కోవిడ్-19 వ్యాక్సినేషన్ పూర్తవ్వగానే పౌరసత్వ చట్టాన్ని అమలు చేస్తాం: అమిత్ షా - News Reel

అమిత్ షా

ఫొటో సోర్స్, ANI

ప్రచురణ
చదివే సమయం: 3 నిమిషాలు

కోవిడ్-19 వ్యాక్సినేషన్ తర్వాత పౌరసత్వ సవరణ చట్టం ప్రకారం శరణార్థులకు పౌరసత్వం ఇవ్వడం మొదలుపెడతామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు. పశ్చిమ బెంగాల్‌లోని ఠాకూర్‌నగర్‌లో గురువారం జరిగిన ర్యాలీలో ఆయన ప్రసంగించారు.

సీఏఏ విషయంలో విపక్షాలు అనవసరంగా మైనార్టీలను రెచ్చగొడుతున్నాయని ఆయన అన్నారు.

ఈ చట్టం వల్ల అల్ప సంఖ్యాక వర్గాలపై ఎలాంటి ప్రభావం ఉండదని అమిత్ షా చెప్పారు.

"బీజేపీ తప్పుడు వాగ్దానాలు ఇస్తుందని మమతా దీదీ అన్నారు. మేము తీసుకొచ్చిన సీఏఏను ఆమె వ్యతిరేకించారు. ఈ చట్టాన్ని అమలు కానివ్వమని అన్నారు. కానీ, మేము మాట నిలబెట్టుకుంటున్నాం. ఈ చట్టాన్ని తీసుకొచ్చాం. శరణార్థులకు పౌరసత్వం ఇస్తాం. దేశ విభజన తర్వాత, బంగ్లాదేశ్ ఏర్పాటు సమయంలో భారత్‌కు వచ్చిన శరణార్థులకు ఈ చట్టం ద్వారా ప్రయోజనం కలుగుతుంది" అని అమిత్ షా వివరించారు.

రాహుల్ గాంధీ

ఫొటో సోర్స్, Loksabha TV

'ఈ దేశాన్ని నలుగురే నడుపుతున్నారు.. మేమిద్దరం, మాకిద్దరు అన్నట్టు'- లోక్‌సభలో రాహుల్ గాంధీ

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ గురువారం పార్లమెంట్‌లో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను తీవ్రంగా విమర్శించారు.

'వ్యవసాయ చట్టాల రూపు రేఖల గురించి కాకుండా వాటి ఉద్దేశాల గురించి, ప్రయోజనాల గురించి కాంగ్రెస్ పార్టీ చర్చిస్తే బాగుంటుంది' అని బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.

మోదీ వ్యాఖ్యలపై స్పందించిన రాహుల్ గాంధీ లోక్‌సభలో మాట్లాడుతూ.. "నిన్నటి సభలో ప్రధాని మోదీ సూచించిన విధంగా, వారి సంతోషం కోసం వ్యవసాయ చట్టాల ఉద్దేశాలు, ప్రయోజనాల గురించి ఈరోజు నేను మాట్లాడతాను.

వారు తీసుకొచ్చిన మొదటి చట్టం ఏమిటంటే.. ఎవరైనా దేశంలో ఎక్కడైనా ధాన్యాలు, పండ్లు, కూరగాయలను ఎంతైనా కొనుక్కోవచ్చు. ఇలా అపరిమిత కొనుగోలుకు అనుమతి ఉన్నప్పుడు మండీకి వెళ్లి ఎవరు కొంటారు? కాబట్టి వారి మొదటి చట్టం ఉద్దేశం, లక్ష్యం ఏమిటంటే.. మండీలను అంతమొందించడం.

రెండో చట్టం ఏమిటంటే.. భారతదేశంలో అక్రమ నిల్వలకు లైసెన్స్ ఇవ్వడం. పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలందరూ ఎంత కావాలంటే అంత ధాన్యం, పండ్లు, కూరగాయలు నిల్వ చేసుకోవచ్చు.

మూడవ చట్టం విషయానికొస్తే.. తాను పండించిన పంటకు సరైన ధర రాకపోతే, రైతుకు కోర్టుకు వెళ్లే హక్కు ఉండదు" అని ఆయన చెప్పారు.

సభలో రాహుల్ గాంధీ మాట్లాడుతున్నప్పుడు బీజేపీ సభ్యులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. బడ్జెట్‌పై రాహుల్ గాంధీ తన అభిప్రాయాన్ని వ్యక్తపరచవచ్చుగానీ ఇంక వ్యవసాయ చట్టాల గురించి మాట్లాడక్కర్లేదు అని వారు వాదించారు. అయినప్పటికీ రాహుల్ గాంధీ తన ప్రసంగాన్ని కొనసాగించారు.

"ఫ్యామిలీ ప్లానింగ్‌ను ప్రోత్సహించడం కోసం 'మేమిద్దరం, మనకిద్దరు' అనే నినాదం చెబుతారు. కానీ ఈరోజు ఆ నినాదం మరో రూపంలో వచ్చింది. ఇందులో ఈ చట్టాల ఉద్దేశం దాగి ఉంది.

