు గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ శుక్రవారం ఆమె నియామకానికి ఆమోదముద్ర వేశారు.

ప్రస్తుతం ఎస్‌ఇసిగా ఉన్న నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ ఈనెల 31న పదవీ విరమణ చేయనున్నారు.

ఈ నేపధ్యంలో తర్వాత ఎస్‌ఇసిగా నియమించేందుకు మూడు పేర్లను పంపాలని గవర్నర్‌ రాష్ట్ర ఫ్రభుత్వాన్ని కోరారు.

ఈనేపథ్యంలో శ్యామ్యూల్‌, ప్రేమచంద్రారెడ్డి, నీలం సహాని పేర్లను ఇటీవల గవర్నర్‌కు పంపారు. ముగ్గురి పేర్లను పరిశీలించిన అనంతరం శుక్రవారం నీలం సహాని పేరుకు గవర్నర్‌ ఆమోదం తెలిపారు.

ఏప్రిల్‌ 1నుంచి ఈమె ఎస్‌ఇసిగా బాధ్యతలు నిర్వహించనున్నారు. కోర్టు కేసులతో నిలిచిపోయిన ఎంపిటిసి, జడ్పీటిసి ఎన్నికలను నూతనంగా బాధ్యతలు చేపట్టనున్న నీలం సహాని ఆధ్వర్యంలో జరుగునున్నాయని ఈ వార్తలో రాశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)