లారీ కింగ్: 50 వేల ఇంటర్వ్యూలు చేసిన టాక్‌ షో హోస్ట్ మృతి - BBC Newsreel

ప్రచురణ
చదివే సమయం: 2 నిమిషాలు

రాజకీయ నాయకులను, ప్రముఖులను ఇంటర్వ్యూ చేసి.. ప్రపంచవ్యాప్తంగా పేరొందిన అమెరికా ప్రసార దిగ్గజం లారీ కింగ్ (87 ఏళ్లు) అనారోగ్యంతో మరణించారు.

ఆరు దశాబ్దాల కెరీర్‌లో లారీ కింగ్ 50,000 ఇంటర్వ్యూలు నిర్వహించారు, ఇందులో 25 సంవత్సరాలు సీఎన్ఎన్ ఛానెల్‌లో ప్రసారమైన టాక్ షో ‘లారీ కింగ్ లైవ్‌’కు హోస్ట్‌గా ఉన్నారు.

లాస్ ఏంజిల్స్‌లోని సెడార్స్-సినాయ్ మెడికల్ సెంటర్‌లో ఆయన తుదిశ్వాస విడిచారని ఓరా మీడియా తెలిపింది. ఈ సంస్థను స్థాపించినవారిలో ఆయన కూడా ఒకరు.

ఇదే ఆస్పత్రిలో ఆయన కోవిడ్-19 చికిత్స పొందారని అమెరికా మీడియా వెల్లడించింది.

లారీ కింగ్ ఇటీవల గుండెపోటుతో సహా అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్నారు.

"63 సంవత్సరాలుగా రేడియో, టెలివిజన్, డిజిటల్ మీడియా వేదికలపై, లారీ కింగ్ నిర్వహించిన వేల కొద్దీ ఇంటర్వ్యూలు, ఆయన సాధించిన అవార్డులు, ప్రపంచవ్యాప్తంగా తెచ్చుకున్న గుర్తింపు.. బ్రాడ్‌కాస్టర్‌గా ఆయన ప్రతిభకు నిదర్శనం" అని ఓరా మీడియా ఒక ప్రకటనలో తెలిపింది.

సీరం ఇనిస్టిట్యూట్ అగ్ని ప్రమాదం: 'రూ. 1,000 కోట్ల నష్టం... వ్యాక్సీన్లు సురక్షితం'

పుణేలో గురువారం సంభవించిన అగ్ని ప్రమాదంతో తమ సంస్థకు వెయ్యి కోట్ల రూపాయలకుపైనే నష్టం సంభవించిందని సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అదార్ పునావాలా చెప్పారు.

అయితే, కోవిడ్-19 వ్యాక్సీన్ల ఉత్పత్తిపై ఈ అగ్ని ప్రమాదం ఎలాంటి ప్రభావం చూపలేదని ఆయన వివరించారు.

ఔషధ విభాగంలో చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో అయిదుగురు చనిపోయారు.

''కోవిడ్-19 టీకాల ఉత్పత్తిపై ఎలాంటి ప్రభావం ఉండదు. ఎందుకంటే దేశ వ్యాప్తంగా చాలా పరిశ్రమల్లో మేం టీకాలు తయారుచేస్తాం. అయితే బీసీజీ సిరంజిల కొరతతోపాటు భారీ ఆర్థిక నష్టం సంభవించింది''అని పూనావాలా చెప్పారు.

ప్రమాదంలో మరణించిన మృతులు ఒక్కొక్కరి కుటాంబాలకు రూ. 25 లక్షలు చొప్పున పరిహారం అందిస్తామని సీరం ఇన్‌స్టిట్యూట్ సీఎండీ, పూనావాలా తండ్రి సైరస్ పూనావాలా ప్రకటించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)