You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
పవన్ కల్యాణ్: 'తెలంగాణ బీజేపీ నేతలకు మా పార్టీ అంటే గౌరవం లేదు, అందుకే వాణీదేవికి మద్దతిచ్చాం' :ప్రెస్ రివ్యూ
స్థానిక బీజేపీ నేతలకు తమ పార్టీ అన్నా, కార్యకర్తలన్నా గౌరవం లేదని, అందుకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీవీ నర్సింహా రావు కుమార్తె వాణీదేవికి మద్దతిచ్చామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నట్లు ఆంధ్రజ్యోతి పత్రిక ఒక కథనం ఇచ్చింది.
''ఎన్నికల సమయంలో ఒక్క ఓటు ఉన్నా వారిని గౌరవిస్తాం. అలాంటిది లక్షల మంది ఉన్నా జనసేన కార్యకర్తలకు గౌరవం దక్కకపోవడం బాధాకరం. గౌరవం లేని చోట ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు'' అని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నట్లు ఈ కథనం పేర్కొంది.
హైదరాబాద్‌లోని జనసేన కార్యాలయంలో ఆదివారం పార్టీ 7వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పవన్ ఈ వ్యాఖ్యలు చేశారు. పీవీ నర్సింహా రావు కూతురు వాణీదేవికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో మద్దతు ఇస్తామని తెలంగాణ విభాగం తన దృష్టికి తీసుకొచ్చినపుడు వారి ఇష్టాలను గౌరవించానని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చేస్తామని ప్రధాని మోదీ భరోసా ఇవ్వడంతో బీజేపీకి మద్దతు ప్రకటించినట్టు తెలిపారు. బీజేపీ కేంద్ర నాయకత్వానికి తామన్నా, తమ పార్టీ అన్నా చాలా గౌరవమని, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో జనసైనికులు అండగా నిలబడిన విధానాన్ని చూసి కేంద్ర హోం మంత్రి అమిత్‌షా కూడా ప్రశంసించారని, కానీ స్థానిక బీజేపీ నాయకత్వం దానిని గుర్తించేందుకు సిద్ధంగా లేదని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించినట్లు ఈ కథనం వెల్లడించింది.
మరోవైపు జనసేన బీజేపీకి మద్దతివ్వకపోవడం విచారకరమని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ఇబ్బందులుంటే రాష్ట్ర నాయకత్వానికిగానీ, కేంద్ర నాయకత్వానికి గానీ పవన్ చెప్పి ఉండాల్సిందని, కనీసం ఎన్నికల్లో తటస్థంగా ఉన్నా బాగుండేదని సంజయ్ వ్యాఖ్యానించినట్లు ఆంధ్రజ్యోతి కథనం వెల్లడించింది.
హైదరాబాద్ సహా 4 ఎయిర్‌పోర్ట్‌లలో వాటాల ఉపసంహరణకు కేంద్రం ప్రయత్నాలు
పెట్టుబడుల ఉపసంహరణ చర్యల్లో భాగంగా హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉన్న తన వాటాను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోబోతోందని ఈనాడు పత్రిక ఒక కథనం ఇచ్చింది.
భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ (ఏఏఐ)కి, రాష్ట్ర ప్రభుత్వానికి కలిపి ఈ విమానాశ్రయంలో ప్రస్తుతం 26% వాటా మిగిలి ఉంది. సంయుక్త భాగస్వామ్యంలో మిగిలిన వాటాలను విక్రయించి, నిధులను కేంద్ర ప్రభుత్వం రాబట్టుకోనుందని ఈ కథనం తెలిపింది.
పెట్టుబడుల ఉపసంహరణ చర్యల ద్వారా రూ.2.5 లక్షల కోట్లు సమీకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా విధించుకున్న విషయం తెలిసిందే. దానిలో భాగంగానే దేశంలోని విమానాశ్రయాలపై దృష్టి సారించింది.
ఇప్పటికే ప్రైవేటుపరం చేసిన హైదరాబాద్‌తో పాటు దిల్లీ, ముంబయి, బెంగళూరు విమానాశ్రయాల్లో ప్రభుత్వానికి మిగిలి ఉన్న వాటాను విక్రయించబోతోంది. మరికొద్ది రోజుల్లో కేంద్ర కేబినెట్ సమావేశంలో దీనికి ఆమోద ముద్ర పొందేందుకు పౌర విమానయాన మంత్రిత్వశాఖ రంగం సిద్ధం చేస్తోందని కూడా ఈ కథనం తెలిపింది.
భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ (ఏఏఐ)కు ఈ నాలుగు విమానాశ్రయాల్లో కొంత వాటా మిగిలి ఉంది. దీనిని విక్రయించడంతో పాటు 2021-22 ఆర్థిక సంవత్సరంలో మరో 13 విమానాశ్రయాలను ప్రైవేటుపరం చేయనున్నట్లు ఈనాడు కథనం పేర్కొంది.
నేటి నుంచి తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం ఉదయం 11 గంటలకు గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ప్రసంగంతో మొదలవుతాయని, ఈ నెల 18న ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనుందని నమస్తే తెలంగాణ పత్రిక ఒక కథనం ఇచ్చింది.
దేశవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మాంద్యం, కరోనా ప్రళయాన్ని పరిగణనలోకి తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం 2021-22 బడ్జెట్‌ను వాస్తవ అంచనాలతో రూపకల్పన చేసినట్టు తెలుస్తోందని ఈ కథనం పేర్కొంది.
ప్రగతి పద్దు (స్కీమ్ ఎక్స్‌పెండీచర్), నిర్వహణ పద్దు (ఎస్టాబ్లిష్‌మెంట్ ఎక్స్‌పెండీచర్) కింద ఆచితూచి అంచనాలను తయారు చేశారని, ఈసారి రెవెన్యూ రాబడులతోపాటు ఖర్చులు కూడా పెరుగనున్నాయి పేర్కొంది.
పీఆర్సీ ప్రకటన, అన్నిరకాల ఉద్యోగులకు జీతభత్యాల పెంపుపై నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉండటంతో రెవెన్యూ వ్యయం భారీగా పెరుగనుందని, అదేస్థాయిలో రాబడులను పెంచడంపై ప్రణాళిక సిద్ధమైందని నమస్తే తెలంగాణ పత్రిక పేర్కొంది.
కరోనా నేపథ్యంలో సమావేశాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సభ్యులతో సహా అసెంబ్లీ సిబ్బంది, మార్షల్స్, మీడియా ప్రతినిధులకు ర్యాపిడ్ టెస్టులు చేస్తున్నారు. ప్రతిరోజూ అసెంబ్లీ ఆవరణను రెండుసార్లు శానిటైజేషన్ చేస్తారు.
తమిళనాడులో 'అమ్మ వాషింగ్‌మెషిన్‘ పథకం
ఉచిత పథకాలతో తమిళనాడు ఎన్నికలను ఎదుర్కొనేందుకు అధికార అన్నాడీఎంకే పార్టీ ప్రయత్నాలు చేస్తోందని సాక్షి పత్రిక ఒక కథనం ఇచ్చింది.
ఆదివారంనాడు 163 అంశాలతో ఆ పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టోలో మహిళలు, రైతులు, కాలేజీ విద్యార్ధులే లక్ష్యంగా అనేక ఉచిత పథకాలను ప్రకటించారని సాక్షి కథనం పేర్కొంది.
దివంగత ముఖ్యమంత్రి జయలలిత పేరు మీద అమ్మ ఇళ్లు, అమ్మ ఇంటి దీపం, మహిళలకు ప్రయాణ ఛార్జీలలో రాయితీలు, అమ్మ వాషింగ్ మెషిన్, అమ్మ సోలార్ స్టవ్, అమ్మ ఉచిత కేబుల్, అమ్మ క్లినిక్‌ల విస్తరణ, అమ్మ బ్యాంకింగ్ కార్డులు, ఏడాదికి ఆరు ఉచిత గ్యాస్ సిలిండర్‌లాంటి అనేక పథకాలున్నాయని ఈ కథనం పేర్కొంది.
అమ్మ వివాహ కానుకను పెంచి ప్రభుత్వం తరఫున అన్ని రకాల వస్తువులతో సారె కూడా పెట్టడానికి అన్నా డీఎంకే పార్టీ హామీ ఇచ్చిందని ఈ కథనం పేర్కొంది. అలాగే విద్యార్ధుల కోసం ఎడ్యుకేషన్ లోన్ రద్దు, ఏడాది పొడవునా 2జీబీ ఉచిత డేటా, ఇంటింటికి ఉద్యోగం లాంటి అనేక పథకాలను అన్నాడీఎంకే ప్రకటించింది.
ఇవి కూడా చదవండి:
- చైనా: ‘అర్ధరాత్రి వస్తారు.. నచ్చిన ఆడవాళ్లను ఎత్తుకెళ్లిపోతారు.. అడిగేవారే లేరు’
- ‘కొకైన్ హిప్పోలు’: శాస్త్రవేత్తలు వీటిని చంపేయాలని ఎందుకు చెబుతున్నారు?
- ఉత్తరాఖండ్: వరద వేగానికి మృతదేహాలపై బట్టలు కూడా కొట్టుకుపోయాయ్
- బీరుబాలా: మంత్రగత్తెలనే నెపంతో దాడులు చేసేవారికి ఈమె పేరు చెబితేనే వణుకు పుడుతుంది
- ఎర్రకోటను షాజహాన్ ఎందుకు కట్టించారు? చరిత్రలో అక్కడ జరిగిన కుట్రలెన్ని? తెగిపడిన తలలెన్ని
- బైరిపురం: పంచాయితీ ఎన్నికల్లో ఒక్కసారి కూడా ఓటు వేయని గ్రామమిది.. ఏకగ్రీవాలతో ఇక్కడ అభివృద్ధి జరిగిందా?
- ‘నా భార్య నన్ను పదేళ్ళు రేప్ చేసింది'
- విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమానికి ‘గంటా’ పిలుపు.. ఇంతకీ అక్కడ ఏం జరుగుతోంది
- ‘18 మందిని చంపిన సీరియల్ కిల్లర్’: ఒంటరి మహిళలతో మాట కలుపుతాడు... కోరిక తీర్చుకుని కడతేరుస్తాడు
- నియాండర్తాల్ మానవులు, తొలి తరం ఆధునిక మానవుల మధ్య సెక్స్ గురించి శాస్త్రవేత్తలు ఏం తెలుసుకున్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)