ఈరోజు దేశాన్ని నలుగురు వ్యక్తులు నడుపుతున్నారు. అంటే మేమిద్దరం, మాకిద్దరు అన్నమాట. వారెవరో అందరికీ తెలుసు. ఆ నలుగురే ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. తన ఇద్దరు మిత్రులలో పెద్దాయనకి దేశంలో పండే ధాన్యం, పండ్లు, కూరగాయల విక్రయాలపై అధికారం కట్టబెట్టడమే ప్రభుత్వం లక్ష్యం. ఇదే వారి మొదటి చట్టం ఉద్దేశం. ఇది చిరు వ్యాపారులందరినీ ముంచేస్తుంది.

వీటన్నిటినీ నిల్వ చేసే హక్కును తన రెండవ స్నేహితునికి అప్పజెప్పడం. ఇది రెండవ చట్టం ఉద్దేశం.

రైతులకు ఆప్షన్లు ఇచ్చామని వాళ్లు అంటున్నారు. అవును, మూడు ఆప్షన్లు ఇచ్చారు.. ఆకలి, నిరుద్యోగం, ఆత్మహత్య.

వాస్తవానికి ఇప్పుడు దేశంలో పెద్ద వ్యాపారం వ్యవసాయమే. 40% ప్రజలు వ్యవసాయం వృత్తిగా జీవిస్తున్నారు. ఇది 40 లక్షల కోట్ల రూపాయల వ్యాపారం. దీనిపై వీళ్లు కన్ను వేశారు.

ఈ చట్టాలు అమల్లోకి వస్తే దేశంలోని రైతులు, చిన్న వ్యాపారులు, దిగువ స్థాయి శ్రామికులు ఉపాధి కోల్పోతారు. రైతులు తమ పోలాలను కోల్పోతారు. చిన్న వ్యాపారులు తమ వ్యాపారాన్ని కోల్పోతారు. అప్పుడు వీళ్లే మిగులుతారు. 'మేమిద్దరం, మనకిద్దరు' అంటూ దేశాన్ని నడుపుతారు" అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.

రాజ్‌నాథ్ సింగ్

ఫొటో సోర్స్, AFP

రాజ్‌నాథ్ సింగ్: సరిహద్దులో భారత్ అంగుళం భూమిని కూడా వదులుకోదు

ఏ దేశానికీ ఒక్క అంగుళం భూమిని కూడా భారత్ వదులుకోదని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ రాజ్యసభలో అన్నారు. లదాఖ్ సరిహద్దులో పరిస్థితి గురించి సభలో ఆయన మాట్లాడారు.

భారత్, చైనాలు పాంగాంగ్ సరస్సు ప్రాంతం నుంచి తమ బలగాలను ఉపసంహరించుకోవాలనే ఒప్పందానికి వచ్చాయని రాజ్‌నాథ్ తెలిపారు. అంతకుముందు చైనా బుధవారం ఈ ప్రకటన చేసింది.

చైనాతో చర్చల్లో భారత్ ఏమీ కోల్పోలేదని మంత్రి స్పష్టం చేశారు.

"అత్యంత ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ భారత బలగాలు ధైర్యసాహసాలు ప్రదర్శించాయి. ధైర్యంగా నిలబడిన సైనికులను అభినందించాలని సభను కోరుతున్నాను" అని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.

చైనాతో వివిధ స్థాయిలలో చర్చలు జరుగుతున్నాయని, సరిహద్దు సమస్యలు చర్చలతోనే పరిష్కారమవుతాయని ఆయన చెప్పారు. మిగతా సమస్యల విషయంలోనే చర్చలతో ముందుకెళ్లాలని అనుకుంటున్నామని, అందుకు చైనా సహకరిస్తుందని భావిస్తున్నామని రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు.

మానస వారణాసి

ఫొటో సోర్స్, missindiaorg

ఫొటో క్యాప్షన్, మిస్ ఇండియా వరల్డ్ 2020 మానస వారణాసి(మధ్యలో)

తెలంగాణ యువతి మానస వారణాసికి మిస్ ఇండియా వరల్డ్ 2020 కిరీటం

తెలంగాణ యువతి మానస వారణాసి మిస్ ఇండియా 2020 కిరీటాన్ని గెలుచుకున్నారు. ఫెమినా మిస్ ఇండియా ఈ అందాల పోటీ విజేతలను ప్రకటించింది.

రాజస్థాన్‌కు చెందిన మిస్ ఇండియా-2019 సుమన్ రతన్ సింగ్ బుధవారం రాత్రి జరిగిన వేడుకలో మానస వారణాసికి మిస్ ఇండియా కిరీటం అలంకరించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

హైదరాబాద్‌కు చెందిన మానస వారణాసికి 23 ఏళ్లు. ఆమె ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఎక్స్ఛేంజ్ అనలిస్టుగా పనిచేస్తున్నారు.

'వీఎల్‌సీసీ ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2020' కిరీటం గెలుచుకున్న మానస, 2021 డిసెంబర్‌లో జరిగే 70వ మిస్ వరల్డ్ పోటీల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించనున్నారు.

మానస వారణాసి

ఫొటో సోర్స్, manasa5varanasi/Instagram

ఫొటో క్యాప్షన్, మానస వారణాసి

హర్యానాకు చెందిన మనికా షియోకంద్ మిస్ గ్రాండ్ ఇండియా 2020గా ఎంపిక కాగా, ఉత్తరప్రదేశ్‌కు చెందిన మాన్యా సింగ్ మిస్ ఇండియా 2020 రన్నరప్‌గా నిలిచారు.

మిస్ ఇండియా వరల్డ్ 2020గా ఎంపికైన మానస వారణాసి ట్విటర్‌లో పలువురు శుభాకాంక్షలు చెప్పారు.

BBC Iswoty

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)